న్యూజెర్సీ ఆర్ట్ ఫెస్టివల్: దుండగుల కాల్పుల్లో 22 మందికి గాయాలు

ఆర్ట్ ఫెస్టివల్లో కాల్పులు

ఫొటో సోర్స్, ART ALL NIGHT

అమెరికా, న్యూజెర్సీ ట్రెంటన్‌ ఆర్ట్ ఫెస్టివల్లో దుండగులు కాల్పులు జరపడంతో 13 ఏళ్ల బాలుడు సహా 22 మంది గాయపడ్డారు.

స్థానిక కళలు, సంగీతం, ఆహారాన్ని ఆస్వాదిస్తున్న వెయ్యి మందిపై స్థానిక కాలమానం ప్రకారం సుమారు 3 గంటలకు (జీఎంటీ 7:00) ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు.

అనుమానితుల్లో ఒకరైన 33 ఏళ్ల వ్యక్తిని కాల్చిచంపిన పోలీసులు, మరొకరిని అరెస్ట్ చేశారని స్థానిక ప్రాసిక్యూటర్ చెప్పారు.

కాల్పుల్లో గాయపడిన 22 మందికి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స జరుగుతోంది. వీరిలో తీవ్రంగా గాయపడిన బాలుడితోపాటూ, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

దుండగులు కాల్పుల ఎందుకు జరిపారనేది ఇంకా తెలీలేదు. ఘటనాస్థలంలో చాలా ఆయుధాలు లభించినట్టు తెలుస్తోంది.

ఆ ప్రాంతానికి సమీపంలో కారు దొంగతనం జరిగినట్టు కూడా చెబుతున్నారు. దానికీ, కాల్పులకు సంబంధం ఉందా అనేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు.

ఆర్ట్ ఫెస్టివల్లో కాల్పులు

ఫొటో సోర్స్, AFP

అందరూ ఆనందంతో మైమరచి ఉన్న సమయంలో, తనపై నాలుగు సార్లు కాల్పులు జరిగాయని గాయపడిన ఒక వ్యక్తి యాక్షన్ న్యూస్‌కు తెలిపాడు.

కాల్పుల శబ్దాలు వినిపించగానే, వీధిలో జనం పరుగులు తీయడం చూశానని ఆ ఈవెంటుకు హాజరైన ఏంజెలో నికోలో అనే మరో వ్యక్తి కూడా అమెరికా మీడియాకు చెప్పాడు.

వరసగా 12వ ఏడాది ట్రెంటన్ ఆర్ట్ ఆల్ నైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక కళాకారుల కోసం విరాళాలు సేకరిస్తారు.

శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ ఉత్సవం, ఆదివారం మధ్యాహ్నం వరకూ జరగాల్సి ఉంది. కానీ కాల్పుల ఘటనతో దీనిని రద్దు చేశారు.

ఈ ఘటనతో షాక్ అయ్యామని నిర్వాహకులు తమ ఫేస్‌బుక్ పేజ్‌లో తెలిపారు. కాల్పుల్లో గాయపడిన వారికి తమ సానుభూతి వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి: