ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం లభ్యం, వెలికితీత ఎందుకింత ఆలస్యమవుతోంది?

ఫొటో సోర్స్, TELANGANA I&PR
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీశారు. జేపీ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేసిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనోజ్ కుమార్ మృతదేహాన్ని బయటకు తీసి ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మార్చ్ 9న పంజాబ్‌కు చెందిన గురుప్రీత్ సింగ్ మృతదేహం దొరకగా మంగళవారం (మార్చ్ 25) ఈ రెండో మృతదేహం దొరికింది.
మనోజ్ కుమార్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయల పరిహారం అందించారు.
నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో పరీక్షల తరువాత ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో అతని స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించారు.
ఎస్సెల్బీసీ ప్రమాదంలో మొత్తం 8 మంది గల్లంతయ్యారు. వారిలో ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలు దొరకగా మిగతా ఆరుగురి ఆచూకీ ఇంకా తెలియలేదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలకు సంబంధించిన నిపుణులు, సిబ్బంది ఈ సహాయకచర్యల్లో పాల్గొంటున్నారు.
700 మంది సిబ్బంది ఈ గాలింపు చర్యలలో పనిచేస్తున్నట్టు జిల్లా అధికారులు తెలిపారు.


ఫొటో సోర్స్, TELANGANA I&PR
ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని డీ1, డీ2 అంటూ భాగాలుగా విభజించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
టన్నెల్ బోరింగ్ మెషీన్(టీబీఎం), అందులోని కీలక భాగాలను కట్ చేయడం దాన్ని తరలించడం పెద్ద ప్రహసనంగా మారింది.
అల్ట్రా థర్మల్ కట్టర్లతో టన్నెల్ బోరింగ్ మెషీన్ భాగాలను తొలగిస్తున్నారు.
మరోవైపు టన్నెల్‌లో నిల్వ ఉన్న నీటితో వాటర్ జెట్ ద్వారా బురదను తొలగించడం, మట్టిని కన్వేయర్ బెల్ట్‌పై తరలించడం, సహాయక బృందాలకు ఆక్సిజన్ సిలిండర్లను అందించడం వంటి పనులు జరుగుతున్నాయి.
మార్చ్ 19 వరకు 800, టన్నుల స్టీల్‌ను ట్రైన్ ద్వారా, 800 టన్నుల మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా తరలించినట్టు జిల్లా అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, TELANGANA I&PR
రోజు 5 షిఫ్ట్‌లుగా అంటే ఉదయం 7, 11, మధ్యాహ్నం 3, రాత్రి 7, 11 గంటల షిఫ్టుల్లో పనిచేస్తున్నారు సిబ్బంది.
అప్పుడప్పుడూ సహాయక సిబ్బందితో కలసి కలెక్టర్, ఎస్పీలు భోజనం చేస్తూ వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ వంటి సంస్థలు సాంకేతిక సహకారం అందిస్తుండగా, మిగిలిన సంస్థలతో పాటూ సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్,భారత సైన్యం – ఈ మూడు సంస్థల సిబ్బంది అత్యధికంగా విధుల్లో పాల్గొంటున్నారు.
ఎప్పటికప్పుడు కొత్త కొత్త యంత్రాలను తెప్పించి సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నారు.
సహాయక సిబ్బందికి ఏ ప్రమాదమూ జరగకూడదన్న ఉద్దేశంతో డీ1, డీ2 ల దగ్గర ఆచితూచి పనిచేస్తున్నారు.
ఓపెన్ ప్రదేశం కాకపోవడం, ఘటనా స్థలికి వెళ్లడానికే గంటకు పైగా ప్రయాణం ఉండడం, తక్కువ ఆక్సిజన్ ఉండే చోట పనిచేయడం వంటి ఎన్నో ప్రతికూలతల మధ్య పనులు జరుగుతున్నాయి.
భారీ యంత్రాలు వెళ్లేలా అంతా సిద్ధం చేయడంతో పని మొదటి కంటే ఊపందుకుంది.
భారీ టీబీఎం విడిభాగాలను వెల్డింగ్ చేసి బయటకు తీస్తున్నారు.
సొరంగంలో కూలిన రాళ్లు, అక్కడ పేరుకున్న మట్టి, ఊట నీటిని బయటకు పంపుతున్నారు.

ఫొటో సోర్స్, TELANGANA I&PR
అయితే మిగిలిన ఆరుగురిని గుర్తించడం ఎప్పుడన్నదానిపై ఎవరూ స్పష్టమైన అంచనాకు రాలేకపోతున్నారు.
మార్చి 9న మొదటి మృతదేహం దొరకగా, రెండోది దొరకడానికి 16 రోజులు పట్టింది.
మిగతావారికి సంబంధించి తొందర్లోనే దొరికే అవకాశం ఉందని క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న కొందరు అధికారులు బీబీసీతో అన్నారు.
''రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో మనోజ్ కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. పొక్లెయినర్లతో పనిచేస్తుండగా దుర్వాసన రావడంతో, వాటిని ఆపి మాన్యువల్‌గా పనిచేశారు. ఈ మృతదేహాన్ని ఉదయం తీసుకువచ్చారు. ఇంకా అక్కడ దుర్వాసన వస్తున్నట్టుగా సమాచారం ఉంది'' అని ఈ సహాయక చర్యల్లో పాల్గొంటోన్న ఉన్నతాధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.
దుర్వాసన వచ్చినప్పుడు యంత్రాలతో పని వేగం తగ్గించి మృతదేహాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా వెలికి తీసినట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, TELANGANA I&PR
''లోపల చిక్కుకున్న అందర్నీ గుర్తించి బయటకు తెచ్చేవరకు సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉంటాం. ఇందుకోసం లోపల 4 ఎక్స్‌కవేటర్లు పనిచేస్తున్నాయి. అంతకుముందు యంత్రాలు లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. ఇప్పుడు సహాయక చర్యల వేగం మరింత పెంచాం. చిక్కుకున్న అందర్నీ గుర్తించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పనిచేస్తాయి'' అన్నారు కలెక్టర్ సంతోష్.
ఇప్పటి వరకూ సహాయక చర్యలను విపత్తుల శాఖ నుంచి ఐఎఎస్ అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ సంతోష్‌లు పర్యవేక్షిస్తుండగా, తాజాగా ఐఏఎస్ అధికారి శివశంకర్ లోతేటిని ప్రత్యేకాధికారిగా నియమించింది ప్రభుత్వం.
శివశంకర్ సంఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించారు సీఎం.
''ప్రమాదం జరిగిన ప్రాంతంలో 30 మీటర్లు అత్యంత ప్రమాదకర జోన్. జీఎస్ఐ, ఎన్జీఆర్ఐ శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాల్సి ఉంటుంది'' అని ఎస్సెల్బీసీపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు ఉన్నతాధికారులు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)














