బెత్లెహాంలోని ఈ ‘పాల గుహ’ మట్టికి పిల్లల్ని పుట్టించే శక్తి ఉందా?

బెత్లెహాంలోని పాల గుహ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బెత్లెహాంలోని పాల గుహ
    • రచయిత, యోలాండె నెల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బెత్లెహాంలోని చర్చ్ ఆఫ్ ది నేటివిటీ పక్కనే ఉన్న సన్నని, ఇరుకైన వీధి సావనీర్లు అమ్మేవారితో కిటకిటలాడుతూ ఉంటుంది. అనేకమంది విదేశీయులు ఈ చర్చిని సందర్శించుకోవడానికి వస్తుంటారు. కానీ ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ వీధి నిర్మానుష్యమైపోయింది.

పక్కనే ఉన్న మిల్క్ గ్రోటో (పాల గుహ) అని పిలిచే చిన్న చర్చి కూడా మనుషులు లేక బోసిపోయింది. బెత్లెహాం చర్చికి వచ్చేవారిలో సగంమంది ఈ పాల గుహ చర్చిని పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ స్థలానికి ఒక ప్రత్యేకత ఉంది.

ఈ చర్చి మదర్ మేరీ మాతృత్వానికి ప్రతీక. ఇక్కడ అమ్మ ప్రేమకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే సంతానోత్పత్తి కలుగుతుందని అనేకమంది విశ్వసిస్తారు.

మేరీ మాత తన బిడ్డకు పాలిస్తున్నప్పుడు కొన్ని పాల చుక్కలు రాలి పడి ఎర్రటి రాళ్లతో నిండి ఉన్న ఈ స్థలం తెల్లగా మారిపోయిందని చెప్తారు
ఫొటో క్యాప్షన్, మేరీ మాత తన బిడ్డకు పాలిస్తున్నప్పుడు కొన్ని పాల చుక్కలు రాలి పడి ఎర్రటి రాళ్లతో నిండి ఉన్న ఈ స్థలం తెల్లగా మారిపోయిందని చెప్తారు

"ఈ చర్చి నాకు ఒక ప్రేరణ" అని సిస్టర్ నయోమీ జిమ్మర్‌మ్యాన్ అంటున్నారు. సిస్టర్ నయోమి 90లలో మొట్టమొదట ఈ చర్చిని సందర్శించడానికి వచ్చారు. తరువాత దగ్గర్లో ఉన్న సెంటర్‌లో కౌన్సిలింగ్ సేవలు చెయ్యడం ప్రారంభించారు.

"ఇదొక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ, జీవితంలోని అద్భుతాలు..బిడ్డను కనడం, తల్లి ఆరోగ్యం దర్శనమిస్తాయి. ఇది నాకు చాలా ఇష్టమైన ప్రదేశం" అని సిస్టర్ నయోమి తెలిపారు.

అత్యంత గొప్ప బహుమతి

ఈ గుహలోకి వెళుతుంటే ప్రవేశ ద్వారం దగ్గరే చంటిబిడ్దకు పాలిస్తున్న మదర్ మేరీ దర్శనమిస్తారు. హేరోదు రాజు అమాయకులను ఊచకోత కోస్తున్నప్పుడు మేరీ మాత కుటుంబం ఇక్కడ తలదాచుకున్నదని చెప్తారు.

మేరీ మాత తన బిడ్డకు పాలిస్తున్నప్పుడు కొన్ని పాల చుక్కలు రాలి పడ్డాయని, వెంటనే ఎర్రటి రాళ్లతో నిండి ఉన్న ఈ స్థలం తెల్లగా మారిపోయిందని చెప్తారు.

ఇక్కడి సున్నపురాయిని పొడి చేసి తయారుచేసిన పాలపొడితో కాచే పానీయం తాగితే సంతానోత్పత్తి కలుగుతుందని భావిస్తారు.

ఇది జీవితంలోని అద్భుతాలను చూపిస్తుంది అని సిస్టర్ నయోమీ జిమ్మర్‌మ్యాన్ అంటున్నారు
ఫొటో క్యాప్షన్, ఇది జీవితంలోని అద్భుతాలను చూపిస్తుంది అని సిస్టర్ నయోమీ జిమ్మర్‌మ్యాన్ అంటున్నారు

ఈ పాలగుహ శక్తి గురించి బెత్లెహాంలోని అనేకమంది క్రైస్తవులు అనేక కథనాలు చెప్తారు. ఒక మహిళకు ఎన్నో ఏళ్లుగా సంతానం కలుగలేదు. చివరకు ఆమె, తన భర్తతో కలిసి పాల గుహకు వచ్చి ప్రార్థించిన తరువాత క్రిస్మస్ సమయంలో ఒక బిడ్డకు జన్మనిచ్చారు.

"నాకు జీవితంలో లభించిన అత్యంత గొప్ప బహుమతి ఇదే" అని ఆమె అన్నారు.

"అమెరికాలో ఉన్న నా స్నేహితురాలు తన సోదరి కోసం ఈ పాల పొడిని తీసుకుని వెళ్లారు. ఆమె సోదరికి వివాహమై 25 సంవత్సరాలైనా సంతానం కలుగలేదు. తరువాత ఒక ఏడాదికి నా స్నేహితురాలు ఇక్కడకు వచ్చినప్పుడు తన సోదరికి పుట్టిన బిడ్డ ఫొటో చూపించారు" అని ఇక్కడి టూరిస్ట్ గైడ్ సాద్ ఫెయిర్ చెప్పారు.

"ఇదంతా భూటకం అని సులువుగా కొట్టిపారేయొచ్చు. కానీ ఇది నమ్మకానికి, విశ్వాసానికి సంబంధించిన విషయం" అని సిస్టర్ నయోమి అన్నారు.

మిరాకల్ బేబీ

అనేక సంవత్సరాలుగా ఇక్కడ జరిగిన అద్భుతాలకు సాక్ష్యమిస్తూ ఈ చర్చి ఆఫీసులో ప్రపంచం నలుమూలలనుంచీ వచ్చిన అనేక ఉత్తరాలు ఉన్నాయి.

భారతదేశంనుంచీ వచ్చిన ఒక ఉత్తరంలో ఒక ముద్దులొలికే పాప ఫొటో ఉంది. రెండుసార్లు అబార్షన్లు అయిన తరువాత ఈ పాల పొడి తీసుకున్నామని, వెంటనే తమకు సంతానం కలిగిందని చెప్తూ ఆ లేఖ రాసారు.

"ఇక్కడకు వచ్చి నేను ఏడుస్తూ ప్రార్థించాను. రెండు నెలల తరువాత నేను ప్రగ్నెంట్ అయ్యాను" అని ఒక ఫ్రెంచ్ మహిళ తెలిపారు.

బ్రెజిల్‌కు చెందిన మరొక మహిళ కూడా ఇలాంటి అద్భుతమే జరిగిందని చెప్పారు. తనకు ఇంక సంతానం కలగదని తెలిసిన తరువాత టీవీలో ఈ చర్చి గురించి విన్నానని, ఈ పాల పొడి తెప్పించుకుని తాగానని తరువాత తనకు ఒక చక్కని పాప పుట్టిందని ఆమె తెలిపారు.

ఇక్కడికొచ్చి ప్రార్థన చేస్తే సంతానోత్పత్తి కలుగుతుందని నమ్మకం
ఫొటో క్యాప్షన్, ఇక్కడికొచ్చి ప్రార్థన చేస్తే సంతానోత్పత్తి కలుగుతుందని నమ్మకం

మత విశ్వాసాలు ఎలా ఉన్నాగానీ ఈ పాల గుహను సందర్శిస్తే ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. ఇక్కడి రాతి వలన లోపల చల్లగా ఉండి, నిశ్శబ్దంగా ఉంటుంది.

గుహలో ఓ మూల సైలెన్స్ అని రాసి ఉంటుంది. అక్కడి చాపెల్‌లో నన్స్ నిశ్శబ్దంగా ప్రార్థనలు చెయ్యడం చూడవచ్చు.

ముస్లిం మహిళలు కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. ప్రపంచం నలుమూలలనుంచీ అనేకమంది మహిళలు ఈ గుహకు వచ్చి మేరీ మాత ఎదుట నిల్చుని ప్రార్థనలు చేస్తారు.

జీసస్‌ను ఎత్తుకుని పాలు ఇస్తున్న మేరీ మాత విగ్రహం చూస్తే స్త్రీ శక్తి, తల్లి ప్రేమ తప్పక స్ఫురిస్తుంది.

ఆశ చిగురిస్తుంది

కోవిడ్ కారణంగా ప్రస్తుతం ఈ చర్చిని కొన్ని గంటలపాటే తెరిచి ఉంచుతున్నారు. అక్కడ ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నారు. సంతానం కలగని ఒక అమెరికా దంపతుల అభ్యర్థన మేరకు..వారికి సంతానం కలగాలని మేరీ మాతను ప్రార్థిస్తున్నారు.

"పిల్లలు లేకపోవడం చాలా బాధగా ఉంటుంది. పిల్లలు జీవితానికి ఒక అర్థాన్ని తీసుకొస్తారు. మేరీ మాకు తల్లి. మా ప్రార్థనలు ఆలకించి, కరుణించే దేవత. నేనిక్కడ పని చెయ్యడం నా అదృష్టం" అని ఆ వ్యక్తి చెప్పారు.

"ఈ కోవిడ్ మహమ్మారి సమయంలో ఇది ఒక ఆశను చిగురింపజేస్తుంది" అని ఆయన అన్నారు.

నేటివిటీ చర్చి క్రిస్మస్‌నాడు జీసస్ పుట్టుకను వేడుకగా జరుపుకుంటే, ఈ మిల్క్ గ్రోటో పసిపాపల చిరునవ్వును, వారు తీసుకురాగల అందమైన భవిష్యత్తును ప్రతిబింబిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)