‘రాజు ఎప్పుడూ తప్పు చేయడని రాజ్యాంగం చెబుతుంది. మరి తప్పు చేస్తే ఏం చేయాలి?’

ఫొటో సోర్స్, CHANDAN KHANNA/getyimages
2జీ స్పెక్ట్రం కేటాయింపుల కేసుకు సంబంధించి మాజీ టెలికాం మంత్రి, డీఎంకే నేత ఎ.రాజాను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల నిర్దోషిగా ప్రకటించింది.
దీనికి సంబంధించి '2జీ సాగా అన్‌ఫోల్డ్స్' పేరుతో రాజా ఓ పుస్తకం రాశారు. ఈ సందర్భంగా ఆయన జర్నలిస్టులతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...
నేనెందుకు పుస్తకం రాయాలనుకున్నానంటే..
నా విషయంలో సహజ న్యాయం జరగలేదు, సుప్రీంకోర్టులోగాని, పార్లమెంట్‌లోగాని, దర్యాప్తు సంస్థల ఎదుటగాని వివరణ ఇచ్చుకునే అవకాశాన్ని నాకు కల్పించలేదు.
అందుకే జైలులో ఉన్నప్పుడే పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నాను. నా వైపు నుంచి ప్రజలకు దీని గురించి చెప్పాలనుకున్నా. తుది తీర్పు ఎలా ఉన్నా సరే, అది వెలువడటానికి ముందే నా పుస్తకాన్ని ప్రచురించాలని ప్రచురణకర్తలను కోరాను.

ఫొటో సోర్స్, Getty Images
'వినోద్ రాయ్ దేశాన్ని మోసం చేశారు'
యూపీఏ-2 రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక దాన్ని కూలదోసే ప్రయత్నాలు జరిగాయి. కాగ్ నివేదికను వినోద్ రాయ్ ఇందుకోసం వినియోగించుకునేందుకు ప్రయత్నించారు.
అందుకే, ఆయన లక్షా 76 వేల కోట్ల రూపాయిలంటూ ఓ పెద్ద సంఖ్యను సృష్టించి దేశాన్ని మోసం చేశారు. సంచలనాలతో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు యత్నించారు.
స్పెక్ట్రం వేలం వేయడం ప్రభుత్వ విధాన నిర్ణయం. అందుకే నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆ పద్ధతిపై వ్యతిరేకంగా ఏమీ లేరు.
వేలం విధానం సరైన పద్ధతిలో అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటానని మాత్రమే ప్రధాని చెప్పారు. సీబీఐ అధికారులు లేదా కొంతమంది మంత్రివర్గ సహచరులు ఆయనను తప్పుదోవ పట్టించి ఉండొచ్చు. అందువల్లే ఆయన మౌనంగా ఉన్నారని నేను భావిస్తున్నా.
'సుప్రీం తీర్పు తప్పు కావొచ్చు'
కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదకను అనుసరించి సుప్రీం కోర్టు 122 లైసెన్స్‌లను రద్దు చేయడంపై రాజాను ప్రశ్నించగా, "అసలు కాగ్ నివేదికే తప్పని రుజువైంది. అందువల్ల లైసెన్స్‌ల రద్దు కూడా అప్పుడు తప్పే అవుతుంది. నాకు న్యాయవ్యవస్థ మీద గౌరవం ఉంది. అంతిమంగా సుప్రీం కోర్టే ఫైనల్. అయితే ప్రతీసారి వారి తీర్పే సరైంది కాకపోవచ్చు. మళ్లీ లైసెన్స్ పొందాలనుకునే కంపెనీలు న్యాయస్థానాన్ని సంప్రదించవచ్చు. కోర్టుకు వెళ్లవచ్చు" అని అన్నారు.

ఫొటో సోర్స్, MONEY SHARMA/getty images
'చిదంబరం మౌనంతో నిరాశ చెందా'
కేంద్ర ఆర్థిక మంత్రి సలహాలను పాటించలేదని నాపై ఆరోపణలు వచ్చాయి. అయితే, దీనిపై మొదట ఆర్థికమంత్రిని విచారించాలని నేను సీబీఐని అడిగాను. కానీ, వారు ఆ పని చేయలేదు. నాటి ఆర్థికమంత్రి పి.చిదంబరం కూడా మౌనంగానే ఉండిపోయారు. ఆయన మౌనం నన్ను నిరాశకు గురిచేసింది.
ఎయిర్ సెల్, ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియా కంపెనీలు మార్కెట్‌లో తమ గుత్తాధిపత్యం కొనసాగించుకునేందుకు సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాగా ఏర్పడ్డాయి. కొత్తగా వచ్చే కంపెనీలకు లైసెన్స్‌లు జారీ చేయడాన్ని ఈ కంపెనీలు సవాల్ చేస్తూ టెలికం ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాయి.
అయితే, ట్రైబ్యునల్ వారి అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో వాళ్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కంపెనీలు మార్కెట్‌లో పోటీని ఇష్టపడడం లేదంటూ సుప్రీం వారికి జరిమానా విధించింది.
అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాకే ఆ కంపెనీలన్నీ కలసి ప్రధానమంత్రి కార్యాలయానికి ఎవరి సంతకం లేకుండానే ఓ లేఖ రాశాయి. అయితే, ప్రధానిని ఎవరు ప్రేరేపించారో నాకు తెలియదు కానీ, ఆ లేఖను ఆధారంగా చేసుకొని ఈ విషయంపై చర్య తీసుకోవాలని ఆయన నాకు లేఖ రాశారు. వేలం వేయడానికి ముందు తనను సంప్రదించాలని ఆయన కోరారు.

ఫొటో సోర్స్, Getty Images
'రాజు' విఫలమైతే..
దేశాన్ని మోసం చేసినందుకు వినోద్ రాయ్ మీద చర్యలు తీసుకోవాలి. కానీ, ఆయనకు రాజ్యాంగ రక్షణ ఉంది. రాజు ఎప్పుడు తప్పు చేయడని రాజ్యాంగం చెబుతుంది.
ఒక వేళ రాజు తప్పు చేస్తే ఏం చేయాలో రాజ్యాంగం చెప్పలేదు. కాంగ్రెస్, డీఎంకేలకు ఈ పుస్తకంతో ఏ సంబంధం లేదు.
'మీడియా మీద కోపం లేదు'
ఏ వార్తా సంస్థల మీద నాకు కోపం లేదు. వాళ్లకు ఎలాంటి వార్త అయినా రాసే హక్కు ఉంది. కాగ్ నివేదికే సరైందని వాళ్లు నమ్మారు. రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తి కూడా అబద్ధాలు చెప్పే అవకాశం ఉందని మీడియా ఆలోచించలేదు.
కానీ, వినోద్ రాయ్ అబద్ధాలకోరు, మోసగాడు అని ఇప్పుడు రుజువైంది. తన వ్యక్తిగత స్వార్థంతోనా లేక ఇతర కారణాలతోనా తెలియదుకానీ ఆయన అందరిని తప్పుదోవ పట్టించారు.

ఫొటో సోర్స్, RAVEENDRAN
'కాగ్ అలా అర్థం చేసుకుంది'
ప్రభుత్వానికి డబ్బు అవసరం. అందుకే ప్రధాని, ఆర్థిక మంత్రి, నేను చర్చించుకొని కొత్తగా టెలికంలో అడుగుపెట్టే కంపెనీల లైసెన్సు ఫీజులు పెంచకుండా, కొనసాగుతున్న టెలికం కంపెనీల స్పెక్ట్రం వినియోగ ధరలను పెంచాలని నిర్ణయించాం.
ఈ నేపథ్యంలోనే తమతో సమావేశం కావాలని టెలికం కమిషన్‌ను పిలిచాం. అయితే వారు కొత్తగా స్పెక్ట్రం కేటాయింపులలో బిజీగా ఉండటంతో సమావేశం వాయిదా పడింది. కేటాయింపులు పూర్తిచేశాకే సమావేశం కావాలని నిర్ణయించుకున్నాం.
కానీ, కాగ్ నివేదిక మాత్రం టెలికం కమిషన్‌కు సమాచారం ఇవ్వకుండా ఉండేందుకే మీటింగ్‌ను వాయిదా వేశారని పేర్కొంది. ఫీజు పెంపును కమిషన్ అంగీకరించలేదని కాగ్ ఆరోపించింది. అయితే, కొత్త కంపెనీల లైసెన్సు ఫీజులు, కొనసాగుతున్న టెలికం కంపెనీల స్పెక్ట్రం వినియోగ ధరల పెంపు, సమావేశం వాయిదాకు స్పెక్ట్రం కేటాయింపులతో ఎలాంటి సబంధం లేదని టెలికం సెక్రటరీ.. కాగ్‌కు లేఖ రాశారు.
సమావేశం వాయిదా వెనుక కుట్ర ఉందని కోర్టుకు నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక చూసి అక్కడున్న న్యాయమూర్తి, లాయర్లు కూడా నవ్వారు.

ఫొటో సోర్స్, Getty Images
'అందుకే అవి ముందే డీడీ తీసుకున్నాయి'
స్పెక్ట్రం కేటాయింపు తేదీకి ముందే కొన్ని కంపెనీలు డీడీ తీసుకున్నాయి కదా అని అడగ్గా, రాజా దీనిపై స్పందిస్తూ...
'సెప్టెంబర్ 25కు ముందు దరఖాస్తు చేసుకున్న అన్ని కంపెనీలకు స్పెక్ట్రంలు కేటాయిస్తారని గతంలోనే పత్రికల్లో ప్రచురితమైంది. ఆ తేదీకి ముందు దరఖాస్తు చేసుకుంటే స్పెక్ట్రంలు కేటాయిస్తారని కంపెనీలకు తెలుసు. భారీ మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉండటంతో స్పెక్ట్రం కేటాయింపులకు దరఖాస్తు చేసుకున్న కంపెనీలు ముందే డీడీ తీసుకున్నాయి' అని రాజా వివరణ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
- ప్రకంపనలు సృష్టిస్తున్న ప్యారడైజ్ పేపర్స్
- అపర కుబేరుల పన్ను స్వర్గం రహస్యాలు బట్టబయలు
- ప్యారడైజ్ పేపర్స్‌లో వైఎస్ జగన్ పేరు!
- ‘ఇంతకీ అజ్ఞాతవాసి ఫ్రెంచ్ మూవీకి కాపీయా? కాదా?’
- ఇంటర్వ్యూ: హెబ్బార్స్ కిచెన్ సృష్టికర్త ఈవిడే
- జోల పాటలు, లాలి పాటలతో తల్లికి కూడా లాభమే!
- సోషల్‌మీడియాలో మీసం మెలేస్తున్న దళితులు!
- కూల్‌డ్రింక్స్ తాగితే కొవ్వు పెరుగుతుందా?
- ‘ఏడాదిన్నరలో అమెరికా వీడి వెళ్లండి’
- ఓల్డ్‌మాంక్ సృష్టికర్త మృతి
- ఇస్రో: ఈ మరుగుజ్జు నక్షత్రవీధి ఓ భారీ నక్షత్రాల ఫ్యాక్టరీ
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








