తేనెటీగలంటే ఏనుగులకు భయమా? కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఏం చేశారంటే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గెన్నారో టొమ్మా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ భూములు విస్తరిస్తుండటంతో ఏనుగులు ఆవాసాలు కోల్పోయి, పంట చేలలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో తరచుగా ప్రమాదకర ఘటనలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పలు ప్రాంతాలతోపాటు భారతదేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో పంటపొలాలపై, ఇళ్లపై ఏనుగుల దాడులు సర్వసాధారణంగా మారాయి. వీటిని అడ్డుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు బాధితులు.
అయితే, కెన్యాలో దశాబ్దాల పరిశోధన తర్వాత, ఏనుగులు పంటలను పాడుచేయకుండా అరికట్టడానికి ఒక ఉపాయాన్ని కనుగొన్నారు. పంటచేను వద్ద తేనెటీగల ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేయడమే ఆ ఉపాయం.
‘ఏనుగులకు తేనెటీగలంటే పడదు’ అనే స్థానిక కథ నుంచి ప్రేరణ పొంది ఈ తేనెటీగల ఫెన్సింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఏనుగు దాడుల నుంచి తప్పించుకోగలుగుతున్నారు.
ఇప్పుడు మొజాంబిక్ నుంచి థాయిలాండ్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ పద్ధతి విస్తరిస్తోంది.
మరి ఏనుగులు తేనెటీగలను ఎందుకు ద్వేషిస్తాయి ? ఏనుగు దాడుల నుంచి తేనెటీగలు ఈ ప్రపంచాన్ని కాపాడతాయని అనుకోవచ్చా?

మానవులు-ఏనుగుల మధ్య ఘర్షణ అనేది అనేక ప్రాంతాలలో పెరుగుతున్న సమస్య . ముఖ్యంగా కెన్యాలో.
‘‘వ్యవసాయ భూముల విస్తరణ, చెట్ల నరికివేత, పట్టణీకరణ, ఏనుగుల ఆవాసాలు కుచించుకుపోవడం- అవి పెద్ద స్థలం అవసరమయ్యే వన్యప్రాణులు కావడం వంటి కారణాలతోపాటు, ఆహారం, నీటి కోసం ఏనుగులు మానవ నివాసాలలోకి ప్రవేశిస్తున్నాయి " అని ఇథియోపియాకు చెందిన ఏనుగుల సంరక్షణ, హ్యూమన్-ఎలిఫెంట్ కాన్‌ఫ్లిక్ట్ పై అనేక ప్రభుత్వాలకు, లాభాపేక్షలేని సంస్థలకు సలహాదారుగా పని చేస్తున్న గ్రెటా ఫ్రాన్సిస్కా ఇయోరి అన్నారు.
నీరు, పచ్చని, అధిక పోషకాలున్న పంటలు ఏనుగులకు ఆకర్షణీయంగా ఉంటాయి. అలాంటి పంటలు మానవ నివాసాలకు దగ్గరగా ఉంటాయి.
‘‘ప్రజలు తమ భూమిని జాగ్రత్తగా చూసుకోవడానికి చాలా కష్టపడతారు. కానీ ఏనుగులు పంటలు కోతకొచ్చెసమయానికి వస్తాయి. పంటంతా నాశనమవుతుంది. మాలో కొందరికి వ్యవసాయమే జీవనాధారం. అలాంటిది రాత్రికి రాత్రే పంటంతా నాశనమైతే ఎలా ఉంటుందో ఊహించుకోండి" అని అని మ్వాకోమాలో నివసించే రైతు ఇమ్మాన్యుయేల్ మ్వాంబా చెప్పారు.
ఏనుగులను తరమడం కూడా ఇరువైపులా ప్రాణాంతకం కావచ్చు. ఆకలితో ఉన్న ఏడు టన్నుల బరువైన ఏనుగులు తమ పంటల్లోకి రాకుండా ఆపడానికి ప్రయత్నించి రైతులు చనిపోవచ్చు,లేదంటే పంటంతా మేసినందుకు మనుషుల చేతిలో ఏనుగులే చనిపోవచ్చు.
దీనిని నివారించడానికి, పంటచేలల్లోకి ఏనుగుల రాకను అరికట్టడానికి శాస్త్రవేత్తలు, స్థానికులు దశాబ్దాలుగా విద్యుత్ కంచెలు, వాచ్‌టవర్లు సోలార్ స్పాట్‌లైట్‌ల నుంచి మిరపపొడి పూసిన ఇటుకలు, దుర్వాసన వచ్చే మందులు, శబ్దాలు చెయ్యడం వంటి వివిధ పరిష్కారాలను పరీక్షిస్తున్నారు. అయితే వీటివల్ల లాభాలున్నాయి, నష్టాలున్నాయి.
కానీ ఏనుగులను భయపెట్టడానికి తేనెటీగలను ఉపయోగించడం రైతులకు అనేక ఇతర ప్రయోజనాలతో పాటు సమర్థవంతమైందిగా పనిచేస్తోంది.
‘‘మేం రెండు తేనెటీగల పెట్టెలతో ప్రారంభించాం. ఇప్పుడు మాకు మూడు గ్రామాలకు కంచెలాగా 700 తేనెటీగల పెంపకం కేంద్రాలు ఉన్నాయి. ఇది మా కమ్యూనిటీకి కూడా మేలు చేస్తుంది.’’ అని ఇమ్మాన్యుయేల్ మ్వాంబా అన్నారు.
ఇదంతా 2000ల ప్రారంభంలో ప్రారంభమైంది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పర్యావరణ శాస్త్రవేత్త, సేవ్ ది ఎలిఫెంట్స్ చారిటీ చైర్మన్ ఫ్రిట్జ్ వోల్రాత్, సేవ్ ది ఎలిఫెంట్స్ వ్యవస్థాపకుడు ఇయాన్ డగ్లస్-హామిల్టన్‌లు ఒక కథ విన్నారు.
కెన్యా పశువుల కాపరులు చెప్పిన ఈ కథ ప్రకారం, తేనెతెట్టెలున్న చెట్లను ఏనుగులు ముట్టుకోవు. కారణం తేనెటీగలంటే వాటికి ఉన్న భయం.

ఫొటో సోర్స్, Save the Elephants
ఈ కథ నుంచి ప్రేరణ పొందిన వోల్రాత్, డగ్లస్-హామిల్టన్‌లు సేవ్ ది ఎలిఫెంట్స్ సంస్థ కో డైరక్టర్ లూసీ కింగ్‌తో కలిసి పరిశోధన ప్రారంభించారు.
ఆఫ్రికన్ తేనెటీగలంటే ఏనుగలకు భయమని, అవి కనిపిస్తే తాము దూరంగా వెళ్లడమే కాకుండా, ఇతర ఏనుగులను కూడా హెచ్చరిస్తాయని 2007 నాటికి గుర్తించారు.
ఈ పరిశోధన ఆధారంగా, ఆకలితో ఉన్న ఏనుగుల నుంచి రైతులు తమ పంటలను రక్షించుకోవడానికి ఉపయోగించే ఒక సాధనాన్ని కింగ్ రూపొందించారు. అదే తేనెటీగల ఫెన్సింగ్.
ఆమె మొదట 2008లో కెన్యాలోని లైకిపియాలోని ఒక కమ్యూనిటీలో ఈ ఐడియాను టెస్ట్ చేశారు. ఆ ప్రాంతంలో తరచూ ఏనుగులు పంటలపై దాడులు చేస్తుంటాయి.
ఆ కంచె ఒక పొలం చుట్టూ ఉంటుంది. రెండు స్తంభాల మధ్య ప్రతి 10 మీటర్ల దూరంలో తేనెతెట్టె బాక్సులను పెడతారు. ఆఫ్రికన్ తేనెటీగలు సహజంగా ఆ తుట్టెల్లో స్థిరపడతాయి.
"ఒక ఎకరం వ్యవసాయ భూమికి, 24 తేనెటీగల గూళ్ళు అవసరం" అని కింగ్ చెప్పారు.
అయితే, వీటిలో 12 మాత్రమే నిజమైనవి: మిగతావన్నీ నకిలీ తేనెటీగల గూళ్ళు. పసుపు రంగు ప్లైవుడ్‌తో తయారు చేసిన నకిలీ గూళ్ళు. ఇవి ఏనుగులకు నిజంగా ఉన్న దానికంటే ఎక్కువ తేనెటీగల గూళ్ళు ఉన్నాయనే భ్రమను కలిగిస్తాయి. రైతులకు ఖర్చులను తగ్గిస్తాయి.
‘‘చీకటిలో ఏనుగులు పంట దగ్గరకు వచ్చినప్పుడు, అవి తేనెటీగల వాసన చూడగలవు, తేనెను పసిగట్టగలవు. పసుపు పెట్టెలను చూడగలవు. ఏది నిజమైనదో, ఏది నకిలీదో వాటికి తెలియదు. కాబట్టి ఇది ఒక భ్రమ. అది వర్కౌట్ అయ్యింది" అని కింగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Meha Kumar/ Save the Elephants
ఈ కంచెవల్ల కృత్రిమంగా తేనెను ఉత్పత్తి చేసుకుని రైతులు అదనపు ఆదాయాన్ని సంపాదించవచ్చు.
"ఒక రైతు దగ్గర పంటలతోపాటు తేనె కూడా ఉంటే, కుటుంబం మరింత అభివృద్ధి చెందుతుంది." అని మ్వాంబా చెప్పారు.
తేనెటీగల కంచెలను పరీక్షించిన గ్రామాలలో ఒకదానిలో నివసిస్తున్న మ్వాంబా, ఇప్పుడు సేవ్ ది ఎలిఫెంట్స్ తరఫున తేనెటీగల కంచె ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా మారారు. కంచెలను ఎలా నిర్మించాలో రైతులకు నేర్పుతున్నారు.

ఫొటో సోర్స్, Jane Wynyard/ Save the Elephants
అయితే దీంట్లో కొన్ని ఇబ్బందులున్నాయని వేల్స్ లోని బంగోర్ యూనివర్సిటీలో వైల్డ్ లైఫ్ ఎకాలజిస్టుగా పని చేస్తున్న గ్రేమీ షానన్ అన్నారు.
ఉదాహరణకు, కరువు సంవత్సరాల్లో పుష్పించే మొక్కలు లేకపోవడం వల్ల తేనెటీగల సంఖ్య తగ్గిపోతుంది. 2018లో అంతకు ముందు సంవత్సరం కరువు నుంచి తేనెటీగలు కోలుకునేలోగా, ఏనుగులు పెద్ద ఎత్తున గ్రామాల మీద దాడులు చేశాయి. ఈ ఫెన్సింగ్ కొంత వరకు పని చేయలేదు.
‘‘ఏదైనా ఒక పద్ధతి లేదా సాధనం ఎంత ప్రభావవంతంగా పని చేస్తుందనేదానికి కొన్ని పరిమితులు ఉంటాయి." అని షానన్ అన్నారు.
" ప్రతి నాలుగేళ్లకోసారి ఇలా కరువులు వచ్చి తేనెటీగలకు ఆహారం దొరక్కపోతే మీరు ఇబ్బందుల్లో పడతారు" అని కింగ్ చెప్పారు.
అధిక వర్షం కూడా తేనెటీగలకు సమస్యగా మారవచ్చని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ సమస్యకు పరిశోధకులు సూచిస్తున్న ఒక పరిష్కారం ఏమిటంటే, తేనెటీగల కంచెలతోపాటు మిరపపొడి అంటించిన ఇటుకలు, వాచ్‌టవర్లు వంటి ఇతర మార్గాలను కూడా కొనసాగించడం.
ప్రస్తుతానికి, తేనెటీగల కంచెలు మ్వాంబాతోపాటు అనేకమందికి సాయపడుతున్నాయి.
తేనెటీగల ఫెన్సింగ్ లేకముందు ఏనుగులు చాలా పొలాలను నాశనం చేశాయని, కానీ ఇప్పుడు జనం భయం లేకుండా జీవించగలుగుతున్నారని మ్వాంబా తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














