వ్యవసాయ బిల్లుల వివాదం: గోదాములు చాలక ధాన్యాన్ని విస్కీ, బీర్లతో కలిపి నిల్వ చేస్తున్నారు - పాలగుమ్మి సాయినాథ్

వ్యవసాయం

ఫొటో సోర్స్, STR/NurPhoto via Getty Images

వ్యవసాయ రంగానికి సంబంధించి భారత ప్రభుత్వం ఇటీవల మూడు కొత్త బిల్లులను తెచ్చింది. పార్లమెంటులో వాటిని ఆమోదింపజేసుకుంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇవి చట్టాలుగా మారనున్నాయి.

అయితే, ఈ బిల్లులు రైతుల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొన్ని విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయి.

ఈ కొత్త బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వివిధ రైతు సంఘాలు శుక్రవారం ‘భారత్ బంద్’‌కు పిలుపునిచ్చాయి.

ఈ నేపథ్యంలో అసలు ఈ బిల్లుల్లో ఏముంది? వీటిపై ఎందుకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది? అన్నది తెలుసుకునేందుకు సీనియర్ జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్‌‌ను బీబీసీ ప్రతినిధి ముళీధరన్ కాశీ విశ్వనాథ్ ఇంటర్వ్యూ చేశారు. సాయినాథ్ ఏం చెప్పారంటే...

ప్రశ్న: ఈ బిల్లులపై మీ అభిప్రాయం ఏమిటి?

జవాబు: ఇవి చాలా ప్రమాదకరమైన బిల్లులు. వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)కి సంబంధించి తెచ్చిన బిల్లులో, ఏపీఎంసీని రైతులను బానిసలు చేసుకున్న విలన్‌లా చిత్రించారు. ఇది పిచ్చితనమే. ఇప్పటికీ వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల్లో కొంత భాగమే నియంత్రిత మార్కెటింగ్ కేంద్రాలు, నోటిఫైడ్ హోల్‌సేల్ మార్కెట్లలో జరుగుతున్నాయి.

మన దేశంలో ఎక్కువగా రైతులు తమ ఉత్పత్తిని పొలం వద్దే అమ్మేస్తారు. మధ్యవర్తులు, అప్పు ఇచ్చినవాళ్లు నేరుగా పొలానికే వచ్చి ఉత్పత్తిని తీసుకువెళ్తారు. మొత్తం రైతుల్లో ఆరు నుంచి ఎనిమిది శాతమే నోటిఫైడ్ హోల్‌సేల్ మార్కెట్లకు వెళ్తారు.

మన రైతులు కోరుకుంటున్నదేంటి? ఉత్పత్తికి నిర్ణీత ధర ఉండాలని అడుగుతున్నారు. ఈ బిల్లులు ఆ విషయం గురించి అసలు మాట్లాడుతున్నాయా? ధరలు తీవ్ర ఆటుపోట్లకు గురవుతుంటాయి. విపరీతంగా బేరాలు ఆడుతుంటారు. అసలు నిర్ణీత ధర అంటూ లేనేలేదు.

రైతులకు కనీస మద్దతు ధర దక్కుతుందని ప్రధాని అంటున్నారు. ఒకవేళ ఆయన నిజమే చెబుతున్నట్లైతే... ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ప్రకారం కనీస మద్దతు ధరను నిర్ణయిస్తూ ప్రభుత్వం చట్టం చేయాలి. అప్పుడు అందరూ మద్దతు తెలుపుతారు. ఇలాంటి ప్రయత్నానికి అడ్డుచెప్పే పార్టీ ఏదైనా ఉంటుందా? కానీ, ప్రభుత్వం అలా చేయడం లేదు. చెబుతున్న మాట మీద వారు గట్టిగా నిల్చోవడం లేదు.

సాయినాథ్

ఫొటో సోర్స్, P Sainath Facebook Page Farmers bill India

ఫొటో క్యాప్షన్, సాయినాథ్

ఇక ఒప్పంద వ్యవసాయం గురించి మరో బిల్లు తెస్తున్నారు. ఇది ఒప్పంద వ్యవసాయాన్ని చట్టబద్ధం చేస్తుంది. తమాషా ఏంటంటే, ఈ ఒప్పందాలు రాతపూర్వకంగా ఉండాల్సిన అవసరం లేదంటున్నారు. వాళ్లకు 'ఇష్టమైతే' చేయొచ్చని అంటున్నారు. ఇప్పటికీ మధ్యవర్తులు, రైతులు నోటి మాట మీద ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ బిల్లు కూడా అదే చెబుతోంది.

రాతపూర్వకంగా ఒప్పందం చేసుకున్నా, ఒకవేళ పెద్ద కార్పొరేట్ సంస్థలు దాన్ని ఉల్లంఘిస్తే ఏం చేయాలి? సివిల్ కోర్టుకు మీరు వెళ్లలేరు. ఒకవేళ కోర్టుకు వెళ్లినా, పెద్ద కార్పొరేట్ సంస్థకు వ్యతిరేకంగా ఏమైనా చేయగలమా? న్యాయవాదిని పెట్టుకునేందుకు రైతుల దగ్గర డబ్బు ఉంటుందా? ఒప్పందానికి అవతలి పక్షం కట్టుబడేలా చేసే శక్తి రైతులకు లేనప్పుడు, ఒప్పందం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది?

నిత్యావసర సరకుల సవరణ బిల్లు తెచ్చారు. నిత్యావసర సరకుల జాబితా నుంచి అన్నింటినీ తొలగించారు. ఒకవేళ అత్యవసర పరిస్థితి ఉంటేనే ఇందులో మార్పు చేస్తారు. అత్యవసర పరిస్థితి అంటే, ఆ సరుకుల ధరలు మరీ అత్యధిక స్థాయికి చేరుకున్నప్పుడు వస్తుంది. ఇలా వాళ్లు నిబంధన చేశారు. దీని వల్ల ఇక ఏదీ నిత్యావసర సరకు కాదు.

రైతులకు మంచి మార్కెట్ ధర కల్పించేందుకు ఇదంతా చేస్తున్నామని అంటున్నారు. నిజానికి రైతుల కోసం ఇందులో ఏమీ చేయలేదు. తమ ఉత్పత్తిని నిల్వ చేసుకునే స్వేచ్ఛ రైతులకూ ఎప్పుడూ ఉంది. గరిష్ఠంగా ఎంతవరకూ నిల్వ చేసుకోవచ్చన్న పరిమితి పెద్ద కార్పొరేట్ సంస్థలకు మాత్రమే అడ్డంకిగా ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని ఎత్తేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు గిట్టుబాటు ధరను ఎలా సాధించుకోగలరు. మధ్యతరగతిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రతి ఒక్కరిపై దీని ప్రభావం ఉంటుంది.

వ్యవసాయం

ఫొటో సోర్స్, getty images

చెరకు సాగులో ఇప్పటికే ఒప్పంద పద్ధతి ఉంది కదా! చట్టబద్ధం చేస్తే సమస్య ఏంటి?

ఒప్పందం ఎలాంటిదో మనం గమనించాలి. ప్రస్తుతం ప్రతిపాదించిన ఒప్పందాల్లో రైతులు అశక్తులుగా మారిపోతారు. రాతపూర్వక ఒప్పందాలు లేకపోతే సివిల్ కోర్టులను ఆశ్రయించలేం. రైతులను తమకుతాముగా బానిసలుగా మార్చుకునేలా చేసేవే ఈ ఒప్పందాలు.

ఉదాహరణకు మహారాష్ట్రలో పాల ధరను చూడండి. ముంబయిలో ఆవు పాల ధర లీటరుకు 48 రూపాయలు. గేదె పాల ధర లీటరుకు 60 రూపాయలు. పాడి రైతుకు ఈ 48 రూపాయల నుంచి ఎంత వస్తుంది? 2018-19లో రైతులు భారీ నిరసన ప్రదర్శనకు దిగారు. రోడ్డు మీద పాలు పారబోశారు. పాడి రైతులకు లీటరు మీద 30 రూపాయాలు ఇవ్వాలని అప్పుడు నిర్ణయం జరిగింది. కానీ, ఏప్రిల్‌లో కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత వారికి లీటరు మీద 17 రూపాయలే వస్తున్నాయి. వారికి వచ్చే ధర దాదాపు 50 శాతం ఎందుకు పడిపోయింది? ఇది ఎలా జరిగింది?

వ్యవసాయ రంగంలో కార్పొరేట్ శక్తులను బలోపేతం చేసే లక్ష్యంతో తెచ్చినవే ఈ బిల్లులు. ఇవి గందరగోళానికి కారణమవుతాయి. వ్యవసాయం రంగంలో కార్పొరేట్లు వాళ్ల సొంత డబ్బును పెట్టుబడిగా పెట్టారు. ప్రజల డబ్బునే పెడతారు.

బిహార్‌లో ఏపీఎంసీ చట్టం లేదు. 2006లో దాన్ని ఎత్తేశారు. అక్కడేం జరిగింది? బిహార్‌లో కార్పొరేట్లు రైతులకు సేవ చేస్తున్నారా? చివరికి బిహార్‌లో రైతులు తమ మొక్కజొన్నను హరియాణా రైతులకు అమ్ముకుంటున్నారు. ఎవరికీ లాభం ఉండట్లేదు.

నోటిఫైడ్ హోల్‌సేల్ మార్కెట్ల బయట రైతులను వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోనిస్తే నష్టం ఏంటి?

రైతులు చాలా వరకు తమ ఉత్పత్తిని మార్కెట్ల బయటే అమ్ముకుంటున్నారు.

ఇందులో కొత్త విషయమేం లేదు. మార్కెట్ల ద్వారా కొందరు రైతులకు ప్రయోజనం కలుగుతోంది. ఇప్పడు దాన్ని కూడా దెబ్బకొడుతున్నారు.

వ్యవసాయం

ఫొటో సోర్స్, TAUSEEF MUSTAFA/AFP via Getty Images

నోటిఫైడ్ మార్కెట్లు కొనసాగుతాయని ప్రభుత్వం చెబుతోంది కదా...

ఉంటాయి. కానీ, వాటి సంఖ్య తగ్గుతుంది. వాటిని వినియోగించేవారు తగ్గిపోతారు. విద్య, వైద్య రంగాల్లో ఇదే సరళీకరణను అమలు చేశారు. అక్కడేం జరిగింది? వ్యవసాయ రంగంలోనూ అదే జరుగుతుంది.

కరోనావ్యాప్తి వేగంలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. గత బడ్జెట్‌లో ఈ ప్రభుత్వం జిల్లా స్థాయి ఆసుపత్రులను ప్రైవేటు రంగానికి అప్పగించేందుకు సిద్ధమైంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు ఎవరైనా ప్రాధాన్యం ఇస్తున్నారా?

పేదలు మాత్రమే తమ పిల్లలను వాటిలో చేర్చుతున్నారు. ఆ పాఠశాలలను కూడా నాశనం చేసి, 'ఇక మీరు ఎక్కడైనా చదువుకోవచ్చు' అని అంటే... పేదలు ఎక్కడికి పోతారు.

రైతుల విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. నోటిఫైడ్ మార్కెట్ కేంద్రాలను వాడుకుంటున్నవారు ఎక్కడికి వెళ్తారు? నేను అడిగే ప్రశ్న ఇదే.

కార్పొరేట్లు ఉత్పత్తులను నిల్వ ఉంచుకోవడంపై నిషేధం తొలగిస్తే వారు రైతుల నుంచి పెద్ద మొత్తంలో ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. ఇది రైతులకు మంచి ధరను తెచ్చిపెట్టదా?

అసలు ముందుగా నిత్యావసర సరుకుల చట్టం ఎందుకు తేవాల్సి వచ్చింది. వ్యాపారులు ఉత్పత్తులను పెద్ద మొత్తంలో నిల్వ ఉంచుకుంటున్నారనే కదా! ఇప్పుడు మళ్లీ వ్యాపారులు ఎంత మొత్తమైనా నిల్వ చేసుకోవచ్చని చెబుతున్నారు. రైతులకు ఎక్కువ ధర వస్తుందని అంటున్నారు.

నిజానికి రైతులకు ఎక్కువ ధర రాదు. కార్పొరేట్లకు లాభాల పరిమాణం బాగా పెరుగుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే... వ్యవసాయ ఉత్పత్తులు రైతుల దగ్గర ఎక్కువగా ఉంటే ధరలు పడిపోతాయి. అదే వ్యాపారుల దగ్గర ఎక్కువగా ఉంటే, ధరలు పెరుగుతాయి. సహజంగా జరిగేది ఇదే.

ఈ బిల్లుల కారణంగా వ్యాపారులు తగ్గిపోతారు. మార్కెట్లలో గుత్తాధిపత్యం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అధిక ధర ఎలా వస్తుంది?

కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయిగా! వాటి వల్ల సామాన్య రోగులకు ఏమైనా ప్రయోజనం కలుగుతోందా? సాధారణ కోవిడ్ పరీక్ష చేయించుకోవాలంటే, ముంబయిలో ఆసుపత్రులు 6,500 నుంచి 10,000 రూపాయల దాకా వసూలు చేస్తున్నాయి. ఈ సంస్థలు లాభాలను ఆర్జించేందుకే ఉన్నాయి. రైతులకో, సామాన్య రోగులకో సేవ చేయడానికి కాదు.

వ్యవసాయం

ఫొటో సోర్స్, Sameer Sehgal/Hindustan Times via Getty Images

నోటిఫైడ్ హోల్‌సేల్ మార్కెట్లు, కనీస మద్దతు ధర ఉంటాయని ప్రభుత్వం అంటోంది? అలాంటప్పుడు మీరు ఈ బిల్లులను అంగీకరిస్తారా?

నోటిఫైడ్ హోల్‌సేల్ మార్కెట్లు ఉంటాయని నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ, అవి ప్రభుత్వ పాఠశాలల్లాగా ఉంటాయి. ప్రభుత్వం వాటిని పట్టించుకోదు. కనీస మద్దతు ధర గురించి మీరు మాట్లాడుతున్నారు. కానీ, దీని గురించి ప్రభుత్వం చెబుతున్న విషయాన్ని నమ్మే పరిస్థితి లేదు.

రైతు పంటపై పెట్టిన మొత్తం ఖర్చుకు మరో 50 శాతం కలిపి కనీస మద్దతు ధరగా నిర్ణయించాలని ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసింది. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా ఈ సిఫార్సును అమలు చేస్తామని 2014లో నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆయన మాటను నమ్మి ఎన్ని కోట్ల మంది రైతులు ఓటు వేసి ఉంటారు?

తొలి ఏడాదిలో వాళ్లు ఏం చేశారు? హామీ ఇచ్చినట్లుగా కనీస మద్దతు ధర కల్పించలేమని కోర్టులో అఫిడవిట్ సమర్పించారు. ఇది 2015లో జరిగింది. 2016లో తాము అసలు అలాంటి హామీనే ఇవ్వలేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ అన్నారు. ''ఎంఎస్ స్వామినాథన్ కమిటీ రిపోర్టు మర్చిపోండి. శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లో ఏం చేశారో చూడండి'' అని 2017లో వ్యవసాయ మంత్రి అన్నారు. అదే ఏడాది ఆ రాష్ట్రంలో ఐదుగురు రైతుల ప్రాణాలు పోయాయి.

2017-18, 2018-19ల్లో బడ్జెట్లు ప్రవేశపెడుతున్నప్పుడు అరుణ్ జైట్లీ... ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అప్పటికే అమలు చేసినట్లు చెప్పుకువచ్చారు.

2014లో ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని హామీ ఇస్తారు. 2016లో అసలు ఆ హామీనే ఇవ్వలేదంటారు. 2017లో ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అవసరమే లేదంటారు. 2018, 2019ల్లో సిఫార్సులు అమలు చేసేశామని చెబుతారు. జరిగింది ఇదే.

పంట పెట్టుబడి, కూలీల ఖర్చులు, కమతానికి అద్దె ఇవన్నీ లెక్కగట్టి, యాభై శాతం జోడించి కనీస మద్దతు ధర ఇవ్వాలని స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసింది. కానీ, ప్రభుత్వం పంట పెట్టుబడి, కూలీల ఖర్చులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటూ గోధుమలకు కనీస మద్దతు ధరను నిర్ణయించింది. సిఫార్సుతో పోల్చితే క్వింటాలుపై ఇది 500 రూపాయలు తక్కువ.

నోటిఫైడ్ హోల్‌సేల్ మార్కెట్లు వ్యాపారుల గుత్తాధిపత్యాన్ని దెబ్బతీశాయి. రైతులకు కొంత మేర అనుకూలమైన ధర వచ్చేలా చేశాయి. విద్య, వైద్య రంగాల్లో ఉదారవాదంతో ఏ జరిగిందో వ్యవసాయ రంగంలోనూ అదే జరుగుతుంది. అలా జరగదన్న భరోసా ఏముంది?

చాలా వరకూ నోటిఫైడ్ మార్కెట్లలో అమ్మకాలు జరగడం లేదు. ప్రభుత్వం కూడా కొనుగోళ్లు చేయడం లేదు. మరి, కార్పొరేట్లు మంచి ధర ఇచ్చి, ఉత్పత్తులను కొనుగోలు చేస్తే నష్టమేంటి?

రైతులకు లాభాలు తెచ్చిపెట్టేందుకు కార్పొరేట్లు రాలేదు. తమ వాటాదారులకు లాభాలు తీసుకువచ్చేందుకు వారు వస్తున్నారు. రైతులకు ఎక్కువ ధర చెల్లిస్తే వారికి లాభం ఎలా వస్తుంది?

వ్యవసాయం

కోల్డ్ స్టోరేజీల్లాంటి వ్యవసాయ మౌలిక వసతుల విషయంలో ప్రైవేటు పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది కదా! వాటిని ఎందుకు అడ్డుకోవాలి?

ఇలాంటి మౌలికవసతులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం వద్ద ప్రత్యేక నిధి ఉంది.

దాన్ని ఎందుకు ప్రైవేటుపరం చేయాలి? రైతుల కోసం తమ వంతుగా ప్రభుత్వం ఏం చేస్తోంది?

భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గోదాముల నిర్మాణాన్ని ఎందుకు ఆపేసింది? స్టోరేజీ పనులను ప్రైవేటు రంగానికి ఎందుకు అప్పగించింది?

ఫలితంగా పంజాబ్‌లో ఇప్పుడు ధాన్యాన్ని విస్కీ, బీర్లతో కలిపి నిల్వ చేస్తున్నారు. ప్రైవేటు రంగంలో గోదాములు నిర్మించేవాళ్లు ఎక్కువ అద్దె తీసుకుంటారు. ఉచితంగా వసతిని ఇవ్వరు కదా! ప్రభుత్వం నుంచి ఏ సహకారమూ లేదు.

1991 తర్వాత భారత్ అన్ని విభాగాల్లో సరళీకరణ విధానాలు తెచ్చింది. వ్యవసాయ రంగంలో మాత్రం దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి?

1991లోనే ఇదంతా మొదలైంది. ఓపెన్ మార్కెట్ అంటే స్వేచ్ఛ అన్న భావన ఉంది. కానీ ప్రభుత్వం దానికి అండగా నిలబడితే, అది బానిసత్వం అవుతుంది. ఓపెన్ మార్కెట్‌లో వ్యాపారుల దయాదాక్షిణ్యాల మీద రైతులు ఆధారపడి ఉంటారు.

వ్యవసాయ రంగంలో ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికా, యురోపియన్ దేశాల్లో సబ్సిడీలు ఇస్తున్నారు. కానీ, ఈ సబ్సిడీలు రైతులకు కాదు, వ్యవసాయం రంగంలో ఉన్న కార్పొరేట్లకు ఇస్తున్నారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది.

దీనికి పరిష్కారం ఏంటి?

రైతులు అందరూ సమన్వయం చేసుకుని ఏకమైతే, వేల సంఖ్యల రైతు మార్కెట్లు ఏర్పాటు చేసుకోవచ్చు.

వీటిని రైతులే నియంత్రిస్తారు. కేరళలో నోటిఫైడ్ హోల్‌సేల్ మార్కెట్లు లేవు. అక్కడ అలాంటి చట్టాలు కూడా లేవు.

కానీ, అక్కడ మార్కెట్లు ఉన్నాయి. అందుకే, రైతుల నియంత్రణలో మార్కెట్లు ఉండాలని నేను అంటున్నా.

ఇప్పుడు కూడా నగరాల్లో ఇలాంటి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కార్పొరేట్ సంస్థలపై మనం ఎందుకు ఆధారపడాలి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)