హ్యారీపోటర్ ఎక్స్‌ప్రెస్: పాత ఇనుము కింద అమ్మేసినా మళ్లీ ప్రాణం పోసుకుంది

ఫొటో సోర్స్, ROBERT TARLING
- రచయిత, మ్యాట్ లాయిడ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆవిరి మేఘాలు చిమ్ముకుంటూ వచ్చి పిల్లలను ఎక్కించుకుని మాంత్రిక పాఠశాలకు తీసుకెళ్లే హోగ్వార్ట్స్ ఎక్స్‌ప్రెస్‌కి హ్యారీ పోటర్ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. కానీ, ఈ రైలింజన్ ఆ సినిమాలోకి రాకముందు పాతసామాన్ల గోడౌన్‌లో పదిహేడేళ్లపాటు తుప్పుపట్టి మూలన పడివుంది. ఇప్పుడది వార్నర్ బ్రదర్స్ స్టూడియోలో సగర్వంగా వేలాది మందిని అలరిస్తోంది.
కాలం చెల్లిందని కరిగించేయటానికి పంపించేసిన పరిస్థితి నుంచి.. తిరిగి పట్టాలెక్కి రాజసంగా పయనిస్తున్న హోగ్వార్ట్స్ ఎక్స్‌ప్రెస్ రైలింజన్ జీవిత కథలో కూడా ఎన్నో ఆసక్తికరమైన మలుపులున్నాయి.
ఈ రైలింజన్ అసలు పేరు జీడబ్ల్యూఆర్ 5972 ఓల్టన్ హాల్. దాదాపు 80 ఏళ్ల కిందట దీనిని తయారుచేశారు. ఆవిరి ఇంజన్ల స్వర్ణయుగంలో.. 1940, 50ల్లో బ్రిటన్‌లోని లండన్ పాడింగ్టన్‌కి గ్రేట్ వెస్ట్రన్ రైల్వేస్ ప్రధాన మార్గాల్లో ఈ ఓల్టన్ హాల్ నడిచేది.

ఫొటో సోర్స్, PETER BRABHAM
కానీ..రైల్వేలు డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజన్లకు మారుతున్న క్రమంలో ఈ ఇంజన్ రోజులు దగ్గరపడ్డాయి. ప్లైమౌత్‌లో కొంత కాలం నడిచిన తర్వాత.. 1959లో ఈ ఇంజన్‌ను సౌత్ వేల్స్‌కి తిరిగి పంపించారు. చివరికి 1963లో కార్డిఫ్ ఈస్ట్ డాక్ షెడ్ నుంచి దీన్ని తొలగించారు. ఇదేకాదు.. గతించిన ఆవిరి ఇంజన్ల కాలానికి చెందిన చాలా రైలింజన్లను ఇలాగే తీసేశారు.
‘‘బ్రిటిష్ రైల్వే 1960ల్లో ఆవిరి ఇంజన్లను తొలగించటం ప్రారంభించింది. ఏదైనా ఇంజన్‌లో ఏదైనా సమస్య వచ్చిందంటే ఇక దానిని వదిలించుకునేవారు. దాదాపు 22,000 ఆవిరి ఇంజన్లన్నిటినీ పాత సామాన్ల కింద అమ్మేశారు’’ అని వివరించారు వెస్ట్ కోస్ట్ రైల్వేకి చెందిన జేమ్స్ షటిల్‌వర్త్.
బారీ డాక్స్‌లోని పాత సామాన్ల గోదాం యజమానులు ఈ ఇంజన్‌ను కొన్నారు. ఆ ప్రాంతాన్ని ‘రైలింజన్ల స్మశానం’గా అభివర్ణించేవారు. అక్కడికి చేరటంతో దీని కథ ముగిసిందని అనుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘అది దాదాపు 20 ఏళ్ల పాటు పాత సామాన్ల గోదాంలో తుప్పపట్టి వుంది’’ అని షటిల్‌వర్త్ గుర్తుచేసుకున్నారు. బారీ ఐలాండ్ బీచ్‌కి కూతవేటు దూరంలో ఉన్న ఉధామ్ బ్రదర్స్.. అనతికాలంలోనే రైలింజన్ల ప్రేమికులకు ఒక గనిగా మారింది.
సౌత్ వేల్స్ పాత సామాన్లలో కునారిల్లుతున్న ఈ ఇంజన్‌ను.. ఇప్పుడు వెస్ట్ కోస్ట్ రైల్వేస్ యజమానిగా ఉన్న డేవిడ్ స్మిత్ 1981లో కొనుగోలుచేశారు. అప్పటికే పదిహేడేళ్లు మూలనపడి తుప్పుపట్టిపోయిన ఈ ఎక్స్‌ప్రెస్‌ను మళ్లీ పట్టాల మీద పరుగెత్తించటానికి కొంతమంది వలంటీర్ల బృందం పదహారేళ్లు పనిచేసింది.
ఓల్టన్ హాల్ పునరుత్థానం చాలా విశిష్టమైనది. ఫీనిక్స్‌లా బూడిద నుంచి తిరిగి పుట్టిన ఈ ఇంజన్ జీవితంలో మరో మలుపు వేచి ఉంది.

ఫొటో సోర్స్, VALERIE MACON/AFP/GETTY IMAGES
హాలీవుడ్ నుంచి పిలుపు...
‘‘అప్పటికది చాలా పాడైపోయింది. బాగుచేయటానికి చాలా సమయం పట్టింది. అలా నీళ్లు పోసి బాయిలర్‌ని మండించేయలేం. మొదటి నుంచీ అంతా బాగుచేయాలి. చివరికి దానిని పట్టాలెక్కించి ఉత్తర ఇంగ్లండ్‌లో నడపటం మొదలుపెట్టాం’’ అని షటిల్‌వర్త్ చెప్పారు.
కొంత కాలానికి వారికి వార్నర్ బ్రదర్స్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్‌తో ఈ రైలు జీవితం అనూహ్యంగా మారిపోయింది.
హ్యారీ పోటర్ మొదటి నవల ‘హ్యారీ పోటర్ అండ్ ద ఫిలాసఫర్స్ స్టోన్’ను సినిమాగా తీస్తున్నపుడు.. అందులోని హోగ్వార్ట్స్ ఎక్స్‌ప్రెస్ కోసం అచ్చమైన బ్రిటిష్ ఆవిరి ఇంజన్ కోసం ఆ సినిమా నిర్మాతలు తీవ్రంగా వెతుకుతున్నారు.
‘‘హోగ్వార్ట్స్‌ను స్కాట్లండ్‌లో ఏర్పాటుచేశారు. వెస్ట్ హైల్యాండ్ లైన్‌లో మేం పాత ఇంజన్లను నడుపుతున్న విషయం వార్నర్ బ్రదర్స్‌కి తెలుసు. ఆ నవలా రచయిత జె.కె.రౌలింగ్ కూడా ఎడిన్‌బర్గ్ నుంచి లండన్ ప్రయాణంలో పాత ఆవిరి ఇంజన్‌ను చూసినట్లు కనిపిస్తోంది’’ అని షటిల్‌వర్త్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ సినిమా ఆర్ట్ డైరెక్టర్.. తమకు కావలసిన ఇంజన్ ఎలా ఉండాలో ఒక ఫొటోను షటిల్‌వర్త్‌కి చూపించారు. ‘‘అది ఒక హాల్ క్లాస్ ఇంజన్. ‘అలాంటిది మా దగ్గరుంది’ అని అతడికి జవాబిచ్చాను’’ అని షటిల్‌వర్త్ చెప్పారు.
ఈ ఇంజన్‌కు.. రౌలింగ్ నవలలో వర్ణించినట్లుగానే ఎరుపు రంగు వేయాలని వార్నర్ బ్రదర్స్ పట్టుపట్టినపుడు.. అందుకు రైలు ప్రేమికులను ఒప్పించటం చాలా కష్టమైంది.
‘‘ఆది నుంచీ గ్రేట్ వెస్ట్రన్ రైల్వే రంగు ఆకుపచ్చగానే ఉంది. అది అలా ఉండటమే అసలు సిసలు బ్రిటిష్ రైలింజన్ అవుతుందని భావించే వారిని.. ఎరుపు రంగు వేయాలన్న నిర్ణయం అసంతృప్తికి గురిచేసింది’’ అని షటిల్‌వర్త్ తెలిపారు.
హ్యారీ పోటర్ సినిమాలు అన్నిటిలోనూ ఓ ప్రధాన పాత్రగా కొనసాగిన జీడబ్ల్యూఆర్ 5972.. ఇప్పుడు హెర్ట్‌ఫోర్డ్‌షైర్ లోని వార్నర్ బ్రదర్స్ స్టూడియోలో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ప్రతి రోజూ దాదాపు 6,000 మంది సందర్శకులు దీనిని వీక్షిస్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే.. కొంతమంది రైలు ప్రేమికులు, అవకాశవాది అయిన బ్యారీ పాత సామాన్ల వ్యాపారి ప్రమేయం లేకపోతే.. పాతసామాను కింద కరిగించేయటానికి మూలనపెట్టిన ఈ ఇంజన్ మళ్లీ హోగ్వార్ట్స్ ఎక్స్‌ప్రెస్ రూపంలో ప్రాణం పోసుకునేది కాదు.
‘‘దాయ్ వుధామ్.. స్వభావరీత్యా వ్యాపారవేత్త. రైలింజన్లను రద్దు కింద అమ్మేసిన తర్వాత వాటిని తిరిగి అమ్మరాదన్న నిషేధం ఉండేది. ఆ నిషేధాన్ని ఆయన తొలగింపజేశారు. తద్వారా ఆయన దాదాపు 220 ఇంజన్లను తిరిగి అమ్మేశారు. అందులో చాలా వాటిని పునరుద్ధరించారు’’ అని షటిల్‌వర్త్ తెలిపారు.
‘‘ఆ ఇంజన్లను పరిరక్షించాలన్నది ఆయన ఉద్దేశమని నేనను. కానీ.. ఆవిరి ఇంజన్లను ఒంటి చేత్తో కాపాడటంలో ఆయన ప్రమేయం చాలా ఉంది’’ అని పేర్కొన్నారు.
ఆయన చేసిన పనికి హ్యారీ పోటర్ అభిమానులు లక్షలాది మంది ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు.


ఫొటో సోర్స్, Getty Images
- జీడబ్ల్యూఆర్ 5972 ఓల్టన్ హాల్ ఇంజన్‌ను 1937లో స్విన్డన్‌లో తయారుచేశారు. చార్లెస్ కొలెట్ దీనిని డిజైన్ చేశారు.
- ఈ రైలింజన్ మొదట 2001లో ‘హ్యారీ పోటర్ అండ్ ద ఫిలాసఫర్స్ స్టోన్’ సినిమాలో కనిపించింది. కింగ్స్ క్రాస్ నుంచి హాగ్స్‌మీడ్ స్టేషన్‌కి పిల్లలని తీసుకెళుతుంది.
- మొత్తం ఎనిమిది హ్యారీ పోటర్ సినిమాల్లోనూ హోగ్వార్ట్స్ ఎక్స్‌ప్రెస్ కనిపిస్తుంది. అన్ని సినిమాలూ కలిసి 770 కోట్ల డాలర్లు వసూలు చేశాయి.
- చివరి సినిమా ‘డెత్లీ హాలోస్ పార్ట్ 2’లో.. హ్యారీ పోటర్ ఇద్దరు కొడుకులు సహా కొత్త తరం విద్యార్థులను తీసుకుని హోగ్వార్ట్స్‌కు బయలుదేరుతుందీ ఇంజన్.

మా ఇతర కథనాలు:
- ఆ రాజ్యానికీ రాజుకూ ఈ అందమైన, బలమైన మహిళా సైనికులే రక్ష
- భగత్ సింగ్ పిస్టల్ 85 ఏళ్ల తర్వాత ఎలా దొరికింది?
- బీబీసీ స్పెషల్: తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న ఎడారీకరణ ముప్పు
- ‘ఇండియాలోని భారతీయులకంటే బ్రిటన్‌లోని భారతీయులే సంప్రదాయబద్ధంగా బతుకుతున్నారు’
- జలియాన్‌వాలా బాగ్ నరమేధం: ‘వందేళ్ల ఆ గాయాలు క్షమాపణలతో మానవు’
- ఆపరేషన్ బ్లూ స్టార్: ‘కాల్పుల శబ్దం ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతోంది’
- వెయ్యేళ్ల పాత్ర.. వెల రూ.248 కోట్లు
- జీసస్: నిజంగా నల్లగా ఉండేవాడా?
- తొలి కంచి పీఠాధిపతి ఆది శంకరుడేనా?
- నిజాం నవాబూ కాదు, బిల్ గేట్సూ కాదు.. చరిత్రలో అత్యంత ధనికుడు ఇతనేనా!!
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- చరిత్ర: ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ ఎలా సాధించుకున్నారు?
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: బహుశా.. ఈ తరానికి పెద్దగా తెలియని చరిత్ర ఇది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









