అపర కుబేరులు వార్తా పత్రికలను ఎందుకు కొంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ల్యూసీ హూకర్
- హోదా, బిజినెస్ రిపోర్టర్, బీబీసీ న్యూస్
అన్నీ ఉన్న కుబేరుడు ఇంకా ఏం కావాలనుకుంటాడు? మరో స్పోర్ట్స్ కారా? ఇంకా పెద్ద పడవా? లేదంటే ఏదైనా ఆటలో చాంపియన్‌గా నిలిచిన టీమా?
అవేవీ కాదు.. ప్రఖ్యాత న్యూస్‌పేపర్ లేదా మేగజీన్ అని ఈ ప్రశ్నకు సమాధానంగా కనిపిస్తోంది. కష్టాల్లో పడిన పేరున్న వార్తాపత్రికలు, వారపత్రికలను బిలియనీర్లు సొంతం చేసుకుంటున్న ఉదంతాలు పెరుగుతున్నాయి.
బిజినెస్ రారాజులు.. సిటిజన్ కేన్, వాటర్‌గేట్‌ల శకం ముగిసిపోయిన ఎంతో కాలం తర్వాత సంపన్నులైన అపర కుబేరులు సైతం.. మీడియా సంస్థల్లో యజమానులుగా ప్రవేశించటానికి చాలా ఆసక్తిగా ఉన్నారని రుజువు చేస్తున్నారు.
1923 నుంచీ ప్రపంచ ఘటనల విషయంలో అమెరికా దృక్పథాన్ని ప్రతిఫలించిన ‘టైమ్’ మేగజీన్‌ను తాము కొంటున్నట్లు మార్క్ బేనియాఫ్, ఆయన భార్య తాజాగా ప్రకటించటం ఈ ట్రెండ్‌కి లేటెస్ట్ ఉదాహరణ.
విశ్వవిఖ్యాత టైమ్ మేగజీన్ ‘కవర్ పేజీ’లో తన బొమ్మ పడాలని ఇప్పటికీ కోరుకుంటున్న ధనికులు, శక్తివంతుల్లో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నారు.
బిజినెస్ సాఫ్ట్‌వేర్ సంస్థ సేల్స్‌ఫోర్స్.కామ్ (Salesforce.com) సహవ్యవస్థాపకుడైన బేనియాఫ్ ఆస్తి విలువ 6.7 బిలియన్ డాలర్లు. టైమ్ మేగజీన్‌ను ఆయన 190 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెజాన్ ద్వారా సంపాదించిన బిలియన్ల సంపదలో కొంత వెచ్చించి ఐదేళ్ల కిందట ‘వాషింగ్టన్ పోస్ట్’ దినపత్రికను సొంతం చేసుకున్న జెఫ్ బెజోస్ అడుగుజాడల్లో బేనియాఫ్ నడుస్తున్నారు.
వాషింగ్టన్ పోస్ట్‌ని జెఫ్ కొన్న ఏడాదిలోనే.. మాజీ ఫండ్ మేనేజర్, బోస్టన్ రెడ్ సోక్స్ యజమాని జాన్ హెన్రీ.. బోస్టన్ గ్లోబ్ పత్రికను కొన్నారు.
ఆ తర్వాత కొంత కాలానికే.. హోటల్ - కాసినో మాగ్నేట్ షెల్డన్ ఆడిల్సన్ కూడా.. లాస్ వేగాస్ రివ్యూ-జర్నల్ సొంతం చేసుకున్నారు. నెవాడాలో అతి పెద్ద దినపత్రిక అది.
యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారీన్ పావెల్ జాబ్స్.. ద అట్లాంటిక్ మేగజీన్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేశారు. తన సారథ్యంలో గల ఎమర్సన్ కలెక్టివ్ అనే సామాజిక సంస్థ ద్వారా ఈ కొనుగోలు జరిపారామె.
దక్షిణాఫ్రికాలో జన్మించిన బయోటెక్ బిలియనీర్ పాట్రిక్ సూన్-షియాంగ్.. ఈ ఏడాది ఆరంభంలో లాస్ ఏంజెలెస్ టైమ్స్ పత్రికతో పాటు మరికొన్ని వెస్ట్ కోస్ట్ పత్రికలను కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పడిపోతున్న విక్రయాలు.. ఆన్‌లైన్ ప్రకటనల ఆదాయం కోసం భీకర పోటీలతో ప్రతికూల పరిస్థితులతో పోరాడుతున్న మీడియా సంస్థలు.. వార్తల వ్యామోహమున్న బిలియనీర్లను ఆలింగనం చేసుకోవటానికి సిద్ధంగా ఉండటాన్ని సులభంగానే అర్థం చేసుకోవచ్చు.
ఆయా వార్తాపత్రికలు ‘‘తీవ్ర ఒత్తిడి’’లో ఉన్నాయంటారు ఎండర్స్ ఎనాలిసస్ సంస్థలో మీడియా విశ్లేషకుడిగా పనిచేస్తున్న మెక్ కేబ్. తమ పత్రికల వార్తలను ఆన్‌లైన్‌లో చదవటానికి చార్జీలు వసూలు చేయరాదన్ని తొలినాటి నిర్ణయాలు.. ముద్రించే పత్రికల్లో ప్రకటనలకు చేసే చెల్లింపులకు సమానంగా డిజిటల్ ప్రకటనలకు చెల్లింపులు చేయటానికి ప్రకటనదారులు సుముఖంగా లేకపోవటం దీనికి కారణమని ఆయన చెప్తారు.
ఆ ఒత్తిడుల వల్ల.. పెట్టుబడిదారులకు మీడియా రంగం అంత ఆకర్షణీయంగా కనిపించటం లేదు.
మరి.. లాభాలు ఆర్జించటం లక్ష్యం కాకపోతే.. ఈ బిలియనీర్లు.. వాణిజ్య రారాజులు మీడియా సంస్థలను ఎందుకు కొంటున్నట్లు?

‘‘ధనవంతులకు ఎప్పుడూ న్యూస్ మీడియాకు ఆకర్షితులవతూ ఉంటారు. ముఖ్య కారణం ఏమిటంటే.. ప్రభావ వంతమైన మీడియా ద్వారా దాని యజమానులకు.. ప్రభావితం చేయగల శక్తి లభిస్తుంది’’ అంటారు మెక్ కేబ్.
కొందరి విషయంలో ఇది నిజం కావచ్చు. కొత్త జాతి బిలియనీర్ మీడియా యజమానులను నడిపిస్తున్న ఇతర ప్రేరణలూ ఉన్నాయని.. బోస్టన్‌లోని నార్తీస్ట్రన్ యూనివర్సిటీలో జర్నలిజం అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాన్ కెన్నడీ అంటారు. ఆయన.. ‘ద రిటర్న్ ఆఫ్ ద మొగల్స్: హౌ జెఫ్ బెజోస్ అండ్ జాన్ హెన్రీ ఆర్ రీమేకింగ్ న్యూస్‌పేపర్స్ ఫర్ ద ట్వంటీ-ఫస్ట్ సెంచురీ’ పేరుతో ఒక పుస్తకం కూడా రాశారు.
‘‘ఇది అహం.. తాము బాగా పనిచేయగలమని నిజాయితీగా విశ్వసించటం.. రెండూ కలగలసిన కారణమని నేను చెప్తాను’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘ఈ వార్తా సంస్థలకు ఆర్థిక చతురత లోపించిందని.. తామే గనుక యజమానులమైతే అవి మళ్లీ లాభాల బాటలో పయనించటం ప్రారంభిస్తాయని వీరు నమ్ముతుంటారు’’ అని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
వాషింగ్టన్ పోస్ట్ విషయంలో.. ఆ దినపత్రికను కొనుగోలు చేసిన జెఫ్ బెజోస్ స్వీయ సామర్థ్యం మీద విశ్వాసం దాదాపు మంచి ఫలితాలనిచ్చిందని కెన్నడీ అంటారు. అమెజాన్‌కి గల విస్తారమైన వ్యాప్తిని కొంత ఉపయోగించుకుని చందాదారుల సంఖ్యను పెంచుకోగలిగింది. వాషింగ్టన్ డీసీ కేంద్రంగా నడుస్తున్న ఈ పత్రిక ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ దినపత్రికకు సిసలైన పోటీదారుగా నిలిచింది.
వాషింగ్టన్ పోస్ట్ పత్రికతో బెజోస్ సాధించిన విజయం.. మిగతా వారికి స్ఫూర్తినిచ్చి ఉండొచ్చునని కెన్నడీ భావిస్తున్నారు.
అమెజాన్ బ్రాండ్‌ని కానీ, తన వాణిజ్య ప్రయోజనాలను కానీ ప్రచారం చేసుకునేందుకు.. లేదంటే రాజకీయ, ఆర్థిక అజెండాలను సాధించటానికి ఆ సంస్థ వ్యవస్థాపకుడైన బెజోస్.. వాషింగ్టన్ పోస్ట్‌ను ఉపయోగించుకుంటారేమోనన్న భయాలు ఉన్నప్పటికీ.. అలా జరగలేదని కెన్నడీ పేర్కొన్నారు.
బోస్టన్ గ్లోబ్ పత్రికను కొన్న జాన్ హెన్రీ వంటి ఇతర వాణిజ్యవేత్తలు.. పత్రిక సంపాదక వైఖరిలో జోక్యం చేసుకుని ఉండొచ్చు. కానీ.. వార్తల విషయంలో స్థిరమైన దూరం పాటించారు. పైగా వారు కొత్త వ్యాపార వ్యూహాలను అభివృద్ధి చేయటం మీద దృష్టి కేంద్రీకరించటానికి మొగ్గుచూపారు.
అయితే.. బిలియనీర్ పెట్టుబడిదారుల్లో ‘ప్రజా ప్రయోజనం’ అనే భావన లోపించిందని కాదు.
సూన్-షియాంగ్ ఈ వేసవిలో లాస్ ఏంజెలెస్ టైమ్స్ దినపత్రికను కొన్నపుడు.. దక్షిణాఫ్రికాలో పత్రికా స్వాతంత్ర్యాన్ని కత్తిరించిన వర్ణవివక్ష శకంలో పెరిగిన తన అనుభావాలు కూడా ఈ పత్రికను కొనుగోలు చేయటానికి ఒక ప్రేరణగా ఉన్నాయని చెప్పారు.
ఫేక్ న్యూస్ అనేది ‘మన కాలపు క్యాన్సర్’ అని అభివర్ణిస్తూ ఆ రుగ్మతపై పోరాడతానని ఆయన హామీ ఇచ్చారు. తాను కొన్న వార్తా పత్రికలు.. ‘‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటానికి.. వివక్షకు విరుగుడు మందును అందించటానికి సంపాదక నిబద్ధత, స్వాతంత్ర్యాల కంచుకోటలు’’గా ఉంటాయని పాఠకులకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వాషింగ్టన్ పోస్ట్ పత్రికను కొన్నపుడు బెజోస్ కూడా.. ప్రజాస్వామ్యాన్ని నిర్వచించటంలో ఆ పత్రిక పాత్ర గురించి మాట్లాడారు. అట్లాంటిక్ మేగజీన్‌లో పెట్టుబడులు పెట్టటంపై పావెల్ జాబ్స్ చేసిన ప్రకటన కూడా.. ‘‘ఈ కీలక కాలంలో పత్రిక కీలక కార్యక్రమాన్ని నెరవేర్చటం’’ కొనసాగిస్తుందని హామీ ఇచ్చింది.
మరైతే.. ప్రజా చర్చను కాపుగాయాలన్న ఆకాంక్ష గల సంపన్న యజమానులు ఉండటం.. ఈ పత్రికలకు శుభవార్త అవుతుందా?
‘‘దీనికి ప్రత్యామ్నాయం ఏమిటనే దాని గురించి మనం ఆలోచించాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నా’’ అంటారు కెన్నడీ.
గడచిన ఒకటిన్నర దశాబ్ద కాలంలో చాలా వార్తా సంస్థల యజమానులు.. ‘‘లాభాల్లో ప్రతి చుక్కనూ పిండుకునే ప్రయత్నంలో’’ సిబ్బంది స్థాయిని గణనీయంగా తగ్గించారని ఆయన చెప్పారు.
‘‘ఆ కోణంలో చూస్తే.. ప్రజా స్ఫూర్తి గల వ్యక్తులు.. వార్తాపత్రికల విషయంలో ఒక ప్రయత్నం చేయాలని భావించటం మంచి విషయమే అవుతుంది’’ అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కానీ.. దీనర్థం వాళ్లు ఎల్లవేళలా విజయం సాధిస్తారని కాదు.
ఫేస్‌బుక్ సహవ్యవస్థాపకుడు క్రిస్ హ్యూజెస్.. 2012లో వందేళ్ల చరిత్ర గల ‘ద న్యూ రిపబ్లిక్’ మేగజీన్‌ను కొన్నారు. కానీ.. అందులో 20 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టినా.. ఇటు సిబ్బంది, అటు పాఠకులు తరలిపోవటాన్ని నిలువరించటంలో విఫలమై.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ అమ్మేశారు.
కొద్ది కాలం కిందట తాను బోస్టన్ గ్లోబ్ యజమాని జాన్ హెన్రీతో మాట్లాడానని.. ఆయన కొన్ని ప్రయత్నాలు చేసినా పత్రిక లాభాలను పునరుద్ధరించటం ఎంత కష్టమనేది ఆయనకిప్పుడు నిస్పృహను తెప్పించినట్లు కనిపిస్తోందని కెన్నడీ చెప్పారు.
టైమ్స్ కొత్త యజమాని బేనియాఫ్‌ని కూడా.. వేగంగా మారిపోతున్న మీడియా రంగంలో ఆ మేగజీన్ తన కొత్త పాత్రను గుర్తించే వరకూ కొన్నేళ్ల పాటు నష్టాలను భరించటానికి సంసిద్ధంగా ఉండాలని మేధో వర్గం సూచిస్తోంది.


ఫొటో సోర్స్, Getty Images
అలీబాబా ఈ-కామర్స్ సామ్రాజ్యాధినేత జాక్ మా సైతం ఒక మీడియా సంస్థను సొంతం చేసుకున్నారు.
2015లో 266 మిలియన్ అమెరికన్ డాలర్లను చెల్లించి అలీబాబా సంస్థ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రికను కొనుగోలు చేసింది.
అలీబాబాకు ఉన్న ప్రచురణ సంస్థలు, వెబ్‌సైట్లు, మేగజీన్లకు ఇది అదనం.
చైనాతో సత్సంబంధాలు ఉన్న జాక్ మా.. చైనా సాఫ్ట్ పవర్‌ను ప్రచారం చేసే పత్రికను కొనుగోలు చేయటం పట్ల అప్పట్లో ప్రశ్నలు తలెత్తాయి. అయితే, పత్రిక ఎడిటోరియల్

ఇవి కూడా చదవండి:
- అలీబాబా అధిపతి జాక్ మా: అపర కుబేరుడి అయిదు విజయ రహస్యాలు
- పూజకు ముందు.. పీరియడ్లను వాయిదా వేసే పిల్ తీసుకుంటున్నారా?
- ‘రాజకీయ నేతల ప్రేమ వ్యవహారాలపై ఎవ్వరూ బహిరంగంగా ఎందుకు మాట్లాడరు?’
- ‘భాగస్వామిని ఆకట్టుకునే కళను మర్చిపోతున్న భారతీయులు’
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- ఐయూడీ: ఈ పరికరంతో గర్భం రాదు.. ఎక్కువ మంది మహిళలు వాడట్లేదు
- నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పిల్లలు ఎందుకు పుడతారు?
- అమృత కన్నీటి కథ : ‘‘నన్ను గదిలో బంధించే వారు... ప్రణయ్‌ని మరచిపోవాలని రోజూ కొట్టేవారు’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








