'ఆ సమయం వచ్చింది..' క్రికెట్‌కు శిఖర్ ధావన్ గుడ్‌బై

శిఖర్ ధావన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శిఖర్ ధావన్

టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు.

సోషల్ మీడియాలో భావోద్వేగ వీడియోను పోస్టు చేసిన ఈ ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్, అన్ని ఫార్మాట్లకూ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు చెప్పారు.

ధావన్ చివరిసారిగా 2022లో వన్డే సిరీస్ ఆడారు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ వంటి యువ బ్యాట్స్‌మెన్‌లు దూసుకురావడంతో జట్టులో చోటు కోల్పోయారు.

టీమిండియా తరఫున ధావన్ 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడారు. 50 ఓవర్ల వన్డే మ్యాచ్‌లలో ఇప్పటివరకూ 44.11 సగటుతో 6,793 పరుగులు చేశారు.

టెస్టుల్లో 40.61 సగటుతో 2,315 పరుగులు చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు

సమయం వచ్చిందన్న ధావన్

సోషల్ మీడియాలో భావోద్వేగపూరిత వీడియో పోస్ట్ చేసిన ధావన్, క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు చెప్పారు.

ఈ వీడియోలో, "ఆ సమయం వచ్చింది.. ఈ రోజు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, చాలా జ్ఞాపకాలున్నాయి. భవిష్యత్తును చూస్తే, తర్వాత జీవితం కనిపిస్తోంది. నాకు ఇండియా తరఫున ఆడాలన్న ఒకే ఒక్క లక్ష్యం ఉండేది, అది నెరవేరింది. అందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.'' అని చెప్పారు.

శిఖర్ ధావన్

ఫొటో సోర్స్, TWITTER

ఫొటో క్యాప్షన్, నా దేశం కోసం ఆడాననే సంతృప్తి మిగిలిందన్న శిఖర్ ధావన్

"మొదట నా కుటుంబం. నా చిన్నప్పటి కోచ్‌లు తారక్ సిన్హా , మదన్ శర్మ , వాళ్ల దగ్గరే నేను క్రికెట్ నేర్చుకున్నా. ఆ తర్వాత ఏళ్ల తరబడి కలిసి ఆడిన నా టీం. నాకొక ఫ్యామిలీ దొరికింది. పేరొచ్చింది, మీ అందరి ప్రేమాభిమానాలు దక్కాయి.''

''ఎవరో చెప్పినట్టు, కథ ముందుకు వెళ్లాలంటే పేజీలు తిప్పక తప్పదు. నేను కూడా అదే చేయబోతున్నా. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా'' అన్నారాయన.

ఇంకా మాట్లాడుతూ, ''నా క్రికెట్ ప్రయాణానికి వీడ్కోలు చెబుతున్న ఈ సమయంలో, నాకు నా దేశం కోసం ఆడాననే సంతృప్తి ఉంది. నాకు అవకాశం కల్పించిన బీసీసీఐ, డీడీసీఏతో పాటు నాపై ప్రేమాభినాలు చూపించిన అభిమానులు, అందరికీ నా కృతజ్ఞతలు.

‘‘నాకు నేను చెప్పుకుంటున్నా, బ్రదర్ నువ్వు మళ్లీ దేశం కోసం ఆడలేవని బాధపడకు, దేశం కోసం ఆడిన ఆ ఆనంద క్షణాలను గుర్తుంచుకో అని. నాకు నేను చెప్పుకునే అతిపెద్ద విషయం కూడా ఇదే'' అన్నారు.

శిఖర్ ధావన్

ఫొటో సోర్స్, TWITTER

ఫొటో క్యాప్షన్, హ్యాపీ రిటైర్మెంట్ గబ్బర్ అంటూ పంజాబ్ కింగ్స్ శుభాకాంక్షలు తెలిపింది.

'హ్యాపీ రిటైర్మెంట్ గబ్బర్'

ధావన్ టీమిండియా తరఫున 269 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడారు. అందులో 24 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించారు. తన సహచరులు ధావన్‌ను గబ్బర్ అని పిలుచుకుంటారు.

రిటైర్మెంట్ ప్రకటన తర్వాత ధావన్‌ ఇన్నింగ్స్‌ను గుర్తుచేసుకుంటూ పంజాబ్ కింగ్స్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ''పరుగులు, ట్రోఫీలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. హ్యాపీ రిటైర్మెంట్ గబ్బర్'' అని రాసింది.

శిఖర్ ధావన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శిఖర్ ధావన్ తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాపై సెంచరీ చేశారు.

ఆ రికార్డు ఆయనదే..

వన్డే మ్యాచ్‌లలో 40 కంటే ఎక్కువ సగటుతో 5 వేలకు పైగా పరుగులు చేసిన ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్‌లలో ధావన్ కూడా ఒకరు.

వన్డేల్లో ధావన్ స్ట్రైక్ రేట్ 90కి పైగా ఉంది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు.

శిఖర్ ధావన్ టెస్టు క్రికెట్‌‌తో అరంగేట్రం చేశారు. తన టెస్టు క్రికెట్ ప్రారంభంలోనే, తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాపై సెంచరీ చేశారు.

మొహాలీలో జరిగిన ఈ మ్యాచ్‌లో 85 బంతుల్లో సెంచరీ బాదారు. తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌లలో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం ఓ రికార్డ్. ఈ మ్యాచ్‌లో ధావన్ చేసిన 187 పరుగులు మ్యాచ్‌ను భారత్‌కు అనుకూలంగా మార్చేశాయి.

శిఖర్ ధావన్ కెరీర్‌లో 2013 కీలకం,ఆ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్నారు వన్డేల్లో 50.52 సగటు, 97.89 స్ట్రైక్ రేట్‌తో 1162 పరుగులు చేశారు.

అదే ఏడాది జరిగిన చాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలకపాత్ర పోషించారు. చాంపియన్స్ ట్రోఫీలో 5 మ్యాచ్‌లలో రెండు సెంచరీలతో సహా 363 పరుగులు చేశారు.

ఈ టోర్నీలోనే ధావన్, రోహిత్ శర్మ ఓపెనింగ్ జోడీగా మారారు. ఓపెనింగ్ జోడీగా వన్డేల్లో నాలుగో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడారు.

సచిన్ తెందూల్కర్, సౌరవ్ గంగూలీ తర్వాత టీమిండియాకి విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా నిలిచారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)