'అమెరికాలో రాజకీయ విప్లవం తీసుకువస్తా...' - 2020 అధ్యక్ష ఎన్నికల బరిలో బెర్నీ సాండర్స్

బెర్నీ సాండర్స్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా సెనెటర్ బెర్నీ సాండర్స్ 2020 అధ్యక్ష ఎన్నికల్లో బరిలో దిగటానికి తన ప్రయత్నం ప్రారంభించారు. కార్పొరేట్ దురాశ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు సంధించారు. ''రాజకీయ విప్లవం'' తెస్తానని హామీ ఇచ్చారు.

న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో సాండర్స్ మాట్లాడుతూ.. ఇటీవలి అమెరికా చరిత్రలో ''అత్యంత ప్రమాదకర అధ్యక్షుడు'' డొనాల్డ్ ట్రంప్ అని అభివర్ణించారు.

వెర్మాంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న స్వతంత్ర సెనెటర్ సాండర్స్. ప్రస్తుతం 77 ఏళ్ల వయసున్న సాండర్స్ 2016 ఎన్నికల్లో డొమెక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ పొందటానికి హిల్లరీ క్లింటన్‌తో తలపడి ఓడిపోయారు.

అయితే.. ఈసారి బరిలో మరింత ఎక్కువ మందితో ఆయన పోటీ పడాల్సి వస్తోంది. కానీ.. ఆయనకు ఎంతో గుర్తింపు ఉండటంతో పాటు.. బలమైన అభిమానుల పునాది కూడా ఉంది.

రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ గెలుచుకోవటానికి.. మసాచుసెట్స్ సెనెటర్ ఎలిజబెత్ వారెన్, న్యూజెర్సీ సెనెటర్ కోరీ బుకర్, శాన్ ఆంటోనియో మేయర్ జూలియన్ కాస్ట్రోలు సహా 10 మందికి పైగా పోటీ పడుతున్నారు.

బెర్నీ సాండర్స్

ఫొటో సోర్స్, Getty Images

సాండర్స్ అధ్యక్షుడైతే ఎలా ఉంటుంది?

సాండర్స్ తన ప్రసంగంలో.. అధ్యక్షుడిగా ఎన్నికైతే తన పాలన ''ప్రజలను సమైక్యం చేస్తుంది'' అని హామీ ఇచ్చారు. పలు విధానాలను వివరించారు. ''బిలయనీర్ల వర్గం'' దురాశ మీద విరుచుకుపడ్డారు. దేశాధ్యక్షుడినైతే తాను చేపట్టే చర్యలను ఇలా వివరించారు...

  • అమెరికన్లు అందరికీ ఉపాధి లభించేలా సమాఖ్య 'ఉద్యోగాల హామీ' చట్టం చేస్తాను.
  • కనీస వేతనాన్ని ప్రస్తుతం 7.25 డాలర్ల నుంచి 15 డాలర్లకు రెట్టింపు చేస్తాను.
  • సమగ్ర వలస సంస్కరణలు అమలు చేస్తాను.. లెక్కల్లో లేని లక్షలాది మంది వలసలు అమెరికాలో నివసించేందుకు అనుమతిస్తాను.
  • యూనివర్సిటీలు, కాలేజీల్లో ఉచిత విద్య అమలు చేస్తాను
  • అందరికీ సంపూర్ణ కవరేజీ లభించేలా ఆరోగ్య పరిరక్షణను సంస్కరిస్తాను.
  • 'ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, జాతి న్యాయం, పర్యావరణ న్యాయం' కోసం పోరాడుతాను.

బెర్నీ సాండర్స్ ఎదుర్కొంటున్న సవాళ్లలో ఒకటి.. డెమొక్రటిక్ పార్టీ వామపక్షానికి మళ్లటమని.. దానివల్ల.. ఆయన సందేశం పెద్దగా విభిన్నంగా కనిపించబోదని బీబీసీ అమెరికా రిపోర్టర్ ఆంథొనీ జుర్చర్ పేర్కొన్నారు.

సాండర్స్ అధ్యక్ష ఎన్నికల కోసం మరోసార ప్రయత్నించటం సరైనదేనని ఆయన సోదరుడు లారీ బీబీసీతో మాట్లాడుతూ సమర్థించారు.

''బెర్నార్డ్స్ అధ్యక్షుడిగా పాలన అభివృద్ధిదాయకంగా ఉంటుందని, నిజాయితీపరుడిగా జనం భావించే, సుదీర్ఘ కాలం కట్టుబడి ఉన్న ఒక నాయకుడు చివరికి అధ్యక్షుడవటం చాలా ఉత్సాహాన్నిస్తుంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అధ్యక్షుడు ట్రంప్ గురించి సాండర్స్ ఏమన్నారు?

సాండర్స్ న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో జన్మించారు. అదే బ్రూక్లిన్‌లో ఆయన ప్రసంగించటం.. తనకు, ట్రంప్‌కి ఉన్న తేడా చెప్పే అవకాశం లభించింది.

పెయింట్ విక్రేతగా పనిచేసిన ఒక యూదు వలస కుమారిడిగా సాండర్స్ పెరిగారు. న్యూయార్క్‌లోనే పుట్టిన డొనాల్డ్ ట్రంప్.. సంపన్న రియల్ ఎస్టేట్ డెవలపర్ కుమారుడు.

''విలాసవంతమైన ఆకాశహర్మ్యాలు, కాసినోలు, కంట్రీ క్లబ్‌లు నిర్మించటానికి మిలియన్ల కొద్దీ డాలర్లు ఇచ్చిన తండ్రి నాకు లేరు. కానీ అంతకన్నా ఎంతో విలువైనది నాకు ఉంది. జేబులో డబ్బులేవీ లేకుండా మెరుగైన జీవితం కోసం కొత్త జీవితం కోసం సముద్రాన్ని దాటి ప్రయాణించిన అసమాన ధైర్యం గల ఒక తండ్రి నాకు ఆదర్శంగా ఉన్నాడు'' అని సాండర్స్ పేర్కొన్నారు.

మరోవైపు ఇదే సమయంలో ట్రంప్ మితవాద కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. డెమొక్రటిక్ పార్టీ మీద విమర్శలు ఎక్కుపెడుతూ.. తాను మళ్లీ అధ్యక్షుడిగా గెలుస్తానని ధీమా వ్యక్తంచేశారు.

పర్యావరణానికి సంబంధించి డెమొక్రటిక్ ప్రతిపాదనలను, సార్వజనీన ఆరోగ్య సంరక్షణ ప్రణాళికలను ట్రంప్ వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు. సార్వజనీన ఆరోగ్య సంరక్షణ అనేది ''అమెరికా ఆరోగ్య సంరక్షణను సోషలిస్టులు స్వాధీనం చేసుకుంటారు'' అని వ్యాఖ్యానించారు.

బెర్నీ సాండర్స్

ఫొటో సోర్స్, Getty Images

బెర్నీ సాండర్స్ ఎవరు?

అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) చరిత్రలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న స్వతంత్ర సెనెటర్ బెర్నీ సాండర్స్. అయితే, డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ పొందటానికి పోటీ పడుతున్నారు. ఎందుకంటే మూడో పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగితే తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలు తగ్గిపోతాయని ఆయన చెప్తున్నారు.

సాండర్స్ యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో చదువుకున్నారు. 1960లు, 70ల్లో యుద్ధ వ్యతిరేక, పౌర హక్కుల ఉద్యమాల్లో పాల్గొన్నారు.

1990లో ఆయన ప్రతినిధుల సభకు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆ సభకు అప్పటికి 40 ఏళ్లలో ఒక స్వతంత్ర అభ్యర్థి ఎన్నికవటం అదే మొదటిసారి. 2007లో సెనెటర్‌గా గెలిచేవరకూ ఆ సభలో కొనసాగారు.

ఆయన 2016 అధ్యక్ష ఎన్నికల కోసం.. డెమొక్రటిక్ నామినేషన్ రేసులో పెద్దగా ప్రాబల్యం లేని నాయకుడిగా బరిలోకి దిగారు. అనూహ్యంగా బలమైన నాయకుడిగా అవతరించారు. హిల్లరీ క్లింటన్‌తో హోరాహోరీగా పోటీపడ్డారు.

చివరికి హిల్లరీయే పార్టీ నామినేషన్‌ను గెలుచుకుని అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోయారు.

సాండర్స్ తనను తాను డెమొక్రటిక్ సోషలిస్ట్ (ప్రజాస్వామిక సామ్యవాది) అని అభివర్ణిస్తారు. ''కేవలం అత్యంత ధనవంతులకు మాత్రమే కాకుండా అందరికీ మేలు చేసే ఆర్థిక వ్యవస్థను తయారు చేయాలని కోరుకునే'' వ్యక్తిగా దానికి నిర్వచనం ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)