కిషన్ రెడ్డి: 'సంక్రాంతి ముగ్గుల పోటీలో గెలిస్తే రూ. 6 లక్షల బహుమతి' - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
వచ్చే ఏడాది సంక్రాంతికి వివిధ పోటీలు నిర్వహించనున్న కేంద్ర సాంస్కృతిక, పర్యటకశాఖ మహిళలకు బహుమతులు ఇవ్వనుందని నమస్తే తెలంగాణ పత్రిక వార్తా కథనం ప్రచురిచింది.
‘పండుగ రోజు అందమైన ముగ్గులు వేస్తే పోటీలలో గెలిచినవారికి ఏకంగా రూ. 6 లక్షల నగదు బహుమతి ఇవ్వనుంది. పాటలు పాడి గెలిచినా బహుమతులు అందజేయనుంది.
సోమవారం హైదరాబాద్‌లో ఆ శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
జాతీయస్థాయిలో ప్రథమ బహుమతి రూ. 6 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.5 లక్షలు, తృతీయ బహుమతి రూ.4 లక్షలు ఇవ్వనున్నారు.
రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి లక్ష, ద్వితీయ బహుమతి రూ. 75 వేలు, తృతీయ బహుమతి రూ. 50 వేలు ఇస్తారని పత్రిక రాసింది.
జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి రూ. 10 వేలు, ద్వితీయ బహుమతి రూ.5 వేలు, తృతీయ బహుమతి రూ.3 వేలు ఇవ్వనున్నట్టు తెలిపారు.
సంక్రాంతిని చాలా రాష్ట్రాల్లో వివిధ పేర్లతో నిర్వహిస్తారని, ఈ సంస్కృతికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు పోటీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
పూర్తి వివరాలకు www.indiaculture.nic.in ను సంప్రదించాలని సూచించార’’ని నమస్తే తెలంగాణ వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
తెలుగు రాష్ట్రాల్లో 241 మంది నిరుద్యోగులను మోసం చేసిన జంట అరెస్ట్
తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల పేరుతో 241 మందిని మోసం చేసిన ఒక జంటను పోలీసులు అరెస్ట్ చేశారని ఆంధ్రజ్యోతి వార్తా కథనం ప్రచురించింది.
'స్కౌట్స్ అండ్ గైడ్స్' విభాగంలో ఉద్యోగాల పేరుతో తెలుగు రాష్ట్రాల్లో 241 మంది నిరుద్యోగులకు రూ. కోటి మేర కుచ్చుటోపీ పెట్టిన ముఠా ఆటను వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కట్టించారు.
సోమవారం వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి వివరాలు వెల్లడించారు.
హనుమకొండ జిల్లా శాయంపేట మండలానికి చెందిన చల్లా వినయ్‌పాల్‌రెడ్డి(37) ములుగు జిల్లా బండారుపల్లె గ్రామంలో వీఆర్వోగా పనిచేసేవాడు.
వడ్డెపల్లి సురేంద్రపురికి చెందిన పోరిక అనసూయ ములుగు రెవెన్యూ విభాగంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసేది.
అప్పటికే వివాహితులై.. కుటుంబాలు ఉన్న వీరిద్దరూ.. కొంత కాలం సహజీవనం చేశారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.
అనసూయ సమీప బంధువు సాకేత్‌తో కలిసి వీరంతా నకిలీ దస్తావేజులు, డాక్యుమెంట్ల దందాకు తెరతీశారు.
2012లో పోలీసు కేసు కావడంతో.. వినయ్‌పాల్, అనసూయ తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ ముగ్గురు కొంత కాలం దిల్లీ వెళ్లారు.
ఆ సమయంలో వీరికి రాజ్.కేపీ.సిన్హా అనే మోసగాడు పరిచయమయ్యాడు. అతను స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ కమిషనర్‌గా చెప్పుకొంటూ మోసాలకు పాల్పడేవాడు.
అతనితో జతకట్టిన వినయ్‌పాల్, అనసూయ, సాకేత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ఉద్యోగాల పేరుతో తెలుగు యువతకు గాలం వేశారు.
2019 నుంచి 241 మంది నిరుద్యోగులకు కుచ్చుటోపీ వేశారు. ఒక్కొక్కరి నుంచి రూ. 3 నుంచి రూ. 5 లక్షల చొప్పున సుమారు రూ. కోటి వరకు వసూలు చేశారు.
ఈ ముఠా వీరిని నిమ్మించడానికి నల్లగొండ, వరంగల్‌లో 15 రోజుల పాటు శిక్షణనిప్పించింది. ఆ తర్వాత వేర్వేరు స్కూల్లలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇన్‌చార్జులుగా వివిధ హోదాలతో నకిలీ నియామక పత్రాలను అందజేసింది.
వాటిని పట్టుకుని, తమకు కేటాయించిన స్కూళ్లకు వెళ్లిన నిరుద్యోగులంతా ఖంగుతిన్నారు. అక్కడ అలాం టి పోస్టులు లేవని తెలుసుకుని.. తాము మోసపోయినట్లు గుర్తించారు.
పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్ సిన్హా మినహా.. మిగతా నిందితులను సోమవారం వరంగల్ చౌరస్తాలో అరెస్టు చేశారు. వారివద్ద రూ.21.70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నార’ని పత్రిక వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఏపీలో చార్జింగ్ పాయింట్లు
ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ పాయింట్లు పెంచుతున్నట్లు ఈనాడు పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వాహనాల వినియోగం ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. రవాణా శాఖ రికార్డుల ప్రకారం విద్యుత్ వాహనాల సంఖ్య రాష్ట్రంలో 15,372 వరకు చేరింది.
మొత్తం వాహనాల్లో.. ఈ ఏడాది (అక్టోబరు వరకు) 40 శాతం కొత్త వాహనాలు రోడ్డెక్కాయి.
విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సదుపాయాలను కల్పించడంలో భాగంగా జనవరి నాటికి 100 ఈవీ వాహనాల ఛార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్) నిర్ణయించింది.
దీనికోసం ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన (ఈవోఐ) జారీ చేసింది. రిలయన్స్, టాటా, ఈఈఎస్‌ఎల్, ఎన్‌టీపీసీ, ఓలా, టైరెక్స్, స్టాటిక్ సంస్థలు ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంప్రదింపులు జరుపుతున్నాయని ఒక అధికారి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు ముసాయిదాకు జేపీసీ ఆమోదం
పౌరుల వ్యక్తిగత గోప్యతకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన 'పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు-2019 (పీడీపీ)' ముసాయిదాకు పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) సోమవారం ఆమోదం తెలిపిందని సాక్షి దిన పత్రిక కథనం ప్రచురించింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ఉభయ సభల ముందుకు రానుంది. గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన అనంతరం 2019 డిసెంబర్‌లో ఈ బిల్లుకు కేంద్రం రూపకల్పన చేసింది.
కేంద్ర దర్యాప్తు సంస్థలు, నిఘా ఏజెన్సీలకు ఈ చట్టం నుంచి పలు మినహాయింపులు ఇచ్చింది. ప్రజల వ్యక్తిగత సమాచారానికి గోపత్య కల్పించడం, ఓ ప్రాధికార సంస్థ ద్వారా రక్షణ కల్పించడం ఈ బిల్లు ఉద్దేశం.
జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్నా అంశాలు, జాతీయ భద్రత, శాంతిభద్రతలు, దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తమ దర్యాప్తు సంస్థలకు ఈ చట్టం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వొచ్చు.
ఏదైనా నేరం జరిగే ఆస్కారం ఉందని భావించినా దాన్ని నిరోధించడానికి, ఆ విషయంలో తదుపరి దర్యాప్తు చేయడానికి, సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడానికి వ్యక్తిగత డాటాను విశ్లేషించే అధికారాన్ని ఈ చట్టంలో దర్యాప్తు సంస్థలకు వీలు కల్పించారు.
ఈడీ, సీబీఐలతో సహా తమ దర్యాప్తు సంస్థలకు వ్యక్తిగత గోప్యత రక్షణ హక్కు చట్టం నుంచి మినహాయించే అపరిమిత అధికారాలను కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టడాన్ని విపక్షాలు తీవ్రం ఆక్షేపించాయి.
ఇలా మినహాయింపు ఇవ్వడానికి పార్లమెంటు ఆమోదం తీసుకోవాలని, అప్పుడే సిసలైన జవాబుదారీతనం ఉంటుందని విపక్షాలు కోరినా ప్రభుత్వం అంగీకరించలేదని సాక్షి వివరించింది.
ఇవి కూడా చదవండి:
- చంద్రుడి నుంచి కొంత భాగం విరిగిపోయిందా? భూమికి సమీపంలో తిరుగుతున్న ఈ శకలం ఏమిటి
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: లాజిస్టిక్స్ సూచీలో తెలుగు రాష్ట్రాల ర్యాంకులు ఎందుకు దిగజారాయి?
- సీఏఏ, ఎన్ఆర్సీ విషయంలో కూడా మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా
- పేటీఎం షేర్ ధర మొదటిరోజునే ఎందుకు కుప్పకూలింది... ఈ ఐపీఓ నేర్పే పాఠాలేంటి?
- కడప జిల్లాలో వరదలు: ‘మా కళ్లెదుటే కొందరు కొట్టుకుపోయారు.. మా బంధువుల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు’
- ‘ఆన్లైన్ చదువులకు లక్షల్లో ఫీజులు కట్టాం... ఏమీ అర్థం కాలేదని చెబితే ఏమంటారో’
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- వికాస్ దుబే ఎవరు? ఒక రైతు కొడుకు 'గ్యాంగ్‌స్టర్' ఎలా అయ్యాడు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








