కోవిడ్ భారిన పడ్డ ప్రొఫెసర్ సాయిబాబా.. గొంతు, ఊపిరితిత్తులకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ - Newsreel

ఫొటో సోర్స్, A S VASANTHA
ప్రొఫెసర్ జీ.ఎన్ సాయిబాబాకు కోవిడ్ సోకడంతో తీవ్రమైన దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్టు నాగ్‌పూర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ నిర్ధరించింది. ఈ విషయాన్ని నాగ్‌పూర్ సెంట్రల్ జైలు అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు ఫిబ్రవరి 23న తెలియజేసినట్లు సాయి బాబా విడుదల కోసం ఏర్పాటైన కమిటీ సభ్యులు వెల్లడించారు.
ఆయన రక్త పోటు స్థాయిలు 90/50కి పడిపోవడంతో 2021 ఫిబ్రవరి 18న జైలులో మంచం మీద నుంచి కూడా పడిపోయారు. ఆయన శారీరకంగా బలహీనంగా మారి తీవ్రమైన గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల ఎవరితోనూ మాట్లాడలేక పోతున్నారు. ఆయన రుచి, వాసన కూడా కోల్పోయారని తెలిపారు. సాయి బాబా వీల్ చెయిర్ లేకుండా అడుగు కూడా వేయలేరని, సహాయం కోసం జైలులో వెంటనే ఎవరినీ పిలవలేరని కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయనకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఆయన కుటుంబ సభ్యులు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సాయిబాబా ఆరోగ్య పరిస్థితి కుటుంబ సభ్యులను కలవరపెడుతోందని అన్నారు. సాయి బాబా ఆరోగ్య పరిస్థితి విషమిస్తే ఆయనకున్న ఇతర ఆరోగ్య సమస్యల రీత్యా ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆయనను వెంటనే ఆసుపత్రిలో చేర్చాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. కోవిడ్ క్వారంటైన్ ముగియగానే ఆయనను విడుదల చేస్తే ఆయనకు కొంత విశ్రాంతి, కుటుంబ మద్దతు, పోషకాహారం దొరుకుతుందని ప్రకటన ద్వారా తెలిపారు.
దిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల రామ్‌లాల్ ఆనంద్ కాలేజ్‌లో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జి.ఎన్.సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు అరెస్టుచేశారు.
2017 మార్చిలో యూఏపీఏ చట్టం కింద ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. ఆయనను ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో గల అండా సెల్‌లో నిర్బంధించారు.

ఫొటో సోర్స్, facebook/singamaneni narayana
రచయిత, విమర్శకులు సింగమనేని నారాయణ మృతి
రచయిత, విమర్శకులు సింగమనేని నారాయణ మరణించారు. అనంతపురం జిల్లాలో రైతు కుటుంబంలో జన్మించిన సింగమనేని వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయుడు.
జూదం, అనంతం, సింగమనేని కథలు వంటి కథాసంపుటాలు ఆయనకు పేరు తెచ్చాయి. ఎడారి గులాబీలు, అనురాగానికి హద్దులు వంటి నవలలు ఆయన కలం నుంచి వచ్చినవే.
అభ్యుదయ రచయిత సంఘంలో ఆయన కీలకంగా వ్యవహరించేవారు.
కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఆయన మృతి పట్ల సాహితీకారులు, అభిమానులు సంతాపం తెలిపారు.
‘కరవు నేల రచయిత’ ఇక లేరంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన పంచుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Reuters
వార్తలకు డబ్బు చెల్లించాల్సిందే.. గూగుల్, ఫేస్‌బుక్ లక్ష్యంగా చట్టం చేసిన ఆస్ట్రేలియా
వివిధ పబ్లిషర్ల న్యూస్ కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో పెట్టినందుకు, షేర్ చేసినందుకు ఫేస్‌బుక్, గూగుల్‌లు ఆయా మీడియా సంస్థలకు డబ్బు చెల్లించేలా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక చట్టం చేసింది.
‘ది న్యూస్‌కోడ్ లెజిస్లేషన్’గా పేర్కొంటున్న ఈ చట్టాన్ని గూగుల్, ఫేస్‌బుక్‌లు మొదట తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా గతవారం ఫేస్‌బుక్ తన ప్లాట్‌ఫామ్‌పై న్యూస్‌ను బ్లాక్ చేసింది.
అయితే ప్రభుత్వంతో చర్చల తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. చర్చల సందర్భంగా బిల్లులో కొన్ని మార్పులుచేర్పులు చేశారు.
ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టానికి లోబడి లేకున్నా ప్రముఖ పబ్లిషింగ్ కంపెనీల వార్తలను ఆన్‌లైన్‌లో పెట్టినందుకు ఆయా కంపెనీలకు భారీ మొత్తాన్ని చెల్లించడానికి ఈ రెండు కంపెనీలు అంగీకరించాయి.
ఈ నిర్ణయంతో టెక్ దిగ్గజాలు ఒకమెట్టు దిగినట్లేనని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ చట్టం కారణంగా మీడియా కంపెనీలు, గూగుల్, ఫేస్‌బుక్‌ల మధ్య జరిగే ఒప్పందాలు పారదర్శకంగా ఉంటాయని ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొంది.
తాము ఇప్పటికే పబ్లిషింగ్ కంపెనీలకు రీడర్స్ ట్రాఫిక్‌ను పెంచుతున్నామని గూగుల్, ఫేస్‌బుక్‌లు వాదిస్తున్నాయి. ఇంటర్నెట్ ఎలా పని చేస్తుందో చాలమందికి ఇంకా అర్ధం కాలేదని గూగుల్, ఫేస్‌బుక్‌లు పరోక్షంగా ప్రభుత్వాన్ని విమర్శించాయి.
ప్రభుత్వం చట్టం తీసుకురానుండటంతో ఆందోళన చెందిన ఈ రెండు టెక్ సంస్థలు లాబీయింగ్ ద్వారా చట్టాలలో స్వల్పమార్పులు చేయించుకోగలిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇటు స్థానిక పబ్లిషింగ్ కంపెనీలతో కూడా చర్చలు జరిపి సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్త పడ్డాయి.
ఆస్ట్రేలియా తరహాలో మరికొన్ని దేశాలు కూడా ఇలాంటి చట్టాలు తీసుకొచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయాపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








