ఇజ్రాయెల్ అండర్‌కవర్ ఆపరేషన్ తరువాత గాజాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు

ఫొటో సోర్స్, Getty Images
గాజా రగులుతోంది. ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ల మధ్య హింస తీవ్ర రూపం దాల్చింది. ఇజ్రాయెల్ చేపట్టిన అండర్‌కవర్ ఆపరేషన్‌లో ఏడుగురు మిలిటెంట్లు హతమైన తరువాత అక్కడ మళ్లీ కాల్పుల మోత తీవ్రమైంది.
మిలిటెంట్లు ఇజ్రాయెల్ వైపు 300 రాకెట్లు, మోర్టార్లు ప్రయోగించారు. ఈ దాడుల్లో ఒక బస్సు ధ్వంసమైంది.
ప్రతిగా ఇజ్రాయెల్ కూడా 70 దాడులు చేసింది. అయితే, హమాస్ తీవ్రవాదులు, ఇస్లామిక్ జిహాదిస్ట్ స్థావరాలు లక్ష్యంగా తమ దాడులు సాగాయని ఇజ్రాయెల్ చెబుతోంది.
ఈ దాడుల్లో మిలిటెంట్లుగా చెబుతున్న ఇద్దరు సహా ముగ్గురు పాలస్తీనియన్లు మృతిచెందారు.
కాగా హమాస్ తీవ్రవాదులు హద్దులు మీరారని, వారి రాకెట్ దాడులు, ఉగ్ర చర్యలను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ తన దాడులు కొనసాగించనుందని ఆ దేశానికి చెందిన మేజర్ జనరల్ కమిల్ అబూ రుకున్ ప్రకటించారు.
మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ భద్రతా విభాగాధిపతులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అందుకోసం తన ఫ్రాన్స్ పర్యటనను కుదించుకున్నారు.

ఫొటో సోర్స్, Reuters
తాజా ఉద్రిక్తతలు ఎలా మొదలయ్యాయి?
ఆదివారం ఇజ్రాయెల్, హమాస్ పరస్పర దాడుల్లో ఒక హమాస్ కమాండర్, ఇజ్రాయెల్ సైనికుడు మరణించారు.
వాహనంలో వచ్చిన ఇజ్రాయెల్ సైనికులు హమాస్ కమాండర్‌ను చంపేశారని పాలస్తీనా చెబుతోంది. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ సైనిక యూనిట్‌కు చెందినవారు కారులో వస్తుండగా హమాస్ మిలిటెంట్లు అడ్డుకున్నారు.
దీంతో ఇజ్రాయెల్ సైనికులు కాల్పుల వర్షం కురిపించారని హమాస్ మిలిటెంట్లు చెబుతున్నారు.
రెండు పక్షాల మధ్య కాల్పుల అనంతరం ఇజ్రాయెల్ ట్యాంకులు, గగనతల దాడులు చేయడంతో ఏడుగురు హమాస్ మిలిటెంట్లు మరణించారని వార్తా ఏజెన్సీలు వెల్లడించాయి.
మరోవైపు తమ స్పెషల్ యూనిట్ సభ్యుడు కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆత్మరక్షణ కోసమే తమవారు కాల్పులు జరిపారని చెప్పింది.
అయితే, సీక్రెట్ మిషన్‌గా చెబుతున్న ఈ ఆపరేషన్ గురించి ఇజ్రాయెల్ వివరాలు వెల్లడించడంలేదు. మిలిటెంట్లను చంపడం తమ ఉద్దేశం కాదని, ఇజ్రాయెల్ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యమని భద్రతాబలగాలు చెప్పాయి.

ఇజ్రాయెల్, హమాస్ మధ్య శత్రుత్వం ఎందుకు?
గాజా ఒకప్పుడు ఈజిప్టు ఆక్రమణలో ఉండేది. 1967 మధ్య ప్రాచ్య యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ గాజా దక్షిణ ప్రాంతాన్ని తన అధీనంలోకి తీసుకుంది. 2005లో ఇజ్రాయెల్ అక్కడి నుంచి తన బలగాలను ఉపసంహరించుకుంది.
అనంతరం ఆ ప్రాంతం పాలస్తీనా అధీనంలోకి వచ్చింది. మళ్లీ 2007 నుంచి 2014 వరకు ఇస్లామిస్ట్ తీవ్రవాద సంస్థ హమాస్ పాలనలోకి వెళ్లింది.
2006లో వారు పాలస్తీనా ఎన్నికల్లో విజయం సాధించారు, కానీ, ఫతా అనే మరో గ్రూపుతో విభేదాల కారణంగా పరిస్థితి హింసాత్మకంగా మారింది.
హమాస్ గాజాను తమ అధీనంలోకి తీసుకున్న తరువాత ఇజ్రాయెల్ ఆ ప్రాంతాన్ని దిగ్బంధించింది. గాజాకు సరకు రవాణా జరక్కుండా.. అక్కడికి ఎవరూ రాకపోకలు సాగించకుండా అదుపు చేసింది. మరోవైపు ఈజిప్టు కూడా గాజా దక్షిణ సరిహద్దును మూసివేసింది. దీంతో గాజాకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లయింది.
గాజాలోని హమాస్ తీవ్రవాదులను, వారు ప్రయోగించే రాకెట్ లాంఛర్లను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో 2014లో హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రమైంది.
అదే సమయంలో ఈజిప్టు 2014 అక్టోబరు నుంచి గాజాతో సరిహద్దును పూర్తిగా మూసేసింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సరిహద్దు నుంచి రాకపోకలకు అనుమతించింది.
ఐక్యరాజ్య సమితి మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం(ఓసీహెచ్ఏ) వివరాల ప్రకారం సరిహద్దు మూసేసినప్పటి నుంచి 2018 ఏప్రిల్ వరకు కేవలం 17 రోజులు మాత్రమే దాన్ని తెరిచారు. అదికూడా ఐరాస వద్ద నమోదైన 23 వేల మంది శరణార్దుల కోసం తెరిచారు.
ఇక ఉత్తరాన చూసుకుంటే ఎరెజ్ ప్రాంతంలోని ఇజ్రాయెల్ సరిహద్దు వద్ద 2017 కంటే ఈ ఏడాది కొంత సడలించారు. 2017 ప్రథమార్థంలో గాజా నుంచి సుమారు 240 మంది పాలస్తీనీయులు గాజాను వీడి ఇజ్రాయెల్ మీదుగా వలస వెళ్లిపోయారు. 2000 సంవత్సరం సెప్టెంబరులో రోజుకు సగటున 26 వేల మంది ఇలా వలస వెళ్లారు.
ఇజ్రాయెల్ హమాస్ మధ్య మొత్తం మూడుసార్లు యుద్ధం జరిగింది. గాజా వైపు నుంచి హమాస్ రాకెట్ దాడులు.. వారిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఇక్కడ నిత్యకృత్యం.
ఇటీవల కాలంలో ఉద్రిక్తతలు పెరిగాక ఈజిప్ట్, ఐరాసల మధ్యవర్తిత్వంతో రెండు పక్షాల మధ్య కొంత సయోధ్యకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఆదివారం నుంచి పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి.
ఇవి కూడా చదవండి:
- కేరళ వరదలు: ఫేక్‌న్యూస్ ప్రవాహం
- ‘ఫేక్‌న్యూస్ మూలాలు మహాభారతంలోనూ ఉన్నాయి’ - మాడభూషి శ్రీధరాచార్యులు
- వాట్సాప్: రేపటిలోగా బ్యాకప్ చేయకపోతే... మీ పాత బ్యాకప్ ప్యాకప్పే
- మిషెల్ ఒబామా: నా పిల్లలిద్దరూ ఐవీఎఫ్ ద్వారా జన్మించారు
- ఖషోగ్జీ హత్య కేసు: సౌదీ అరేబియా, అమెరికాలకు టేపులు ఇచ్చిన టర్కీ
- తెలంగాణ ఎన్నికలు : ఏ ఎమ్మెల్యేపై ఎన్ని కేసులు?
- పాము కాటేశాక ఏమవుతుంది? శాస్త్రవేత్త స్వీయ మరణగాథ
- ‘‘ఎక్స్పోజింగ్’తో సమస్యలు రావద్దనే.. ఊర్లో మహిళలు నైటీ ధరిస్తే.. రూ. 2,000 జరిమానా’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









