సల్వాజుడుం: ఛత్తీస్‌గడ్‌లో నిర్వాసితులైన 30 వేల మంది ఆదీవాసీలకు అటవీ భూమిపై హక్కులు లభిస్తాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శుభ్రాంశు చౌధరి
- హోదా, బీబీసీ కోసం
2004 తర్వాత ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో మావోయిస్టు వ్యతిరేక సల్వాజుడుం మొదలైంది.
ఆ తర్వాత వేలాది ఆదీవాసీలు తమ ఇల్లువాకిలి వదిలి పక్క రాష్ట్రాలకు పారిపోవాల్సి వచ్చింది.
ఆ సమయంలో ఎన్ని వేల మంది అలా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారనడానికి ఎవరి దగ్గరా సరైన గణాంకాలు లేవు.
కానీ, అలా వెళ్లిన సుమారు 5000 కుటుంబాలు లేదా 30 వేల మంది ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ అడవుల్లో ఉంటున్నట్టు మా అంచనా.
నిర్వాసితులు ఉంటున్న ప్రాంతాలను గ్రామాలు అనడం కూడా కష్టమే. ఎందుకంటే అక్కడ గ్రామాల్లో లభించే కనీస సౌకర్యాలు కూడా దాదాపు కనిపించవు.
అక్కడ దాదాపు అందరూ పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ ఆ భూములపై వారికి యాజమాన్య హక్కులు లేవు.

ఫొటో సోర్స్, Getty Images
ఇళ్లు తగలబెట్టినా అక్కడే ఉంటారు
ఇక అటవీశాఖ అధికారులు, పోలీసులు ఎప్పుడూ అడవుల్లోకి వచ్చి వారిని ఇబ్బందులు పెడుతూ ఉంటారు.
వారు ధ్వంసం చేసిన, తగలబెట్టిన ఎన్నో నిర్వాసితుల ప్రాంతాలకు నేను వెళ్లాను. కానీ అంతా బూడిదైన కాసేపటికే వాళ్లు మళ్లీ అక్కడే గుడిసెలు వేసుకుంటూ ఉంటారు.
తిరిగి సొంత ఊళ్లకు వెళ్లడం వాళ్లకు ఇప్పటికీ అసాధ్యంగానే అనిపిస్తోంది.
నిర్వాసితుల ఎక్కువ మంది స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డుకు చాలా లోపలికి ఉంటాయి. ఇప్పటికీ అక్కడ నక్సలైట్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
పరాయి రాష్ట్రంలో జీవనం, ఉన్న భూమిపై హక్కు లేదు
ఇటు ఆంధ్రా, తెలంగాణల్లో ఈ ఆదివాసీలను స్థానిక గిరిజనులుగా భావించరు. అక్కడ వీళ్లు 2005 తర్వాత నుంచి ఉంటున్నారు.
దాంతో ఆయా రాష్ట్రాల్లో తాము ఉంటున్న భూముల కోసం వారు అక్కడి అటవీశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు.
ఎందుకంటే అటవీ హక్కుల నిబంధనల ప్రకారం, స్వాధీనం చేసుకున్న భూముల హక్కుల గురించి దరఖాస్తు చేసుకునే గడువు 2005 డిసెంబర్ 13తో ముగిసింది.
గత ఏడాది నవంబర్లో ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసినపుడు నిర్వాసితుల్లో ఒక చిన్నఆశ ఏర్పడింది.

ఫొటో సోర్స్, Getty Images
భూమి బదిలీ కోసం ప్రయత్నాలు
రెండేళ్ల క్రితం ప్రారంభమైన కొత్త శాంతి ప్రక్రియ భాగంగా వాళ్లంతా ఒక సైకిల్ ర్యాలీని చేపట్టారు.
రాజధాని రాయ్‌పూర్ వరకూ సైకిళ్లపై వెళలాలని, తమ పునరావాసం గురించి ఆలోచించేలా ప్రభుత్వానికి అభ్యర్థనలు ఇవ్వాలని అనుకున్నారు.
ఫిబ్రవరి 22 నుంచి మార్చి 2 వరకూ జరిగిన శాంతి సైకిల్ యాత్రలో 300 మంది నిర్వాసితులు 300 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ రాజధాని రాయ్‌పూర్ చేరుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వారికి లోక్‌సభ ఎన్నికల తర్వాత సాయం అందిస్తామంటూ హామీ ఇచ్చింది.
సైకిల్ యాత్ర చేస్తున్నపుడు జరిగిన చర్చల్లో నిర్వాసితుల్లో చాలా మంది ఛత్తీస్‌గడ్‌లోని తమ స్వగ్రామాల్లో అటవీ హక్కుల పట్టాల కోసం అప్లికేషన్లు పెట్టాలని అనుకోలేదు.
ఎందుకంటే అక్కడకు వెళ్తే ఇప్పటికీ తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారు. కానీ అటవీ హక్కుల బదిలీ గురించి వారికి అప్పుడే తెలిసింది.
దాని ప్రకారం ఎవరైనా ఒక నిర్వాసితుడు 2005కు ముందు తన అధీనంలో ఉన్న భూమిని వదులుకుంటే, దానికి బదులు ప్రభుత్వం అతడికి వేరే దగ్గర భూమి ఇస్తుంది.

ఫొటో సోర్స్, Gee
భూమి హక్కుల కోసం 'పెన్ పండుమ్'
కానీ, ఈ నిర్వాసితుల్లో ఎక్కువ మంది గోండు భాష మాట్లాడేవారు, నిరక్షరాస్యులు.
భూమి బదిలీ గురించి తెలీడంతో దాదాపు వారంతా తమ అటవీ హక్కులను బదిలీ చేసి ప్రస్తుతం ఉంటున్న చోట భూమి హక్కుల కోసం దరఖాస్తు చేయాలనుకున్నారు.
ఆదివాసీలు చాలా పనులను తమ గ్రామ దేవతలకు పూజలు చేశాకే ప్రారంభిస్తారు.
అంటే 'బీజ్ పండుమ్' వేడుక తర్వాత విత్తనాలు చల్లుతారు. కొత్త పంటను దేవతలకు పూజలు చేసిన తర్వాతే తినడం లాంటివి చేస్తుంటారు.
ప్రతి గిరిజన గ్రామానికీ గ్రామ దేవతలు ఉంటారు. ఆ దేవతలకు చేసే ఉత్సవాలను 'పెన్ పండుమ్' అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
పూజల తర్వాతే దరఖాస్తుల ప్రక్రియ
గత 15 ఏళ్లుగా ఈ నిర్వాసితులు తమ గ్రామాల్లో లేకపోవడంతో, అక్కడి దేవతలకు ఎలాంటి ఉత్సవాలూ నిర్వహించలేదు.
సైకిల్ యాత్ర తర్వాత జరిగిన బస్తర్ డైలాగ్ 3లో ఆదివాసీ గ్రామాల్లో ఉన్న దేవతలందరికీ కలిపి ఒకే 'పెన్ పండుమ్' చేస్తే బాగుంటుందని అందరూ భావించారు.
ఆ తర్వాతే అటవీ హక్కుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తులు ఇవ్వాలని, ఈ వేడుకలను రాత్రంతా, ఆటపాటలతో ఘనంగా చేయాలనుకుంటున్నారు.
నిర్వాసితులు తమ గ్రామ దేవతల వేడుకలను ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గడ్ సరిహద్దుల్లో ఉన్న కోంటాలో జూన్ 12, 13 తేదీల్లో చేయాలని నిర్ణయించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నామనడానికి ఆధారాలు లేవు
పెన్ పండుమ్ తర్వాత నిర్వాసితులందరూ ప్రభుత్వానికి అటవీ హక్కుల కోసం దరఖాస్తులు ఇవ్వడం ప్రారంభిస్తారు.
కానీ, అధికారులకు అటవీహక్కుల దరఖాస్తులు ఇవ్వడానికి వారికి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి.
ఎందుకంటే నిర్వాసితుల్లో ఎక్కువమంది దగ్గర వారు ఛత్తీస్‌గఢ్‌లో నివసించారనడానికి ఏ ఆధారాలూ లేవు.
వారిలో చాలా మంది ఇళ్లను తగలబెట్టారు. చాలా మంది ప్రాణాలు కాపాడుకుంటే చాలని, పరుగులు తీశారు.
అప్లికేషన్ ప్రక్రియ కోసం మళ్లీ తమ స్వగ్రామాలకు వెళ్లడం అనేది వారికి మరో సమస్యగా మారింది.

ఫొటో సోర్స్, MANPREET ROMANA
చొరవ తీసుకోవాల్సింది ప్రభుత్వమే
నిర్వాసితులు తమ గ్రామాల్లోకి వెళ్లడానికి భయపడుతుండడంతో, ప్రభుత్వమే గ్రామాల బయట వారి కోసం ఏవైనా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సుంటుంది.
ఇప్పుడు ప్రభుత్వం, చాలా కష్టాల్లో ఉన్న వీరికి ఎలాంటి సాయం చేస్తుందో చూడాలి.
ఆంధ్రలో అయినా, తెలంగాణలో అయినా తాము గత 15 ఏళ్లుగా ఉంటున్న భూమికి సంబంధించిన హక్కులు ఇవ్వాలని ఎక్కువ మంది నిర్వాసితులు కోరుతున్నారు.
దీనికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సుంటుంది. వారికి ఆ హక్కులు అందించేలా సంబంధిత రాష్ట్రాలు కూడా సహకరించాల్సి ఉంటుంది.
అటవీ హక్కుల చట్టం చారిత్రక తప్పిదాలను సరిదిద్దడానికే ఏర్పాటు చేసినట్లు దానిలో రాశారు. ఈ నిర్వాసితులకు అటవీ హక్కులను అందించడం నిజంగా ఒక చారిత్రక అడుగే అవుతుంది.
ఇవి కూడా చదవండి:
- అస్సాం: 40 లక్షల మంది ప్రజలు భారతీయులు కాదు
- 'ఇక్కడే పుట్టా, ఇక్కడే చచ్చిపోతా... అడవిని మాత్రం వదలను’
- పెళ్లి పేరుతో పాక్ అమ్మాయిలను వ్యభిచారంలో దించుతున్న చైనా అబ్బాయిలు
- ఈ మహిళలు చైనాలో లైవ్ సెక్స్‌క్యామ్ రాకెట్ కోరల నుంచి ఎలా తప్పించుకున్నారంటే..
- ఏఎన్ 32: భారతీయ వాయుసేన విమానం శకలాలు లభ్యం - ఐఏఎఫ్ ప్రకటన
- కల్నల్ గడాఫీ: ఒకప్పటి అమెరికా పవర్ఫుల్ మహిళ వెంటపడిన నియంత
- శ్రీలంక ముస్లింల అసాధారణ చర్య.. హింసాత్మక అతివాదులను దూరం పెట్టేందుకు మసీదు కూల్చివేత
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
- ‘పీరియడ్ పేదరికం’: బహిష్టు సమయంలో పాత గుడ్డలకు ఈ కప్పులే సమాధానమా?
- స్వదేశంలో కంటే విదేశాలకు అప్పులు ఇవ్వడానికే చైనా బ్యాంకుల మొగ్గు
- భారత ప్రభుత్వం మాల్దీవులకు వేల కోట్ల అప్పు ఎందుకిస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








