రష్యా -ట్రంప్ విచారణ : అమెరికా ఎన్నికల టాంపరింగ్‌లో రష్యన్ల పాత్రపై అభియోగం

ఫొటో సోర్స్, AFP/Getty
అమెరికా ఎన్నికల టాంపరింగ్ విచారణపై ఆ దేశ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ముందడుగు వేసింది.
తమ దేశంలో 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారని 13 మంది రష్యన్లపై అభియోగాలు నమోదు చేసింది.
ఇందులో ముగ్గురిపై మోసం, కుట్ర , మరో ఐదుగురిపై అమెరికా పౌరులుగా తప్పుడుగా చెప్పుకున్నట్టు అభియోగాలు మోపింది.
అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక అధికారి రాబర్డ్ ముల్లర్ ఈ ఆరోపణలు చేశారు. అభియోగ పత్రంలో మూడు రష్యన్ కంపెనీల పేర్లు కూడా ఉన్నాయి.
''అమెరికా రాజకీయ వ్యవస్థలో వ్యూహాత్మకంగా అసమ్మతిని రగిలించేందుకు, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు సెయింట్ పీటర్స్‌బర్గ్ కేంద్రంగా ఉన్న ఇంటర్నెట్ రీసెర్చ్ ఏజెన్సీ ప్రయత్నించింది'' అంటూ 37 పేజీల అభియోగ పత్రంలో ఎఫ్‌బీఐ పేర్కొంది.

ఫొటో సోర్స్, Reuters
''ఈ చట్ట విరుద్ధ వ్యవహారంలో పాత్ర వహించినట్లు, ఎన్నికల ఫలితాలు మార్చేందుకు ప్రయత్నించినట్లు ఏ ఒక్క అమెరికన్ మీదా ఆరోపణలు లేవు'' అని డిప్యూటీ అటార్నీ జనరల్ రాడ్ రొసెన్‌స్టీన్ మీడియాకు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నేరాభియోగంపై శుక్రవారం స్పందించినట్లు వైట్ హౌజ్ తెలిపింది. ఎన్నికల వేళ తమ ప్రచారకర్తలు ఎలాంటి తప్పూ చేయలేదని ట్రంప్ ట్వీట్ చేశారు. రష్యాతో కుమ్మక్కైయ్యారనే ఆరోపణలను తోసిపుచ్చారు.
''నేను అధ్యక్షుడి రేసులో ఉంటానని ప్రకటించక ముందే, అంటే 2014లోనే అమెరికా వ్యతిరేక ప్రచారాన్ని రష్యా ప్రారంభించింది. ఎన్నికల ఫలితాలపై వారి ప్రభావం ఏమీ లేదు. మా ప్రచార బృందం ఏ తప్పూ చేయలేదు'' అని ట్రంప్ పేర్కొన్నారు.
మరోవైపు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆ దేశ అధికారులు కూడా ఖండించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అభియోగ పత్రంలో ఏముంది?
ఒక రష్యా బృందం..
- అమెరికా పౌరులుగా తమ పేర్లు నమోదు చేసుకొని వ్యాపార ఖాతాలను తెరిచింది.
- రాజకీయ ప్రకటనలకు వేలాది డాలర్లను వెచ్చించింది.
- తమ రష్యా గుర్తింపును దాచేందుకు అమెరికా సర్వర్ స్వేస్‌ను కొనుగోలు చేసింది.
- అమెరికాలో రాజకీయ ర్యాలీలు నిర్వహించింది.
- నిజమైన అమెరికా పౌరులకు అన్యాయం జరగకూడదని సోషల్ మీడియాలో రాజకీయ సందేశాలు ప్రచారం చేసింది.
- హిల్లరీ క్లింటన్‌పై విమర్శలను వ్యాప్తి చేసింది.
- అమెరికా సోషల్ మీడియా సైట్‌లలో పోస్టులు చేసేందుకు ఖాతాదారుల నుంచి డబ్బు తీసుకుంది.
- ఒక్క నెలలోనే 12.5 కోట్ల డాలర్ల బడ్జెట్‌ను ఇందుకోసం వినియోగించింది.
- ఒక నటిని హిల్లరీ క్లింటన్‌లా జైలు యూనిఫాంతో చూపించే భవనానికి ఆర్థికంగా సహాయపడింది.
ప్రాథమికంగా ఈ రష్యన్ బృందంలోని సభ్యులు హిల్లరీపై విద్వేషం వెదజల్లే సందేశాలను వ్యాప్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో బెర్నీ సాండెర్స్, అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతిచ్చే కార్యక్రమాలకూ సహకరించారు అని అభియోగపత్రం పేర్కొంది.

ఫొటో సోర్స్, Reuters
రష్యా ప్రతిస్పందన ఏంటి?
ఈ ఆరోపణలు అసంగతమైనవని రష్యా పేర్కొంది.
''అమెరికా ఎన్నికల్లో 13 మంది రష్యన్లు జోక్యం చేసుకున్నారా ? రక్షణపై బిలియన్ డాలర్ల వెచ్చించే దేశానికి వ్యతిరేకంగా 13 మంది పని చేశారా? ఇదంతా అర్థరహితం'' అని రష్యా విదేశాంగ అధికార ప్రతినిధి మారియా జకరోవా అన్నారు.
పుతిన్ ఆంతరంగికుల్లో ఒకరైన యెవగనీ ప్రిగోజైన్ కూడా ఎన్నికల టాంపరింగ్ ఆరోపణలను తోసిపుచ్చారు. ఎఫ్‌బీఐ అభియోగ పత్రంలో ఈయన పేరు కూడా ఉంది.
విచారణ వేగం పెరుగుతోంది.. వివాదం రాజుకుంటోంది
ఆంటోనీ జర్చర్, విశ్లేషకులు, బీబీసీ న్యూస్- వాషింగ్టన్
అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యంపై రాబర్ట్ ముల్లర్ బృందం శుక్రవారం నేరాభియోగ పత్రాన్ని విడుదల చేసింది. వీటిని పరిశీలిస్తే ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందనే స్పష్టమవుతోంది.
'ప్రాజెక్ట్ లక్తా' పేరుతో వారు కోటి డాలర్ల బడ్జెట్‌ను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించినట్లు తెలుస్తోంది.
రష్యా అనుబంధ సంస్థలు అమెరికా అంతటికీ వెళ్లాయి. కొంతమంది రష్యన్లు అమెరికన్లుగా నటిస్తూ వ్యూహాత్మక లక్ష్యాలతో ముందుకు వెళ్లారు. అమెరికా రాజకీయ విధానంలో అసమ్మతిని సృష్టించేందుకు ప్రయత్నించారు. కొన్ని ముఖ్యమైన రాష్ట్రాలను ఎంచుకొని అక్కడ గెలుపు ఓటములను ప్రభావితం చేసేలా యత్నించారు.
డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను కించపరుస్తూ, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతిచ్చేలా వాళ్లు ప్రయత్నించినట్లు అభియోగపత్రంలో ఉంది. అయితే, ట్రంప్ ప్రచార బృందం, రష్యాతో కుమ్మక్కైందనే ఆరోపణలను ఇది సూచించలేదు. రిపబ్లికన్ అభ్యర్థులకు చెందిన వ్యక్తులు ఈ ప్రయత్నాలు చేశారని మాత్రమే పేర్కొంది.
ఈ వార్త వైట్ హౌజ్‌కు కాస్త ఉపశమనం కలిగించేదే. అయితే, దర్యాప్తు వేగం పెరుగుతుంటే వేడి మరింతగా రాజుకుంటోంది. ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదని విషయాన్ని మనం గ్రహించాలి. ముల్లర్ ఆరోపణలను కోర్టు సమర్థిస్తే ట్రంప్‌కు అది ఇబ్బందికరంగా మారవచ్చు.
సోషల్ మీడియా కంపెనీలు ఏమంటున్నాయి?
ముల్లర్ దర్యాప్తుతో తాము సహకరిస్తున్నామని ఫేస్ బుక్ స్పష్టం చేసింది. అయితే, ఈ తరహా చర్యలు అడ్డుకునేందుకు చేయాల్సి చాలా ఉందని అభిప్రాయపడింది.
ఇలాంటి చర్యలు ఎంతమాత్రం ఉపేక్షించబోమని, తాము దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని ట్విటర్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Reuters
ఇంతకూ ఈ దర్యాప్తు ఏంటసలు?
2016 ఎన్నికల్లో ట్రంప్ గెలిచేందుకు రష్యా ప్రయత్నించిందని అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ దీనిపై విచారణకు గతేడాది మేలో ప్రత్యేక దర్యాప్తు అధికారిగా ముల్లర్‌ను నియమించారు.
ముల్లర్ తన విచారణలో భాగంగా ఇప్పటికే ట్రంప్ మాజీ ప్రచార మేనేజర్ పౌల్ మన్‌ఫోర్ట్‌పై హవాలా విధానంలో డబ్బు వినియోగించారని, ఉక్రెయిన్‌తో మోసపూరితంగా వ్యవహరించారని అభియోగాలు నమోదు చేశారు.
ట్రంప్ వ్యాపార సహచరుడు రిట్ గేట్స్‌పై కూడా హవాలా రూపంలో డబ్బు వినియోగించారని కూడా కేసు నమోదైంది. అధ్యక్షుడు ట్రంప్ మాజీ ముఖ్య వ్యూహకర్త స్టీవ్ బానన్‌ను కూడా ముల్లర్ విచారించారు.
మరోవైపు ఈ దర్యాప్తులో ట్రంప్ జోక్యం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వీటిని ట్రంప్ తోసిపుచ్చుతున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








