ఆంధ్రప్రదేశ్: కొండవీడు రైతు కోటయ్యది హత్యా? ఆత్మహత్యా?

ఫొటో సోర్స్, Sankar
- రచయిత, వి శంకర్
- హోదా, బీబీసీ కోసం
గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో పిట్టల కోటేశ్వ రరావు అలియాస్ కోటయ్య అనే రైతు మృతిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ సహా అన్ని రాజకీయ పార్టీలూ దీనిపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో పోలీసుల పాత్ర ప్రశ్నార్థకంగా మారగా.. గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ వారికి నగదు రివార్డులు విశేషం.
ఏం జరిగింది?
ఈనెల 17, 18 తేదీలలో గుంటూరు జిల్లాలో కొండవీడు ఉత్సవాలు జరిగాయి.
రెడ్డిరాజుల పాలనలో ఓ వెలుగు వెలిగిన చారిత్ర క నిర్మాణమైన కొండవీటి కోట ప్రాభవాన్ని చాటేందుకు రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో పర్యాటక అభివృద్దికి అన్ని రకాలుగానూ అవకాశాలున్నాయని, వాటిని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి కొండవీటి కోట ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేస్తామని ముగింపు వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

ఫొటో సోర్స్, Sankar
పొలాల్లో హెలీప్యాడ్ నిర్మాణం... పోలీసులకు టెంట్లు
18వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో 15వ తేదీ నుంచే కొండవీడులో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
16వ తేదీ నుంచి రైతులపై ఆంక్షలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి ప్రయాణించే హెలీకాప్టర్ రాకపోకలకు వీలుగా.. కొండవీడు నుంచి కొండపైకి వెళ్లే ఆర్ అండ్ బీ రహదారిని ఆనుకుని ఉన్న పొలాల్లో హెలీకాప్టర్ దిగేందుకు హెలీప్యాడ్‌ను నిర్మించారు. హెలీప్యాడ్‌కు ఎదురుగా.. రోడ్డుకు మరోపక్క ఉన్న పొలంలో పోలీసుల కోసం టెంట్లు వేశారు.
ఈ రోడ్డు మార్గంలో ప్రయాణించొద్దని, వేరే మార్గం ద్వారా వెళ్లాలని రైతులకు పోలీసులు సూచించారు.
రైతు కోటయ్య మృతి...
పోలీసుల కోసం టెంట్ నిర్మించిన పొలంలో చామంతి, ఇతర పూలు, బొప్పాయి సాగు చేస్తున్న పిట్టల కోటేశ్వరరావు అలియాస్ కోటయ్య అనే రైతు 18వ తేదీన మృతి చెందారు.
ఆ రైతును ఒక కానిస్టేబుల్ భుజాలపై ఎత్తుకుని పరుగెట్టుకుంటూ బొలెరో వాహనంలో ఎక్కిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వైఎస్ జగన్ ట్వీట్.. వైసీపీ నిజ నిర్థరణ కమిటీ
ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ, 'కొండవీడులో ఒక బీసీ (ముత్రాసి) రైతు కోటయ్యని మీరే చంపేశారు ముఖ్యమంత్రి గారూ.. కొట్టి కొన ఊపిరితో ఉన్న రైతును అక్కడే వదిలేశారు. మీ హెలికాప్టర్ దిగడానికి ఆయన బొప్పాయి పొలాన్ని నాశనం చేశారు. మానవత్వం చూపాల్సిన సమయంలో ఈ రాక్షసత్వం ఏమిటి చంద్రబాబు గారూ..' అంటూ జగన్ ట్వీట్ చేశారు.
వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సారథ్యంలో ఓ కమిటీని నియమించి కొండవీడు పంపించారు. ఆ కమిటీ గ్రామాన్ని సందర్శించింది. పలువురితో మాట్లాడింది. వివరాలు సేకరించింది. ఆ తర్వాత జిల్లా ఎస్పీని కలిసింది. రైతు కోటేశ్వరరావు మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరింది.
ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ "పోలీసుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన కోటయ్య మృతిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. ఆయనకు అసలు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఆయనకున్న అప్పులన్నీ గతంలోనే తీర్చేశారు. 14 ఎకరాలు కౌలుకు తీసుకుని కష్టపడి సాగు చేసుకుంటున్న రైతుకి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముంది? పంచనామా నుంచి పోస్ట్ మార్టమ్ వరకూ ఏదీ సక్రమంగా జరగలేదు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. రైతు చనిపోతే రూ.3 లక్షల నష్ట పరిహారం, రూ.2 లక్షలు చంద్రన్న బీమా ఇస్తామంటూ ఆర్డీవో, డీఎస్పీ బేరాలు సాగించడం అనుమానాలకు తావిస్తోంది" అన్నారు.
వైసీపీ నేతలు గ్రామంలో పర్య టించిన సందర్భంగా పోలీస్ అధికారుల సంఘం తరపున అదనపు ఎస్పీ వరదరాజులు సహా పలువురు పోలీసులు వైసీపీ నేతలకు వినతిపత్రాలు అందించారు. నిజాయితీగా పనిచేస్తున్న తమపై దుష్ప్రచారాలు తగవన్నారు. రైతు మరణంలో పోలీస్ పాత్రపై సాగుతున్న ప్రచారాన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఫొటో సోర్స్, APCPIM/facebook
కోటయ్య కుమారుడు ఏమంటున్నారు?
రైతులపై ఆంక్షలు పెట్టడం, రైతు కోటేశ్వరరావు పొలంలో ఉన్న బొప్పాయి తోటల్లో చొరబడిన కొందరు పళ్లు తీసుకెళ్లడం కోటేశ్వరరావుకి కోపాన్ని తీసుకొచ్చిందని, ఇక్కడే వివాదం మొదలైందని గ్రామస్తులు చెబుతున్నారు.
పోలీసులతో ఇదే విషయమై తన తండ్రి గొడవ పడినట్లు కోటయ్య కుమారుడు వీరాంజనేయులు చెబుతున్నారు. "18వ తేదీ ఉదయాన్నే మా నాన్న పొలానికి వెళ్లారు. ఆయనతో పాటు పున్నారావు కూడా ఉన్నారు. ఇద్దరూ కలిసి వెళ్లిన తర్వాత ఏం జరిగిందనేది తెలియదు. ఆయనకు కొంత కాలం క్రితమే గుండెనొప్పి వచ్చింది. స్టంట్స్ కూడా వేశారు. బొప్పాయి తోటలో పోలీసులు ప్రవేశించడంపై ఆయన నిలదీయడంతో పోలీసులకు ఆగ్రహం కలిగించింది. దాంతో, ఏం జరిగిందనేది మాకు తెలియదు. పున్నారావు ఫోన్ చేసి.. పోలీసులు మీ నాన్నను కొడుతున్నారు అని చెప్పాడు. నేను గ్రామంలో ఉన్న పెద్ద మనుషులను తీసుకుని ఆటోలో ఎక్కించుకుని పొలానికి వెళ్లాం. అప్పటికే ఆయన చనిపోయారు. పున్నారావు మాత్రం పోలీసుల వ్యాన్ లో కనిపించారు. పోలీసులను అడిగితే (పురుగుల) మందు తాగి చనిపోయాడని చెప్పారు. డాక్టర్లు గుండె ఆగి చనిపోయారని మాతో చెప్పారు. ఇంతకుముందు మా ఊర్లో చాలామంది మందు తాగి చనిపోయారు. కానీ, పురుగుల మందు తాగితే నోటి నుంచి నురగ వస్తుంది. మా నాన్నకు రాజకీయాలు తెలియవు. మాకు రాజకీయాలు ఎందుకు? పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. మా కుటుంబానికి న్యాయం జరగాలి" అని చెప్పారు.
ప్రత్యక్ష సాక్షి పున్నారావు ఏమన్నారు?
ప్రత్యక్ష సాక్షిగా ఉన్న పున్నారావు వాదన భిన్నంగా ఉంది. మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన, "ఉదయాన్నే నేను కోటయ్యతో కలిసి పొలానికి వెళ్లాను. బొప్పాయితోట దగ్గర నన్ను దించి టిఫిన్ తీసుకొస్తానని గ్రామంలోకి వెళ్లాడు. మళ్లీ వచ్చి మునగతోటలోకి వెళ్లాడు. 11 గంటల సమయంలో గ్రామంలోకి వెళ్లడానికి బైక్ కోసమని మునగతోటకు వెళ్లాను. అక్కడ చేతిలో పురుగుల ముందు డబ్బాతో నోటి నుంచి నురగలు కక్కుకుంటూ కోటయ్య కనిపించారు. వెంటనే డబ్బా లాగేశాను. గ్రామంలో అందరికీ చెబుదామని పరుగెత్తాను. కోటయ్య కొడుక్కి ఫోన్ చేసి చెప్పాను" అంటూ పున్నారావు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, APCPIM/facebook
గ్రామస్తులు ఏమంటున్నారు?
స్థానికుడు రామసుబ్బారావు బీబీసీతో మాట్లాడుతూ "పురుగుల మందు తాగిన వాళ్లు అక్కడికక్క డే చనిపోవడం చాలా అరుదు. సీఎం పర్యటన కోసం ఆంబులెన్స్ సహా డాక్టర్లు, సిబ్బంది అక్కడ ఉన్నారు. వారు కోటయ్యకు ప్రాథమిక చికిత్స అందించాల్సి ఉండగా పోలీసులు ఆయనను భుజన వేసుకుని తీసుకెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల చేతుల్లో ఉన్నప్పుడు కోటయ్య ధరించిన చొక్కా, గ్రామస్తుల దగ్గరికి వచ్చేసరికి మారిపోయింది. పురుగుల మందు తాగితే గిలగిలా కొట్టుకుంటారు. కానీ, అలా జరిగినట్లు కనిపించలేదు. ఆత్మహత్య అని చెబుతున్న పోలీసులు నష్ట పరిహారం గురించి కూడా మాట్లాడారు. ఇవన్నీ ఊరిలో అనుమానాలను మరింత పెంచుతున్నాయి" అన్నారు.
రాజకీయాల నుంచి వైదొలుగుతానంటూ మంత్రి ప్రత్తిపాటి చాలెంజ్
హెలీప్యాడ్ నిర్మాణం కోసం రైతు పొలాన్ని తీసుకుని, ఆయన మరణానికి కారణమయ్యారంటూ విపక్ష నేత జగన్ చేసిన ఆరోపణలను టీడీపీ తిప్పికొట్టింది. ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, "ఉత్స వాల కోసం హెలీప్యాడ్ నిర్మించింది మృతుడు కోటయ్య పొలంలోనేనని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతా. నిరూపించలేకపోతే వైఎస్ జగన్ రాజకీయాల నుంచి తప్పుకోవాలి. హెలీప్యాడ్ కోటయ్య పొలానికి 700 మీటర్ల దూరం ఉంది. కంట్రోల్ రూమ్ మాత్రం కోటయ్య అనుమతితోనే నిర్మించారు. ఆయనే మరో రైతుతో మాట్లాడి పార్కింగ్ కోసం మూడెకరాలు ఇప్పించారు. అయినా జగన్ మీడియా అబద్ధాలు చెబుతోంది. గాలివార్తలతో జగన్ విషం జల్లుతున్నారు" అంటూ మండిపడ్డారు.
జనసేన, సీపీఎం సహా పలు రాజకీయ పార్టీల నేతలు కూడా కొండవీడు సందర్శించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జనసేన తరపున మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కోటయ్య కుటుంబానికి ఆర్థిక సహకారం అందించారు. వైసీపీ నేతలు కూడా ఆర్థిక సహకారం అందించారు.
బాధితుడి కుటుంబానికి రూ. 25 లక్షల నష్ట పరిహారం అందించాలని ఏపీ రైతు సంఘం నాయకుడు పి. నర్సింహారావు డిమాండ్ చేశారు. రైతు పొలంలో బొప్పాయి తోటలు ధ్వంసం అయి ఉండడం తమ దృష్టికి వచ్చిందన్నారు.

ఫొటో సోర్స్, Sankar
హెలీప్యాడ్ నిర్మాణంపై తహశీల్దార్ వివరణ
హెలీప్యాడ్ నిర్మించిన స్థలానికి సంబంధించి ఎడ్లపాడు తహాశీల్దార్ జయపాల్ బీబీసీకి వివరణ ఇచ్చారు. "కొండవీడు గ్రామంలోని సర్వే నెంబర్ 17బి భూమిలో హెలీప్యాడ్ నిర్మాణం జరిగింది. కాకర్లపూడి కృష్ణ, కాకర్లపూడి నాగేశ్వరరావు అనే రైతులకు చెందిన ఈ భూమిలో కృష్ణ ఇటీవలే భరత్ రెడ్డి అనే వారికి అమ్మినట్టు తెలిసింది. ఇక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన పొలం మద్దిపోటి వెంకటేశ్వ ర్లు అనే రైతుకి చెందిన 36వ సర్వేనెంబర్‌లో ఉంది. హెలీప్యాడ్‌కు పోలీసుల కంట్రోల్ రూమ్‌కు మధ్య లో ఆర్ అండ్ బీ రోడ్డు కూడా ఉంది. హెలీప్యాడ్ వేసిన స్థలానికి కోటయ్య పొలానికి సంబంధం లేదు. బొప్పాయి తోట పాడు చేశారన్నది రైతు తరపు వారి అభియోగం. కానీ అది ఖాళీ స్థలం. అనుమతి తీసుకుని అక్క డ టెంట్లు వేసినట్టు మా దృష్టికి వచ్చిన సమాచారం" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Sankar
విచారణాధికారి, డీఎస్పీ ఏమన్నారంటే..
కోటయ్య మరణంపై అనుమానాలు తీర్చాలంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై 19/ 2019 నంబరుతో అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అధికారిగా ఉన్న నర్సారావుపేట డీఎస్పీ డి. రవివర్మ బీబీసీతో మాట్లాడుతూ, "నిష్పక్షపాత విచారణ సాగిస్తున్నాం. అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నాం. అందరి దగ్గర ఆధారాలు సేకరిస్తాం. విచారణ కోసం మీడియాకు కూడా నోటీసులిస్తాం. వారి దగ్గర ఉన్న సమాచారాన్ని సేకరిస్తాం. పోస్టుమార్టం రిపోర్టు రావాల్సి ఉంది. వీలయినంత త్వరగా వస్తుందని ఆశిస్తున్నాం. విచారణ పూర్త యిన తర్వాత వివరాలను కోర్టుకు సమర్పిస్తాం. పోలీసుల మీద అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదులో చెప్పారు. అన్నింటినీ పరిశీలించిన తర్వాతే నిర్ధరణకు రాగలం" అన్నారు.
చనిపోయిన తర్వాత కోటయ్య చొక్కా మారిందనే వాదనను రవివర్మ దృష్టికి తీసుకెళ్లగా.. అవన్నీ దర్యాప్తులో తేలాల్సిన అంశాలని , విచారణలో ఉండగా కేసు వివరాలు వెల్లడించలేనని ఆయన బదులిచ్పారు.
ఇవి కూడా చదవండి:
- కస్తూర్భా గాంధీ: శరీరం భస్మమైంది, ఆమె 5 గాజులు మిగిలే ఉన్నాయి
- ఆ దేశంలో తెలుగుకున్న క్రేజ్ అంతా, ఇంతా కాదు!
- దేశంలో సగటున గంటకో రైతు ఆత్మహత్య
- ఈ రైతులు కరువు నేలలో కోట్లు పండిస్తున్నారు
- తెలంగాణ: 'కోతుల బాధితుల సంఘం'... పొలం కాపలాకు లక్ష జీతం
- 2022 నాటికి రైతులకు రెట్టింపు ఆదాయం: మోదీ కల నిజమయ్యేనా?
- అన్నదాత సుఖీభవ పథకం: ఎవరు అర్హులు? కౌలు రైతుల్ని ఎలా గుర్తిస్తారు?
- పుల్వామా దాడి: మసూద్ అజర్ 'టెర్రరిస్టు' అని చైనా ఎందుకు అంగీకరించడం లేదు
- అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని, ఆత్మహత్య చేసుకున్న రైతు కథ
- అది మామూలు టార్చర్ కాదు.. నా గర్ల్‌ఫ్రెండ్ నన్ను ఎలా చిత్రహింసలు పెట్టిందంటే..
- ప్రేమికులు ప్రేమలో పడటానికి, వారిలో రొమాన్స్‌కు కారణం ఇదే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









