అమెరికా: కీలక బిల్లుకు లభించని సెనేట్ ఆమోదం.. నిలిచిపోయిన ప్రభుత్వ సేవలు

వైట్ హౌజ్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలో కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లుకు సెనేట్‌ ఆమోదం లభించకపోవడంతో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ కార్యకలాపాలు, సేవలు చాలా వరకు నిలిచిపోయాయి. మరిన్ని సేవలు నిలిచిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతున్నాయి.

ఫిబ్రవరి 16 వరకు నిధుల వినియోగానికి ప్రభుత్వానికి వీలు కల్పించే ఈ బిల్లు ఆమోదం పొందకపోవడం లక్షల మంది ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది.

బిల్లుపై రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య చివరి క్షణం వరకు చర్చలు జరిగినా, బిల్లు ఆమోదానికి కావాల్సిన 60 ఓట్లు లభించలేదు.

బిల్లుకు అనుకూలంగా 50 మంది, వ్యతిరేకంగా 49 మంది సెనేటర్లు ఓటు వేశారు.

రిపబ్లికన్లలో ఐదుగురు వ్యతిరేకంగా, డెమోక్రాట్లలో ఐదుగురు అనుకూలంగా ఓటు వేశారు.

బిల్లు ప్రతినిధుల సభలో గురువారమే ఆమోదం పొందింది. శుక్రవారం సెనేట్‌లో మాత్రం ఈ ఫలితాన్ని చవిచూసింది.

ఇమ్మిగ్రేషన్, సరిహద్దు భద్రత అంశాలపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య తీవ్రస్థాయి విభేదాలు తలెత్తాయి.

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

డెమోక్రాట్లపై మండిపడిన వైట్‌హౌస్

ప్రస్తుత పరిస్థితికి కారణం మీరంటే.. మీరంటూ.. పాలక, ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకొంటున్నాయి.

అధ్యక్షుడు ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీకే కాంగ్రెస్‌లోనూ బలం ఉంది. అటు అధ్యక్ష పదవిని, ఇటు కాంగ్రెస్‌లో ఆధిక్యాన్ని ఒకే పార్టీ కలిగి ఉన్న సందర్భంలో ఈ బిల్లుకు ఆమోదం లభించకపోవడం ఇదే ప్రథమం.

ఈ పరిణామంతో డెమోక్రాట్లపై అధ్యక్ష భవనం మండిపడింది. తమ నిర్లక్ష్యపూరిత డిమాండ్లతో వారు ప్రజలకు నష్టం కలిగిస్తున్నారని విమర్శించింది.

సైనిక కుటుంబాలు, చిన్నారులు, దేశంలోని ప్రజలందరి అవసరాలను తీర్చడం కంటే డెమోక్రాట్లకు రాజకీయాలే ముఖ్యమైపోయాయని వైట్‌హౌస్ వ్యాఖ్యానించింది.

చుక్ ష్కుమర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చుక్ ష్కుమర్

బిల్లుపై రెండు పార్టీల మధ్య రాజీ కోసం రెండు ప్రతిపాదనలు చేయగా, అధ్యక్షుడు ట్రంప్ వాటిని తోసిపుచ్చారని సెనేట్‌లో డెమోక్రాటిక్ పార్టీ నాయకుడు చుక్ ష్కుమర్ తప్పుబట్టారు.

రిపబ్లికన్ పార్టీపై ట్రంప్ తగినంత ఒత్తిడి తీసుకురాలేదని ఆయన విమర్శించారు.

అమెరికా కాలమానం ప్రకారం ప్రభుత్వ సేవలు స్తంభించిపోవడం శుక్రవారం అర్ధరాత్రి దాటాక అంటే శనివారం మొదలయ్యింది.

ట్రంప్ ప్రభుత్వ తొలి వార్షికోత్సవం రోజే ఈ పరిస్థితి ఏర్పడింది. ఆయన నిరుడు జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు.

జాతీయ భద్రత, తపాలా సేవలు, గగనతల రద్దీ నియంత్రణ, వైద్యసేవలు, విపత్తు సహాయక చర్యలు, విద్యుదుత్పత్తి, పలు ఇతర అత్యవసర ప్రభుత్వ సేవలు, కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

నాడు 16 రోజులు కొనసాగిన సమస్య

బిల్లు కాంగ్రెస్ ఆమోదం పొందకపోవడం వల్ల ప్రభుత్వ సేవలు నిలిచిపోయిన పరిస్థితి చివరిసారిగా 2013లో ఏర్పడింది.

అప్పుడు 16 రోజులపాటు ఈ సమస్య కొనసాగింది.

ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది విధులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఒక దశలో అత్యధికంగా సుమారు 8.5 లక్షల మంది విధులకు హాజరు కాలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో వారికి వేతనం అందదు.

వీసా, పాస్‌పోర్టు సేవల్లో జాప్యం

నిధుల వినియోగానికి కాంగ్రెస్ ఆమోదం లభించనందున ఇప్పుడు అనేక ప్రభుత్వ కార్యాలయాలు సేవలను, కార్యకలాపాలను నిలిపివేశాయి.

గృహనిర్మాణం, పర్యావరణం, విద్య, వాణిజ్యం విభాగాల ఉద్యోగుల్లో అత్యధికులు కార్యాలయాలకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితం కానున్నారు.

ఖజానా, ఆరోగ్యం, రక్షణ, రవాణా విభాగాల ఉద్యోగుల్లో సగానికి సగం మంది సోమవారం విధులకు హాజరు కాబోవడం లేదు.

వీసా, పాస్‌పోర్టు సేవల్లో కూడా జాప్యం జరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)