జన్‌ధన్ ఖాతాలో రూ. 10 కోట్లు.. ఎలా వచ్చాయో తెలియదంటున్న పదహారేళ్ల అమ్మాయి- ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక యువతి ఖాతాలో ఆమెకు తెలీకుండానే 10 కోట్ల రూపాయలు జమ అయినట్లు ఈనాడు ఒక కథనం ప్రచురించింది.
‘‘ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాకు చెందిన సరోజ్‌కు అలహాబాద్ బ్యాంకులో 2018 నుంచి ఖాతా ఉంది. సోమవారం ఆమె బ్యాంకుకు వెళ్లినపుడు ఆమె ఖాతాలో రూ.9.99 కోట్లు ఉన్నాయని అధికారులు చెప్పారు.
తన ప్రమేయం లేకుండానే బ్యాంక్ ఖాతాలో దాదాపు రూ.10 కోట్లు జమ కావడంతో విస్తుపోవడం ఆ అమ్మాయి వంతైంది.
నిరక్షరాస్యురాలైన ఆమె దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబ్బు జమ చేయడానికి అంటూ గతంలో ఒక వ్యక్తి తన ఆధార్ కార్డు, ఫొటో అడిగితే పంపించానని, ఆ నంబరుకు ఇప్పుడు ఫోన్ చేస్తే స్విచాఫ్ వస్తోందని మంగళవారం ఆమె విలేకరులకు తెలిపింది.
అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో తనకు తెలీదని సరోజ్ చెప్పార’ని ఈనాడులో రాశారు.

ఫొటో సోర్స్, facebook/ysrcp
జగన్, అమిత్ షా సమావేశం
ఏపీ సీఎం జగన్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తమకు సమాచారం అందిందని ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.
‘ఢిల్లీ పిలుపు’ మేరకు జగన్ మంగళవారం ఆకస్మికంగా హస్తినకు బయలుదేరి వెళ్లారు. మంగళవారం రాత్రి ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సుమారు 40 నిమిషాలపాటు భేటీ అయ్యారు.
రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడల సంగతి ఎలా ఉన్నా.... మొత్తంగా న్యాయ వ్యవస్థను, అందులోనూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సైతం కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని అమిత్‌షా ప్రస్తావించినట్లు తెలిసిందని జ్యోతి రాసింది.
‘‘న్యాయమూర్తులపై బహిరంగ వ్యాఖ్యానాలు చేయడం, అందుకు పార్లమెంటును కూడా ఉపయోగించుకోవడం సరైంది కాదు. ఇలాంటి విషయాల్లో సున్నితంగా వ్యవహరించాలి. రచ్చకెక్కడం మంచిది కాదు’’ అని జగన్‌కు అమిత్‌షా చెప్పినట్లు తెలిసిందని పత్రిక చెప్పింది.
న్యాయ వ్యవస్థతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, పరిపాలన సాగించడమే క్లిష్టంగా మారుతోందని జగన్ వివరించేందుకు ప్రయత్నించగా.. అమిత్‌షా వినిపించుకోలేదని సమాచారం. భారత దేశంలో న్యాయవ్యవస్థకు అత్యున్నత గౌరవం ఇస్తుండగా.. చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వమే కోర్టులను టార్గెట్ చేయడం ఏమిటని అమిత్‌షా నిలదీసినట్లు తెలిసిందని కథనంలో రాశారు.
‘‘ఏదైనా ఉంటే న్యాయస్థానాల్లో అప్పీల్ చేసి తేల్చుకోవాలి. ఇది మాత్రం పద్ధతి కాదు’’ అని కఠినంగానే చెప్పినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వైసీపీ నేతలు కోర్టులకు తప్పుడు ఉద్దేశాలు ఆపాదించడం, ఆ తర్వాత పార్టీ నేతలు ఒక్కొక్కరుగా బయటకొచ్చి న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడం, దానికి ప్రభుత్వం వత్తాసుగా నిలవడం ఈ భేటీలో ప్రధానంగా చర్చకొచ్చినట్లు తెలిసింది. సీఎంగా ఉన్న వ్యక్తి విచక్షణారహితంగా వ్యవహరించడం తగదని అమిత్‌షా మందలించినట్లు తెలుస్తోందని ఆంధ్రజ్యోతి తన కథనంలో వివరించింది.
మరోవైపు.. ప్రజా ప్రతినిధులపై నమోదైన ఆర్థిక నేరాలు, క్రిమినల్ కేసులను ఏడాదిలోపు పరిష్కరించాలని సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, జగన్ తనపై ఉన్న కేసుల అంశాన్ని ప్రస్తావించినట్లు తమకు తెలిసిందని పత్రిక రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
డ్రగ్స్ కేసులో మరో రెండు కొత్త పేర్లు
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్తగా నటుడు మహేశ్ బాబు భార్య నమ్రత, నటి దియా మీర్జా పేర్లు బయటికి వచ్చాయని సాక్షి కథనం ప్రచురించింది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణలో రోజూ కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి.
ఈ కేసులో సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్, నటి దియా మీర్జా పేరు తెరపైకి రావడం సంచలనం సృష్టించింది. విచారణ నిమిత్తం దియాకు ఎన్సీబీ సమన్లు పంపనున్నట్లు తెలుస్తోందని సాక్షి రాసింది.
కాగా, నమ్రతపై వచ్చిన ఆరోపణలను ఆమె టీమ్ ఖండించింది. ఈ వ్యవహారంతో ఆమెకు సంబంధం లేదని స్పష్టంచేసింది.
సుశాంత్ మాజీ టాలెంట్ మేనేజర్ జయ సాహాను ఎన్‌సీబీ అధికారులు విచారిస్తున్న క్రమంలో పలువురు బాలీవుడ్ నటీమణుల పేర్లు బయటకి వస్తున్నాయి.
జయ సాహా వాట్సాప్ గ్రూప్స్‌లో చాట్‌లను జాతీయ మీడియా ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తోంది.
కోడ్ భాషలో ఉన్న అక్షరాలను డీ కోడ్ చేస్తూ ఉంటే ఒక్కొక్క బాలీవుడ్ హీరోయిన్ పేరు బయటపడుతోంది. ఇందులో ఎన్ అంటే నమ్రతా శిరోద్కర్ అని అనుమానిస్తున్నారు. డి అంటే దీపికా పదుకొణె, ఎస్ అంటే శ్రద్ధాకపూర్, కె అంటే దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్, జె అంటే జయ సాహా అని భావిస్తున్న విషయం తెలిసిందే అని పత్రిక చెప్పింది.
ఇప్పటికే కరిష్మా ప్రకాశ్‌కి విచారణకు హాజరు కావాలంటూ ఎన్‌సీబీ సమన్లు పంపింది.
జయ సాహా గ్రూప్ చాట్స్‌లో నమ్రత, జయ... దీపిక, కరిష్మా ప్రకాశ్ మధ్య జరిగినట్టుగా భావిస్తున్న సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
2017 అక్టోబర్‌లో ఈ వాట్సాప్ సంభాషణలు జరిగినట్టు సమాచారం అందిందని సాక్షి వివరించంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో కరోనా తగ్గుముఖం
దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని నమస్తే తెలంగాణ సహా ప్రధన పత్రికలన్నీ కథనం ప్రచురించాయి.
యావత్ దేశప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేసిన కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నదా? కొన్ని నెలలుగా యావత్ భారతాన్ని వణికించిన వైరస్.. క్రమంగా కబళించేశక్తిని కోల్పోతున్నదా? అంటే.. అవుననే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇటీవల కొంతకాలంగా.. రోజుకు దాదాపు లక్ష కేసుల వరకూ వెళ్లిన కరోనా గ్రాఫ్ మెల్లగా కిందికి వస్తున్నది. ఆదివారం దేశవ్యాప్తంగా 92,605 కొత్త కేసులు, 1,133 మరణాలు నమోదుకాగా.. సోమవారం 86,961 కొత్త కేసులు, 1,130 మరణాలు నమోదయ్యాయి.
కాగా.. మంగళవారం ఇది మరింతతగ్గి.. కొత్తకేసుల సంఖ్య 75,083కి పడిపోయింది (ఇది దాదాపు నెల రోజుల వ్యవధిలో అత్యల్పం).
అదేవిధంగా కరోనా మరణాల సంఖ్య 1,053కి తగ్గింది. ఈ లెక్కన కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు స్పష్టమవుతున్నది.
మరోవైపు, మహమ్మారి బారిన పడి కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. సోమవారం నుంచి మంగళవారానికి ఒక్కరోజులోనే రికార్డుస్థాయిలో 1,01,468 మంది కోలుకున్నారని నమస్తే తెలంగాణ వివరించింది.
ఇవి కూడా చదవండి:
- వారంలో ఆరు రోజులు సబ్‌రిజిస్ట్రార్.. ఆదివారం వ్యవసాయ కూలీ
- శ్రీలంక ప్రజలు ఆకలి బారిన పడకుండా పనస కాయలే కాపాడుతున్నాయా...
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- PCOD: ''తనకు పీరియడ్స్ సరిగా రావు.. ఎప్పుడూ లేటే.. పిల్లలు పుట్టే అవకాశం వుందో లేదో చూడండి’’
- మోదీ ప్రభుత్వం చైనా బ్యాంక్ నుంచి కోట్ల డాలర్ల రుణం తీసుకుందా? నిజం ఏంటి? - BBC Fact Check
- 'కరోనావైరస్ నుంచి కోలుకున్నాను... కానీ, కంప్యూటర్ స్క్రీన్ నన్ను దెయ్యంలా వెంటాడుతోంది'
- ప్రపంచంలో తొలి టీకా ప్రచారాన్ని భారత రాణులే చేపట్టారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








