ఆపరేషన్ సిందూర్‌కి, విజయనగరం, హైదరాబాద్‌లలో ఎన్ఐఏ అరెస్ట్ చేసిన వ్యక్తులకు సంబంధం ఏంటి? పోలీసులు ఏం చెబుతున్నారు...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
భారీ పేలుడు పదార్థాలు కలిగి ఉండటంతోపాటు పేలుళ్లకు కుట్ర పన్నారనే అభియోగాలపై ఒక యువకుడిని, అతనికి సహకరించారనే ఆరోపణలపై మరో యువకుడిని విజయనగరం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
విజయనగరంలో సిరాజ్ ఉర్ రెహ్మాన్‌ను అరెస్టు చేయగా, హైదరాబాద్‌కు చెందిన సయీద్ సమీర్‌ను ఇక్కడే అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు.
‘‘ఆ ఇద్దరు యువకుల్ని అరెస్టు చేశాం’’ అని బీబీసీతో చెప్పారు విజయనగరం జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ మాధవరెడ్డి.
ఇదే విషయాన్ని మంగళవారం పవన్ కల్యాణ్ మీడియాకు చెప్పారు.
‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు’’ అని విజయనగరం అరెస్టు ఘటన గురించి వెల్లడించారు.
''మన నిఘా వ్యవస్థలు మరింత అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో ఉగ్రవాదుల జాడలు కనిపించడంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపీ డీజీపీని కోరాను" అని అన్నారాయన.
ఇప్పుడు ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అయితే, ఈ అరెస్టులపై ఇప్పటివరకు పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
అసలు ఏపీ, తెలంగాణ పోలీసులు చేసిన జాయింట్ ఆపరేషన్ ఏంటి ? ఇందులో ఏపీలోని విజయనగరం, ఇటు హైదరాబాద్‌లో పోలీసులు ఏం చేశారు ? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


ఫొటో సోర్స్, Getty Images
బీబీసీ సేకరించిన వివరాల ప్రకారం.. విజయనగరం పట్టణం రాజానగర్ వద్ద సిరాజ్ ఉర్ రెహ్మాన్‌ను మే 16న అరెస్టు చేశారు విజయనగరం టూటౌన్ పోలీసులు.
కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో స్థానిక పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి విజయనగరం కోర్టులో హాజరు పరిచారు.
‘‘అతని వద్ద నుంచి మోటారు సైకిల్, ఒక బ్యాగు స్వాధీనం చేసుకున్నాం’’ అని విజయనగరం టూటౌన్ పోలీసులు తెలిపారు.
ఒక ట్యాబ్, ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్, అల్యూమినియం పౌడర్, పొటాషియం నైట్రేట్ ప్యాకెట్, సల్ఫర్ పౌడర్, ట్వింకిల్ స్టార్ ప్యాకెట్, పీవీసీ గమ్, బ్లేడ్, హెచ్‌డీపీ పైపును సిరాజ్ దగ్గర్నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
''జిహాద్ కోసం హైదరాబాద్‌కు చెందిన సయీద్ సమీర్‌తో కలిసి భారీ పేలుళ్లు జరపాలని, తద్వారా భయం పుట్టించాలని అనుకున్నా'' అని విచారణలో సిరాజ్ చెప్పినట్లు విజయనగరం పోలీసులు చెప్పారు.
సిరాజ్ చెప్పిన వివరాలతో హైదరాబాద్‌లోని బోయిగూడకు చెందిన సయీద్ సమీర్‌ను మే 18న తెలంగాణ పోలీసుల సహకారంతో ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తొలుత సమీర్‌ను అరెస్టు చేసినప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నారు..? ఏం జరిగిందనే వివరాలు కుటుంబసభ్యులకు చెప్పకపోవడంతో, వారు ‘గుర్తు తెలియని వ్యక్తులు సమీర్‌ను తీసుకెళ్లారు’ అని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు వారికి సమాచారం ఇచ్చారు.
''ఈ ఆపరేషన్‌లో ఏపీ పోలీసులు భాగస్వామ్యం అయ్యారు. కేసును వారే పరిశోధిస్తున్నారు'' అని హైదరాబాద్‌కు చెందిన పోలీసు అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.
ఇద్దర్నీ విజయనగరం జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు వారికి ఈ నెల 30వరకు రిమాండ్ విధించింది.
''కోర్టులో విజయనగరం టూ టౌన్ పోలీసులు రిమాండ్ పిటిషన్ వేశారు. విచారణకు అప్పగించాలని కోరారు'' అని విజయనగరం ఇన్‌చార్జ్ ఎస్పీ మాధవరెడ్డి బీబీసీకి చెప్పారు.
ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది.
ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు, ఎన్ఐఏ అధికారులు విజయనగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. దీంతో స్టేషన్ వద్ద హడావుడి వాతావరణం కనిపించింది.
''ఎన్ఐఏ బృందం వచ్చింది. వాళ్ల పని వాళ్లు చేస్తున్నారు'' అని ఇన్‌చార్జ్ ఎస్పీ మాధవరెడ్డి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా తెలిసింది?
పహల్గాంలో తీవ్రవాదుల దాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనుమానాస్పద ఫోన్ కాల్స్, వ్యక్తుల కదలికలపై పోలీసులు దృష్టి పెట్టారు.
విజయనగరంలో టూటౌన్ పరిధిలో నివాసముంటున్న సిరాజ్ ఫోన్‌లో సిగ్నల్ యాప్‌లో గ్రూప్, ఆ గ్రూప్‌లోని సమాచారం, గ్రూప్‌లో సభ్యుల మధ్య సంభాషణలను పరిశీలించిన ఇంటెలిజెన్స్ టీమ్ వారి కదలికలపై దృష్టి పెట్టింది.
ఆ తర్వాత కొద్ధి రోజులకు సిగ్నల్ గ్రూపుకి అడ్మిన్‌గా ఉన్న సిరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిరాజ్‌ను విచారించిన తర్వాత హైదరాబాద్‌లో సమీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ గ్రూపులో కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మరికొందరు కూడా సభ్యులుగా ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.
వీరంతా సిగ్నల్ గ్రూపులో బాంబు ఎలా తయారు చేయాలి? బాంబు పేలితే ఎంతటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు ప్రయోగం ఎక్కడ చేయాలి? వంటి విషయాలను చర్చించినట్లు పోలీసులు గుర్తించారు.
సిరాజ్, సమీర్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు.
ఈ విషయంపై మాట్లాడేందుకు సిరాజ్, సమీర్ కుటుంబసభ్యుల కోసం బీబీసీ ప్రయత్నించగా..వారు అందుబాటులోకి రాలేదు.

ఎస్ఐ కావాలనుకుని, అరెస్టు అయ్యి..
కేసులో ఎ1గా ఉన్న సిరాజ్..గతంలో పోలీసు, గ్రూపు-2 ఉద్యోగాల కోసం ప్రయత్నించినట్లు తెలిసింది.
బీటెక్ పూర్తయ్యాక కొంతకాలంపాటు హైదరాబాద్‌లో ఉండి, ఎస్ఐ ఉద్యోగం కోసం శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత బాంబులు తయారీ, తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షితులైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
విజయనగరం, హైదరాబాద్‌లలో అరెస్ట్ చేసిన యువకులిద్దరిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, పేలుడు పదార్ధాల చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు విజయనగరం పోలీసులు.
బోయిగూడకు చెందిన సమీర్ వయసు 28 ఏళ్లని, వీరి కుటుంబం బోయిగూడ రైల్ కళారంగ్ బస్తీలో నివాసం ఉంటోందని చెప్పారు పోలీసులు.
తండ్రి చనిపోవడంతో తల్లి, సోదరితో కలిసి ఉంటున్న సమీర్, ఒక లిఫ్ట్ ఆపరేటర్ కంపెనీలో మెకానిక్‌గా పనిచేస్తున్నట్లు వారు తెలిపారు.
సిరాజ్, సమీర్ ఎప్పుడు కలిశారు ? ఎక్కడెక్కడికి వెళ్లారు అన్న విషయాలతోపాటు వారితో పాటు సిగ్నల్ గ్రూపులో ఉన్న సభ్యులు ఎవరు అన్నదానిపై విచారణ చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
ఎన్ఐఏ అధికారుల దర్యాప్తు
మంగళవారం విజయనగరంలో అరెస్టైన ఇద్దరు యువకుల్ని ఎన్ఐఏ విచారించింది. ఎన్ఐఏ బృందం టూటౌన్ పోలీసులు ఇప్పటికే సేకరించిన సమాచారాన్ని విశ్లేషిస్తూ ఇతర వివరాలను కూడా సేకరిస్తోంది.
వారికి ఆర్థిక సాయం ఎక్కడి నుంచి అందుతుందో నిర్థరించుకునేందుకు బ్యాంకు ఖాతాలను తనిఖీ చేస్తున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, JanaSena Party/facebook
అప్రమత్తత అవసరం: పవన్ కల్యాణ్
విజయనగరం, హైదరాబాద్‌లకు చెందిన ఈ యువకుల్ని అరెస్ట్ చేసేందుకు ఏపీ, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.
దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
"ఆపరేషన్ సిందూర్ తర్వాత ఏపీలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరం. ఈ క్రమంలో ఏపీ పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అనుమానాస్పద కదలికలపై అన్ని జిల్లాల అధికారులు నిఘా పెట్టాలి. ప్రజలు కూడా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే...ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి" అని పవన్ కల్యాణ్ చెప్పారు.
ప్రత్యేకంగా తీర ప్రాంత జిల్లాల పరిధిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.
‘‘దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల లక్ష్యాల్లో ఉన్నాయి. కోయంబత్తూరు, హైదరాబాద్ గోకుల్ చాట్‌లలో జరిగిన దాడులు చూశాం కదా. అందుకే సరిహద్దుల్లో భద్రతా సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉంటారో, రాష్ట్ర పోలీసులు కూడా అంతర్గత భద్రతపై అంతే సీరియస్ గా దృష్టి సారించాలి" అని పవన్ కల్యాణ్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














