Jan Dhan: రైతు బ్యాంకు అకౌంట్‌లో 15 లక్షలు పడ్డాయి.. మోదీయే వేశారు అనుకుని, 9 లక్షలతో ఇల్లు కట్టేశాడు.. ఆ తర్వాత.. - ప్రెస్ రివ్యూ

డబ్బు

ఫొటో సోర్స్, Getty Images

ఒక రైతు జన్‌ధన్‌ ఖాతాలో 15 లక్షల రూపాయలు జమయ్యాయి. తొమ్మిది లక్షలతో ఓ చిన్న ఇల్లు కట్టుకున్నాడు. మిగిలిన వాటిని ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగా ఆయనకు పిడుగులాంటి వార్త అందిందని ఈనాడు ఒక కథనం రాసింది.

ఆ కథనం ప్రకారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా దావర్‌వాడీ గ్రామానికి చెందిన ధ్యానేశ్వర్ జనార్ధన్ ఔటే కొంతకాలం క్రితం తన బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు .

ఖాతాలో ఏకంగా 15 లక్షల రూపాయలు ఉండటంతో షాక్‌కు గురయ్యాడు.

ఈ డబ్బంతా మోదీనే తన ఖాతాలో జమ చేశారని సంబరపడిపోయాడు. ఇందుకు ధన్యావాదాలు తెలుపుతూ ప్రధాని కార్యాలయానికి మెయిల్ కూడా పంపాడు.

తన ఖాతాలోని సొమ్ము నుంచి తొమ్మిది లక్షలు తీసి గ్రామంలో ఇల్లు కట్టుకున్నాడు. అలా ఆనందంగా ఉన్న సమయంలో ధ్యానేశ్వర్‌కు ఓ లేఖ అందింది.

'జిల్లా పరిషత్ నుంచి పింపల్‌వాడీ గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు పొరపాటున మీకు వచ్చాయి. ఆ మొత్తాన్ని మీరు తిరిగి చెల్లించాలి' అన్నది దాని సారాంశం.

ఖాతాలో మిగిలి ఉన్న రూ. ఆరు లక్షలు తిరిగి చెల్లించేసినా ఇప్పటికే ఖర్చు చేసిన తొమ్మిది లక్షలను ఎలా ఇవ్వాలా అని ధ్యానేశ్వర్ ఇప్పుడు తలపట్టుకున్నాడు.

కోవిడ్ టెస్ట్

ఫొటో సోర్స్, Getty Images

'మూడో వేవ్ ముగిసినట్లే.. ఆంక్షలు లేవి జీవితం గడపొచ్చు'

తెలంగాణ‌లో క‌రోనా థ‌ర్డ్ వేవ్ ముగిసింద‌ని రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు శ్రీనివాస్ రావు చెప్పారని నమస్తే తెలంగాణ కథనం రాసింది.

తెలంగాణలో జ‌న‌వ‌రి 28న థ‌ర్డ్ వేవ్ ఉధృతి ముగిసింద‌ని ఆయన పేర్కొన్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎలాంటి కొవిడ్ ఆంక్ష‌లు లేవ‌ని చెప్పారు. క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని స్ప‌ష్టం చేశారు.

వీడియో క్యాప్షన్, అంకాపూర్ చికెన్‌‌కు అంత రుచి ఎలా వస్తుందో ఫార్ములా చెప్పేశారు

టీకా తీసుకున్న వారిలో ప్ర‌భావం త‌క్కువ‌గా ఉంద‌న్నారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2 శాతం కంటే త‌క్కువ‌గా ఉంద‌ని తెలిపారు.

ఐటీ సంస్థ‌లు వ‌ర్క్ ఫ్రం హోం విర‌మించుకోవ‌చ్చని శ్రీనివాస్ రావు సూచించారు. అన్ని సంస్థ‌లు వంద శాతం ప‌ని చేయ‌వ‌చ్చని చెప్పారు. ఉద్యోగులు పూర్తి సంఖ్య‌లో కార్యాల‌యాల‌కు వెళ్లొచ్చని, విద్యాసంస్థ‌ల‌ను పూర్తిగా ప్రారంభించామ‌ని తెలిపారు.

అయితే, కేసులు త‌గ్గినా మాస్కులు ధ‌రించాల‌ని ఆయన ఆదేశించారు.

సూర్య జైభీమ్

ఫొటో సోర్స్, fb/Suriya Sivakumar

ఆస్కార్ ఆశలు గల్లంతు

భారతీయ సినిమాకు ఆస్కార్ మరోసారి అందని ద్రాక్షే అయింది. ఎన్నో ఆశలతో ఆస్కార్ ముంగిట వరకూ వెళ్లిన జై‌భీమ్ తుది బరిలో నిలువలేకపోయిందని ఆంధ్రజ్యోతి పత్రిక కథనం రాసింది.

సూర్య కథనాయకుడిగా నటించిన జైభీమ్ ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరీలో భారత్‌ తరపున స్క్రీనింగ్‌‌కు ఎంపికైంది. అయితే, ఆస్కార్ కమిటీ ప్రకటించిన తుది జాబితాలో జైభీమ్‌కు స్థానం దక్కలేదు.

డాక్యుమెంటరీ చిత్రాల విభాగంలో ఇండియా నుంచి 'రైటింగ్ విత్ ఫైర్' పోటీలో నిలవడం కాస్త ఊరటనిచ్చే అంశం.

మార్చి 27న ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది.

కోళ్లు, కృత్రిమ మాంసం

ఫొటో సోర్స్, Getty Images

ఆర్టీసీ బస్సులో కోడికి ఫుల్ టికెట్

తెలంగాణలో ఒక ప్రయాణికుడు వెంట తీసుకెళ్తున్న కోడికి ఆర్టీసీ బస్సు కండక్టర్‌ టికెట్‌ కొట్టాడని సాక్షి పత్రిక రాసింది.

ఆ కథనం ప్రకారం.. మహమ్మద్‌ అలీ గోదావరిఖని డిపో బస్సులో కరీంనగర్‌కు వెళ్తున్నారు. అతనితో పాటు కోడిని చీరలో చుట్టి తీసుకెళ్లారు. అయితే, సుల్తానాబాద్‌ రాగానే కోడి కూసింది.

దాంతో కండక్టర్‌ తిరుపతి మహమ్మద్‌ అలీ దగ్గరకొచ్చి చీర తీసి చూస్తే కోడి కనిపించింది.

వీడియో క్యాప్షన్, కోడి లేకుండా కోడి కూర... ఈ చికెన్ కర్రీ ఎలా చేస్తారంటే?

బస్సులో కోడిని ఎలా తీసుకొస్తారని, టికెట్‌ తీసుకోవాలని కండక్టర్ పట్టుపట్టారు.

కోడికి టికెట్ తీసుకోవడం ఏంటని అలీ... తీసుకోవల్సిందేనని తిరుపతి ఇద్దరూ కాసేపు మాటామాటా అనుకున్నారు.

అయితే, చివరకు రూ.30లతో కోడికి ఫుల్‌ టికెట్‌ కొట్టాడు కండక్టర్‌.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)