జీ7 సదస్సు: భారత్‌ను ట్రంప్ ఎందుకు ఆహ్వానించారు? ఈ గ్రూప్‌లో చైనా ఎందుకు లేదు?

ఫొటో సోర్స్, Reuters
జీ-7 దేశాల సదస్సును వాయిదా వేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ శనివారం వెల్లడించారు.
ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జూన్ మొదటివారంలో జరగాల్సి ఉంది.
అయితే, భారత్‌తోపాటు రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలనూ ఈ సమావేశానికి ఆహ్వానిస్తామని ట్రంప్ చెప్పారు.
"నేటి ప్రపంచ వ్యవహారాలకు జీ-7 సమర్థంగా ప్రాతినిధ్యం వహిస్తోందని నేను అనుకోవడం లేదు. ఈ గ్రూప్ పాతబడింది" అని ఎయిర్‌ఫోర్స్ వన్‌లో రిపోర్టర్లతో ట్రంప్ చెప్పారు.
"తదుపరి సమావేశం సెప్టెంబరులో కానీ లేదా ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ సమావేశాలు పూర్తైన తర్వాత కానీ ఉండొచ్చు. లేదా అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు పూర్తైన తర్వాతైనా నిర్వహించొచ్చు" అని ఆయన తెలిపారు.
అమెరికాలో ఎన్నికలు నవంబరులో జరగనున్నాయి. మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించేందుకు ట్రంప్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.
జీ-7 దేశాల సదస్సును జీ-10 లేదా జీ-11 సదస్సుగా ఆయన అభివర్ణిస్తున్నారు.
ఈ విషయంపై రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, భారత్‌లతో ఆయన చర్చించారు.
ఇదివరకటి షెడ్యూల్ ప్రకారం.. జూన్‌లో జరిగే ఈ సదస్సు కోసం ట్రంప్.. మెరీల్యాండ్‌లోని క్యాంప్ డేవిడ్‌కు వెళ్లాలి. మిగతా నాయకులు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సదస్సుకు హాజరయ్యేవారు.
అయితే గతవారం, శ్వేతసౌధంలో ఈ సదస్సు నిర్వహిస్తామని, అందరి నాయకులూ ఇక్కడకు రావాలని ఆహ్వానం పంపుతామని చెప్పి ట్రంప్ అందరనీ ఆశ్చర్యానికి గురిచేశారు.

ఫొటో సోర్స్, PRAKASH SINGH/AFP via Getty Images
జర్మనీ తిరస్కారం
అయితే, అమెరికాకు వెళ్లేందుకు జర్మనీ ఛాన్స్‌లర్ ఏంగెలా మెర్కెల్ విముఖత వ్యక్తంచేశారు. ఇలా తిరస్కరించిన జీ-7 దేశాల తొలి నాయకురాలు మెర్కెలే.
"కరోనావైరస్ చెలరేగుతున్న ఈ సమయంలో ఆమె వాషింగ్టన్‌కు వెళ్లడం సాధ్యంకాదు. అయితే తనను ఆహ్వానించినందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు"అని జర్మనీ ఛాన్స్‌లర్ అధికార ప్రతినిధి స్టీఫెన్ సీబర్ట్ వివరించారు.
అంతా సవ్యంగా ఉంటే.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్.. అమెరికా వెళ్లే అవకాశముందని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు.
అందరూ హాజరయ్యేందుకు వీలుండేలా త్వరలో జీ-7 సదస్సును నిర్వహించనున్నట్లు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ శుక్రవారం వెల్లడించారు.
జీ-7 అంటే ఏమిటి?
ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఏడు పెద్ద దేశాల కూటమి జీ-7. దీనిలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా సభ్య దేశాలుగా ఉన్నాయి. దీన్నే గ్రూప్ ఆఫ్ సెవెన్ అని కూడా అంటారు.
ఈ బృందం తనని తాను ఒక 'విలువలతో కూడిన సమాజం'గా పరిగణిస్తుంది. స్వాతంత్ర్యం, మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, చట్ట పాలన, సుసంపన్నత, సుస్థిర అభివృద్ధి దీని ప్రధాన సూత్రాలు.
ఇది ఏం చేస్తుంది?
మొదట 1975లో నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి సాధ్యమైన పరిష్కారాల గురించి చర్చించటానికి ఆరు దేశాల బృందం సమావేశమైంది. ఆ మరుసటి ఏడాది ఈ బృందంలో కెనడా కూడా చేరింది. ఈ జీ7 దేశాల మంత్రులు, అధికారులు.. ఉమ్మడి ప్రయోజనాల అంశాలపై చర్చించటానికి ఏడాది పొడవునా సమావేశమవుతుంటారు.

ప్రతి సభ్య దేశమూ.. ఒక్కో ఏడాది జీ7 అధ్యక్ష బాధ్యతను చేపడుతుంది. ఆ దేశమే ఆ సంవత్సరానికి కీలకమైన రెండు రోజుల శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తుంది. ఇంధన విధానం, వాతావరణ మార్పు, హెచ్ఐవీ-ఎయిడ్స్, ప్రపంచ భద్రత వంటివి గత శిఖరాగ్ర సదస్సుల్లో చర్చించిన కొన్ని అంశాలు.
వార్షిక శిఖరాగ్ర సదస్సు ముగిసిన అనంతరం.. సభ్యదేశాలు ఆమోదించిన అంశాలను వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేస్తుంది. ఈ సదస్సుకు హాజరయ్యే వారిలో జీ7 దేశాల ప్రభుత్వాధినేతలతో పాటు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు కూడా ఉంటారు.
అయితే.. జీ7 శిఖరాగ్ర సదస్సు జరిగిన ప్రతిసారీ.. అనేక సంస్థల నుంచి భారీ సంఖ్యలో నిరసనకారులు తమ నిరసనను వ్యక్తంచేస్తుంటారు. పర్యావరణ కార్యకర్తలు మొదలుకుని పెట్టుబడిదారుల వ్యతిరేకుల వరకూ విభిన్న సంస్థలు ఈ ఆందోళనలను నిర్వహిస్తుంటాయి. ఈ ఆందోళనకారులను సదస్సు జరిగే వేదికకు చాలా దూరంలోనే భారీ భద్రతా ఏర్పాట్లతో నిలువరిస్తుంటారు.
ఈ జీ7 ప్రభావం చూపగలదా?
ఈ కూటమి ఎప్పుడూ సరిగ్గా పనిచేయలేదని విమర్శలు వస్తుంటాయి. తాము చాలా విజయాలు సాధించామని జీ-7 చెబుతోంది. ఎయిడ్స్, టీబీ, మలేరియాలపై పోరాటానికి ప్రపంచ నిధిని తామే ప్రవేశపెట్టామని వివరిస్తోంది. అంతేకాదు 2002 నుంచి 2.7 కోట్ల మంది ప్రాణాలు కాపాడామని వివరిస్తోంది.
అలాగే 2016 నాటి పారిస్ వాతావరణ ఒప్పందం అమలు వెనుక గల చోదకశక్తి కూడా తానేనని చెప్తుంది. ఆ ఒప్పందం నుంచి తాను వైదొలగుతున్నట్లు అమెరికా నోటీస్ ఇవ్వటం వేరే విషయం.
ఈ బృందంలో చైనా ఎందుకు లేదు?
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగివుండటంతో పాటు రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా కూడా ఉన్న చైనాలో.. జనాభా తలసరి సంపద మిగతా అభివృద్ధి చెందిన దేశాలకన్నా తక్కువ స్థాయిలో ఉండటం వల్ల.. జీ7 దేశాల తరహాలో ఆర్థికంగా అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా దానిని పరిగణించటం లేదు.
అయితే.. మరింత విస్తృతమైన జీ20 దేశాల బృందంలో చైనా కూడా ఉంది.

ఫొటో సోర్స్, AFP
రష్యా దీనిలో ఎప్పుడైనా ఉండేదా?
నిజానికి 1998లో రష్యా కూడా ఈ బృందంలో చేరింది. అప్పుడది జీ8 బృందంగా మారింది. కానీ.. ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియాను రష్యా తన భూభాగంలో కలుపుకోవటంతో 2014లో ఈ బృందం నుంచి ఆ దేశానికి ఉద్వాసన పలికారు. దీంతో ఈ బృందం మళ్లీ జీ7గా మారింది.
అయితే.. ఈ బృందంలో రష్యాను మళ్లీ చేర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విశ్వసిస్తున్నారు. ''మన చర్చల్లో రష్యా కూడా ఉండాలి'' అని ఆయన పేర్కొన్నారు.
జీ7 ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి?
ఈ జీ7 బృందంలో అంతర్గతంగా చాలా విభేదాలున్నాయి.
గత ఏడాది కెనడాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.. దిగుమతులపై పన్నులు, వాతావరణ మార్పు విషయంలో చేపట్టాల్సిన చర్యల విషయంలో మిగతా సభ్య దేశాలతో తలపడ్డారు.
అలాగే.. ప్రస్తుత ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక పరిస్థితులను ఈ బృందం ప్రతిఫలించటం లేదన్న విమర్శలూ ఉన్నాయి.
ఈ బృందంలో ఆఫ్రికా నుంచి, లాటిన్ అమెరికా నుంచి.. దక్షిణార్థ గోళం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాలేవీ లేవు.
ఆ దేశాలు జీ20లో సభ్యులుగా ఉన్నా.. జీ7లో చోటు లేని ఇండియా, బ్రెజిల్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థల నుంచి కూడా ఈ బృందానికి సవాళ్లు ఎదురవుతున్నాయి.
ఇటువంటి దేశాల్లో కొన్ని 2050 నాటికి.. జీ7 బృందంలోని కొన్ని దేశాలకు స్థానభ్రంశం కలిగిస్తాయని కొందరు అంతర్జాతీయ ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- గృహ హింస: ‘లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- వరంగల్ హత్యలు: ‘‘ఒక మహిళను చంపేసి.. అది బయటపడుతుందని మరో 9 మందిని చంపేశాడు’’
- రెండు ఖండాల్లో, 28 మారు పేర్లతో 26 సంవత్సరాలుగా తప్పించుకు తిరిగాడు.. చివరికి ఎలా దొరికిపోయాడంటే
- పాకిస్తాన్: 'పది అడుగుల ఎత్తు నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాను...' - కరాచీ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ జుబైర్
- తెలంగాణ: ‘రెండేళ్ల కిందట తప్పిపోయి, 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నను టిక్‌టాక్ చూపించింది’
- అమెరికా డాలర్ కనుమరుగవుతుందా? చైనా డిజిటల్ యువాన్ రాజ్యం చేస్తుందా?
- సంక్షేమానికి, వివాదాలకూ రారాజు జగన్
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నరేంద్ర మోదీ వారసుడు అమిత్ షాయేనా?
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుదాడుల నుంచి బతికి బయటపడ్డ మొసలి ఇప్పుడు మృతి
- జాక్ మా: కరోనావైరస్ను కట్టడి చేయాలని, చైనా ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్న మహా కోటీశ్వరుడు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








