అవెంజర్స్ ఎండ్‌గేమ్: భారీ తారాగణం, స్పెషల్ ఎఫెక్ట్స్.. సూపర్ హీరో సినిమాల సక్సెస్‌కు కారణాలివేనా

ఫొటో సోర్స్, Getty Images
బాక్సాఫీసు రికార్డులు బద్దలుకొట్టడం ఖాయమనే అంచనాల మధ్య అవెంజర్స్ ఎండ్‌గేమ్ సినిమా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇలాంటి సూపర్ హీరో తరహా చిత్రాలు బాగా ప్రజాదరణ పొందుతున్నాయి. మరి ఇలాంటి సినిమాల విజయానికి కారణాలేంటి?
నిజానికి సూపర్ హీరో చిత్రాలు కొత్తేమీ కాదు. 1940ల నుంచి ఇలాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. కానీ, గత దశాబ్ద కాలంగా ఇలాంటివి మరింత ప్రజాదరణ పొందుతున్నాయి. అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన పది సినిమాల్లో నాలుగు సూపర్ హీరో సినిమాలే ఉన్నాయంటే వీటికి ఎలాంటి ప్రజాదరణ ఉందో అర్థమవుతుంది.
అవెంజర్ ఎండ్‌గేమ్ సినిమా.. గత ఏడాది వచ్చిన 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్'కు సీక్వెల్. 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్' ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల డాలర్లు వసూలు చేసింది. కాల్పనిక, సైంటిఫిక్ ఫిక్షనల్ సినిమాలు నిజానికి కొత్తేమీ కావు. స్టార్‌వార్స్ వంటివి దీనికి ఉదాహరణ.

ఫొటో సోర్స్, Getty Images
విజువల్ ఎఫెక్ట్స్
1978లో వచ్చిన సూపర్‌మేన్ అమెరికాలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఆ సినిమా విజువల్ ఎఫెక్టులు ప్రత్యేకం. కానీ, ఆ సినిమాకు వచ్చిన మూడు ఆస్కార్ అవార్డులలో ఒక్కటి కూడా విజువల్ ఎఫెక్టులకు సంబంధించింది కాదు.
గత నాలుగు దశాబ్దాల్లో సినిమాలు సాంకేతికంగా బాగా ప్రగతి సాధించాయి. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో సంక్లిష్ట సన్నివేశాలు కూడా సులభరీతిలో, వాస్తవానికి దగ్గరగా సృష్టించగలుగుతున్నారు.
సూపర్ హీరోలు, విలన్లు అంతా కంప్యూటర్లలో సృష్టించినవారే కావడం దీనికి ఉదాహరణ.

ఫొటో సోర్స్, Getty Images
వైవిధ్యం
సూపర్‌హీరో సినిమాలకు విభిన్న వర్గాల నుంచి ఆదరణ ఉంటోంది. వండర్ ఉమన్, బ్లాక్ పాంథర్‌లే దీనికి ఉదాహరణలు. మహిళ ప్రధాన పాత్రలో ఉన్న మొట్టమొదటి సూపర్ హీరో మూవీ వండర్ ఉమన్ కాగా... అందరూ నల్లజాతి నటులే ఉన్న సినిమా బ్లాక్ పాంథర్. అమెరికాలో బ్లాక్ పాంథర్ ప్రేక్షకుల్లో 53 శాతం ఆఫ్రికన్ అమెరికన్లు, హిస్పానిక్‌లు. మోషన్ పిక్చర్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా లెక్కల ప్రకారం 2018లో ఈ వర్గం సగటు ప్రేక్షకుల సంఖ్య 37 శాతం.. కానీ, బ్లాక్ పాంథర్‌ను 53 శాతం మంది చూశారు.

ఫొటో సోర్స్, Getty Images
స్క్రిప్ట్
ఎక్స్ మన్ సిరీస్‌లోని లోగాన్ వంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఒకేలాంటి ఆదరణ పొందలేదు. కానీ, 2017లో జాక్‌మన్ ప్రధాన పాత్రధారిగా వచ్చిన ఈ సినిమా ఆస్కార్‌లో ఉత్తమ స్క్రీన్‌ప్లేకు నామినేట్ అయిన మొట్టమొదటి సూపర్ హీరో మూవీగా చరిత్ర సృష్టించింది.

ఫొటో సోర్స్, Getty Images
అగ్రశ్రేణి నటులు
జెన్నిఫర్ లారెన్స్, క్రిస్టియన్ బాలె, జార్జ్ క్లూనీ, రాబర్ట్ డౌనీ జూనియర్, నటాలియా పోర్ట్‌మన్, గ్వినిత్ పాల్‌త్రో వంటి భారీ తారాగణం ఇలాంటి సూపర్ హీరో మూవీలలో కనిపిస్తుంటారు.
అగ్రశ్రేణి నటులున్నప్పుడు ఆ సినిమాలపై అంచనాలూ అంతేస్థాయిలో ఉంటాయి. అది ఆ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎస్కేపిజమ్
బాగా ఆదరణ పొందిన సూపర్ హీరో మూవీల్లో కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. విపరీతమైన ప్రేక్షకాదరణ పొందిన సూపర్ హీరో చిత్రాలన్నీ 2008 తరువాత విడుదలైనవే. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్న సంవత్సరంలో అలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలన్న ప్రజల్లోని ఒక బలమైన కోరికకు దీనికి సంబంధం కనిపిస్తుంది.
ప్రపంచం ఆర్థిక ఇబ్బందుల్లో పడినప్పటికీ సినీ రంగం మాత్రం లాభాలు చవిచూసింది. అంతేకాదు.. 2008 నుంచి లాభాలు అంతకంతకూ పెరిగాయే తప్ప తగ్గలేదు.
ప్రజలు తమ కష్టాలను మర్చిపోవడానికి సినిమాలను ఆశ్రయించారని సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీలోని ఎంటర్‌టైన్‌మెంట్ విభాగ ప్రొఫెసర్ మార్టీ కాప్లాన్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
పుంజుకొన్న చైనా మార్కెట్
అమెరికా కాకుండా చూస్తే ప్రపంచంలో చైనా కూడా సినిమాకు పెద్ద మార్కెట్. మోషన్ పిక్చర్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా లెక్కల ప్రకారం 2018లో చైనాలో 900 కోట్ల డాలర్ల సినిమా వ్యాపారం జరిగింది. జపాన్‌తో పోల్చితే ఇది నాలుగు రెట్ల కంటే ఎక్కువ.
చైనాలో మంచి కలెక్షన్లు సాధించే సినిమాల్లో సూపర్ హీరో మూవీస్ ముందుంటున్నాయి. అందుకే ముందుముందు ఆసియా సూపర్ హీరో మూవీస్ సినిమాలు తీయాలని హాలీవుడ్ బుర్రలు ఆలోచిస్తున్నాయట. ఇది చైనా మార్కెట్‌ను మరింత ఆకర్షించడానికేనంటోంది హాలీవుడ్ రిపోర్టర్ అనే సినీ పత్రిక.
ఇవి కూడా చదవండి:
- అవెంజర్స్: ఎండ్‌గేమ్‌ను అర్థం చేసుకోవాలంటే ముందు వచ్చిన 21 సినిమాలూ చూడాల్సిందేనా?
- టీఎస్ఆర్టీసీ బస్: ‘‘పక్కా ప్లాన్‌తో ప్రొఫెషనల్స్ చేసిన దొంగతనం ఇది’’.. ఎలా జరిగిందంటే..
- లాబ్‌స్టర్, పీతల గుల్లలతో ఎకో-ఫ్రెండ్లీ ప్లాస్టిక్ సంచుల తయారీ
- ఫుట్‌బాల్ మైదానం కంటే పెద్ద విమానం
- 12 లక్షల తులిప్ పుష్పాలను ఒక్కచోట చూస్తే..
- రాజకీయ పార్టీల నుంచి ముస్లిం మహిళలు ఏం కోరుకుంటున్నారు...
- అంతరిక్షంలో అత్యధికంగా చెత్త నింపే దేశం ఏదో తెలుసా...
- లైంగిక వేధింపుల కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు: నాలుగు ప్రశ్నలు
- నవీన్ పట్నాయక్ మ్యాజిక్ అయిదోసారీ ఫలించనుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








