కొరియా యుద్ధం ముగింపుపై అమెరికా, ఉత్తర కొరియా ప్రకటన త్వరలోనే: బీబీసీ ఇంటర్వ్యూలో మూన్

ఫొటో సోర్స్, Getty Images
కొరియా ద్వీపకల్పంలో యుద్ధ పరిస్థితి ముగింపుపై దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ ఆశాభావం వ్యక్తంచేశారు. దీనిపై త్వరలోనే అమెరికా, ఉత్తర కొరియా ప్రకటన చేస్తాయని ఆయన బీబీసీతో చెప్పారు.
అమెరికా, ఉత్తర కొరియా మధ్య అంగీకారం మేరకు 1953లోనే యుద్ధం ముగిసింది. శాంతి ఒప్పందం మాత్రం ఇప్పటివరకు కుదరలేదు.
అణ్వాయుధాలను విడనాడేలా ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్-ఉన్‌ను ఒప్పించే క్రమంలో తనకు మరిన్ని దౌత్యపరమైన ఇబ్బందులు ఎదురుకావొచ్చని మూన్ చెప్పారు. అదే సమయంలో, కిమ్ నిజాయతీగా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశంసించారు.
దక్షిణ కొరియా రాజధాని సోల్‌లో బీబీసీ ప్రతినిధి లారా బికర్‌కు మూన్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
ఐరోపా నాయకులు నాకు తోడ్పడాలి: మూన్
అమెరికా, ఉత్తర కొరియా చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడితే అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, కిమ్ మధ్య మధ్యవర్తిత్వం నెరపేందుకు తనకు ఐరోపా నాయకులు తోడ్పడతారని ఆశిస్తున్నట్లు మూన్ చెప్పారు.
కిమ్‌తో దక్షిణ కొరియా అధ్యక్షుడు ఈ ఏడాది మూడుసార్లు సమావేశమయ్యారు. ట్రంప్, కిమ్ మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు.
మీకు ఎవరితో వ్యవహారం నెరపడం సులభం- కిమ్‌తోనా, ట్రంప్‌తోనా అని బీబీసీ అడగ్గా, మూన్ చిన్నగా నవ్వారు. సమాధానమివ్వడానికి ఆయన ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది.
యుద్ధ పరిస్థితి ముగింపు ప్రకటన గురించి ట్రంప్‌తోపాటు అమెరికా ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చించానని మూన్ తెలిపారు. ''ఉత్తర కొరియా కొన్ని చర్యలు చేపడితే, యుద్ధం ముగింపు ప్రకటన ఒక రాజకీయ ప్రకటన అవుతుంది. ఉత్తర కొరియా, అమెరికా మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న వైషమ్యాలు తొలగిపోయాయన్నది ఈ ప్రకటన సారాంశం అవుతుంది'' అని వెల్లడించారు.
వీలైనంత త్వరగా ఈ ప్రకటన వెలువడాలని కోరుకొంటున్నానని మూన్ చెప్పారు. ఈ విషయంలో అమెరికా, దక్షిణ కొరియా ఆలోచన ఒకటేనని తాను భావిస్తున్నట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, KOREA SUMMIT PRESS POOL/AFP/GETTY IMAGES
యుద్ధం, విడిపోవడంలో ఉండే బాధ నాకు తెలుసు
గత నెల్లో ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ పర్యటన సందర్భంగా 'అరిర్యాంగ్ గేమ్స్'లో ఉత్తర కొరియా ప్రజలను ఉద్దేశించి మూన్ ప్రసంగించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు ఉత్తర కొరియా ప్రజలను ఉద్దేశించి ఇలా ప్రసంగించడం ఇదే తొలిసారి. ఆయన ప్రసంగం ముగిసిన తర్వాత లక్షన్నర మంది ప్రజలు లేచి నిలబడి హర్షం వ్యక్తంచేశారు.
ఆ ప్రసంగం సమయంలో తాను కంగారుపడ్డానని మూన్ తెలిపారు. ''నేను అణు నిరాయుధీకరణ గురించి మాట్లాడాను. దీనిపై ఉత్తర కొరియా ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది. నేను నా ప్రసంగంతో కొరియా ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను సంతృప్తిపరచాల్సి ఉంది. అందువల్ల అది అంత సులభమైన పని కాదు'' అన్నారు.
ప్రసంగంపై కిమ్ తనకు ఎలాంటి పరిమితులూ పెట్టలేదని మూన్ స్పష్టంచేశారు. ''నేను ఏం మాట్లాడబోతున్నానో కూడా ఆయన తెలుసుకోవాలనుకోలేదు. ఉత్తర కొరియాలో ప్రస్తుతం వస్తున్న మార్పులను ఇది సూచిస్తోంది'' అని వ్యాఖ్యానించారు.
కొరియా ద్వీపకల్పంలో యుద్ధం తిరిగి రాకుండా చూసేందుకు తాను దక్షిణ కొరియా అధ్యక్షుడిని అయ్యానని, యుద్ధం, అయినవాళ్ల నుంచి విడిపోవడంలోని బాధను తాను చాలా అనుభవించానని చెప్పారు.
మూన్ తల్లిదండ్రులు 1953లో ఉత్తర కొరియా నుంచి పారిపోయారు. వాళ్లు తిరిగి ఎన్నడూ వాళ్ల కుటుంబాన్ని కలుసుకోలేకపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
కొరియా యుద్ధంలో 50 లక్షల మంది మృతి
ఉభయ కొరియాల మధ్య 1950 జూన్‌లో యుద్ధం మొదలైంది. 75 వేల మంది ఉత్తర కొరియా సైనికులు ఉభయ కొరియాల మధ్య సరిహద్దు అయిన '38వ అక్షాంశం(parallel)' వెంబడి దాడికి దిగడంతో సమరం ప్రారంభమైంది. తర్వాత దక్షిణ కొరియా తరపున అమెరికా యుద్ధ రంగంలోకి దిగింది. ఉత్తర కొరియాకు చైనా, సోవియట్ యూనియన్(యూఎస్‌ఎస్‌ఆర్) మద్దతు ఉంది.
ఒక దశలో ఉత్తర కొరియా బలగాలు వెనక్కు తగ్గాల్సి వచ్చింది. అనంతరం రణరంగంలో రెండు పక్షాల మధ్య ఆధిపత్యం చేతులు మారింది. తర్వాత ప్రతిష్టంభన ఏర్పడింది.
1953 జులైలో అమెరికా, ఉత్తర కొరియా మధ్య యుద్ధ విరమణకు అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందంపై దక్షిణ కొరియా సంతకం చేయలేదు.
మూడేళ్లు సాగిన కొరియా యుద్ధంలో 50 లక్షల మంది సైనికులు, ప్రజలు చనిపోయారు.

ఫొటో సోర్స్, Reuters
చర్చలు ఎలా సాగుతున్నాయి?
కిమ్, ట్రంప్ ఈ ఏడాది జూన్‌లో సింగపూర్‌లో చరిత్రాత్మక శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణకు భేటీలో అంగీకారం కుదిరింది.
తర్వాత ఉత్తర కొరియా, అమెరికా సంబంధాల్లో ఒడిదొడుకులు తలెత్తాయి. చర్చలు స్తంభించిపోయాయి. ప్రతిష్టంభనను తొలగించేందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు గత నెల్లో ప్యాంగ్యాంగ్‌ను సందర్శించారు. ఉత్తర కొరియా ప్రధాన క్షిపణి పరీక్ష కేంద్రాల్లో ఒకటైన టాంగ్‌చాంగ్-రి మూసివేతకు కిమ్ అంగీకరించారు. మూసివేతను స్వయంగా పరిశీలించేందుకు అంతర్జాతీయ నిపుణులను అనుమతిస్తామని ఉత్తర కొరియా ప్రకటించింది.
మరోవైపు సైనిక ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై ఉత్తర కొరియా సైన్యాధిపతి, దక్షిణ కొరియా రక్షణ మంత్రి సంతకాలు చేశారు.
అమెరికా ఏమంటోంది?
ఉత్తర కొరియా తమ దేశంలోని అణు కేంద్రాలు, ఆయుధాల వివరాలన్నీ బహిర్గతపరచాలని అమెరికా డిమాండ్ చేసింది. ఈ నెల 7న అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి మైక్ పాంపేయో ఉత్తర కొరియాలో కిమ్‌తో చర్చలు జరిపారు. పాంపేయో ఉత్తర కొరియా సందర్శించడం ఇది నాలుగోసారి.
ఉత్తర కొరియాలో అంతర్జాతీయ పరిశీలకుల సమక్షంలో సంపూర్ణ అణు నిరాయుధీకరణే తమ అంతిమ లక్ష్యమని పాంపేయో ఈ నెల 9న అమెరికా అధ్యక్ష భవనంలో చెప్పారు. ఈ లక్ష్య సాధనకు చేయాల్సింది చాలా ఉందని, అయితే ఈ దిశగా సాగుతున్నామని తెలిపారు. త్వరలోనే ఉత్తర కొరియాలోని రెండు అణు కేంద్రాలను అంతర్జాతీయ పరిశీలకులు సందర్శిస్తారని వివరించారు.
అమెరికాలో నవంబరులో ఎన్నికల తర్వాత కిమ్, ట్రంప్ మరోసారి సమావేశం కానున్నారు.
ఇవి కూడా చదవండి:
- కొరియా చర్చలు- ‘కొత్త చరిత్రకు ఆరంభం’
- 'తిత్లీ' తుపానుకు ఆ పేరు పెట్టింది పాకిస్తాన్
- తిత్లీ తుపాను: ప్రభావిత ప్రాంతాలలో ముమ్మరంగా సహాయచర్యలు
- #MeToo: ఏది వేధింపు? ఏది కాదు?
- సింగపూర్ టూ అమెరికా... 19 గంటల నాన్‌స్టాప్ జర్నీ
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
- వాట్సాప్‌లో 'అపరిచిత వీడియో కాల్' బగ్, పరిష్కరించిన నిపుణులు
- జైపూర్‌లో జికా వైరస్... బాధితురాలికి పుట్టిన బిడ్డ పరిస్థితి ఏమిటి?
- ఆసియాన్ భారత్‌కు ఎందుకంత ప్రత్యేకం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








