కేరళ వరదలు: రూ. 20 వేల కోట్లు నష్టం

ఫొటో సోర్స్, Getty Images
వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కేరళలో ఆదివారం దాదాపు 22,000 మందిని రక్షించినట్టు అధికారులు వెల్లడించారు.
వరదల్లో చిక్కుకున్న కొన్ని ప్రాంతాలకు మిలిటరీ బృందాలతో పాటు, విపత్తు నిర్వహణ దళాలు, స్థానిక జాలర్లు చేరుకున్నారు.
హెలికాప్టర్లతో ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నారు.
ప్రస్తుతం 5,645 సహాయక కేంద్రాల్లో 7,25,000 మంది ఆశ్రయం పొందుతున్నారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. వరదల్లో చిక్కుకున్న ప్రతి వ్యక్తినీ రక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు.. గాలి, నీళ్ల ద్వారా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం అప్రమత్తమవుతోంది.
ఇప్పటికే అలువా క్యాంపులో ఉంటున్న ముగ్గురికి తట్టు వ్యాధి (అమ్మవారు) సోకడంతో వారిని వేరుగా ఉంచి వైద్యం అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

జూన్‌లో వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కేరళలో 350 మందికి పైగా చనిపోయారు.
దాదాపు 5,000 మంది చిక్కుకున్నట్టుగా భావిస్తున్న చెంగన్నూర్ పట్టణంతో పాటు, ఎర్నాకుళం జిల్లాలో ఆదివారం ప్రత్యేక దృష్టి పెట్టి సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
చెంగన్నూర్‌లో చిక్కుకుపోయిన తన ప్రజలను కాపాడాలంటూ అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే సాజి చెరియన్ ఓ టీవీ చానల్లో వేడుకున్నారు.
"దయచేసి మాకు హెలికాప్టర్ పంపండి. మిమ్మల్ని అడుక్కుంటున్నా. దయచేసి సాయం చేయండి, లేదంటే మా ప్రజలు చనిపోతారు. దయచేసి మాకు సాయం చేయండి. వారిని హెలికాప్టర్లలో తరలించడం తప్ప మరోదారి లేదు" అంటూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్న కొందరు, వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వెనక్కి వెళ్లి తమ ఇళ్లలో ఏం మిగిలింది? అని చూసుకుంటున్నారు.
"మా ఇళ్లు మొత్తం బురద పేరుకుపోయింది. అది శుభ్రం చేసి, మనుషులు నివాసం ఉండేట్లుగా మార్చాలంటే కొన్ని రోజులు పడుతుంది" అని కోచిలోని చెరనెల్లూరు ప్రాంతానికి చెందిన టీజీ జానీ తెలిపారు.
కొన్ని రోజులపాటు తాము ఆహారం, నీళ్లు లేకుండానే గడిపామని సహాయక కేంద్రాల్లో ఉంటున్న కొందరు చెప్పారు. "అక్కడ కరెంటు లేదు. తిండి లేదు, నీళ్లు లేవు. మా జీవితంలో అత్యంత భయంకరమైన ఘడియలు అవి" అని వరదల ప్రభావం తీవ్రంగా ఉన్న త్రిస్సూర్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల ఇందర్‌జీత్ కుమార్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు.

శనివారం రాష్ట్రంలో ఏరియల్ సర్వే నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ, తక్షణ సాయంగా కేరళకు రూ. 500 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ప్రాథమిక అంచనా మేరకు ఈ వరద విపత్తు వల్ల కేరళకు రూ.20,000 కోట్ల దాకా నష్టం వాటిల్లిందని అసోచాం తెలిపింది. అది ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








