హైపోథెర్మియా అంటే ఏంటి? మద్యం తాగొద్దని వాతావరణ శాఖ ఎందుకు చెబుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అనంత్ ప్రకాశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీ సహా ఉత్తర భారత దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. రానున్న రోజుల్లో చలి తీవ్రంగా ఉండబోతోందని హెచ్చరించింది.
గత కొన్ని రోజులుగా దిల్లీ, హరియాణా, పంజాబ్, చండీగఢ్‌లలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సున్నాకు చేరువలో నమోదు అవుతున్నాయి.
తెల్లవారుజామున ఆరుబయట ఎక్కువగా తిరగొద్దని వాతావరణ శాఖ సూచించింది. పడిపోతున్న ఉష్ణోగ్రతలతో హైపోథెర్మియా, ఫ్రాస్ట్‌బైట్ లాంటి సమస్యలు చుట్టుముట్టే ముప్పుందని హెచ్చరించింది.
ఉష్ణోగ్రతలు పడిపోవడంతో శరీరం పనిచేయడం ఆపేయడాన్ని హైపోథెర్మియా అంటారు. మరోవైపు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో కాళ్లు, చేతులు, ముఖంలోని కొన్ని భాగాలు మొద్దుబారిపోవడాన్ని ఫ్రాస్ట్‌బైట్ అంటారు.

ఫొటో సోర్స్, Sanchit Khanna/Hindustan Times via Getty Images
మద్యం తీసుకోవద్దని హెచ్చరిక
మద్యం తీసుకోవద్దని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. మద్యపానంతో శరీర ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే ముప్పుందని తెలిపింది.
ఈ హెచ్చరికల విషయంపై మాట్లాడేందుకు వాతావరణ శాఖ ప్రాంతీయ డైరెక్టర్ కుల్‌దీప్ శ్రీవాస్తవను బీబీసీ సంప్రదించింది.
‘‘దిల్లీలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోతున్నాయి. కొన్నిచోట్ల నాలుగు డిగ్రీల కంటే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అందుకే ఉదయం పూట ఆరుబయట తిరగడం తగ్గించాలి. ఆ సమయంలో ప్రయాణాలు కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే ఎదురుగా వచ్చే వాహనాలు, మనుషులు.. ఎవరూ కనిపించరు. మద్యం కూడా తీసుకోకూడదు. మద్యపానంతో శరీర ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే ముప్పుంది’’అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, DIBYANGSHU SARKAR/AFP via Getty Images
ఎందుకు మద్యపానం వద్దు?
డిసెంబరు 25న విడుదల చేసిన ప్రకటనలో కూడా మద్యం తీసుకోవద్దని వాతావరణ విభాగం సూచించింది. దీంతో ఎందుకు ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
ఈ అంశంపై కుల్‌దీప్‌తో బీబీసీ మాట్లాడింది. ‘‘ఈ అంశంపై వైద్య నిపుణులు పరిశోధనలు చేపట్టారు. వాటి ఆధారంగానే మేం హెచ్చరికలు జారీచేశాం’’అని ఆయన చెప్పారు.
ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా అంటే మైనస్ పది నుంచి మైనస్ 30 వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే దేశాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. అయితే, అక్కడ మద్యం వినియోగం కూడా ఎక్కువగానే ఉంటుంది. రష్యా, బెలారస్, లిథువేనియా ప్రాంతాలను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చలితోపాటు అక్కడ మద్యం వినియోగం కూడా ఎక్కువే ఉంటుంది.
మరోవైపు మద్యం తీసుకుంటే ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందని ఒక నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో అసలు మద్యాన్నే తీసుకోవద్దని ఐఎండీ ఎందుకు చెబుతుందని వార్తలు వస్తున్నాయి.
ఈ అంశంపై లోతైన అవగాహన కోసం కొంతమంది నిపుణులతో బీబీసీ మాట్లాడింది.

ఫొటో సోర్స్, Reuters
సైన్స్ ఏం చెబుతోంది?
మానవ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు కొంచెం అటూఇటుగా ఉంటుంది. బయట ఉష్ణోగ్రతలు తగ్గిపోయేటప్పుడు శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంచేందుకు ఎక్కువ శక్తిని శరీరం వినియోగించుకుంటుంది. ఒక నిర్దేశిత పరిమితికి మించి ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు హైపోథెర్మియా వస్తుంది.
దిల్లీ, పంజాబ్, హరియాణాల్లో ప్రస్తుతం నమోదవుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో ఎక్కువసేపు గడిపితే ఇలాంటి హైపోథెర్మియా వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
సాధారణ పరిభాషలో చెప్పాలంటే.. శరీరం లోపల ఉష్ణోగ్రత నిర్దేశిత పరిమితి కంటే తక్కువగా పడిపోయినప్పుడు హైపోథెర్మియా వస్తుంది.
ఇప్పుడు ఉష్ణోగ్రతలు తక్కువుండే ప్రాంతాల్లో మద్యం తాగడం గురించి చూద్దాం. ఈ అంశంపై దిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రి సీఎంవో డాక్టర్ రీతు సక్సేనాతో బీబీసీ మాట్లాడారు.
‘‘శరీరంలోకి ఆల్కహాల్ వెళ్లిన తర్వాత.. చేతులు, కాళ్లు, ఇతర భాగాల్లోని రక్త నాళాలు కాస్త పెద్దవి అవుతాయి. ఫలితంగా వాటిలో రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది. అందుకే కాస్త వేడిగా అనిపిస్తుంది. అందుకే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే పశ్చిమ దేశాల్లో ఎక్కువమంది మద్యం తీసుకుంటుంటారు’’అని ఆమె చెప్పారు.
‘‘అయితే, ఆల్కహాల్ తీసుకుంటే వేడిగా అనిపించగానే చాలా మంది ఉన్ని దుస్తుల్ని తొలగించేస్తారు. ఫలితంగా శరీర ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. అది చాలా ప్రమాదకరం’’అని ఆమె వివరించారు.
ఇదే విషయాన్ని మ్యాక్స్ హెల్త్‌కేర్‌కు చెందిన ఇంటర్నల్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ కో డైరెక్టర్ రోమెల్ టీకు కూడా చెప్పారు.
‘‘మద్యం తీసుకునేవారిలో కొంత మంది మొహం ఎర్రగా కనిపించడం చూస్తుంటాం. వారి శరీరంలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణ పెరగడంతో వారి మొహం అలా కనిపిస్తుంది. ముఖ్యంగా అంతర్గత అవయవాల నుంచి రక్తం బయటవైపుకు ఎక్కువగా ప్రవహించడంతో లోపలి ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం కూడా జరుగుతుంది’’అని ఆయన చెప్పారు.
‘‘అంటే శీతాకాలంలో ఆల్కహాల్ తీసుకోవడం ఎక్కువయ్యే కొద్దీ శరీర కోర్ ఉష్ణోగ్రతలు పడిపోవడం జరుగుతుంది. ఎందుకంటే రక్త ప్రసరణ పెరగడంతో చెమట ఎక్కువగా పడుతుంది. కోర్ ఉష్ణోగ్రత తగ్గుతుంది’’అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Hindustan Times
చనిపోయే ముప్పుంది..
చలికాలంలో పరిమితికి మించి ఆల్కహాల్ తీసుకుంటే చనిపోయే ముప్పు కూడా ఉందని రీతు చెప్పారు.
‘‘చలికాలంలో ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే.. మొదట బట్టలు ఎలా వేసుకున్నారన్న సంగతి మరచిపోతారు. మరోవైపు మెదడుపై ఆల్కహాల్ ప్రభావం వల్ల.. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా తెలియదు. ఫలితంగా శరీర కోర్ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతుంటాయి. దీంతో హైపోథెర్మియా చుట్టుముడుతుంది. ఒక్కోసారి కోమాలోకి వెళ్లిపోయి... మరణించే ముప్పు కూడా ఉంటుంది’’అని ఆమె చెప్పారు.
మరోవైపు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే రష్యా లాంటి దేశాల్లో సగటు జీవిత కాలం తక్కువగా ఉంటోందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధన కూడా చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
- కరోనాతో ప్రపంచం తలకిందులవుతున్న వేళ ఈ ఐదుగురు రూ. 22 వేల కోట్లు వెనకేసుకున్నారు
- కోవిడ్-19 లాక్డౌన్: ఫిలిప్పీన్స్‌లో సంతాన విప్లవం - లక్షల సంఖ్యలో అవాంఛిత గర్భాలు
- కరోనా వ్యాక్సీన్ : అన్ని ముస్లిం దేశాలు టీకా తీసుకుంటాయా ? హలాల్, హరామ్ చర్చ ఎందుకు మొదలైంది ? బీబీసీ ఫ్యాక్ట్ చెక్
- ‘మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారి
- భారత్: ఒకపక్క ఊబకాయం.. మరోపక్క పోషకాహార లోపం.. ఎందుకిలా?
- కరోనావైరస్: భారత్‌లో గల్లంతవుతున్న కోవిడ్ మరణాలు ఎన్ని?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








