దండోరా రివ్యూ: కులాల కుమ్ములాటలో నలిగిపోయిన తండ్రి కథ

ఫొటో సోర్స్, facebook/Loukya Entertainments
- రచయిత, సాహితీ
- హోదా, బీబీసీ కోసం
ఇది నవశకం. సైన్స్ మనిషిని చాలా దూరం తీసుకొచ్చేసింది. సాంకేతికలో మునిగిపోయాం.
కానీ ఇంకా కొన్ని దురాచారాల కోరల్లోనే మనిషి కొట్టుమిట్టాడడం మనిషితనానికే అవమానం. కులం.. మతం.. మనల్ని రాతి యుగాల వైపు లాక్కెళ్లిపోతున్నాయి.
మనిషి బతికున్నప్పుడు నీదేకులం అని అడగడమే ఓ అనాగరికం అనుకొంటే.. చచ్చాక స్మశానంలో కాస్త స్థలం ఇవ్వడానికి కూడా కులం అడ్డురావడం మరింత అరాచకం.
పుట్టిన కులమే.. చచ్చాక నీ చోటెక్కడో నిర్ణయిస్తోందంటే అంతకంటే మనిషితనానికి మచ్చ ఎక్కడుంది? సరిగ్గా ఈ అంశమే చర్చించిన సినిమా దండోరా.
మరి దర్శకుడు చెప్పాలనుకొన్న పాయింట్ లో ఉన్న నిజాయతీ... నిబద్ధత.. దాన్ని తెరమీదకు తీసుకురావడంలో కనిపించిందా? లేదా?

కథేంటి?
తెలంగాణలోని ఓ పల్లెప్రాంతం అది. అక్కడ వర్గపోరు ఎక్కువ. కొన్ని కులాల వారికి స్మశానంలో చోటివ్వరు. ఊరవతల పుంతల్లో, వాగుల్లో దహన సంస్కారాలు చేయడమే.
శివాజీ (శివాజీ) అక్కడ పుట్టినవాడే. పైగా ‘అగ్ర కులం’ అని చెప్పుకొనే వర్గం. కులాల పట్టింపు చాలా ఎక్కువ. నా కులం.. నా మనుషులు అనుకొనే తత్వం. తను తనువు చాలిస్తే.. సగర్వంగా అక్కడి కుల స్మశానంలోనే దహనం చేయాలి అనుకుండాడు.
కానీ అక్కడి కుల పెద్దలు అందుకు ఒప్పుకోరు. మా కులానికి మచ్చ తెచ్చిన శివాజీకి స్మశానంలో చోటివ్వం అంటారు. ‘అగ్ర కులాల’ ఆధిపత్యానికి, వాళ్ల అహంకారానికీ ఆ కులానికి చెందిన మనిషే బలైపోవడం 'దండోరా'లో కనిపించే వైచిత్రి.
ఇదంతా ఎందుకు జరిగింది? ఆ కులానికి చెందిన పెద్ద మనుషులకు శివాజీకీ ఉన్న తగువేంటి? దానికి పరిష్కార మార్గం చూపించిందెవరు? అనేవి మిగిలిన అంశాలు.

ఫొటో సోర్స్, facebook/Loukya Entertainments
ఆఖరి మర్యాద మరణమే
మనిషి ఎలా పుట్టాడన్నది కాదు ముఖ్యం. ఎలా మరణించాడన్నదే. మరణించినప్పుడు ఎంత మర్యాద దక్కింది అనేదాన్ని బట్టి ఆ మనిషి ఎంత గొప్పగా బతికాడు అనేది నిర్ధరణ చేస్తారు. అలాంటి గౌరవాన్ని కులాన్ని బట్టి నిర్ణయించడం అనే అంశాన్ని దర్శకుడు ఈ కథలో ఎంచుకొన్నాడు.
నిజంగా.. ఆలోచింపదగిన విషయమే ఇది. ఓ చావుతోనే ఈ కథ మొదలవుతుంది. చావుతోనే పూర్తవుతుంది. రెండు చావుల మధ్య కులాల అంతరాల్ని, కుమ్ములాటల్ని, అందులో నలిగిపోయిన ఓ ప్రేమ జంటని, అన్నీ కోల్పోయిన ఓ తండ్రినీ చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
తొలి పది నిమిషాల్లోనే ఎలాంటి కథ చూడబోతున్నామనే విషయాన్ని ప్రేక్షకులకు చెప్పేసి, వాళ్లని ప్రిపేర్ చేశాడు. ఆ తరవాత ప్రేమకథలోకి వెళ్లాడు.
రవి, సుజాత మధ్య నడిచిన ప్రేమకథ కొత్తగా ఉండదు. కాకపోతే ఈ కథకు అది అవసరం. ఎమోషన్ పండించడానికి ఈ ప్రేమకథతోనే దర్శకుడికి అవకాశం దక్కింది.
రవి - సుజాతల ప్రేమ, ఆ ప్రేమకు కులం అడ్డు తగలడం... ఇవన్నీ రొటీన్ వ్యవహారాలుగానే కనిపిస్తాయి. అసలు తొలి సగంలో చూసిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని పెద్దగా కదిలించవు.
కాకపోతే మధ్యమధ్యలో శివాజీ నటన, ఆయన పలికిన సంభాషణలు, కుల వ్యవస్థపై దర్శకుడు వేసిన సెటైర్లు ఆకట్టుకొంటాయి. చావు.. శవం చుట్టూ మనుషులు చేరడం, అక్కడ జరిగే పంచాయితీలు.. ఇవన్నీ చూస్తున్నప్పుడు బలగం సినిమా ఛాయలు కనిపిస్తుంటాయి.
ఈసారి కూడా మరో బలగం చూడబోతున్నామా? అనే అనుమానం కలుగుతుంది. కానీ ఆ వెంటనే దర్శకుడు తనదైన టర్న్ తీసుకొన్నాడు. విశ్రాంతి కార్డు దగ్గర ఓ చిన్నపాటి కుదుపు.. అక్కడ చూపించే సన్నివేశాలు దిగ్భ్రాంతిని కలిగిస్తాయి. ఇంకా కులం, మతం మనిషిని, మానవత్వాన్ని, వాళ్లలోని అహంకారాన్ని ఇంతగా ప్రేరేపిస్తుందా అనిపిస్తోంది.

ఫొటో సోర్స్, facebook/Loukya Entertainments
పోరాడు - సాధించు
ఇది వరకు కొన్ని అంశాల్ని వెండి తెరపై చూపించడానికి అంతగా ధైర్యం చేసేవాళ్లు కాదు.
ఓ వర్గానికి చెందిన కథగా ప్రేక్షకులు భావిస్తారన్న భయం దర్శకులకు ఉండేది. ఇప్పుడు ఆ భయాల నుంచి మెల్లమెల్లగా బయటకు వస్తున్నారు. తాము అనుకొన్న పాయింట్ ని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కథలో అక్కడక్కడ అంబేడ్కరిజం కనిపిస్తుంది.
చదువు - పోరాడు.. అనే విషయాన్ని నర్మగర్భంగా చెప్పాడు దర్శకుడు. బాగా చదువు.. లేదంటే రాజకీయాల్లోకి రా.. అప్పుడే మనం ఎదగగలం అని రెండు సందర్భాల్లో పాత్రలతో చెప్పించాడు దర్శకుడు. ఇవి అంబేడ్కర్ భావాలు. చదువు, రాజకీయాల వల్లే నిమ్న జాతి ఎదగగలదు అని అంబేడ్కర్ భావించారు. ఆ మార్గంలో నడవాల్సిన అవసరం యువతకు ఎంతైనా ఉంది.
ద్వితీయార్థంలో ఈ కథ మరో టర్న్ తీసుకొంటుంది. శివాజీ - బిందుమాధవి ట్రాక్‌తో దర్శకుడు తన ఉద్దేశాల్ని చాటి చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ పాత్రల మధ్య సంభాషణల్ని కొన్ని సీరియస్ విషయాల్ని చర్చించడానికి వేదికగా మార్చుకొన్నాడు. అవి కొన్నిసార్లు సందేశాలుగా అనిపిస్తాయి. ఇంకొన్నిసార్లు సజహంగా కుదిరాయి. తొలి సగంలో ఉగ్ర రూపం దాల్చిన శివాజీ... ఈ ట్రాక్ దగ్గరకు వచ్చేసరికి చాలా సౌమ్యంగా మారిపోతాడు. మగాడు.. తనకు ఇష్టమైన మహిళ చెంతన.. ఇంతే సాదాసీదాగా కనిపిస్తాడేమో అన్నంతగా ఆ మార్పు ఉంటుంది.
శివాజీ మరణం తరవాత ఆ ఊర్లో జరిగే పరిణామాలు, ప్రీ క్లైమాక్స్‌లో పాప చెప్పిన మాటలు ఇవన్నీ కదిలిస్తాయి. శివాజీ మరణంతో ఆ ఊరికి ఓ సమాధానం దొరుకుతుంది.
ఈ కథ ఎక్కడైతే మొదలైందో, అక్కడే ముగిసిపోవడం, ప్రతి పాత్రకూ సరైన ముగింపు దొరకడంతో క్లైమాక్స్ మరింత బలంగా మారింది. తనకు తెలియకుండానే శివాజీ అనే పాత్ర ఆ ఊరికి చేసిన మంచి.. ఊరి ప్రజల్లోనే కాదు, ప్రేక్షకుల్లోనూ ఓ సానుకూల దృక్పథాన్ని తీసుకొస్తుంది.
కులాల కుమ్ములాటలూ, వాళ్లలో ఉండే అంతర్గత సంఘర్షణకు దర్శకుడు ఈ సినిమాలోనూ పరిష్కారం చూపించలేకపోయాడు. కాకపోతే..కులాల అహంకారానికి వాళ్లలో వాళ్లే ఎలా బలైపోతారో రేఖామాత్రంగా చూపించగలిగాడు.

ఫొటో సోర్స్, facebook/Loukya Entertainments
మంగపతి మళ్లీ కనిపించాడు
కోర్ట్ సినిమాలో మంగపతి పాత్ర శివాజీకి నటుడిగా మరోసారి పేరు తెచ్చింది. మంగపతి సంభాషణలు పలికే విధానం, అందులో కనిపించే ఎగ్రసివ్‌నెస్ ఈ పాత్రలోనూ ఉంటాయి.
ముఖ్యంగా కోర్టు సన్నివేశంలో శివాజీ నటన మెచ్చుకోదగినది. అక్కడ ఈ కథకు సరైన ముగింపు దొరుకుతుంది. ఈ పాత్రలో శివాజీ చాలా పార్శ్వాలు పలికించాల్సివచ్చింది. ఆయనకున్న అనుభవం వల్లే అది సాధ్యమైంది.
బిందుమాధవి పాత్ర సెకండాఫ్‌లో కానీ కనిపించదు. ఆమె నటించింది కొన్ని సన్నివేశాల్లోనే. కానీ ఆ పాత్రలోని సంఘర్షణ, దాన్ని బిందు మాధవి ప్రదర్శించే పద్ధతి ఆకట్టుకొంటాయి. ఈ పాత్ర వల్ల కథకు ఓ ప్రయోజనం ఒనగూరింది. అది క్లైమాక్స్ లో అర్థం అవుతుంది.
నందు, నవదీప్ రెండు పాత్రలు మెల్లమెల్లగా రూపాంతరం చెందుతూ ఉంటాయి. మొదట్లో చిన్న పాత్రలుగా కనిపిస్తాయి. ఆ తర్వాత పరిధి పెంచుకొంటూ వెళ్లాయి.
చిన్న సినిమా అయినా కెమెరాపనితనం, నేపథ్య సంగీతంలో ఉన్న సొగసు వల్ల.. ఆ పరిమితులు పెద్దగా కనిపించవు. తెలంగాణ యాస, సొగసుని సంభాషణల్లో బాగా పలికించారు.
మాటలు కొన్ని చోట్ల అర్థవంతంగా ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల లోతుగా ఆలోచిస్తే తప్ప తర్కం తెలీదు.
దర్శకుడు రాసుకొన్న పాయింట్ లో బలం ఉంది. తొలి సగంలో అతని మార్క్‌పెద్దగా కనిపించదు. కానీ రెండో సగంలో పుంజుకొన్నాడు. తాను చెప్పాలనుకొన్న విషయాన్ని నిస్సంకోచంగా చెప్పగలిగాడు. క్లైమాక్స్ రాసుకొన్న విధానం సంతృప్తి ఇస్తుంది. కాకపోతే సినిమా చాలా తొందరగా ముగిసిందన్న భావన కూడా కలగజేస్తుంది.
* ప్లస్ పాయింట్స్
శివాజీ నటన
ద్వితీయార్థం
కదిలించే ఘటనలు
* మైనస్ పాయింట్స్
ప్రథమార్థం
లవ్ స్టోరీ
(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














