Dogs: మనుషులు ఒత్తిడిలో ఉన్నప్పుడు వారి శ్వాస ఆధారంగా కుక్కలు ఆ విషయం పసిగట్టేస్తాయి

బెల్‌ఫాస్ట్ ‌లోని క్వీన్స్ యూనివర్సిటీలో వాసన పరీక్షలో పాల్గొన్న కుక్క

ఫొటో సోర్స్, Queen's University, Belfast

ఫొటో క్యాప్షన్, బెల్‌ఫాస్ట్ ‌లోని క్వీన్స్ యూనివర్సిటీలో కుక్కలకు ఈ వాసన పరీక్ష పెట్టారు
    • రచయిత, విక్టోరియా గిల్
    • హోదా, సైన్స్ కరెస్పాండెంట్

మనుషుల భావోద్వేగాలను కుక్కలు ఎంత బాగా అర్థం చేసుకుంటాయనేది మరోసారి రుజువైంది. ఈసారి శాస్త్రీయంగా నిర్వహించిన ఒక వాసన పరీక్షలో ఓ కొత్త విషయం వెల్లడైంది.

మనం ఒత్తిడికి గురవుతున్నట్లయితే.. మన శ్వాసలో, మన చెమటలో ఆ ఒత్తిడి వాసనను పెంపుడు కుక్కలు పసిగడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

నాలుగు పెంపుడు కుక్కలకు మూడు రకాల వాసనలున్న డబ్బాలను వాసన చూసేలా శిక్షణనిచ్చారు. ఆ కుక్కలను వాటి యజమానులు స్వచ్ఛందంగా ఈ ప్రయోగంలో పాల్గొనేందుకు తెచ్చారు.

ఈ కుక్కలు మొత్తం 700 ట్రయల్స్‌లో 650 సార్లకు పైగా.. ఒత్తిడిలో ఉన్న వ్యక్తి నుంచి సేకరించిన శ్వాసను కానీ చెమటను కానీ విజయవంతంగా గుర్తించాయి.

హెర్బర్ట్ ది డాగ్

ఫొటో సోర్స్, Victoria Gill

ఫొటో క్యాప్షన్, కుక్క ముక్కు అత్యంత సున్నితమైన కెమికల్ డిటెక్టర్

క్వీన్స్ యూనివర్సిటీ బెల్‌ఫాస్ట్‌ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను 'ప్లాస్ వన్' జర్నల్‌లో ప్రచురించారు. థెరపీ శునకాలకు శిక్షణనిచ్చేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని వారు ఆశిస్తున్నారు.

కుక్కలు తమ ప్రపంచాన్ని వాసన ద్వారా అనుభూతి చెందుతాయి. వీటికి వాసన పసిగట్టే సామర్థ్యం అత్యధిక స్థాయిలో ఉంటుంది కాబట్టి ఇప్పటికే మాదకద్రవ్యాలను, పేలుడు పదార్థాలను పసిగట్టటానికి ఉపయోగిస్తున్నారు.

అంతేకాదు.. మనుషుల్లో కొన్ని రకాల క్యాన్సర్లు, డయాబెటిస్ వంటి జబ్బులతో పాటు కోవిడ్‌ను సైతం పసిగట్టటానికి కూడా శునకాలను వినియోగిస్తున్నారు.

''మనుషుల్లో కొన్నిరకాల అనారోగ్యాలు, జబ్బులకు సంబంధించిన వాసనలను కుక్కలు పసిగట్టగలవనేందుకు చాలా ఆధారాలున్నాయి. అయితే మన మానసిక పరిస్థితుల్లో తేడాలను కుక్కలు పసిగట్టగలవనేందుకు ఎక్కువ ఆధారాలు లేవు'' అని ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన ప్రొఫెసర్ క్లారా విల్సన్ పేర్కొన్నారు.

ఈ ప్రయోగంలో పాల్గొన్న నాలుగు శునకాల్లో రెస్క్యూ డాగ్ 'సూట్' ఒకటి

ఫొటో సోర్స్, Queen's University, Belfast

ఫొటో క్యాప్షన్, ఈ ప్రయోగంలో పాల్గొన్న నాలుగు శునకాల్లో రెస్క్యూ డాగ్ ‘సూట్’ ఒకటి

ఈ ప్రయోగంలో పాల్గొన్న 36 మంది వలంటీర్లు ఒక క్లిష్టమైన లెక్కను పరిష్కరించటానికి ముందు, తర్వాత తమ ఒత్తిడి స్థాయిలు ఎలా ఉన్నాయనేది నివేదించారు.

ఈ 36 మంది ఒత్తిడికి గురి కావటానికి ముందు, ఒత్తిడిలో ఉన్నపుడు (వారి రక్త ప్రసరణ, గుండె కొట్టుకునే వేగం పెరిగి ఉన్న సమయంలో) వారి చమట లేదా శ్వాస నమూనాలను డబ్బాలలో సేకరించారు.

ఇలాంటి నమూనాలున్న 700 డబ్బాలను నాలుగు కుక్కలు ట్రియో, ఫింగల్, సూట్, విన్నీలకు వాసన చూపించారు. ''ఒత్తిడితో కూడిన'' నమూనా ముందు నిశ్చలంగా నిలుచోవటం లేదా కూర్చోవటం చేసిన కుక్కకు వాటికి ఇష్టమైన డాగ్ ట్రీట్ బహుమతిగా ఇచ్చారు.

వీడియో క్యాప్షన్, డ్రగ్స్, బాంబులను పోలీస్ డాగ్స్ ఎలా గుర్తిస్తాయి? వాటికి ఎలాంటి శిక్షణ ఇస్తారో చూడండి..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)