ఇండోనేసియా సునామీ: ఊహకందని విధ్వంసం... దాదాపు వేయి మంది మృతి

ఇండొనేషియా సునామీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న మిలటరీ సిబ్బంది

ఇండోనేసియాలోని తీర ప్రాంత నగరం 'పాలు'లో శుక్రవారం సంభవించిన తీవ్ర భూకంపం వల్ల చాలా మంది ప్రజలు శిథిలాల్లో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు సహాయక బృందాలు భారీ యంత్రాల కోసం ఎదురు చూస్తున్నారు.

పాలూ నగరంలో ఒక షాపింగ్ సెంటర్, హోటల్ కుప్ప కూలిపోయాయి. ఆ శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి వెలికి తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

సహాయం కోసం అర్థిస్తున్న వారిని ఆదుకునేందుకు నీరు, ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు.

ఇప్పటివరకు, ఈ విలయం కారణంగా 832 మందికి పైగా చనిపోయారని అధికారులు ప్రకటించారు.

మృతులను సామూహికంగా ఖననం చేసేందుకు ఇండోనేసియా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం నాడు ఒకే చోట దాదాపు 300 మృతదేహాలను ఖననం చేసినట్లు తెలిసింది.

ఈ ప్రాంతాన్ని సందర్శించిన దేశాధ్యక్షుడు జోకో విడోడో, బాధితులను ఆదుకోవడానికి రాత్రింబగళ్ళు సహాయక చర్యలను కొనసాగించాలని కోరారు.

ఇండొనేషియా సునామీ

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, పాలూ నగరంలో కూప్పకూలిన మసీదు

రిక్టర్ స్కేలుపై 7.5 గా నమోదైన ఈ భూకంపం వల్ల చాలా భవనాలు కూలిపోయాయి. ఈ శిథిలాల కింద ఎంతో మంది ప్రజలు చిక్కుకున్నారని జాతీయ విపత్తు సంస్థ అధికార ప్రతినిధి సుటోపో పుర్వొ నుగ్రొహొ విలేకరుల సమావేశంలో చెప్పారు.

తొలుత భూకంపం రావటంతో అప్రమత్తమైన అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు.

అలా అధికారులు సునామీ హెచ్చరికలు ఎత్తివేసిన కాసేపట్లోనే దాదాపు 20 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడుతూ సులవేసి ద్వీపంలోని పాలు నగరాన్ని ముంచెత్తాయి.

వీడియో క్యాప్షన్, వీడియో: ఇండొనేసియా భూకంపం, సునామీ

నగరంలో కూలిపోయిన భవంతుల శిథిలాల కింద ఎవరైనా ప్రజలు ప్రాణాలతో ఉన్నారేమోనని అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. యంత్రాలను ఉపయోగించకుండా తవ్వకాలు చేపట్టారు.

డొంగల నగరంపై భూకంప, సునామీ తీవ్రత ఎంతగా ఉందనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియట్లేదు.

ఆ నగరానికి వెళ్లే రోడ్లు ధ్వంసం కావటం, అడ్డంకులు ఎదురవడం, ఒక వంతెన కూలిపోవటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది.

భూకంపం, సునామీ కారణంగా 16 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని రెడ్ క్రాస్ సంస్థ అంచనా వేసింది.

‘‘ఇదొక విషాదం. మరింత తీవ్రం కావొచ్చు’’ అని రెడ్ క్రాస్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని, వేలల్లో ఉండొచ్చని ఇండోనేసియా ఉపాధ్యక్షుడు జుసుఫ్ కళ్లా తెలిపారు.

భూకంప ప్రభావిత ప్రాంతాలను దేశాధ్యక్షుడు జోకో విడొడొ సందర్శిస్తున్నారు.

పాలు నగరంలో భవన శిథిలాల కింద చిక్కుకున్న ఒక మహిళను కాపాడుతున్న సహాయ సిబ్బంది

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పాలు నగరంలో భవన శిథిలాల కింద చిక్కుకున్న ఒక మహిళను కాపాడుతున్న సహాయ సిబ్బంది
పాలు మ్యాప్

డొంగల నగరంలో పరిస్థితి ఏంటి?

డొంగల నగరానికి రోడ్డు మార్గంలో కానీ, ఆకాశ మార్గంలో కానీ వెళ్లే అవకాశాల్లేవని, బహుశా సముద్ర మార్గంలో వెళ్లి సహాయ కార్యకలాపాలు అందించాలని సహాయ సంస్థ కేథలిక్ రిలీఫ్ సర్వీసెస్ ఇండోనేసియా దేశ మేనేజర్ యెన్ని సుర్యానీ తెలిపారు.

శుక్రవారం వచ్చిన భూకంపం తర్వాత ఈ దీవిలో తీవ్రమైన భూ ప్రకంపనలు కొనసాగాయి.

గత నెలలో కూడా వరస భూకంపాలు ఇండొనేషియా ద్వీపాలను అతలాకుతలం చేశాయి. లోంబోక్‌లో సంభవించిన భూకంపానికి వందలాది మంది చనిపోయారు. ఆగస్టు 6న సంభవించిన అత్యంత తీవ్రమైన భూకంపం 460 మంది ప్రాణాలు తీసింది.

కూలిపోయిన ఒక ఆస్పత్రి శిథిలాలపైనే చికిత్స పొందుతున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కూలిపోయిన ఒక ఆస్పత్రి శిథిలాలపైనే చికిత్స పొందుతున్న మహిళ
ఇండొనేషియా సునామీ

‘పాలు’ నగరంలో పరిస్థితి ఏంటి?

ఈ నగర జనాభా 3,35,000. భూకంపం ధాటికి చాలా భవంతులు కూలిపోయాయి. వాటి శిథిలాల కింద ప్రాణాలతో చాలామంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

రోవా-రోవా అనే ఒక హోటల్ శిథిలాల కింద చిక్కుకున్న 24 మందిని సహాయక సిబ్బంది కాపాడారు.

2004లో సుమత్రా దీవుల్లో వచ్చిన తీవ్ర భూకంపంతో వచ్చిన భారీ సునామీ వల్ల హిందూ మహా సముద్రం పరిధిలో 2,26,000 మందికి పైగా ప్రజలు చనిపోయారు. ఒక్క ఇండొనేసియాలోనే 1,20,000 మందికి పైగా చనిపోయారు.

తరచూ భూకంపాలు సంభవించే అవకాశంతో పాటు అగ్నిపర్వతాలున్న వలయంలో ఉన్న ఇండొనేసియాకు భూకంపాల ముప్పు ఎప్పుడూ పొంచే ఉంటోంది.

పాలు బీచ్ వద్ద ధ్వంసమైన ఇల్లు, వాహనాలు

ఫొటో సోర్స్, EPA

line

‘తాగడానికి నీళ్లు కూడా దొరకట్లేదు’

పోస్కో నుంచి రెబెక్కా హెన్స్‌ఖె, బీబీసీ ప్రతినిధి, జకార్తా

పాలు నగరం నుంచి నాలుగు గంటల ప్రయాణ దూరంలో ఉన్న పోస్కో నగరంలో నిత్యావసరాల కొరత ఏర్పడింది. పెట్రోలు పంపులు ఖాళీ అయిపోతున్నాయి. సూపర్ మార్కెట్లలో చాలా తక్కువ మొత్తంలోనే సరుకులు ఉన్నాయి. తాగేందుకు బాటిల్ నీళ్ల కోసం చాలా కష్టపడి వెతుక్కోవాల్సిన పరిస్థితి.

మా బీబీసీ బృందంతో పాటు ప్రయాణిస్తున్న ఎర్మి లియానా తల్లిదండ్రులు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా తెలియదు. ‘‘కూలిపోయిన వంతెనకు సమీపంలోనే వాళ్లు ఉంటారు. ఫోన్లో వారిని సంప్రదించలేకపోతున్నాను. వాళ్లు బ్రతికే ఉండాలని దేవుణ్ణి ప్రార్థించటమే ఇప్పుడు నేను చేయగలిగినది’’ అని ఆమె అన్నారు.

డొంగల నగరానికి ఎలాంటి సహాయం వెళుతున్నట్లు మాకు కనిపించట్లేదు. ఇప్పటికీ ఆ నగరానికి సమాచార సంబంధాలు పునరుద్ధరించలేదు.

line

ఇవి కూడా చదవండి:

వీడియో క్యాప్షన్, వీడియో: భవిష్యత్తులో జకార్తాను చూడలేమా?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)