ఈద్ ప్రత్యేకం: హలీం గురించి రుచికరమైన విషయాలు

రంజాన్ మాసం అనగానే పిల్లలకి పెద్దలకి అందరికి గుర్తు వచ్చేది హలీం!
హైదరాబాద్ పుర వీధుల్లో సాయంత్రం అవ్వగానే నోరూరుంచే హలీం దుకాణాలు దర్శనమిస్తాయి.
హలీం అనగానే హైదరాబాద్ లో పుట్టింది అని చాలా మంది అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు
మరి హలీం ఎక్కడిది? దీని చరిత్ర ఏంటి?

ఫొటో సోర్స్, NAVEEN KUMAR/BBC
ఆరా తీస్తే పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. మరి ఎక్కడ పుట్టింది?
ఈ విషయం తెలుసుకునేందుకు ప్రముఖ ఆహార చరిత్రకారుడు పుష్పేష్ పంత్‌ను బీబీసీ సంప్రదించింది.
ఇది ఇక్కడిది కాదని.. అరబ్ ప్రాంతానికి చెందినదని ఆయన వెల్లడించారు.

ఫొటో సోర్స్, NAVEEN KUMAR/BBC
అలాగే నిజాం సంస్థానంలో పని చేసేందుకు వచ్చిన యెమెన్ సైనికుల ద్వారా ఈ వంట యెమెన్ నుంచి దక్కన్ ప్రాంతానికి ప్రయాణం చేసిందనే వాదన కూడా ఉందని చెప్పారు. హలీంని మొదట హరిస అని పిలిచేవారని వివరించారు.
10 వ శతాబ్దానికి చెందిన రచయత అబూ ముహమ్మద్ అల-జాఫర్ రాసిన 'కితాబ్ అల్ తబిఖ్' అనే పుస్తకం లో గోధుమ ని జావలా తయారు చేసే వంటకాన్ని 'హరిస' అంటారని పేర్కొన్నారు.
నిజాం సంస్థానం లో ఉండే సుల్తాన్ సైఫ్ నవాస్ జంగ్ 1930 ప్రాంతంలో 'హరిస'ని విందు భోజనాలలో పెట్టించేవారని 'సండే గార్డియన్' హలీం చరిత్ర గురించి రాసిన ఒక వ్యాసం లో పేర్కొంది. అయితే, కాలక్రమేణా భారతీయ మసాలాలు జోడించి ఇది హలీం గా రూపాంతరం చెందిందని ఆ వ్యాసం లో రాశారు.
అలాగే ముస్లిం అల్లుళ్ళు గురించి తెలుసా?

ఫొటో సోర్స్, NAVEEN KUMAR/BBC
హలీం అరేబియా ప్రాంతంలో పుట్టినా కేరళ మీదుగా ప్రయాణించి దక్కన్ ప్రాంతాన్ని చేరుకుందని పుష్పేష్ పంత్ వివరించారు.
మలబార్ ప్రాంతానికి వ్యాపార లావాదేవీల కారణంగా అనేక ముస్లిం ప్రాంతాలతో సత్సంబంధాలు ఉండేవని కొంత మంది ముస్లింలను మలబార్ ప్రాంత వాసులు అల్లుళ్లుగా చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయని చరిత్ర ఆధారం గా చెప్పవచ్చని అన్నారు.
హలీం తింటే ఏమవుతుంది?

ఫొటో సోర్స్, NAVEEN KUMAR/BBC
హలీం చాలా బలవర్ధకమైన ఆహారం. దీనిని గోధుమ నూక, మాంసం అనేక పప్పు ధాన్యాల మిశ్రమంతో తయారు చేస్తారు.
అనేక తృణ ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వాడుతారు. ఇది ప్రోటీన్స్, కొవ్వు అందిస్తుంది.
ఇది చూడటానికి జావలా ఉంటుంది.
హలీంలో లభించే పోషకాలు రంజాన్ ఉపవాసం అనంతరం ఆహారం తీసుకునేవారికి చాలా ఉపయోగం గా ఉంటాయి.
హలీంకి రంజాన్ మాసంలో ఎక్కువ ప్రాధాన్యం ఉంది. మరి వండటానికి ఎంత సమయం పడుతుందో తెలుసా?

ఫొటో సోర్స్, NAVEEN KUMAR/BBC
హలీం క్షణాలలో తయారయ్యే వంటకం కాదు. చాలా సమయం తీసుకుని కొన్ని గంటల పాటు ‘వన్డే’ వంటకం ఇది.
రంజాన్ తర్వాత హలీం వీధులలో తయారు కాకపోవచ్చు కానీ, చాలా రెస్టారెంట్స్ లో సంవత్సరం పొడవునా దొరుకుతుంది. దీనికి డిమాండ్ పెంచేందుకు అరుదుగా లభించేటట్లు చేసి ఉండవచ్చు అని పుష్పేష్ అభిప్రాయపడ్డారు. అలాగే దీన్ని హైదరాబాద్ నుంచి అరబ్ దేశాలకూ ఎగుమతి చేస్తున్నారు.
హలీం తర్వాత కిచడగా ఎలా మారింది?
హలీం హైదరాబాద్ నుంచి దిల్లీ ప్రయాణించిందా అనేది చరిత్రకారుల లెక్కకు తేలలేదు. బహుశా అరబ్ సైనికులు, పరిశోధకులు, లేకుంటే రాజరికపు సిబ్బంది ఈ వంటని దిల్లీకి పరిచయం చేసి ఉండవచ్చని పుష్పేష్ చెప్పారు.
కాలక్రమేణా హలీంని తలపించే 'కిచడ' అనే వంటకం ప్రాంతీయ వంటగా మార్పు చెందిందని వివరించారు.
వ్యాపారం పెంచుకోవటం కోసం ఎన్ ఆర్ ఐ లు , ధనిక వ్యాపారులు హలీం ఎగుమతులు ప్రారంభించడంతో హలీంకి దుబాయ్ తో సంబంధం ఏర్పడింది అని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ దం బిరియాని, హలీం మరెక్కడా దొరకవనుకుంటే పొరపాటే. హలీం లక్నో, రాంపూర్, దిల్లీ, భోపాల్‌లో సంవత్సరం పొడవునా దొరుకుతుంది.
అలాగే తొలినాళ్లలో మటన్‌తోనే హలీం చేసేవారు. ఇప్పుడు మారిన రుచులు, పరిస్థితులకు అనుగుణంగా చికెన్, వెజిటేరియన్ హలీం కూడా తయారు చేస్తున్నారు.
సాధారణ హోటల్లో హలీం ఖరీదు 100 నుంచి 150 రూపాయిల వరకు ఉంటుంది. స్టార్ హోటళ్లలో మరింత ఎక్కువ.
ఇవి కూడా చదవండి
- ఈ వీడియో చూస్తే ఇక ఎన్నడూ ఆహారం వృధా చేయరు!
- ఇంతకూ బిర్యానీ హైదరాబాద్‌ది కాదా?
- గుజరాత్లో అరుదైన శిలాజాలు కనుగొన్న తెలుగు ప్రొఫెసర్
- ఫుట్‌బాల్‌లో యూరోపియన్ దేశాలకు ఉన్నదేంటి? భారత్‌లో లేనిదేంటి?
- చే గువేరా భారత్ గురించి ఏమన్నారంటే..
- ఈమె తెలంగాణలో తొలి గిరిజన మహిళా పైలట్
- స్త్రీ శక్తి: కొవ్వలిని ‘మనోహరం’గా మలచిన ‘గ్రామ దీపం’
- పరిశోధన: మైగ్రేన్‌కు సరికొత్త మందు..‘ఇది జీవితాలను మార్చేస్తుంది!’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










