సంతోషంలో భారత్ కంటే బంగ్లా, పాకిస్తాన్‌లే మెరుగు. అసలేమిటీ హ్యాపీనెస్ ఇండెక్స్?

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలో అత్యంత సంతోషకరంగా ఉన్న దేశంగా ఫిన్‌లాండ్ నిలిచిందని ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన 'వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్' నివేదిక వెల్లడించింది.
రెండో స్థానాన్ని ఫిన్‌లాండ్ పొరుగు దేశమైన నార్వే కైవసం కేసుకుంది.
మొత్తం 156 దేశాలకు ర్యాంకులు ప్రకటించగా.. అందులో భారత్ 133వ ర్యాంకు సాధించింది.
సార్క్ దేశాల్లో అతి తక్కువ ఆనందంగా ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. కింది స్థానంలో అఫ్గానిస్థాన్ ఉంది.
భారత ర్యాంకు గత ఏడాది 122వ స్థానంలో ఉండగా, ఈ సారి 11 స్థానాలు దిగజారింది. అఫ్గానిస్థాన్ 145వ స్థానంలో ఉంది.
రోహింజ్యా సంక్షోభం ఎదుర్కొంటున్న మయన్మార్ సైతం హ్యాపీనెస్‌లో భారత్ కంటే 3 స్థానాలు మెరుగ్గా ఉండటం గమనార్హం.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా భారత పొరుగు దేశాల ర్యాంకులన్నీ మెరుగ్గానే ఉన్నట్టు ఈ నివేదిక చెబుతోంది.
నేపాల్ 101, పాకిస్థాన్ 75, చైనా 86, భూటాన్ 97, బంగ్లాదేశ్ 115, శ్రీలంక 116 స్థానాలను సాధించాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఫిన్‌లాండ్ పౌరులే కాదు, బతుకుదెరువు కోసం ఆ దేశానికి వెళ్లిన వాళ్లు సైతం సంతోషంగా ఉన్నారని ఈ నివేదిక చెబుతోంది.
దాదాపు 55 లక్షల మంది జనాభా కలిగిన ఫిన్‌లాండ్‌లో సుమారు 3 లక్షల మంది విదేశీ మూలాలు ఉన్నవారని తేలింది.
ప్రపంచంలో అత్యంత ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ, తక్కువ ఆనందంగా ఉన్న దేశం తూర్పు ఆఫ్రికాలోని బురుండి అని ఈ నివేదికి తెలిపింది.
ఆ తర్వాత స్థానాల్లో అంతర్యుద్ధం, తిరుగుబాటు చర్యలతో అట్టుడుకుతున్న సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, దక్షిణ సూడాన్, టాంజానియా, యెమెన్ దేశాలు ఉన్నాయి.
అమెరికా గతేడాదితో పోల్చితే 4 స్థానాలు పడిపోయి 18వ స్థానంలో ఉంది. బ్రిటన్ 19వ ర్యాంకు సాధించింది.

ఫొటో సోర్స్, Getty Images
అసలేంటీ హ్యాపీనెస్ ఇండెక్స్?
2012 నుంచి ఐక్యరాజ్య సమితి ఈ ఆనందం సూచీలను విడుదల చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా వలసదారుల పరిస్థితి ఎలా ఉంది? ఏ దేశంలో ప్రవాసులు సంతోషంగా గడుపుతున్నారు? అనే అంశాల ఆధారంగా ఈ ఏడాది ర్యాంకులు ఇచ్చారు.
దేశ స్థూల తలసరి ఆదాయం, సామాజిక మద్దతు, ఆరోగ్యం, సామాజిక స్వేచ్ఛ, ఉదారత, అవినీతి అనే ఆరు ప్రధాన అంశాలను ఆధారంగా ఈ నివేదిక రూపొందిస్తారు.
2015 నుంచి 2017 వరకు 156 దేశాలలో సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు.
ఆయా దేశాల్లో పుట్టిపెరిగిన వారితో పాటు, ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంది? ఎంత సంతోషంగా ఉన్నారు? వసతులు కల్పన, సామాజిక బాంధవ్యాలు ఎలా ఉన్నాయి? వంటి విషయాలపై అధ్యయనం చేశారు.
మరో విషయం ఏమిటంటే, విదేశాలకు వెళ్లి గతం కంటే రెట్టింపు సంపాదిస్తున్న వారి కంటే గ్రామాల్లో కొద్దిపాటి ఆదాయం ఉన్న వారే సంతోషంగా గడుపుతున్నారని ఈ నివేదిక వివరించింది. ఈ విషయం చైనాలో స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది.
ఇవి కూడా చూడండి:
- ఎడిటర్స్ కామెంట్: ఎవరికీ మరొకరిపై విశ్వాసం లేదు, ఈ అవిశ్వాస రాజకీయాలనెలా అర్థం చేసుకోవాలి?
- చంద్రబాబు అంటేనే కూటమి రాజకీయాలు
- బాటిల్ నీళ్లు తాగుతున్నారా? అందులో ఏమేం ఉన్నాయో తెలుసా?
- BBC exclusive: ‘టీం ఇండియా దశ, దిశ మార్చా.. నన్నే టీంలోంచి తీసేశారు’
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడ దాకా!
- పాస్పోర్టు రంగు మార్చాలనుకోవడం వివక్ష అవుతుందా!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








