అత్యుత్తమ నగరాల జాబితాలో చోటు లేని భారత్

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ అత్యుత్తమ నివాస యోగ్యమైన నగరంగా ఈ ఏడాది ఆస్ట్రియా రాజధాని వియన్నా నిలిచింది.
గత ఏడాది వరకూ వరసగా ఏడేళ్లపాటు ఈ స్థానంలో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరం ఉండేది.
ఎకనమిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఈఐయు) ఇచ్చే ఈ ర్యాంకుల్లో యూరప్ నగరం ప్రథమ స్థానంలో నిలవడం ఇదే తొలిసారి.
రాజకీయ, సామాజిక పరిస్థితులు, నేరాలు, విద్య, వైద్య సదుపాయాలు వంటి అంశాల ఆధారంగా 140 నగరాలకు ర్యాంకులు ఇచ్చారు.
ఈ ర్యాంకుల్లో దిల్లీ 112వ స్థానంలో, ముంబయి 117వ స్థానంలో ఉన్నాయి.
ఈ వార్షిక సర్వేలో యూరప్ దేశాల్లో అత్యధిక పురోగతి సాధించిన నగరంగా ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ నిలిచింది. ఈ నగర ర్యాంకు 16 స్థానాలు పెరిగి 35కి చేరింది.
భద్రతపరంగా మెరుగైన స్కోరు సాధించడంతో మాంచెస్టర్ ర్యాంకు పెరిగిందని ఈఐయు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
టాప్ 10 జాబితాలో కెనడా నుంచి మూడు నగరాలు, ఆస్ట్రేలియాలకు చెందినవి మూడు నగరాలు ఉన్నాయి. భారత్, బ్రిటన్, అమెరికాలకు చెందిన ఒక్క నగరమూ టాప్ 10లో లేవు. లండన్ 48వ స్థానంలో ఉంది.
ఈ సర్వే ప్రకారం.. గతేడాదితో పోల్చితే దాదాపు సగం నగరాల స్థానాలు మెరుగుపడ్డాయి.
హింసాత్మక ఘటనలతో అతలాకుతలమైన సిరియాలోని డమాస్కస్ 140 నగరాల జాబితాలో అట్టడుగున ఉంది. దాని తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశ్‌లోని ఢాకా, నైజీరియాలోని లాగోస్ నగరాలు ఉన్నాయి.
అట్టడుగున ఉన్న 10 నగరాల ర్యాంకుల్లో నేరాలు, అశాంతి, యుద్ధం "కీలక పాత్ర" పోషించాయని ఈఐయు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

2018లో అత్యంత నివాస యోగ్యమైన 10 నగరాలు
- వియన్నా, ఆస్ట్రియా
- మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
- ఒసాకా, జపాన్
- కాల్గరీ, కెనడా
- సిడ్నీ, ఆస్ట్రేలియా
- వాంకోవర్, కెనడా
- టోక్యో, జపాన్
- టొరంటో, కెనడా
- కోపెన్‌హాగెన్, డెన్మార్క్
- అడిలైడ్, ఆస్ట్రేలియా

జాబితాలో అట్టడుగున ఉన్న 10 నగరాలు
- డమాస్కస్, సిరియా
- ఢాకా, బంగ్లాదేశ్
- లాగోస్, నైజీరియా
- కరాచీ, పాకిస్తాన్
- పోర్ట్ మోరెస్బీ, పపువా న్యూ గునియా
- హరారే, జింబాబ్వే
- ట్రిపోలీ, లిబియా
- దువాలా, కేమెరూన్
- అల్జియర్స్, అల్జీరియా
- డకర్, సెనెగల్
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








