కేరళ వరదలు: ఈ పెను విపత్తుకు కారణాలేమిటి?

వీడియో క్యాప్షన్, కేరళ వరదలు: బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్‌ను ఈ వీడియోలో చూడొచ్చు
    • రచయిత, నవీన్ సింగ్ ఖాడ్కా
    • హోదా, పర్యావరణ ప్రతినిధి, బీబీసీ వరల్డ్ సర్వీస్

కేరళలో విధ్వంసం సృష్టించిన వరదలు రావటానికి నెల రోజుల ముందు.. ప్రభుత్వ నివేదిక ఒకటి వచ్చింది. దక్షిణ భారతదేశంలో జలవనరుల నిర్వహణలో కేరళ పరిస్థితి మిగతా రాష్ట్రాలకన్నా చాలా దారుణంగా ఉందని ఆ నివేదిక హెచ్చరించింది.

హిమాలయాల పరిధిలోకి రాని రాష్ట్రాల్లో కేరళకు 42 మార్కులతో 12వ స్థానం ఇచ్చింది. ఆ జాబితాలో గుజరాత్ (79 మార్కులు), మధ్యప్రదేశ్ (69 మార్కులు), ఆంధ్రప్రదేశ్ (68 మార్కులు) అగ్రస్థానంలో ఉన్నాయి.

హిమాలయేతర రాష్ట్రాల్లో కేరళకన్నా తక్కువ ర్యాంకులో కేవలం నాలుగు రాష్ట్రాలే ఉన్నాయి. ఈశాన్య, హిమాలయ రాష్ట్రాల్లో కూడా మరో నాలుగిటికి కేరళ కన్నా తక్కువ మార్కులు లభించాయి. ఆ నివేదిక వచ్చిన నెల రోజులకే అది గుర్తించిన విషయాలను కేరళ వరదలు నిర్ధారించినట్లు కనిపిస్తోంది.

అధికారులు రాష్ట్రంలోని 30 ఆనకట్టల నుంచి నీటిని సకాలంలో, క్రమ పద్ధతిలో విడుదల చేసి ఉన్నట్లయితే కేరళలో వరదల ఇంత తీవ్రస్థాయిలో ఉండేవి కావని అధికారులు, నిపుణులు అంటున్నారు. గత వారం వరదలు తారాస్థాయికి చేరినపుడు రాష్ట్రంలోని 80 పైగా డ్యాముల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. కేరళలో 41 నదులు ప్రవహిస్తున్నాయి.

కేరళ

ఫొటో సోర్స్, Getty Images

కేరళలో ఒకవైపు రాష్ట్రమంతటా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు ముంచుకొస్తున్న సమయంలోనే.. ప్రధాన జలాశయాలైన ఇడుక్కి, ఇదమలయార్ వంటి ఆనకట్టల నుంచి నీరు విడుదల చేయటం.. ఆ వరదలు విషమించటానికి కారణమవుతున్నాయన్నది స్పష్టం’’ అని జలవనరుల నిపుణుడు హిమాంశు ఠక్కర్ పేర్కొన్నారు. ఆయన ‘సౌత్ ఏసియా నెట్‌వర్క్ ఆన్ డ్యామ్స్ రివర్స్ అండ్ పీపుల్’ సంస్థలో పనిచేస్తున్నారు.

‘‘ఆనకట్టల నిర్వాహకులు.. జలాశయాలు నిండి ఇక నీటిని విడుదల చేయక తప్పని పరిస్థితి వచ్చే వరకూ వేచి ఉండకుండా.. ముందుగానే నీటిని క్రమ పద్ధతిలో విడుదల చేసి ఉన్నట్లయితే ఇంత దారుణమైన పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘కేరళను వరదలు ముంచెత్తటానికి ముందే జలాశయాల నుంచి నీటిని విడుదల చేయటానికి తగినంత సమయం ఉందని.. అప్పుడు వర్షాలు తక్కువగా ఉన్నాయనే విషయం కూడా తేటతెల్లమవుతోంది’’ అని చెప్పారు.

వరదల విషయంలో అత్యంత బలహీనంగా ఉన్న పది రాష్ట్రాల్లో కేరళ కూడా ఒకటి అని కేంద్ర హోంశాఖ ఈ ఏడాది ఆరంభంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో గుర్తించింది. అయినా కూడా.. జాతీయ విపత్తు నిర్వహణ విధానానికి అనుగుణంగా విపత్తు ప్రమాదాన్ని తగ్గించటానికి కేరళ చేపట్టిన చర్యలేవీ లేవు.

కేరళ

ఫొటో సోర్స్, AFP

డ్యాముల నిర్వహణలో అసమర్థంగా వ్యవహరించటం, విపత్తు ముప్పులను తగ్గించే దిశగా తగిన చర్యలు చేపట్టకపోవటం వంటి విషయాల్లో కేరళ అధికారులపై విమర్శలు వస్తుండగా.. కేంద్ర ప్రభుత్వ లోపాలనూ వేలెత్తి చూపుతున్నారు.

వరద ముప్పుపై ముందస్తు హెచ్చరికలు చేసే అధికారమున్న ఏకైక ప్రభుత్వ సంస్థ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి కేరళకు ముందస్తు హెచ్చరికలేవీ అందవని నిపుణులు అంటున్నారు.

‘‘ఈ అనూహ్య వరదలు, జలాశయాల నుంచి నీటి విడుదల ఉదంతం.. వరదలను ముందుగా పసిగట్టి హెచ్చరించటం, ముందస్తు చర్యలు చేపట్టే అంశాలపైనా ప్రశ్నలు లేవనెత్తుతోంది’’ అని ఠక్కర్ వ్యాఖ్యానించారు.

‘‘వరదల గురించి ముందుగా కేంద్ర జల సంఘం అంచనావేసి హెచ్చరించే వ్యవస్థలు.. వరద స్థాయి అంచనా కానీ, ఇన్‌ఫ్లో అంచనా కానీ దేనిగురించీ హెచ్చరించే వ్యవస్థ లేకపోవటం దిగ్ర్భాంతి కలిగిస్తోంది. దానికి కేరళలో వరద పరిశీలన వ్యవస్థలు మాత్రమే ఉన్నాయి. ఇడుక్కి, ఇదమలయార్ వంటి కొన్ని కీలక జలాశయాలను, కొన్ని కీలక ప్రాంతాలను సీడబ్ల్యూసీ ముందస్తు అంచనా వ్యవస్థలో చేర్చాలి’’ అని ఆయన పేర్కొన్నారు.

కేరళ వరదలు

ఫొటో సోర్స్, EPA

వరద నిరోధక చర్యల్లో కేరళ చాలా వెనుకబడినప్పటికీ.. ఈసారి రాష్ట్రంలో రుతుపవనాల్లో వర్షపాతం అనూహ్యంగా అసాధారణ స్థాయిలో ఉంది.

రాష్ట్రంలో కేవలం రెండున్నర నెలల్లో 37 శాతం అధిక వర్షపాతం నమోదైంది. గతంలో మొత్తం రుతుపవనాల కాలమైన నాలుగు నెలల్లో ఇలా జరిగింది.

ఇంత తక్కువ వ్యవధిలో అంత భారీ వర్షపాతం.. కొండచరియలు విరిగిపడటానికి కారణమైంది. దానివల్ల రాష్ట్రంలో చాలా మంది చనిపోయారు. అడవుల నరికివేత దీనికి కారణమని పర్యావరణవాదులు తప్పుపడుతున్నారు.

ఇలా తక్కువ సమయంలో భారీ వర్షపాతం వల్ల కొండచరియలు విరిగిపడిన ఉదంతాలు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రత్యేకించి అడవులు నరికివేసిన ప్రాంతాల్లోనూ గతంలో సంభవించాయి.

కేరళ వరదలు

ఫొటో సోర్స్, Getty Images

ఆ ప్రాంతాల్లో కొన్ని వరదనీటిలో మునిగిపోయాయి కూడా. వరదలను నిరోధించే సహజ రక్షణ వ్యవస్థలైన చిత్తడి నేలలు, సరస్సులు.. విస్తరిస్తున్న పట్టణీకరణ, మౌలిక వసతుల నిర్మాణం వల్ల అదృశ్యమవుతుండటం దీనికి కారణం. 2015లో చెన్నైలో ఇదే జరిగింది.

అయితే.. ఈసారి కేరళలో వరదలు సృష్టించిన విలయం.. ఈ విపత్తుకు మరో కోణాన్ని చేర్చిందని నిపుణులు అంటున్నారు. అది.. జలాశయాల వల్ల ప్రమాదాలు.

డ్యాములను సక్రమంగా నిర్వహించకపోతే.. వాతావరణ మార్పులపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు ముందుగానే చెప్పినట్లు.. వర్షాలు ఇలా అనూహ్యంగా కురవటం కొనసాగితే.. ఈ విపత్తులు వందేళ్లకోసారి వచ్చే విపత్తుగానే మిగిలిపోకపోవచ్చు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)