యెమెన్‌లో కారు బాంబు పేలుడు.. 9 మందికిపైగా మృతి - BBC Newsreel

ఫొటో సోర్స్, EPA
యెమెన్ తాత్కాలిక రాజధాని ఆడెన్‌లోని ఒక విమానాశ్రయం సమీపంలో జరిగిన కారుబాంబు పేలుడులో 9 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ఈ పేలుడులో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. యెమెన్ ప్రధాని ముయీన్ అబ్దుల్ మాలెక్ దీన్ని 'టెర్రరిస్టులు జరిపిన బాంబు దాడి'గా పేర్కొన్నారు.
పేలుడు కారణంగా చనిపోయిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
ఈ దాడికి తామే కారణమంటూ ఇంతవరకు ఏ సంస్థా ప్రకటించుకోలేదు.
ఆడెన్ మాజీ గవర్నర్ విమానాశ్రయానికి వచ్చిన సమయంలో ఈ దాడి జరిగిందని స్థానిక మీడియా చెబుతోంది. అయితే, ఈ దాడిలో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఆడెన్ ప్రస్తుత గవర్నర్ లక్ష్యంగా కూడా మూడు వారాల కిందట కారు బాంబు పేల్చారు. ఆ పేలుడులో ఆరుగురు చనిపోయారు.
గత ఏడాది డిసెంబరులో ఇదే ఎయిర్‌పోర్టు వద్ద జరిగిన పేలుడులో 22 మంది మరణించారు. ఆ తరువాత ఇదే పెద్ద దాడి.
హౌతీ తిరుగుబాటుదారులు 2014లో యెమెన్ ప్రభుత్వాన్ని రాజధాని సనా నుంచి తరిమేసిన తరువాత ఆడెన్ కేంద్రంగా పాలన సాగిస్తున్నారు.
సౌదీ నేతృత్వంలోని అరబ్ దేశాల సంకీర్ణం 2015లో యెమెన్‌లో సైనిక చర్యకు దిగి హౌతీ తిరుగుబాటుదారులను ఓడించి అధ్యక్షుడు అబ్ద్రాబూ మన్సూర్ హదీ పాలనను పునరుద్ధరించారు. ఆ తరువాత సంక్షోభం మరింత తీవ్రమైంది.
ప్రభుత్వం, తిరుగుబాటుదారుల మధ్య యుద్ధం కారణంగా ఇప్పటివరకు 1,10,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

ఫొటో సోర్స్, PA Media
కార్పొరేట్ కంపెనీల లాభాలపై కనీసం 15 శాతం పన్ను .. ఒప్పందాన్ని అంగీకరించిన ప్రపంచ నాయకులు
అంతర్జాతీయ పన్ను వ్యవస్థలో సంస్కరణలకు ప్రపంచంలోని 20 ప్రధాన ఆర్థిక వ్యవస్థల అధినేతలు ఆమోదం తెలిపారు. బహుళ జాతి సంస్థల లాభాలపై కనీసం 15 శాతం పన్ను విధించే ప్రపంచ ఒప్పందానికి ఆమోదముద్ర వేశారు.
బహుళజాతి సంస్థలు తమ లాభాలను తక్కువ పన్ను ఉండే దేశాల నుంచి చూపిస్తున్నాయనే ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రోమ్‌లో జరిగిన జీ20 సదస్సుకు హాజరైన నేతలంతా ఈ ఒప్పందాన్ని ఆమోదించారు.
వాతావరణ మార్పులు, కోవిడ్ అనేవి జీ20 సదస్సులో ప్రధాన ఎజెండాలో భాగంగా ఉన్నాయి. ప్రపంచంలోని కీలక ఆర్థిక వ్యవస్థల దేశాల కూటమి అయిన జీ20 సదస్సులో ఈసారి దేశాధినేతాలు ముఖాముఖిగా చర్చించారు. కోవిడ్ మహమ్మారి రెక్క విప్పిన తరువాత ఇలా ముఖాముఖిగా సదస్సు ఏర్పాటు కావడం ఇదే మొదటిసారి.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌లు ఈ సదస్సులో పాల్గొనడానికి రోమ్‌కు రాలేదు. ఇరువురు నేతలూ ఈ సమావేశంలో వీడియో లింక్ ద్వారానే పాల్గొనాలని భావించారు.
రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకారం, అమెరికా ప్రతిపాదించిన ఈ పన్ను ఒప్పందం ఆదివారం అధికారికంగా ఆమోదంపొందనుంది. 2023 నాటికి అమలు కానుంది.
''ఈ చారిత్రాత్మక ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలక ఘట్టంలాంటిది. కార్పొరేట్ పన్నుల విధింపులో దిగువ స్థాయివారిని నష్టపరిచే రేసును అంతం చేస్తుంది'' అని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ పేర్కొన్నారు.
అమెరికాకు చెందిన అనేక పెద్ద కంపెనీలు ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉన్నప్పటికీ, యూఎస్ వ్యాపారస్తులు, కార్మికులు ఈ ఒప్పందం నుండి ప్రయోజనం పొందుతారని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
''జీ20లో, ప్రపంచ జీడీపీలో 80%కి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు ఉన్నారు. అందరూ ఒకే విధంగా విధించే పటిష్టమైన అంతర్జాతీయ కనీస పన్ను కోసం స్పష్టంగా తమ మద్దతును ఇచ్చారు.
ఇది కేవలం పన్ను ఒప్పందం మాత్రమే కాదు. దౌత్యం ద్వారా మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించి, ఫలాలను మన ప్రజలకు అందించడం లాంటిది'' అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.
ఇటలీ ప్రధాన మంత్రి మారియో డ్రాఘి రెండు రోజుల జీ20 శిఖరాగ్ర సమావేశాన్ని ఏకీకరణ సందేశంతో ప్రారంభించారు. "ఒంటరిగా వెళ్లడం అనేది కేవలం ఒక ఎంపిక కాదు. మన విభేదాలను అధిగమించడానికి మనం చేయగలిగినదంతా చేయాలి" అని ప్రపంచ నాయకులకు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ‘తాలిబాన్లు ఇంటింటికీ తిరిగి డబ్బు వసూలు చేస్తున్నారు, వితంతువులను చెరబడుతున్నారు’
- మెటా: ఫేస్‌బుక్ కొత్త పేరుపై ఎందుకు జోకులు పేలుతున్నాయి?
- పోలీసులు ఫోన్ తీసుకుని మన వాట్సాప్ చాట్ చెక్ చేయొచ్చా
- టీ20 వరల్డ్ కప్: జాస్ బట్లర్ మెరుపులు, ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ విజయం
- ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు: ఆర్థర్ రోడ్ జైలు అత్యంత ప్రమాదకరమని ఎందుకంటారు?
- కరోనావైరస్ ఎక్కడ పుట్టిందో తెలుసుకోవడం ఎప్పటికీ సాధ్యంకాకపోవచ్చు – అమెరికా నిఘా సంస్థలు
- టీ20 వరల్డ్ కప్: 'మతం పేరుతో ఒక వ్యక్తిపై దాడి చేయడం అత్యంత నీచం' - విరాట్ కోహ్లీ
- అప్గానిస్తాన్: తాలిబాన్లు ఐఎస్‌కు వ్యతిరేకంగా రహస్య యుద్ధం చేస్తున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












