చంద్రబాబు నాయుడు: ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైదొలుగుతాం.. ఇది తొలి అడుగు!!

ఫొటో సోర్స్, MANJUNATH KIRAN
ప్రత్యేక హోదా ఆందోళనల నేపథ్యంలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు.. సుజనా చౌదరిలను రాజీనామా చేయాల్సిందిగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు.
తాము ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు వస్తామని స్పష్టం చేశారు.
తాము కేబినెట్‌లో ఉన్నా.. రాష్ట్రానికి న్యాయం జరగడం లేదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. విధిలేని పరిస్థితుల్లోనే బయటికి వస్తున్నామనీ, తనకు ఎవరి మీదా కోపం లేదనీ చెప్పారు.
ఇంకా చంద్రబాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే..
‘‘కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నాం. ఇద్దరు కేంద్ర మంత్రులను రాజీనామా చేయమని చెప్పాం. కేంద్ర ప్రభుత్వంలో మా మంత్రులు ఉండరు. ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి మేం వైదొలుగుతున్నాం. కర్టసీ కోసం ప్రధాన మంత్రికి ఒక మాట చెప్పడానికి ఫోన్ చేశాను. ఆయన అందుబాటులోకి రాలేదు.
ఇది మా తొలి అడుగు మాత్రమే. ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల హక్కు.
ప్రత్యేక హోదా, పోలవరం, ఆర్థిక లోటు గురించి కేంద్రంతో మాట్లాడాం.
నాకు చాలా బాధేస్తోంది. దేశ రక్షణకు కూడా డబ్బు అవసరం కదా అని అరుణ్ జైట్లీ చెప్పడం బాధాకరం. దేశ రక్షణ కోసం కేటాయించిన డబ్బులను మేం అడగడం లేదు. ఇది రాష్ట్ర ప్రజలను అవమానించడమే.
విభజన చట్టంలో బీజేపీ కూడా భాగస్వాములే. ఆరోజు డిమాండ్ చేసి, ఇప్పుడు మాట మార్చడం సరికాదు.
మా నెత్తిన అప్పు పెట్టి పంపారు. పదవుల కోసం ఎన్‌డీఏలో చేరలేదు. రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావించి మాత్రమే మేం భాగస్వాములమయ్యాం.
మీడియా ఈ విషయాలను వక్రీకరించకూడదు. రాజీనామాలు చేశాక కేంద్ర ప్రభుత్వ స్పందన కోసం ఎదురు చూస్తాం.
ఒకవేళ స్పందించకపోతే ఎలా ముందుకుపోవాలో ఆలోచిస్తాం.
నాలుగు సంవత్సరాలుగా నేను చాలా ఓపికగా ఉన్నా. వర్తమాన దేశ రాజకీయాల్లో నేనే సీనియర్ నాయకుడిని. నేనెప్పుడూ ఈగోలకు పోలేదు. ఎంతో ఓపికగా దిల్లీకి చాలాసార్లు వెళ్లాను.
29సార్లు దిల్లీకి పోయినా ఫలితం లేకుండా పోయింది. అందుకే గౌరవంగా బయటకు రావాలని భావించాం.
సెంటిమెంట్స్‌తో ఫండ్స్ రావు అని ప్రెస్‌మీట్ పెట్టి చెప్పడం సరికాదు. ఇప్పటికైనా మా సెంటిమెంట్లను గౌరవిస్తారని ఆశిస్తున్నా.
వెనుకబడిన ప్రాంతాలకు 350కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్‌మెంట్ ప్యాకేజ్ కింద ఇచ్చారు. రిలీజ్ చేశాక 09.02.2018న మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఆర్.బి.ఐ ద్వారా డబ్బిచ్చి, ప్రధాని అనుమతి లేదని తిరిగి వెనక్కు తీసేసుకున్నారు. ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
దేశంలో ఆంధ్ర ప్రదేశ్ కూడా ఒక భాగమే. మనం కూడా ట్యాక్సులు కడుతున్నాం. మనకు న్యాయం చేసే బాధ్యత కేంద్రంపై ఉంది. అడగడం మన హక్కు.
ప్రజలందరూ సంఘటితంగా ఉండాలి. సంయమనం పాటించాలి. రాజకీయాలకు ఇది సమయం కాదు. ఇది చాలా కీలకమైన సమయం’’ అన్నారు.
అయితే, ఎన్డీఏ నుంచి బయటకు రావటంపై మాత్రం చంద్రబాబు సూటిగా స్పందించలేదు. ప్రస్తుతానికి ఎన్డీఏలో కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే, రాజీనామా నిర్ణయం తమ ‘తొలి అడుగు’ అని ఆయన చెప్పారు.
అంతకు ముందు
ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాతావరణం వేడెక్కింది. బుధవారం ఉదయం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై మాట్లాడగా.. సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ఇదే అంశంపై మాట్లాడారు. జైట్లీ ప్రత్యేక హోదా అనేదే లేదని చెప్పిన తర్వాత రాష్ట్రంలో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి.
బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న ఎంపీలు, రాష్ట్ర మంత్రులు తెదేపా నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై మాట్లాడారు.
ఇకపై అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చించారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. చంద్రబాబు ప్రెస్ మీట్ కూడా మొదట 7.30కని.. తర్వాత ఎనిమిదింటికని వాయిదాపడుతూ వచ్చింది. చివరకు పదిన్నర తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు.

ఫొటో సోర్స్, twitter/YSRCParty
గత కొంతకాలంగా.. ముఖ్యంగా శీతాకాల పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాక ప్రత్యేక హోదాపై టీడీపీ స్వరం పెంచింది.
అటు పార్లమెంట్‌లో ఎంపీలు ఆందోళనలు.. నిరసన ప్రదర్శనలు చేశారు.
రాష్ట్రంలోనూ అధికార టీడీపీ సహా విపక్షాలు కూడా బంద్.. ప్రదర్శనలు చేపట్టాయి.

ఇక చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ జరుగుతున్నపుడు బయట.. కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించొచ్చని.. టీడీపీ బీజేపీతో పొత్తును కటీఫ్ చేసుకుంటుందనీ వదంతులు వ్యాపించాయి.
అయితే వీటన్నింటికీ చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు.
ఈ అంశంపై మరిన్ని అప్‌డేట్‌ల కోసం బీబీసీ న్యూస్ తెలుగును చూస్తూ ఉండండి
ఇవి కూడా చదవండి
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








