భారత్-చైనా సరిహద్దు వివాదం: లద్దాఖ్ లో ఘర్షణలు జరిగి ఏడాది గడిచినా పరిస్థితుల్లో ఎందుకు మార్పు రాలేదు

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, యతిరాజన్ అన్బరసన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత, చైనాల మధ్య ఉన్న వివాదాస్పద లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న బ్లాక్ టాప్ పర్వతం నవాంగ్ దోర్జేకు సుపరిచితమే. అనేక నెలల పాటూ దోర్జే అక్కడ ఉన్న భారత సైన్యానికి సరుకులను రవాణా చేశారు. మెరాక్ గ్రామానికి చెందిన 62 ఏళ్ల నవాంగ్ దోర్జే, వాళ్ల ఊర్లో ఒక చిన్న సరుకుల దుకాణం నడుపుతుండేవారు.
పర్వతాల అంచుల్లో ప్రయాణిస్తూ మందుగుండు సామాగ్రిని, ఇతర నిత్యావసరాలను సైన్యం కోసం తీసుకెళుతూ ఉంటే ప్రాణ భయం కలిగేదని దోర్జే చెప్పారు.
గత ఏడాది ఇండియా, చైనాల మధ్య ఘర్షణలు చెలరేగినప్పుడు దోర్జేలాంటి అనేకమందిని సరుకులు రవాణా చేసేందుకు భారత సైన్యం పనిలో పెట్టుకుంది. వీరంతా సమీప గ్రామాలకు చెందినవారే.
"మేము చైనీయులకు దగ్గరగా వెళ్లాల్సి వచ్చేది. వాళ్లు మమ్మల్ని టార్గెట్ చేస్తారేమోనని భయం వేసేది" అని దోర్జే చెప్పారు.
కిందటి సంవత్సరం, లద్దాఖ్ దగ్గర ఒకరి భూభాగంలోకి మరొకరు చొరబడ్డారని ఇరు దేశాలూ పరస్పరం ఆరోపించడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
వాస్తవానికి, 1962 యుద్ధం తరువాత ఆ ప్రాంతంలో సుమారు 3,440 కి.మీ. పొడవు భూభాగం వెంబడి సరిహద్దు రేఖలు స్పష్టంగా లేవు.
ఇరు దేశాలూ తమ తమ సరిహద్దుల గురించి భిన్నమైన అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నాయి.
ఇండియా మీడియా ప్రకారం, చైనా సైన్యం భారత సరిహద్దులు దాటి అనేక కిలో మీటర్లు లోపలికి చొరబడి.. గుడారాలు వేసి, కందకాలు తవ్వి, భారీ సామాగ్రిని తరలించడంతో ఘర్షణలు చెలరేగాయి.
చైనా కదలికలను పసిగట్టిన భారత్ వెను వెంటనే వేల సంఖ్యలో సైనికులను సరిహద్దుల వద్ద మోహరించింది. అదనపు ఆయుధాలను భారీగా బోర్డర్ వద్దకు తరలించింది.
ఈ క్రమంలో, గత జూన్‌లో గల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణల్లో నాలుగు దళాలను కోల్పోయినట్లు తరువాత చైనా తెలిపింది.

పాంగోంగ్ సో సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి?
అప్పటి నుంచీ పాంగోగ్ సో సరస్సు వద్దకు పర్యటకులను అరుదుగా అనుమతించారు. ఈ ఏడాది జనవరి నుంచి మాత్రమే సందర్శకులను అనుమతిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో మెరాక్ లాంటి చిన్న చిన్న గ్రామాలను చేరుకోవడానికి ప్రయత్నించిన అతి కొద్ది మీడియా సంస్థల్లో బీబీసీ కూడా ఒకటి.
మెరాక్‌లో సుమారు 350 మంది జనాభా ఉంటారు. వీరిలో చాలామంది సంచార జాతులకు చెందినవారు. ఇక్కడ జీవితం మునుపటిలాగానే సాగుతోంది. ఈ గ్రామానికి కరోనా పీడ అంతగా పాకినట్టు లేదు.
అక్కడక్కడా భయాందోళనలకు గురి చేసే దృశ్యాలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. కొత్తగా వేసిన సింగల్ లైన్ రోడ్డుపై తరచూ సైనికులను, సామాగ్రిని తీసుకెళుతున్న ఆర్మీ వాహనాలు కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, ANBARASAN/BBC
దశాబ్దాలుగా ఇండియా, చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం నీడల్లో ఈ అందమైన ప్రాంతం మనుగడ సాగిస్తోంది.
"శీతాకాలంలో మావాళ్లు, చుషుల్ ప్రాంతంలోని వారు జడల బర్రెలను, గొర్రెలను మేపడానికి పర్వతాలకు ఆవల ఉన్న పచ్చిక బయళ్లకు తోలుకెళ్లేవారు. సంవత్సరాల తరబడి చైనీయులు భారత భూభాగాన్ని ఆక్రమించడంతో పచ్చిక బయళ్లు తగ్గిపోయాయి" అని దోర్జీ చెప్పారు.
కిందటి ఏడాది ఘర్షణలు కూడా ఈ ప్రాంతాలను వణికించాయి.
"గత సంవత్సరం సరిహద్దుల వద్ద ఏర్పడిన ఉద్రిక్తతలు, భారత, చైనాల ద్వైపాక్షిక సంబంధాలను తీవ్రంగా మార్చివేశాయి. 1959లో చైనా నిర్దేశించిన సరిహద్దులను ఇప్పుడు ఆ దేశం మళ్లీ పైకి తీసుకొచ్చింది. దాన్ని భారత్ అంగీకరిస్తే గణనీయమైన భూభాగాన్ని కోల్పోవలసి వస్తుంది" అని మాజీ కల్నల్, భారత మిలటరీ నిపుణులు అజయ్ శుక్లా అన్నారు.
తూర్పు లద్దాఖ్‌లో చైనా బలగాలు ముందుకు వస్తే, ఇన్నాళ్లూ భారత్ తమది అని చెప్పుకుంటున్న వందల చదరపు కిలోమీటర్ల భూభాగం చైనా సొంతమైపోతుందని శుక్లాతో సహా పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, ANBARASAN/BBC
ఇరు వర్గాల మధ్య అంగీకారం
అనేక రౌండ్ల చర్చల తరువాత, పాంగోంగ్ సో సరస్సుకు చుట్టుపక్కల ఉన్న పర్వతాల నుంచి తమ సైన్యాలను విరమించుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.
అయితే, లద్దాఖ్‌లో ఇటీవలే చైనా ఆక్రమించుకున్న హాట్ స్ప్రింగ్స్, గోగ్రా పోస్ట్, డెప్సాంగ్ మైదానాల నుంచి వైదొలిగేందుకు ఆ దేశం ఏమాత్రం మొగ్గు చూపట్లేదు.
ఇప్పటికే తూర్పు లద్దాఖ్‌లోని అక్సాయ్ చిన్ పీఠభూమి చైనా నియంత్రణలో ఉంది. ఈ ప్రాంతం జింజియాంగ్ ప్రావిన్స్‌ను పశ్చిమ టిబెట్‌కు కలుపుతుంది. అందుకే ఈ ప్రాంతం చైనాకు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది.
కాగా, లద్దాఖ్‌లో భారతదేశం కవ్వింపు చర్యలే ప్రస్తుత వివాదానికి దారి తీశాయని చైనా వాదిస్తోంది.
"లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారతదేశం రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది. కానీ అది తమ భూభాగమని చైనా భావిస్తోంది" అని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మాజీ సీనియర్ కల్నల్ జౌ బో బీబీసీతో చెప్పారు.
"సంప్రదాయంగా వస్తున్న సరిహద్దు గీతనే ఇరు దేశాల మధ్య సరిహద్దుగా భావించాలని చైనా వైపు నుంచి మేము పట్టుబడుతున్నాం. కానీ, 1962 యుద్ధానికి ముందున్న వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) ఉండాలని భారత్ పట్టుబడుతోంది. అయితే, వాస్తవ నియంత్రణ రేఖ ఎక్కడ ఉందన్న విషయంపై ఇరు దేశాల మధ్య ప్రాథమిక స్థాయిలో భిన్నాభిప్రాయాలున్నాయి. " అని ఆయన అన్నారు.
కాగా, ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతలు పాంగోంగ్ సో సరస్సు ప్రాంతంలో ఉన్న పర్వత శ్రేణుల్లోని గ్రామాల ప్రజలకు సమస్యలను సృష్టించాయి. ముఖ్యంగా, కొన్ని ప్రాంతాల నుంచి ఇండియా సైన్యాన్ని విరమించుకోవాలని నిర్ణయించుకున్నాక వీరి సమస్యలు పెరిగాయి.
"ఇక్కడి సంచార జాతులు శీతాకాలంలో తమ పశువులను ఎప్పుడూ తీసుకెళ్లే చోటుకే మేతకు తీసుకెళ్లడానికి భారత సైన్యం అనుమతించడం లేదు. కానీ, బ్లాక్ టాప్, గురుంగ్ హిల్ చుట్టుపక్కల ప్రాంతాలకు తీసుకెళ్లి పశువులను మేపడం అవసరం" అని చుషుల్ గ్రామ కౌన్సిలర్ కొంచొక్ స్టాంజిన్ చెప్పారు.
"సంచార జాతులు పశువులను మేపడానికి కొండల్లోకి తీసుకెళ్లినప్పుడు అక్కడ వాళ్లు గుడారాలు కట్టి, పశువులదొడ్డి ఏర్పాటు చేస్తారు. అవి ముఖ్యమైన హద్దులుగా మారిపోతాయి. సరిహద్దుల చర్చలు సమయంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. సంచార జాతులను అక్కడకు వెళ్లకుండా ఆపేస్తే దీర్ఘకాలంలో మనకే ప్రతికూలంగా మారవచ్చు" అని ఆయన అన్నారు.
స్టాంజిన్ మాటలకు స్పందిస్తూ, "ఎల్ఏసీని ఇప్పటివరకూ స్పష్టంగా నిర్వచించలేదని, అందుకే దాని పట్ల పౌరుల్లో అపోహలు ఉన్నాయని" భారత ఆర్మీ ఏప్రిల్‌లో చెప్పింది.
అంతే కాకుండా, "ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పశువులను మేతకు తీసుకెళ్లే విషయంలో పరిమితులను పాటించాలని" కాపరులకు సూచించింది.

ఫొటో సోర్స్, ANBARASAN/BBC
భవిష్యత్తులో ఏం జరుగుతుంది?
భారతదేశంలో కరోనా రెండవ దశ సంక్షోభం ఏర్పడడంతో సరిహద్దు వివాదం వెనక్కు వెళిపోయిందిగానీ ఏ సమయంలోనైనా అది మళ్లీ ముందు రావొచ్చని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తలనొప్పి వ్యవహారంగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గత ఏడాది ప్రారంభ దశలో చొరబాటు జరగలేదని మోదీ చెప్పడం భారత రక్షణ నిపుణులను నిరాశపరచింది. అప్పటి నుంచి విషయం ముందుకు కదల్లేదని శుక్లా అన్నారు.
"భారతదేశం చైనా చేతిలో తన భూభాగాన్ని కోల్పోలేదన్నట్టు నటిస్తూ, కేంద్ర ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. భూభాగం కోల్పోలేదన్నట్లు వ్యవహరిస్తే, దాన్ని మనం ఎలా తిరిగి చేజిక్కించుకోగలం?" అని శుక్లా ప్రశ్నిస్తున్నారు.
చైనా సైనిక శక్తి చాలా అధికమని, ఇండియాకు చైనా అతి పెద్ద వాణిజ్య భాగస్వామి అని కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. చైనా దిగుమతులు, పెట్టుబడులు లేకుండా ఇండియాలో వ్యాపార, వాణిజ్యాలు కష్టాలను ఎదుర్కొంటాయి.
కోవిడ్ సెకండ్ వేవ్‌కు ఎదుర్కొనే దిశలో ప్రస్తుతం ఇండియా, చైనా నుంచి వైద్య సామాగ్రి, మెడికల్ ఆక్సిజన్‌లను భారీగా దిగుమతి చేసుకుంటోంది.
అందుకే ఇరు దేశాలూ వివాదాలను పక్కకు పెట్టి, సరిహద్దుల్లో శాంతిభద్రతలను నెలకొల్పే దిశగా అడుగులు వేయాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
"ఇదేమీ ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే సందర్భం కాదు. కానీ, విశ్వాసాన్ని పెంపొందించుకునే దిశలో మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన మలుపు" అని జౌ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- గల్వాన్ లోయ ఘర్షణలో ప్రాణాలు వదిలిన 20 మంది భారత సైనికులు, వారి కథలు ఇవే..
- లద్దాఖ్: జమ్ముకశ్మీర్ నుంచి విడిపోయిన ఏడాది కాలంలో ఏం జరిగింది
- తప్పుదోవ పట్టించే సమాధానాలతో నిజాన్ని దాచలేరు: మన్మోహన్ సింగ్
- జమ్మూకశ్మీర్: ఏడాది గడిచినా తిరిగిరాని కశ్మీరీలు ఎందరో, ఇంతకీ వారు ఏమయ్యారు?
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- భారత్, చైనా ఘర్షణల తరువాత లేహ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి
- భారత్‌ను ఆక్రమించుకోవాలని రష్యా, కాపాడుకోవాలని బ్రిటన్... చివరికి ఏమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








