బ్రెజిల్: ‘అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటానికి ఆయన అనర్హుడు’

ఫొటో సోర్స్, AFP
జైలులో ఉన్న బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా.. అక్టోబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటానికి అనర్హుడని ఆ దేశ ఎన్నికల కోర్టు స్పష్టం చేసింది. అవినీతి కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్నందున ఆయన పోటీ చేయటానికి వీలు లేదని తేల్చిచెప్పింది.
లులా అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తే.. మూడో వంతు మంది బ్రెజిల్ పౌరులు ఆయనకు మద్దతునిస్తారని.. అక్టోబర్‌లో జరగబోయే ఎన్నికల్లో ఆయనే ముందంజలో ఉంటారని ఇటీవలి సర్వేలు పేర్కొన్నాయి.
రాబోయే అధ్యక్ష ఎన్నికల రేసులో లులా ముందంజలో ఉన్నారని సర్వేలు చెప్తున్న నేపథ్యంలో.. ఎన్నికల కోర్టు తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల కోర్టు తీర్పును సవాల్ చేస్తూ అప్పీలు చేస్తామని ఆయన తరఫు న్యాయవాదుల బృందం చెప్పింది.

ఫొటో సోర్స్, Reuters
‘న్యాయపోరాటం చేస్తాం’
లులా అభ్యర్థిత్వం కోసం ‘‘అన్ని మార్గాల్లోనూ పోరాటం’’ చేస్తామని బ్రెజిల్ వర్కర్స్ పార్టీ (పీటీ) ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘చట్టం, బ్రెజిల్ ఆమోదించిన అంతర్జాతీయ ఒడంబడికల ద్వారా లులాకు లభిస్తున్న హక్కులను గుర్తించాల్సిందిగా కోర్టులకు అప్పీలు చేస్తాం. దేశ వీధుల్లో ప్రజలతో కలిసి లులాకు అండగా నిలబడతాం’’ అని తెలిపింది.
బ్రెజిల్ అధ్యక్షుడిగా 2003 నుంచి 2011 వరకూ పనిచేసిన లులా డిసిల్వా హయాంలో దేశం ఆర్థికంగా పురోగమించటంతో పాటు భారీ సామాజిక కార్యక్రమాలు అమలయ్యాయి. ఆయన పదవి నుంచి వైదొలగే నాటికి 85 శాతం మంది ఆయనకు ఆమోదం తెలిపారు.
అయితే.. దేశాధ్యక్షుడిగా ఉండగా ఓఏఎస్ అనే ఇంజనీరింగ్ సంస్థ నుంచి 11 లక్షల డాలర్ల విలువ చేసే బీచ్ అపార్ట్‌మెంట్‌ను లంచంగా స్వీకరించారన్నది లులా మీద ఉన్న ఆరోపణ. ఆ కేసులో 12 సంవత్సరాల జైలు శిక్ష విధించటంతో లులా (72) జైలులో ఉన్నారు. ఆయన జైలుశిక్షను ఈ ఏడాది జనవరిలో పైకోర్టు కూడా సమర్థించింది.

ఫొటో సోర్స్, Reuters
దోషిగా తేలితే..
బ్రెజిల్‌లో ఏదైనా నేరంలో దోషిగా నిర్ధారితులైన వ్యక్తులు అప్పీలు చేసుకున్నపుడు.. ఉన్నతస్థాయి కోర్టు కూడా ఆ నిర్ధారణను ఖరారు చేసినట్లయితే సదరు వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయటానికి వీలు లేదు. అయితే.. గతంలో ఈ చట్టానికి కొన్ని మినహాయింపులు ఇచ్చారు.
అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా లులా పేరునే వర్కర్స్ పార్టీ గత నెలలో నామినేట్ చేసింది. కానీ తాజాగా.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటానికి లులా అనర్హుడని ఏడుగురు సభ్యుల ఎన్నికల కోర్టు ధర్మాసనంలో ఆరుగురు తీర్పు చెప్పారు. ‘‘చట్టం, రాజ్యాంగం ముందు పౌరులందరు సమానమన్న విషయం ఇప్పుడు మా ముందున్న ప్రశ్న’’ అని ఒక జడ్జి పేర్కొన్నారు.
లులా మాత్రం తానేమీ తప్పు చేయలేదని పేర్కొన్నారు. ఈ కేసులో తనను దోషిగా నిర్ధారించటం.. తాను తిరిగి అధికారంలోకి రాకుండా నిరోధించే కుట్రలో భాగమని ఆరోపించారు. తనను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించినట్లయితే సావో పాలో మాజీ మేయర్ ఫెర్నాండో హదాద్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయాలని లులా ఎంపిక చేసినట్లు చెప్తున్నారు.
మా ఇతర కథనాలు:
- థియేటర్లన్నీ హౌస్ఫుల్.. సీట్లలో ఎవరూ ఉండరు: చైనాలో సినీమాయాజాలం
- హ్యారీపోటర్ ఎక్స్ప్రెస్: పాత ఇనుము కింద అమ్మేసినా మళ్లీ ప్రాణం పోసుకుంది
- నాగ్పూర్ అత్యాచారం: పాతికేళ్ల నా సర్వీసులో.. అంత క్రూరత్వాన్ని ఎప్పుడూ చూడలేదు
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- ''మమ్మల్ని సెక్స్ బానిసలుగా అమ్మేశారు, అత్యాచారం చేశారు''
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








