నిమ్మకాయ డీఎన్‌ఏ ఏం చెప్తోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హెలెన్ బ్రిగ్స్
- హోదా, బీబీసీ న్యూస్
నిమ్మకాయతో ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆయుర్వేదంలో దీన్ని ఔషధంగా వాడుతుంటారు.
భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిమ్మ జాతికి చెందిన పండ్లు విరివిగా లభిస్తున్నాయి.
గ్రామీణ భారతంలో ఇంటి పెరట్లో నిమ్మచెట్టు ఉండటం సర్వసాధారణం.
తియ్యని నారింజ నుంచి చేదు నిమ్మకాయల వరకు అన్నింటినీ సిట్రస్ పండ్లగానే భావిస్తారు.
నిమ్మకాయల్లో కూడా ఎన్నో జాతులు, ఉప జాతులు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతకీ నిమ్మకాయ మొదట ఎక్కడ పుట్టింది?
అది ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించింది? ఈ విషయాలపై అమెరికా, స్పెయిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిమ్మకాయ జీనోమ్‌లను అధ్యయనం చేశారు.
ఇందుకోసం నిమ్మ జాతికి చెందిన 50 రకాల పుల్లని పండ్లపై పరిశోధన చేశారు.
చైనా నుంచి మొదలుకొని స్పెయిన్‌లోని సెవిల్ నారింజ పండ్ల వరకు అన్నింటి జినోమ్‌లను క్షుణ్నంగా అధ్యయనం చేశారు.
వీరి పరిశోధనలో అనేక ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి.
పుల్లని పండ్లకు హిమాలయాలే పుట్టినిల్లు
'నిమ్మ జాతికి చెందిన పుల్లని పండ్లకు భారతదేశంలోని హిమాలయాలే పుట్టినిల్లు' అని శాస్త్రవేత్తలు తేల్చారు.
లక్షల సంవత్సరాల క్రితమే హిమాలయాల్లో ఇవి ఉన్నాయని చెప్పారు.
సిట్రస్ పండ్ల డీఎన్‌ఏ ఆధారంగా ఆగ్నేయ హిమాలయ పర్వతపాదాల వద్ద ఇవి ఎక్కువగా ఉన్నట్లు తేలిందని వివరించారు.
తూర్పు అస్సోం, ఉత్తర మయన్మార్, పశ్చిమ యూనాన్ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉండేవని తెలిపారు.
నిమ్మకాయ జాతికి చెందిన పుల్లని పండ్లు పూర్వకాలం తడి వాతావరణంలో ఎక్కువగా పెరిగేవట.

ఫొటో సోర్స్, Getty Images
మిలియన్ సంవత్సరాల క్రితం సిట్రస్ పండ్లలో జీవపరిణామం
కానీ సుమారు 25 నుంచి 10 మిలియన్ సంవత్సరాల క్రితం వాతావరణ మార్పులతో సిట్రస్ పండ్లలో ఒక్కసారిగా జీవపరిణామం సంభవించిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
తక్కువ వర్షపాతం, పొడి వాతావరణం కారణంగా ఇవి హిమాలయ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించాయని చెబుతున్నారు.
అదే సమయంలో రేడియేషన్ కారణంగా తడి వాతావరణం నుంచి పొడి వాతావరణంలోనూ పెరిగేలా ఈ చెట్లు మార్పు చెందాయని అంచనా వేస్తున్నారు.
క్రమంగా అవి ఆగ్నేయాసియాకు, అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
ప్రస్తుతం పెరట్లో, కిచెన్ టేబుళ్ల మీద కూడా పెంచుకునేలా నిమ్మచెట్లను అభివృద్ధి చేశారని వారు వివరించారు.
సిట్రస్ చెట్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు 50 రకాల పుల్లని పండ్లపై పరిశోధన చేశారు.
ఈ పరిశోధన వివరాలతో ఒక సమగ్ర కథనం 'నేచర్ జర్నల్'లో ప్రచురించారు.
ప్రస్తుత నారింజ, నిమ్మకాయలు లక్షల సంవత్సరాల జీవ పరిణామం ఫలితమేనని తేల్చారు. శతాబ్దాలుగా మానవుడు చేస్తున్న మొక్కల పెంపకం కూడా దీనికి ఒక కారణమని అన్నారు.
అయితే, వాటి చరిత్రకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు మాత్రం ఇప్పటి వరకు లభించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త వంగడాల సృష్టికి అవకాశం
తెగుళ్లను తట్టుకుని నిలబడిన సిట్రస్ పండ్ల జెనెటిక్ పటాలను పరిశోధించడం ద్వారా కొత్త వంగడాలను సృష్టించేందుకు శాస్త్రవేత్తలకు అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు.
'సిట్రస్ పండ్ల వైవిధ్యం, జన్యు సంబంధాలను అర్థం చేసుకోవడం కొత్త సిట్రస్ పండ్ల ఉత్పత్తిలో తొలి అడుగు' అని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ, జాయింట్ జీనోమ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకుడు ఆల్బర్ట్ వూ అన్నారు.
సిట్రస్ పండ్లపై మరిన్ని పరిశోధనలు చేసే దిశగా ఈ అధ్యయనం దోహదపడుతుందని క్యూ పట్టణంలోని రాయల్ బొటానికల్ గార్డెన్స్ జోడ్రెల్ లాబోరేటరీ పరిశోధకులు డాక్టర్ ఇలియా లీచ్ అన్నారు.
ఒక చెట్టు ఎలా పరిణామం చెందింది, ఎలా సరిహద్దులు దాటి, డీఎన్‌ఏలను మార్చుకుంది, కాలక్రమంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనే వివరాలను ఈ పరిశోధనతో తెలుసుకోవచ్చని ఇలియా లీచ్ చెప్పారు.
అంతేకాదు, వాతావరణ మార్పులు తట్టుకునేలా కొత్త వంగడాలను సృష్టించేందుకు కూడా ఈ అధ్యయనం సహాయ పడుతుందని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- కొబ్బరి నూనెను కూరల్లో వాడొచ్చా?
- కాఫీ ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- ఒకచోట ఉండే మహిళలకు పీరియడ్స్ ఒకేసారి వస్తాయా?
- ఈ రాళ్లు శిలాయుగపు ఆనవాళ్లు!
- ఇది కొత్త ప్రేమ ఫార్ములా
- ‘రామసేతు’పై మళ్లీ వివాదం!
- పొడవుంటే కేన్సర్ రిస్క్ ఎక్కువా?
- ఛాతి నొప్పా? గుండెపోటా?: నిమిషాల్లో నిర్ధరణ
- గుజరాత్లో అరుదైన శిలాజాలు కనుగొన్న తెలుగు ప్రొఫెసర్
- అణు దాడి జరిగితే ట్రంప్ ఎక్కడ తలదాచుకుంటారు?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








