షార్ @100: శ్రీహరికోట నుంచి వందో ప్రయోగానికి కౌంట్‌డౌన్

ఇస్రో, భారత్, శ్రీహరికోట, స్పేస్ రీసర్చ్

ఫొటో సోర్స్, ISRO/facebook

ఫొటో క్యాప్షన్, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఆంధ్రప్రదేశ్‌లోని షార్ కేంద్రం నుంచి 100వ ప్రయోగానికి సిద్ధమైంది.
    • రచయిత, శ్రీకాంత్ బక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో గల సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (SDSC SHAR) వందో ప్రయోగానికి సిద్ధమైంది.

2024 సంవత్సరాన్ని ఒక విజయవంతంమైన మిషన్‌తో పూర్తి చేసిన ఇస్రో.. 2025 కొత్త ఏడాదిని కూడా మరో మైలురాయితో ప్రారంభించబోతోంది. శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రం నుంచి వందో ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది.

ఈ నెల 29వ తేదీ ఉదయం 6:23 గంటలకు చేపట్టనున్న GSLV-F15 రాకెట్‌ ప్రయోగం షార్ నుంచి చేసే వందో ప్రయోగమని ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.

శత ప్రయోగాల షార్

2024 డిసెంబర్ చివరి వారంలో, స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా ప్రయోగించిన PSLV C- 60 ప్రయోగ సమయంలో ఇది షార్ నుంచి చేసిన 99వ ప్రయోగమని అప్పటి ఇస్రో చైర్మన్‌ సోమనాథ్ తెలిపారు. ఈ ప్రయోగంలోనే ఇస్రో అంతరిక్షంలో రెండు శాటిలైట్లను డాకింగ్ చేసి, డాకింగ్ సామర్థ్యం ఉన్న నాలుగో దేశంగా చరిత్ర సృష్టించింది.

శాటిలైట్ డాకింగ్ ద్వారా 2025ను కూడా సక్సెస్ ఫుల్‌గా ప్రారంభించిన ఇస్రో ఈ ఏడాది మొదటి నెలలోనే శ్రీహరికోట నుంచి వందో ప్రయోగానికి సిద్ధమైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఫెయిల్యూర్‌తో మొదలైన సక్సెస్ జర్నీ

సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి 1979 ఆగస్ట్ 10న SLV 3E -1 రాకెట్ ద్వారా రోహిణి టెక్నాలజీ పేలోడ్‌ని ప్రయోగించింది. కానీ ఈ ప్రయోగం సఫలం కాలేదు. అయితే, ఆ తర్వాత జరిపిన రెండు ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి.

షార్ నుంచి ఇస్రో జరిపిన 99 ప్రయోగాల్లో 9 మాత్రమే విఫలమయ్యాయి.

విజయవంతమైన ప్రయోగాల్లో 129 స్వదేశీ ఉపగ్రహాలను, 433 విదేశీ ఉప గ్రహాలను, రెండు ప్రైవేట్ ఉపగ్రహాలను, ఒక గగనయాన్ టెస్ట్ వెహికిల్ డీ వన్, 18 స్టూడెంట్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది.

అంతరిక్ష రంగంలో ఇంత సక్సెస్ రేటు సాధించడం చాలా క్లిష్టమైన విషయం.

ఇస్రో, భారత్, అంతరిక్ష పరిశోధన

ఫొటో సోర్స్, ISRO/facebook

ఫొటో క్యాప్షన్, జనవరి 29న GSLV-F15 రాకెట్‌‌ను రోదసిలోకి ప్రయోగించనుంది

వందో ప్రయోగంలో ఏం ఉంది?

ఇస్రో షార్ నుంచి ప్రయోగించబోయే వందో మిషన్‌లో, దేశ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ (నావిక్‌)లో భాగమైన SVN 02 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి దీన్ని ప్రయోగించనున్నారు.

ఈ నావిక్‌ అనేది స్వదేశీ ప్రాంతీయ నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థ. ఇది భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థ ద్వారా భారత్‌తో పాటు భారత్ సరిహద్దుల నుంచి 1500 కిలోమీటర్ల పరిధి వరకూ కచ్చితమైన నావిగేషన్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

ఇప్పటి వరకూ నావిక్ వ్యవస్థ కోసం చాలా శాటిలైట్లను ప్రయోగించిన ఇస్రో తాజా ప్రయోగంలో కూడా ఇదే కోవకు చెందిన నావిగేషన్ వ్యవస్థను ప్రయోగిస్తోంది. ఇందులో భాగంగా, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అటామిక్ క్లాక్‌ను పంపిస్తోంది.

గతంలో ఈ టెక్నాలజీ కోసం రష్యా మీద ఆధారపడిన భారత్ ఇప్పుడు స్వయంగా ఈ టెక్నాలజీని తయారు చేసుకుంది.

ఇన్నాళ్లుగా భారత గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ నావిక్‌ను రిసీవ్ చేసుకునే రిసీవర్లు చాలా పెద్దవిగా ఉండేవి. కానీ, తాజా ప్రయోగంతో చిన్న చిప్ లెవెల్ పరికరాలు కూడా నావిక్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకునే సామర్థ్యాన్ని సంతరించుకోనున్నాయి. అంటే, మనం వాడే స్మార్ట్ వాచ్ లాంటి వాటిల్లో కూడా నావిక్ వ్యవస్థను వినియోగించుకోవచ్చు.

ఇలాంటి గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ పనిచేయడంలో అటామిక్ క్లాక్ చాలా కీలకమని, అందులోనే భారత్ మరింత స్వయం సమృద్ధి సాధించిందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ బీబీసీతో తెలిపారు. జీపీఎస్, గ్లోనాస్ వంటి విదేశీ టెక్నాలజీ మీదనే ఆధారపడుతున్న భారత్, ఇకపై మరింతగానావిక్ మీద ఆధారపడుతుందని రఘునందన్ తెలిపారు.

ఇస్రో, అంతరిక్ష పరిశోధన, భారత్, శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, https://x.com/isro

ఫొటో క్యాప్షన్, ఇస్రో విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతూ స్పేస్ బిజినెస్‌లో తన వాటాను పెంచుకుంటోంది.

ఆర్యభట్టతో మొదలైన అడుగులు..

తొలినాళ్లలో రష్యా, అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాల రాకెట్లలో ఉపగ్రహాలను పంపించిన భారత్... ఇప్పుడు స్వయంగా శాటిలైట్లను పంపించడమే కాకుండా, విదేశాలకు చెందిన వందలాది ఉపగ్రహాలను కూడా పంపించి భారీ స్థాయిలో లాభాలను ఆర్జిస్తోంది.

షార్‌లో 45 ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్న ఇస్రో.. ఇటీవలి కాలంలో ఎక్కువ విజయాలు సాధిస్తూ వస్తోంది. 1979 నుంచి 2000 వరకూ షార్ కేంద్రంగా 13 ప్రయోగాలు చేస్తే అందులో 4 విఫలమయ్యాయి.

ఆరంభం నుంచి 2009 వరకూ షార్‌లో 29 ప్రయోగాలు చేసిన ఇస్రో, 2010 నుంచి 2024 వరకూ గడచిన 15 ఏళ్లలో 70 ప్రయోగాలు చేపట్టింది. ఇందులో 5 మాత్రమే విఫలమయ్యాయి.

తొలినాళ్లలో స్వదేశీ ఉపగ్రహాలను పంపించిన ఇస్రో.. షార్ కేంద్రంగా అభివృద్ధి చెందుతూ విదేశీ ఉపగ్రహాలను కూడా పంపిస్తూ స్పేస్ బిజినెస్‌లో తన వాటాను పెంచుకుంటూ వస్తోంది. భవిష్యత్తులో ఈ వాటాను మరింత పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది.

ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయికి.. రెండున్నర రూపాయలు ప్రతిఫలం పొందుతోందని ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ కర్ణాటకలో జరిగిన ఒక సెమినార్‌లో తెలిపారు.

ఇస్రో, అంతరిక్ష పరిశోధన, భారత్

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, ఇస్రో అతి తక్కువ ఖర్చుతో, స్వదేశీ పరిజ్ఞానంతో శాటిలైట్లు, రాకెట్లను తయారు చేస్తోంది

ఇస్రో సక్సెస్ కారణాలివే..

1969 ఆగస్ట్ 15న ఇస్రో అంతరిక్ష రంగంలో తొలి అడుగు వేసింది. కానీ, అప్పటికి నెలముందే అమెరికా ఏకంగా చంద్రుడి మీద తొలిసారి కాలుమోపి చరిత్ర సృష్టించింది. అలాంటి ఇస్రో ఇప్పుడు అంతరిక్ష రంగంలో అతి తక్కువ ఖర్చుతో, అత్యంత క్లిష్టమైన ప్రయోగాలను తొలి ప్రయత్నాల్లోనే సుసాధ్యం చేస్తూ అంతరిక్ష పరిశోధనల్లో దూసుకెళ్తోంది.

''షార్ కేంద్రంగా ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో గత పాతికేళ్లలో ఎక్కువ సక్సెస్ అవుతున్నాయి. దీనికి చాలా అంశాలు దోహదం చేస్తున్నాయి.అందులో అంతరిక్ష రంగంలో ఇస్రో స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం ప్రధాన కారణం'' అని రఘునందన్ అన్నారు. శాటిలైట్ల మినియేషన్ చెప్పుకోదగ్గ మరో కారణమని ఆయన చెప్పారు.

తొలినాళ్లలో శాటిలైట్లు చాలా పెద్ద పరిమాణంలో, అధిక బరువుతో ఉండేవని, కానీ ఇప్పుడు చాలా చిన్న పరిమాణంలో తక్కువ బరువున్న శాటిలైట్లను తయారు చేస్తున్నారని రఘునందన్ తెలిపారు.

ఇలా, శాటిలైట్ల పరిమాణం తగ్గడం, మరోపక్క రాకెట్ల సామర్థ్యం పెరగడం వల్ల.. ఇస్రో ఏకంగా 104 శాటిలైట్లను ఒక్క మిషన్‌లోనే విజయవంతంగా ప్రయోగించి చరిత్ర సృష్టించింది.

ఇస్రో, అంతరిక్ష పరిశోధన, భారత్, శ్రీహరికోట

ఫొటో సోర్స్, ISRO/facebook

ఫొటో క్యాప్షన్, నిపుణులైన మానవ వనరులు కూడా ఇస్రో విజయపరంపరకు ముఖ్య కారణం.

గతంలో అంతరిక్ష రంగానికి బడ్జెట్ కేటాయింపులు కూడా తక్కువగా ఉండేవి. కానీ, కాలానుగుణంగా ఇస్రో తన విజయాలతో అంతరిక్ష మార్కెట్లో తన వాటాను పెంచుకుంటూ రావడంతో బడ్జెట్ కేటాయింపులు కూడా పెరిగాయి.

కేవలం బడ్జెట్ పెంచుకోవడం వరకే పరిమితం కాకుండా, ఇస్రో అతి తక్కువ ఖర్చుతో, స్వదేశీ పరిజ్ఞానంతో శాటిలైట్లు, రాకెట్ల తయారీ చేపట్టింది. ఒకప్పుడు క్రయోజనిక్ ఇంజిన్లను రష్యా నుంచి దిగుమతి చేసుకునే ఇస్రో, ఇప్పుడు వాటిని స్వయంగా తయారుచేసుకుంది.

ఇలా ఖర్చులు తగ్గించుకుని, ఎక్కువ సక్సెస్ రేటు సాధించడం వల్ల స్పేస్ మార్కెట్లో చిన్న చిన్న దేశాలకు ఆశాదీపంలా కనిపిస్తోంది.

అమెరికా, రష్యా వంటి పెద్ద దేశాల కన్నా తక్కువ ధరకే విదేశీ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపుతోంది. అంతరిక్ష రంగంలో నిపుణులైన మానవ వనరుల లభ్యత కూడా ఇస్రో విజయపరంపరకు దోహదం చేస్తోంది.

ఇస్రో సాధిస్తున్న ఒక్కో విజయం మరో భారీ విజయానికి బాటలు వేస్తోంది. చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య L1 వంటి మిషన్లు విజయవంతం కావడంతో అదే స్ఫూర్తితో వీనస్ ఆర్బిట్ మిషన్, గగనయాన్, భారత అంతరిక్ష స్టేషన్, చంద్రుడి మీదకు మనుషుల్ని పంపడం వంటి లక్ష్యాలు సాధించేందుకు వడివడిగా అడుగులేస్తోంది.

షార్‌లో 100వ ప్రయోగం

ఫొటో సోర్స్, Getty Images

షార్‌లో మూడో లాంచింగ్ ప్యాడ్

శ్రీహరికోటను రాకెట్ కేంద్రంగా గుర్తించిన మొదటి రోజుల్లో ఇక్కడ సౌండింగ్ రాకెట్లు ప్రయోగించేవారు. ఆ తర్వాత చిన్న పాటి SLV, ASLV రాకెట్లు ప్రయోగించారు.

షార్‌లో ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నిర్మించిన తర్వాత 1995 నుంచి 2005 వరకూ ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆ తర్వాత బరువైన ఉపగ్రహాలను ప్రయోగించేందుకు రెండో లాంచ్ ప్యాడ్ తయారు ఏర్పాటు చేశారు.

ఇక్కడే మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసింది.

ఇక్కడి నుంచి న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్స్‌ను ప్రయోగించాలని యోచిస్తున్నారు. భవిష్యత్తులో ఇస్రో చేపట్టనున్న గగనయాన్, భారత్ అంతరిక్ష కేంద్రం వంటి ప్రయోగాలకు ఇదే కీలకం కానుంది.

ఈ న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికిల్‌తో 20 నుంచి 25 టన్నుల బరువైన ఉపగ్రహాలను ప్రయోగించవచ్చు. షార్‌తో పాటుగా తమిళనాడులోని కులశేఖర పట్నంలో కూడా మరో రాకెట్ లాంచింగ్ ప్యాడ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

ఇస్రో షార్‌లో చేపట్టిన ఈ వందో ప్రయోగం విజయవంతమైతే.. తదుపరి ప్రయోగాలకు ఇది మరింత ఉపయోగకారిగా ఉంటుంది. అంటే, మానవ సహిత గ్రహాంతర ప్రయోగాల వంటి కొత్త శకానికి ఇస్రో ఈ వందో ప్రయోగంతో తొలి అడుగు వేసినట్లు అవుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)