ఘట్‌కేసర్‌ కిడ్నాప్ డ్రామా: ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

సీసీటీవీలో యువతి
ఫొటో క్యాప్షన్, సీసీ టీవీ దృశ్యాల్లో యువతి
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

ఇటీవల ఘట్‌కేసర్‌లో తాను కిడ్నాప్‌ అయినట్లుగా అబద్ధమాడిన ఫార్మసీ విద్యార్థిని (19) ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు.

నిద్ర‌ మాత్రలు మింగి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కిడ్నాప్‌ డ్రామా బయటపడిన తరువాత నుంచి ఆమె ఘట్‌కేసర్‌లోని తన మేనమామ ఇంట్లో ఉంటున్నారు.

బుధవారం ఉదయం ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధరించారు.

ఈ నెల ప్రారంభంలో ఫార్మసీ విద్యార్థినిని కొందరు వ్యక్తులు అపహరించి అత్యాచారం చేశారంటూ తొలుత కేసు నమోదైంది. అయితే, అదంతా అవాస్తవమని రాచకొండ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ విద్యార్థినే కట్టుకథ అల్లిందని పోలీసులు తేల్చారు.

రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్

ఇంతకీ ఏమిటా అత్యాచారం, కిడ్నాప్ నాటకం

హైదరాబాద్ శివార్లలోని ఘట్‌కేసర్ ప్రాంతంలో ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, అత్యాచారం ఆరోపణలతో నమోదైన కేసును తప్పుడు కేసు అని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ నిర్ధరించారు. ఆ యువతిపై అత్యాచారం జరగలేదని ఆయన చెప్పారు.

ఫిబ్రవరి 13న విలేఖరుల సమావేశంలో మహేశ్ భగవత్ ఈ కేసు వివరాలను వెల్లడించారు.

ఫిబ్రవరి 10 సాయంత్రం 6.29 గంటలకు కీసర పోలీసులకు యువతి కిడ్నాప్ గురైనట్లుగా ఫిర్యాదు అందింది. బాధితురాలుగా భావించిన ఆ అమ్మాయి తన తల్లికి ఇచ్చిన సమాచారం ప్రకారం, మల్లేశ్ అనే వ్యక్తి 100కు ఫోన్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సెర్చ్ ప్రారంభించారు. సెల్ ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసి ఆ అమ్మాయిని పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు ఆమె చెదిరిన దుస్తులతో అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ఆ యువతిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు.

ఆ మరునాడు అమ్మాయి చెప్పిన వివరాల ప్రకారం పోలీసుల బృందం నిందితులను గాలించే పనిలో పడింది. అందులో భాగంగా వారు వందకు పైగా సీసీ కెమేరా ఫుటేజిని పరిశీలించి నలుగురు ఆటో డ్రైవర్లను అనుమానితులుగా భావించి ఫిబ్రవరి 11న ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అయితే, బాధితురాలు చెప్పిన వివరాలకు, పోలీసులు సేకరించిన ఆధారాలకు పొంతన కుదరలేదు. దాంతో, పోలీసులు మరొకసారి సీసీటీవీ ఫుటేజిని పరిశీలించి సీన్-రీకన్‌స్ట్రక్షన్ చేసి విశ్లేషించారు.

నిజానికి, ఆ యువతి 10వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు ఘట్‌కేసర్, యమ్నంపేట్, అన్నోజిగూడ తదితర ప్రాంతాల్లో ఒంటరిగానే తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. అదుపులో ఉన్న ఆటో డ్రైవర్ల సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఆ సమయంలో ఆ ప్రాంతంలో లేవని కూడా పోలీసులు గుర్తించారు.

దాంతో, పోలీసులు ఆ యువతిని మళ్లీ ప్రశ్నించారు. 'చీకటి పడినా ఇంటికి ఎందుకు రాలేదని తల్లి పదే పదే ఫోన్ చేసి అడగడంతో ఆటో డ్రైవర్ ఎక్కడికో తీసుకువెళ్లాడని చెప్పాను' అని ఆ యువతి అంగీకరించిందని సీపీ చెప్పారు. అటో డ్రైవర్లు కిడ్నాప్ చేయడం, అత్యాచారానికి పాల్పడడం అంతా కట్టుకథ అని ఆయన తేల్చి చెప్పారు. అమెపై ఎవరూ అత్యాచారం చేయలేదన్నారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)