ఇరాన్-ఇరాక్: 2017లో అతి పెద్ద భూకంపం ఇదే

ఫొటో సోర్స్, EPA
ఇరాన్-ఇరాక్ దేశాల ఉత్తర సరిహద్దు వద్ద సంభవించిన పెను భూకంపం కారణంగా భారీ ప్రాణనష్టం జరిగింది. 400 మందికిపైగా చనిపోగా, 7000 మందికి పైగా గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైంది.
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రాణనష్టం కలిగించిన భూకంపం ఇది.
ఇరాన్‌లోని పర్వత ప్రాంతాల్లో భూకంపం ధాటికి భవనాలు కూలిపోయాయి. వాటి కింద చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్పాల్ ఎ జహబ్ పట్టణంలోనే ప్రాణ నష్టం అధికంగా ఉంది. ఈ పట్టణంతో పాటు కెర్మన్‌షా ప్రావిన్సు పరిధిలోని మరిన్ని ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
పట్టణంలోని ప్రధాన ఆస్పత్రి తీవ్రంగా దెబ్బతింది. దీంతో గాయాలపాలైన వందలాది మందికి చికిత్స చేయటంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానెల్ ఇరిన్ తెలిపింది.

ఫొటో సోర్స్, AFP/getty images
శిథిలాల నుంచి ఒక మహిళను, ఆమె కుమార్తెను రక్షించినట్లు ప్రభుత్వ టీవీ వివరించింది.
పట్టణంలో చాలా భవనాలు నేలమట్టమయ్యాయని ఒక టీవీ స్టేషన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోను బట్టి తెలుస్తోంది.
భూకంపంతో కంగారుపడిన ప్రజలు ఆదివారం రాత్రి ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి పరుగులు తీశారు.
చాలా పట్టణాలు, నగరాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరాలు నిలిచిపోయాయి. భవనాలు కూలిపోవటంతో భారీ సంఖ్యలో ప్రజలు ఆరు బయట పార్కుల్లోను, వీధుల్లోను తీవ్రమైన చలిలో గడపాల్సి వచ్చింది.
కుర్దిష్ పర్వత శ్రేణుల్లో చాలా భవనాలను మట్టి ఇటుకలతోనే నిర్మిస్తుంటారు. ఆదివారం సంభవించిన భూకంపం వంటి భారీ భూకంపాలను తట్టుకుని నిలబడే సామర్థ్యం వాటికి ఉండదు.

ఫొటో సోర్స్, Reuters
‘‘నేను నా పిల్లలతో కలిసి డిన్నర్ చేస్తున్నాను. ఉన్నట్టుండి భవనం గాలిలో ఊగుతున్నట్లు అనిపించింది’’ అని బాగ్దాద్‌కు చెందిన మజీదా అమీర్ అనే మహిళ రాయటర్స్ ఏజెన్సీకి తెలిపారు.
‘‘మొదట పెద్ద బాంబు పడిందేమో అనుకున్నా. తర్వాత చుట్టుపక్కల వాళ్లంతా ‘భూకంపం’ అంటూ అరవటం వినిపించింది’’ అని ఆమె చెప్పారు.
‘‘మాకు ఆశ్రయం కావాలి. మాకు సహాయం కావాలి’’ అంటూ సర్పాల్ ఎ జహబ్ పట్టణంలో ఒక వ్యక్తి ప్రభుత్వ టీవీ అడుగుతున్నారు.
ఒక స్వచ్ఛంద సంస్థ అంచనా ప్రకారం 70 వేల మందికి ఆశ్రయం కావాలి. వేలాది మంది ప్రజలు సోమవారం రాత్రి కూడా ధూళి నిండిన చలిలో గడపాల్సి ఉంది.

ఫొటో సోర్స్, EPA
‘అవసరమైతే మద్దతు ఇచ్చేందుకు సిద్ధం’ అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి ఒకరు ప్రకటించారు.
దేశంలో 413 మంది మరణించారని ఇరాన్ అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో సైనికులు, సరిహద్దు భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని ఇరాన్ సైన్యాధిపతి ఇరిన్ టీవీకి చెప్పారు.
ఇరాక్‌లో తొమ్మిది మంది చనిపోయారని రెడ్ క్రిసెంట్ అధికార ప్రతినిధి బీబీసీకి తెలిపారు.
దేశంలో 500 మందికి పైగా గాయపడ్డారని ఇరాక్‌లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయం వివరించింది.
రాజధాని బాగ్దాద్‌తో పాటు ఇర్బిల్, సులైమానియా, కిర్కుక్, బస్రాల్లో కూడా భూమి కంపించింది.

దర్బందిఖాన్‌కు 30 కిలోమీటర్ల దక్షిణాన ఆదివారం రాత్రి స్థానిక కాలమానం ప్రకారం 9.18 గంటలకు భూకంపం సంభవించిందని యూఎస్ జియొలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది. ఇరాన్ సరిహద్దుకు ఈశాన్యంలో ఈ ప్రాంతం ఉంది.
ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ఈ భూకంప కేంద్రానికి 100 కిలోమీటర్ల పరిధిలో 18 లక్షల మంది ప్రజలు నివశిస్తున్నారు.
భూమికి 23.2 కిలోమీటర్ల లోపల భూకంపం సంభవించగా.. దాని ప్రకంపనలు టర్కీ, ఇజ్రాయెల్, కువైట్‌లనూ తాకాయి.

ఫొటో సోర్స్, India.Meteorological.Department/facebook
2003వ సంవత్సరంలో 6.6 తీవ్రతతో సంభవించిన తుపాను ఇరాన్‌లోని బమ్ నగరాన్ని ధ్వంసం చేసింది. అప్పట్లో 26 వేల మంది మరణించారు.
ఇరాన్‌లో ఆదివారం వచ్చిందే 2012 తర్వాత సంభవించిన అతిపెద్ద భూకంపం. 2017వ సంవత్సరంలో రిక్టర్ స్కేలుపై 7 అంతకు మించిన తీవ్రత నమోదైన భూకంపాలు ఆదివారం నాటి భూకంపంతో కలిపి ఆరు వచ్చాయి. గతేడాది 16 సంభవించాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్‌లో తరచూ భూకంపాలు ఎందుకు వస్తాయి?
జొనాథన్ అమోస్, బీబీసీ సైన్స్ కరస్పాండెంట్ విశ్లేషణ
ప్రపంచంలో భూకంపాలు తరచూ సంభవించే ప్రాంతాల్లో ఇరాన్ ఒకటి. గతంలోనూ ఇక్కడ భారీ భూ ప్రకంపనలు నమోదయ్యాయి.
సాధారణ పరిభాషలో చెప్పాలంటే.. అరేబియా, యురేషియా భూ ఫలకాల (టెక్టోనిక్ ప్లేట్స్) మధ్య తలెత్తే ఘర్షణ ఈ భూకంపాలకు ముఖ్య కారణం. యురేషియా భూ ఫలకం ప్రతి ఏటా రెండు సెంటీమీటర్ల చొప్పున ఉత్తర దిక్కుకు కదులుతోంది.
దేశ ఆగ్నేయ భాగంలో.. యురేషియా భూ ఫలకం కిందకు అరేబియా భూ ఫలకం జరుగుతోంది. కానీ, వాయువ్య ప్రాంతంలో మాత్రం ఈ రెండూ ఒకదానికొకటి నేరుగా గుద్దుకుంటున్నాయి. ఈ పీడనం వల్లనే జాగ్రోస్ పర్వతాలు ఏర్పడ్డాయి.
ఈ ఒత్తిళ్ల కారణంగానే భూకంపం సంభవించినట్లు నివేదికల్ని బట్టి తెలుస్తోంది.
భూకంప తీవ్రత, ఆ ప్రాంతంలో జన సాంద్రత, స్థానిక భవన నిర్మాణ పద్ధతుల ఆధారంగా భూగర్భ శాస్త్ర సంస్థలు ప్రాణ నష్టాన్ని అంచనా వేస్తుంటాయి.

మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










