ఐపీఎల్ 2019: సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే-ఆఫ్‌కు చేరేదెలా...

సిమ్రన్ హెట్మయర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సిమ్రన్ హెట్మయర్
    • రచయిత, ఆదేశ్ కుమార్ గుప్తా
    • హోదా, బీబీసీ కోసం

శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచుల్లో దిల్లీ కేపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు విజయం సాధించాయి.

రాజస్థాన్ రాయల్స్, దిల్లీ కేపిటల్స్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో దిల్లీ జట్టు ఐదు వికెట్లతో గెలిచింది. ఈ పరాజయంతో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది.

మరో మ్యాచ్‌లో బెంగళూరు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

బెంగళూరు చేతిలో ఓడినా కూడా హైదరాబాద్ జట్టుకు ప్లేఆఫ్ చేరేందుకు ఇంకా అవకాశం ఉంది. కానీ, అది ఆ జట్టు ప్రదర్శన ఆధారంగా కాదు. వేరే జట్ల గెలుపోటములపై ఆధారపడి ఉంది. అయితే, బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచినప్పటికీ ఇప్పటికే అది ప్లేఆఫ్‌ రేసు నుంచి తప్పుకుంది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ టీమ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. 176 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు జట్టు షిమ్రన్ హెట్మయర్ 75, గుర్‌కీరత్ సింగ్ మాన్ 65 పరుగులతో రాణించడంతో 19.2 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి విజయం సాధించింది.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విరాట్ కోహ్లీ

మరోసారి విఫలమైన కోహ్లీ

20 పరుగులకే కీలకమైన వికెట్ కీపర్ పార్ధివ్ పటేల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దశలో సిమ్రన్ హెట్మయర్, గుర్‌కీరత్ సింగ్ మాన్‌ల జోడీ జట్టును ఆదుకుంది. పార్ధివ్ కనీసం ఖాతా కూడా తెరవలేదు. కోహ్లీ కేవలం 16 పరుగులే చేశాడు. డివిలియర్స్ ఒక్కపరుగుకే అవుటయ్యాడు. ఈ దశలో సిమ్రన్, గుర్‌కీరత్‌ల జోడీ వికెట్లు పడకుండా కాపాడుకుంటూ నాలుగో వికెట్‌కు 144 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఈ జోడీయే హైదరాబాద్ విజయాన్ని అడ్డుకుంది.

విజయానికి చేరువవుతున్న దశలో బెంగళూరు జట్టుకు మరో షాక్ తగిలింది. స్కోరు 164 పరుగుల వద్ద షిమ్రన్ అవుటయ్యాడు. మరో మూడు పరుగులకే ఐదో వికెట్ పడింది. 168కి ఆరో వికెట్. హైదరాబాద్ టీమ్ కోరుకున్నది, ఎదురుచూసేది ఇలాంటి మలుపు కోసమే. కానీ, ఈ ఆనందం సన్‌రైజర్స్‌కు ఎక్కువసేపు నిలవలేదు. ఆ దశలో క్రీజులోకొచ్చిన ఉమేశ్ యాదవ్ రెండు ఫోర్లతో లాంఛనాన్ని ముగించాడు.

హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ 43 బంతుల్లో 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో ఐదు ఫోర్లు, నాలుగు సిక్స్‌లున్నాయి. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 20, మార్టిన్ గప్తిల్ 30 పరుగులు జోడించారు. మూడు సిక్స్‌ల సాయంతో విజయ్ శంకర్ 27 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ పెద్దగా పరుగులు చేయలేదు. బెంగళూరు జట్టు బౌలర్ వాషింగ్టన్ సుందర్ 24 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా, నవ్‌దీప్ సైని 39 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

కేన్ విలియమ్సన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేన్ విలియమ్సన్

ఆసక్తికరంగా మారిన ప్లేఆఫ్ రేసు

ప్రస్తుతం హైదరాబాద్ జట్టు ఖాతాలో 12 పాయింట్లున్నాయి. 14 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌కు మందు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆదివారం నాడు జరగాల్సి ఉంది.

మొదటి మ్యాచ్‌ పంజాబ్, చెన్నై జట్ల మధ్య మొహాలీలో జరుగుతుంది. రెండోది వాంఖెడే స్టేడియంలో ముంబయి, కోల్‌కతా జట్ల మధ్య జరుగుతుంది.

చెన్నై, ముంబయి జట్లు ఇప్పటికే ప్లేఆఫ్‌కు చేరాయి.

కోల్‌కతా ఖాతాలో ప్రస్తుతం 12 పాయింట్లున్నాయి. ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఈ జట్టు నెగ్గితే 14 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓడితే, కోల్‌కతా-హైదరాబాద్ జట్లలో మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు ప్లేఆఫ్‌లో ప్రవేశిస్తుంది.

మరో మ్యాచ్‌లో చెన్నై ఓడి, పంజాబ్ జట్టు గెలిస్తే ఆ జట్టు పాయింట్లు 12కు చేరతాయి. కానీ రన్‌రేట్ ఆధారంగా హైదరాబాద్‌ ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. పంజాబ్ ఐపీఎల్‌ నుంచి నిష్క్రమిస్తుంది. ఒకవేళ చెన్నై గెలిచినా గానీ హైదరాబాద్ భవితవ్యం కోల్‌కతా-ముంబయి మ్యాచ్‌పైనే ఆధారపడి ఉంది. ఆ మ్యాచ్‌లో కోల్‌కతా ఓడితేనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అవకాశం ఉంటుంది.

నవ్‌దీప్ సైని

ఫొటో సోర్స్, Adesh gupta

ఫొటో క్యాప్షన్, నవ్‌దీప్ సైని

శనివారం నాడు ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో దిల్లీ కేపిటల్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ రిషబ్ పంత్ 38 బంతుల్లో 53 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో 16.1 ఓవర్లలోనే విజయం సాధించింది. రిషబ్ రెండు ఫోర్లు, ఐదు సిక్స్‌లు బాదాడు.

రియాన్ పరాగ్

ఫొటో సోర్స్, Rajasthan royalas TWITTER

ఫొటో క్యాప్షన్, రియాన్ పరాగ్

అంతకు ముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. దిల్లీ బౌలర్ల ముందు రియాన్ పరాగ్ తప్ప ఎవరూ నిలవలేకపోయారు. పరాగ్ 50 పరుగులు చేసి అవుటయ్యాడు. లియామ్ లివింగ్‌స్టన్ 14, శ్రేయాస్ గోపాల్ 12, కెప్టెన్ అజింక్య రహానె 5, సంజు శాంసన్ 5 పరుగులకే పెవిలియన్ చేరారు.

అమిత్ మిశ్రా

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, అమిత్ మిశ్రా

దిల్లీ బౌలర్ ఇషాంత్ శర్మ 38 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. అమిత్ మిశ్రా 17 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

దిల్లీ కేపిటల్స్ ఈ మ్యాచ్ కన్నా ముందే ప్లేఆఫ్‌లో బెర్తు ఖాయం చేసుకుంది. ఇప్పుడు ఆ జట్టు ఖాతాలో 18 పాయింట్లున్నాయి. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం చెన్నై జట్టు రన్‌రేట్ ఆధారంగా మొదటి స్థానంలో ఉంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)