Pakistan Hindu Temple: కరాచీలో హిందూ మందిరంపై దాడి.. మారి మాత విగ్రహం ధ్వంసం

వీడియో క్యాప్షన్, కరాచీలోని కోరంగి ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఈ దాడిపై ఎఫ్ఐఆర్ నమోదు

పాకిస్తాన్‌లోని కరాచీ నగరం, కోరంగి ప్రాంతంలో బుధవారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మారి మాత మందిరాన్ని ధ్వంసం చేసి విగ్రహాన్ని పగులగొట్టారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటనపై అక్కడి హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భయంతో శుక్రవారం నుండి ప్రారంభం కావాల్సిన మారి అమ్మన్ పండుగను కూడా హిందువులు రద్దు చేసుకున్నారు.

ఆల్ కరాచీ, మద్రాసీ హిందూ పంచాయత్ సభ్యులు ఎస్‌కే షమీమ్ బీబీసీతో మాట్లాడుతూ.. ''రెండు గంటల ప్రాంతంలో ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయుధాల పట్టుకొని లోపలికి వచ్చారు. ఇక్కడి పూజారిని పిలవమన్నారు. లేకపోతే ఎవరైనా పెద్దవాళ్లను పిలువమన్నారు. ఆ సమయంలో పెద్దవాళ్లెవ్వరూ లేరు. కలర్ పనులు, క్లీనింగ్ పనులు చేసే వాళ్లు అప్పుడే తిరిగి వచ్చారు. ఆగంతకులను చూసి వాళ్లు భయపడిపోయారు. ఆ తర్వాత ఆ దుండగులు హనుమంతుడి మందిరాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత గణేష్ మందిరాన్ని కూడా ధ్వంసం చేశారు. మళ్లీ వస్తాం అని చెప్పి వెళ్లిపోయారు'' అని వివరించారు.

కోరంగిలోని ఈ మారీ మాత గుడి చుట్టుపక్కల తమిళ హిందూ సముదాయానికి చెందిన దాదాపు 15 కుటుంబాలు ఉంటాయి. ఈ కుటుంబాలకు అందుబాటులో ఉన్నది ఈ చిన్న మందిరమే. ఇప్పుడు దీనిపైనే దాడి జరిగింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు. ఈ ప్రాంతంలో కెమెరాలు పెట్టి, తమకు రక్షణ కల్పించాలని ఇక్కడి హిందువులు కోరుతున్నారు.

''మేం ఇక్కడ చాలా ఏళ్లుగా ఉంటున్నాం. మా పూర్వీకులు కూడా ఇక్కడే ఉన్నారు. కానీ ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు మాకు సహాయం చేసే వాళ్లే లేరని భయం వేస్తోంది. ఇలా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మందిరాలపై దాడి చేయడం ఇదే మొదటి సారి'' అని ఒక భక్తురాలు బీబీసీతో అన్నారు.

''జరిగిందేం బాగాలేదు. అన్ని మతాలనూ గౌరవించాలి. ఇలా జరగకూడదని మేం కూడా కోరుకుంటున్నాం. అక్కడ జరుగుతున్న దానిని మేం కూడా వ్యతిరేకిస్తున్నాం. వాళ్లు చేస్తోంది కూడా బాలేదు'' అని మరొక భక్తుడు అన్నారు.

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో హిందూ జనాభా అధికంగా ఉంటుంది. వీళ్ల మందిరాలపై దాడులు జరుగుతూ ఉంటాయి. భారత్‌లో ఏవైనా ఘటన జరిగితే దాని ప్రభావం ఇక్కడి మైనారిటీలపై కూడా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)