పవన్: 2018 నాటికి ప్రాజెక్టును పూర్తిచేయడం అసాధ్యం

ఫొటో సోర్స్, janasena/facebook
ఈనాడు: పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకూ చేసిన ఖర్చుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. లేదంటే కేంద్ర ప్రభుత్వంతోపాటు, ప్రజలకూ అపోహలు, అనుమానాలు వ్యక్తమవుతాయని హెచ్చరించారు.
ప్రాజెక్టును పరిశీలించిన ఆయన, 2018 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం అసాధ్యమమని వ్యాఖ్యానించారు. రాజకీయ లబ్ధి కోసం పూర్తిచేస్తామని ప్రకటనలు చేయడం సరికాదన్నారు.
2014 నాటికి పోలవరం వ్యయం రూ.25 వేల కోట్లుగా చెప్పిన ప్రభుత్వం, అప్పట్లో భూసేకరణ ఖర్చును కలపలేదని అనడం హాస్యాస్పదమన్నారు.
ఈ ప్రాజెక్టుపై అఖిలపక్ష కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, Telangana CMO
అందరూ ఆహ్వానితులే
ఆంధ్రజ్యోతి: తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులేనని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దేశ విదేశాల నుంచి విచ్చేస్తున్న 7,857 మందికి బడ్జెట్ హోటళ్లలో ఉచిత వసతి, భోజనం, ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించింది. స్టార్ హోటళ్లలో ఉండేవారికి 40-50 శాతం రాయితీ ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది.
నమోదు చేయించుకోని వారికి ప్రారంభ, ముగింపు వేడుకలకు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఈ మహాసభలలో తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.
ప్రారంభం రోజున ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మారిషస్ ఉప ప్రధాని పరమశివమ్ పిళ్ల్లై, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఇతర ప్రత్యేక ఆహ్వానితులు హాజరు కానున్నారు.

ఫొటో సోర్స్, Telangana CMO
పదిహేను రోజులకు మళ్లీ వస్తా
సాక్షి: వచ్చే వర్షాకాలం నుంచి గోదావరి నది నీరు ఒక్క చుక్క కూడా వృథాగా కిందికి పోవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు మూడు షిఫ్టుల్లో పనిచేయాలని సూచించారు.
ప్రాజెక్టు పురోగతిపై కాగితాల్లో చూపిస్తున్న దానికి, సమీక్షల్లో వివరిస్తున్న అంశాలకు, జరుగుతున్న పనులకు పొంతన లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బ్యారేజీలు, పంపుహౌస్‌లు, దేవాదుల ప్రాజెక్టు కోసం నిర్మిస్తున్న తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణ పనులను కేసీఆర్ గురువారం పరిశీలించారు.
మరో పదిహేను రోజుల్లో మళ్లీ వస్తానని, అప్పటికి పనుల్లో వేగం పుంజుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఫొటో సోర్స్, APgovt
అమరావతిలో కొరియన్ సిటీ
ఆంధ్రజ్యోతి: అమరావతిలో సింగపూర్ సిటీ తరహాలో కొరియన్ సిటీని అభివృద్ధి చేయాలన్న తమ ప్రతిపాదనలకు దక్షిణ కొరియా పారిశ్రామికవేత్తలు సానుకూలంగా స్పందించారని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాజధానిలో వీలైనన్ని దేశాలు భాగస్వామ్యమైతే అది అంతర్జాతీయ నగరం అవుతుందన్నారు.
దక్షిణ కొరియా పర్యటనలో రూ.8 వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి వచ్చేలా చేయగలిగామని ఆయన తెలిపారు.
25 దిగ్గజ కంపెనీల సీఈవోలు, ఉన్నతాధికారులతో ముఖాముఖి చర్చలు జరిపానని, రెండు ఒప్పందాలు చేసుకున్నామని, ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ తీసుకున్నామని వివరించారు.
కియతోపాటు 37 అనుబంధ సంస్థలతో కలిపి అనంతపురంలో కొరియన్ టౌన్‌షిప్‌ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఇతన కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








