రామ్ గోపాల్ వర్మను అడ్డుకున్న విజయవాడ పోలీసులు.. ఏపీలో ప్రజాస్వామ్యం లేదన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' దర్శకుడు

రాంగోపాల్ వర్మ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వి.శంకర్
    • హోదా, బీబీసీ కోసం

'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ప్రచార కార్యక్రమంలో భాగంగా మీడియా సమావేశం నిర్వహించేందుకు విజయవాడ వెళ్లిన సినీ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మను స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతలు, ఎన్నికల కోడ్ దృష్టిలో ఉంచుకొనే ఈ చర్య తీసుకొన్నామని పోలీసులు చెప్పగా, నిజం చెప్పాలని ప్రయత్నించడమే తాను చేసిన నేరమంటూ వర్మ విమర్శించారు.

ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం లేదని ఆయన ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

తొలుత విజ‌య‌వాడ‌లోని హోట‌ల్ ఐలాపురంలో తన మీడియా స‌మావేశాన్ని అడ్డుకున్నార‌ని వ‌ర్మ ఆరోపించారు. త‌న మీడియా స‌మావేశాన్ని విజ‌య‌వాడ న‌గ‌రంలోనే పైపుల రోడ్డులోని ఎన్టీఆర్ స‌ర్కిల్ వ‌ద్ద ఏర్పాటు చేస్తున్న‌ట్టు వ‌ర్మ ప్ర‌క‌టించ‌డంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

పోస్టర్

ఫొటో సోర్స్, Facebook/RGV

మీడియా సమావేశం కోసం గన్నవరంలోని విమానాశ్రయానికి చేరుకున్న త‌ర్వాత రామ‌వ‌ర‌ప్పాడు జంక్ష‌న్ వ‌ద్ద వ‌ర్మ‌తోపాటు చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. అక్క‌డే వ‌ర్మ‌ను అదుపులోకి తీసుకున్న‌ పోలీసులు తిరిగి విమానాశ్రయం లాంజ్‌కు త‌ర‌లించారు.

శాంతి భద్రతల సమస్యతోపాటు ఎన్నిక‌ల కోడ్ నేప‌థ్యంలోనే ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు విజయవాడ పోలీసులు తెలిపారు.

రెండు నెల‌లుగా వివాదం

రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చుట్టూ గ‌డిచిన రెండు నెల‌లుగా వివాదం సాగుతోంది. ఆంధ్ర‌ ప్ర‌దేశ్ హైకోర్ట్ ఇచ్చిన స్టే కార‌ణంగా ఏపీలో ఈ సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. తెలంగాణ స‌హా అన్ని ప్రాంతాల్లోనూ సినిమా విడుద‌ల‌య్యింది.

రామ్ గోపాల్ వర్మ

ఫొటో సోర్స్, STR/AFP/Getty Images

మే 1న ఏపీలో ఈ సినిమా విడుదల నేపథ్యంలో ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా మీడియా స‌మావేశం ఏర్పాటు చేస్తున్న‌ట్టు శ‌నివారం సాయంత్రం వర్మ ప్ర‌క‌టించారు. తొలుత విజ‌య‌వాడ‌లోని నోవాటెల్, ఆ త‌ర్వాత హోట‌ల్ ఐలాపురంలో త‌మ‌కు అనుమ‌తి ఇచ్చి ర‌ద్దు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. అడ్వాన్స్ కూడా తీసుకుని హోట‌ల్లో మీడియా సమావేశానికి అనుమ‌తి ర‌ద్దు చేయ‌డం వెనుక అధికార దుర్వినియోగం ఉందన్నారు.

సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వ‌హించ‌బోతున్న మీడియా స‌మావేశానికి అంద‌రూ రావాల‌ని వర్మ సోషల్ మీడియాలో కోరారు. న‌డిరోడ్డుపైనే మీడియా సమావేశం ఉంటుందంటూ ప్ర‌క‌టించారు. "మీడియా మిత్రులకు, ఎన్టీఆర్ నిజమ్తైన అభిమానులకు, నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతి ఒక్కరికీ, నిజాన్ని గౌరవించే ప్రజలందరికీ ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇదే నా బహిరంగ ఆహ్వానం" అంటూ వ‌ర్మ సోష‌ల్ మీడియాలో విజ్ఞప్తి చేశారు.

తమ హోటల్లో మీడియా సమావేశం నిర్వహణకు తాము అడ్వాన్సు తీసుకున్నామన్న వర్మ మాటల్లో నిజం లేదని హోటల్ ఐలాపురం తెలిపింది.

"వర్మ సినిమా మీడియా సమావేశం కోసం రూమ్ కావాల‌ని వ‌చ్చారు. బుక్ చేసుకున్నారు. కానీ ఎవరూ హోటల్‌కు రాలేదు. మీడియా సమావేశం నిర్వహణకు అనుమ‌తి ఇవ్వ‌వ‌ద్దంటూ పోలీసుల ఆదేశాలున్నాయి. మేం అడ్వాన్స్ తీసుకున్న‌ట్టు వ‌ర్మ చెప్పిన విష‌యంలో వాస్త‌వం లేదు" అని హోట‌ల్ ఐలాపురం ఫ్రంట్ ఆఫీస్ ఇన్‌ఛార్జి ర‌జిత బీబీసీకి తెలిపారు.

ముందే నోటీసులు ఇచ్చామంటున్న పోలీసులు

శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌లు త‌లెత్తే ప్ర‌మాదం ఉండటంతో ముంద‌స్తుగానే వ‌ర్మ‌కు నోటీసులు ఇచ్చిన‌ట్టు విజ‌య‌వాడ పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా సెక్ష‌న్ 144, సెక్ష‌న్ 30 అమ‌ల్లో ఉన్నందున న‌డిరోడ్డుపై మీడియా సమావేశం పెట్టడానికి వీల్లేదంటూ, వర్మ విమానాశ్రయానికి చేరుకోగానే ఆయనకు వారు నోటీసులు అందించారు. వెంట‌నే విజ‌య‌వాడ నుంచి వెన‌క్కు వెళ్లిపోవాల‌ని చెప్పారు.

నోటీసుల‌ను వర్మ బేఖాత‌రు చేసేందుకు యత్నించడంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నామ‌ని విమానాశ్రయం వద్ద ఉన్న ఏపీ పోలీసులు ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్ వెళ్లిపోవాల‌ని ఆయనకు చెప్పారు. ముంద‌స్తుగా నోటీసులు అందుకున్న త‌ర్వాత కూడా వాటిని ఉల్లంఘిస్తే స‌హించేది లేద‌న్నారు.

రామ్ గోపాల్ వర్మ

ఫొటో సోర్స్, Sean Gallup/Getty Images

పోలీసులతో వాగ్వాదం

సింగ్ న‌గ‌ర్‌లోని పైపుల రోడ్డు ఎన్టీఆర్ స‌ర్కిల్ స‌మీపంలో ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయ‌ని పోలీసులు చేసిన సూచ‌న‌తో వ‌ర్మ వెన‌క్కు త‌గ్గారు. త‌న‌కు హోట‌ల్లో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసుకునే అవ‌కాశం ఇవ్వాల‌ని పోలీసుల‌తో వాగ్వాదానికి దిగారు. ప‌రీక్ష‌ల నేప‌థ్యంలో న‌డిరోడ్డు మీద మీడియా స‌మావేశం ర‌ద్దు చేసుకుంటాన‌ని, త‌న సినిమా గురించి ప్ర‌చారం చేసుకునే స‌మావేశం నిర్వ‌హ‌ణ‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. అయితే పోలీసులు వ‌ర్మతో పాటు నిర్మాత రాకేశ్ రెడ్డిని కూడా విమానాశ్రయం లాంజ్‌లోనే నిలిపివేయ‌డంతో వివాదం ముదిరింది.

"మ‌మ్మ‌ల్ని బ‌లవంతంగా వేరే కారులో ఎక్కించి తీసుకొచ్చి విమానాశ్రయంలో ప‌డేశారు. ’విజ‌య‌వాడ రావ‌డానికి వీలులేదు.. విజ‌య‌వాడ‌లో మ‌కాం ఉండ‌డానికి వీలు లేదు’ అన్న‌ట్టుగా చెబుతున్నారు. ఇలా ఎందుకు చేయాల్సి వ‌చ్చింద‌న్న‌ది నాకైతే అర్థం కావ‌డం లేదు. విజ‌య‌వాడ ఎయిర్ పోర్ట్‌లో కూడా ఉండ‌డానికి వీల్లేదని చెప్ప‌డానికి కార‌ణం తెలియ‌డం లేదు. పోలీసులు శాంతిభ‌ద్ర‌తల కోసం బాధ్య‌త‌గా ఉండాలి. కానీ వారు ఎంత అడిగినా స‌మాధానం కూడా చెప్ప‌లేదు" అని ట్విటర్‌లో ఈ రోజు మధ్యాహ్నం పెట్టిన ఒక వీడియోలో వ‌ర్మ వ్యాఖ్యానించారు.

అనంత‌రం కొద్దిసేప‌టికే త‌న విజ‌య‌వాడ మీడియా సమావేశాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్టు ఆయన ప్ర‌క‌టించారు. త‌న‌ను పోలీసులు విమానాశ్రయంలో అడ్డుకుని, తిరిగి బ‌ల‌వంతంగా హైద‌రాబాద్ పంపిస్తున్నారని తెలిపారు. "ప్ర‌జాస్వామ్యం ఎక్క‌డుంది? నిజానికి ఎందుకు వెన్నుపోటు పొడుస్తున్నారు" అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబునాయుడిని ట్యాగ్ చేసి, ప్ర‌శ్నించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

హైదరాబాద్ వెళ్లాక స్పందిస్తా: వర్మ

"లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు సంబంధించి మీడియా సమావేశం పెట్టాలనుకున్నా. విజయవాడ వచ్చాక పోలీసులు అడ్డుకున్నారు. ఏ కారణంగా పోలీసులు అడ్డుకున్నారో మాకు అర్థం కాలేదు. విజయవాడ వెళ్తున్న మమ్మల్ని అడ్డుకుని తిరిగి తీసుకొచ్చి గన్నవరం విమానాశ్రయంలో పడేశారు. పోలీసులు అడ్డుకోవడం వెనుక ఆంతర్యం అర్థం కాలేదు. మాకు విజయవాడ వచ్చే హక్కు లేదా? సినిమాకు సంబంధించి చెప్పుకొనే భావ ప్రకటన హక్కు మాకు లేదా? దీనిపై హైదరాబాద్ వెళ్లిన తర్వాత స్పందిస్తాను" అని వర్మ ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)