మేం విజయం సాధించాం: ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Reuters
పాకిస్తాన్ ఎన్నికల్లో విజయం సాధించినట్లుగా మాజీ క్రికెటర్, పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించుకున్నారు.
"మేం విజయం సాధించాం, ప్రజలు మాపట్ల స్పష్టమైన తీర్పునిచ్చారు" అని ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.
పీటీఐ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవసరమైన మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం తప్పకపోవచ్చు.
పాకిస్తాన్ ఎన్నికల ప్రచారమంతా హింసాత్మకంగానే సాగింది. ఓటింగ్ రోజున కూడా క్వెట్టాలో జరిగిన బాంబు పేలుడులో 31మంది మృతిచెందారు.
క్రీడల నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఇమ్రాన్ ఖాన్... పాకిస్తాన్ సైన్యం తన పార్టీకి అనుకూలంగా పనిచేస్తోందంటూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే వీటిని ఆయన తోసిపుచ్చారు.
తుదిఫలితాలు వెలువడటానికి మరికొంత సమయం పడుతుంది.
నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ పార్టీ ఈ ఫలితాలను తిరస్కరించింది. పోలింగ్‌లో ఎన్నో అవకతవకలు, రిగ్గింగ్ జరిగాయని వారు ఆరోపించారు.
ఈ ఎన్నికలు ప్రధానంగా ఇమ్రాన్ ఖాన్ పార్టీకి, నవాజ్ షరీఫ్ పార్టీకి మధ్య పోటీగానే నిలిచాయి. మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో తనయుడి పీపీపీ పార్టీ మూడో స్థానానికే పరిమితం కానుంది.
ఫలితాల సరళి తెలిసిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పాకిస్తాన్ చరిత్రలోనే నిష్పక్షపాతంగా జరిగిన ఎన్నికలు ఇవి అని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి ఎలాంటి అంశాలపైనైనా విచారణ జరిపించేందుకు సిద్ధమన్నారు.
పాకిస్తాన్ అభివృద్ధికి సహకరించాలని అన్ని రాజకీయ పక్షాలనూ ఇమ్రాన్ ఖాన్ కోరారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి భారత్‌తో చర్చలకు సిద్ధమని తెలిపారు.
ఇప్పటివరకూ అందిన వివరాల ప్రకారం ఫలితాలు (26.07.2018 రాత్రి 10 గంటలు)

ఈ ఎన్నికలు నిజంగానే నిష్పాక్షికంగా జరిగాయా?
పీఎంఎల్-ఎన్ మొదటి నుంచీ ఈ ఎన్నికలు, ప్రచార సమయంలో సైన్యం పాత్రపై ఆరోపణలు చేస్తూనే ఉంది. పీటీఐ పార్టీకి సైన్యం, కోర్టులు కూడా సహకారం అందిస్తున్నాయని, పరోక్షంగా ఆ పార్టీ విజయానికి దోహదం చేస్తున్నాయని విమర్శించింది. కానీ సైన్యం ఈ ఆరోపణలను ఖండించింది.
మరోవైపు మానవ హక్కుల సంఘం కూడా ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనడానికి ఎన్నో ఉదంతాలున్నాయని వ్యాఖ్యానించింది. మీడియా గొంతు నొక్కడానికి బహిరంగంగానే ప్రయత్నాలు జరిగాయని స్వతంత్ర మీడియా పేర్కొంది.
పోలింగ్ సమయంలో ఎన్నో కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగిందని ఎన్నికలు ముగిసిన అనంతరం కొన్ని రాజకీయ పక్షాలు ఆరోపించాయి. అయితే ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
ఓట్ల లెక్కింపు సమయంలో తమ పోలింగ్ ఏజెంట్లను బయటకు పంపించేశారని కొన్ని పార్టీల ప్రతినిధులు తెలిపారు. ఫలితాలకు సంబంధించిన అధికారిక పత్రాలను ఇవ్వాలని కోరినా తిరస్కరించారని, ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘనే అని పేర్కొన్నారు.
కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేకించి పీఎంఎల్-ఎన్ పార్టీకి బాగా పట్టుందని భావిస్తున్న పంజాబ్ ప్రావిన్స్‌లో ఫలితాల వెల్లడికి చాలా ఎక్కువ సమయం తీసుకోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే సాంకేతిక అవాంతరాల కారణంగానే ఫలితాల వెల్లడి ఆలస్యమైందని ఎన్నికల సంఘం వివరించింది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








