ముస్లింల మహిళల హజ్ యాత్రపై మోదీ తప్పు దోవ పట్టిస్తున్నారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుబైర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆదివారం 2017 ఏడాది ఆఖరు 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ ముస్లిం మహిళలు 'మెహరం'(పురుషుల తోడు) లేకుండానే స్వతంత్రంగా హజ్ యాత్రకు వెళ్లవచ్చునని అన్నారు.
ఇప్పటివరకు మహిళలు ఎందుకు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడంలేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
దీనిని ముస్లిం మహిళల పట్ల అన్యాయంగా పేర్కొంటూ, పాత సాంప్రదాయాలను విడనాడాలని పిలుపునిచ్చారు.
ప్రధాని మాటలపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. చాలా మంది ప్రధాని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, నిజానికి ఈ విషయంలో సౌదీ అరేబియా క్రెడిట్‌ను ప్రధాని కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
2014లో సౌదీ అరేబియా నూతన హజ్ పథకం కింద, 45 ఏళ్లు లేదా అంతకు పైబడిన ముస్లిం మహిళలు 'మెహరం' (రక్తసంబంధీకులైన పురుషులు) తోడు లేకుండా స్వతంత్రంగా హజ్ యాత్ర చేయవచ్చని ఆదేశాలు జారీ చేసింది.
అయితే వాళ్లు ఒక బృందంగా హజ్ యాత్ర చేయాల్సి ఉంటుంది. అలాగే 45 ఏళ్లకన్నా తక్కువ వయసు ఉన్న వాళ్లు మాత్రం మెహరం లేకుండా హజ్ యాత్రను చేయడానికి వీల్లేదన్న నిబంధనను మాత్రం కొనసాగించింది.

ఫొటో సోర్స్, AFP
వివాదం ఏమిటి?
భారత ప్రభుత్వం ఎందుకు 2014కు ముందు ఈ నిర్ణయం తీసుకోలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం లేదు.
బహుశా అందుకే ప్రధాని ముస్లిం మహిళలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తుండవచ్చు.
ఈ ప్రకటన చేస్తూ ప్రధాని, గత 70 ఏళ్లుగా హజ్‌కు వెళ్తున్న ముస్లిం మహిళల విషయంలో ఎందుకు అన్యాయం జరుగుతోందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మరోవైపు కొందరు దీనికి అనుకూలంగా మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కనీసం సౌదీ అరేబియా తన విధానాన్ని మార్చుకున్న తర్వాతైనా సరైన చర్య తీసుకుందని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2018 నుంచి హజ్ పథకాన్ని అమలు చేయడానికి భారత ప్రభుత్వం ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన సిఫార్సుల్లో - హజ్ యాత్రకు వెళుతున్న 45 ఏళ్లకు పైబడిన ముస్లిం మహిళలు పురుషుల తోడు లేకుండానే వెళ్లవచ్చని ప్రతిపాదించింది.
అయితే కనీసం నలుగురు మహిళలు కలిసి ఒక బృందంగా హజ్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
గత అక్టోబర్‌లో మోదీ ప్రభుత్వం 2018 నుంచి అమలులోకి వచ్చే కొత్త హజ్ పాలసీలో 45 ఏళ్లకు పైబడిన ముస్లిం మహిళలంతా పురుషుల తోడు లేకుండానే హజ్‌కు వెళ్లవచ్చని సంకేతాలు ఇచ్చింది.
ఆ తర్వాత కేంద్రం ఐదుగురు సభ్యుల కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.

ఫొటో సోర్స్, EPA
క్షేత్రస్థాయి వాస్తవాలు
ఇప్పటివరకు 1200 మంది మహిళలు మెహరం లేకుండా హజ్‌కు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. మోదీ ప్రభుత్వం వారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది.
ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి 70,000 మంది ముస్లింలు హజ్ యాత్ర చేస్తారు. వారి పేర్లను లాటరీ ద్వారా నిర్ణయిస్తారు. మోదీ ప్రభుత్వం ఈ 1200 మంది మహిళలను లాటరీ లేకుండానే హజ్‌కు పంపాలని నిర్ణయించింది.
దేశచరిత్రలో మొదటిసారిగా ఈ 1200 మంది పురుషుల తోడు లేకుండా హజ్ యాత్రకు వెళుతున్నారు. ఇది ముస్లిం మహిళలకు పెద్ద విజయంగా భావిస్తున్నారు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








