పశ్చిమ బెంగాల్: మమత ఓటమికి 5 కారణాలు

మమతా బెనర్జీ ఓటమికి 5 కారణాలు

ఫొటో సోర్స్, ANI/SANJAY DAS

    • రచయిత, శుభజ్యోతి ఘోష్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 7 నిమిషాలు

పశ్చిమబెంగాల్‌లో భారతీయ జనతాపార్టీ 206 స్థానాలు గెలుచుకుని తొలిసారి అధికారం దక్కించుకుంది. పదిహేనేళ్లపాటు నిరంతరాయంగా పాలించిన తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలు గెలిచింది. ఈ కథనం ప్రచురించే సమయానికి ఒక నియోజకవర్గం ఫలితం రావాల్సి ఉంది.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ స్థానంలో ఓటమి పాలయ్యారు. బీజేపీ నేత శుభేందు అధికారి చేతిలో 15వేల ఓట్లకుపైగా తేడాతో పరాజయం పాలయ్యారు. ఓట్ల లెక్కింపునకు ముందే ఆమె బీజేపీపై ‘‘ఓట్ల చోరీ’’ ఆరోపణలు చేశారు.

‘‘బీజేపీ విజయం అనైతికం. ఆ పార్టీ 100కుపైగా సీట్లను చోరీ చేసింది. ప్రధాని,హోంమంత్రితో ఎన్నికలు సంఘం కుమ్మక్కై తీసుకున్న చర్యలు పూర్తిగా అనైతికం’’ అని మమత ఆరోపించారు.

ఆరోపణల సంగతి ఎలా ఉన్నా, పదిహేనేళ్లపాటు అధికారంలో కొనసాగిన తృణమూల్ కాంగ్రెస్‌ ఎందుకు పరాజయం పాలైందనే విషయంపై విస్తృత చర్చ సాగుతోంది.

మరి ఆ పార్టీ ఓడిపోవడానికి గల 5 కారణాలేమిటో చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పశ్చిమ బెంగాల్లో మహిళల నిరసన

ఫొటో సోర్స్, AFP

1. మహిళకు భద్రత కరవు

పశ్చిమ బెంగాల్‌లో 50 శాతానికి పైగా ఉన్న మహిళా ఓటర్లు ఇప్పటివరకు మమతా బెనర్జీకి గట్టి మద్దతుగా ఉన్నారు. లక్ష్మీ భండార్, కన్యాశ్రీ, సబుజ్ సాథీ (పాఠశాల బాలికలకు సైకిళ్ల పంపిణీ) వంటి సంక్షేమ పథకాలు తృణమూల్ ప్రభుత్వానికి మహిళల్లో విశేష ఆదరణను తీసుకువచ్చాయి.

అయితే ఈసారి ఆ మద్దతు బీటలు వారినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందనే అభిప్రాయం దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. రెండేళ్ల క్రితం జరిగిన ఆర్‌జీ కర్ ఉద్యమం కూడా ఈ ఎన్నికలపై ప్రభావం చూపింది.

టీఎంసీకి గట్టి పట్టు ఉన్న పనిహాటి నియోజకవర్గంలో, ఆర్‌జీ కర్ బాధితురాలి తల్లి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 28836 ఓట్ల మెజార్టీతో గెలవడమే ఇందుకు నిదర్శనం.

పశ్చిమబెంగాల్‌లో భద్రత తదితర అంశాలను కవర్ చేస్తున్న బీబీసీ రిపోర్టర్లతో కొంతమంది మహిళలు మాట్లాడారు.

ఎన్నికల ప్రచార సమయంలో, టీఎంసీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందా అనే ప్రశ్నపై ఓ మహిళ స్పందిస్తూ, "ఇప్పుడైనా మనం సురక్షితంగా ఉంటామా? అదే భయం. నేను నా సోదరుల మాటలతో ఏకీభవిస్తున్నా. చెప్పడానికి ఇంకేమీ లేదు. మహిళలకు ఇక గౌరవం ఉండదు. వాళ్లు మమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తారు. లేదంటే, వాళ్ళు గెలిచిన తర్వాతే అభయ తల్లికి న్యాయం జరుగుతుందని మేమెందుకు అనుకుంటాం? రాష్ట్రం ఇప్పుడు ఈ స్థాయికి దిగజారిందా? వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారో మీరు ఊహించగలరా?" అని ప్రశ్నించారు.

ఓ పదిరోజుల కిందట బీబీసీ విలేఖరి ఇషాద్రిత కోల్‌కతాలో మహిళల భద్రత గురించి మహిళలతో మాట్లాడినప్పుడు, ‘‘ఆర్‌జీ కర్ ఘటన తరువాత నేను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను’’ అని ఓ యువతి చెప్పారు.

మరో యువతి, "కొన్ని ప్రదేశాలు సురక్షితంగా అనిపించవు, ముఖ్యంగా రాత్రి 9-10 గంటల తర్వాత అంత సేఫ్ కాదు’’ అని చెప్పారు.

ఓటర్ల జాబితా సవరణ

ఫొటో సోర్స్, AFP via Getty Images

2. సర్ ప్రభావం

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా సుమారు 90 లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ఇది తృణమూల్ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బగా మారినట్లు కనిపిస్తోంది.

కొంతమంది నిజమైన ఓటర్ల పేర్లు కూడా తొలగించారనే ఆరోపణలున్నప్పటికీ, నకిలీ లేదా చనిపోయిన వారి పేర్లు కూడా పెద్ద ఎత్తున తొలగించారనే విషయంలో సందేహం లేదు.

ఏళ్ల తరబడి ఇటువంటి అక్రమాలు తృణమూల్ కాంగ్రెస్‌కు లాభం చేకూర్చాయని, వాటిని అరికట్టాల్సిన అవసరం ఉందని బీజేపీ వాదిస్తూ వచ్చింది. తాజా ఫలితాలు ఆ వాదనకు కొంత బలం చేకూర్చినట్లు కనిపిస్తున్నాయి.

కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రం బోధించే జెడ్ మన్‌హుడ్ మాట్లాడుతూ, " అవినీతి, సిండికేట్ సంస్కృతిని టీఎంసీ మన జీవితంలో ఒక సాధారణ విషయంగా మార్చింది. టీఎంసీకి వ్యతిరేకంగా ఏ అంశాలు పనిచేశాయో చూడాలి" అన్నారు.

అయితే, ఎన్నికల ప్రక్రియ నుంచి 30 శాతం జనాభాను మినహాయించి కూడా గెలవగలమని బీజేపీ నిరూపించిందని చెప్పాలి. ఇది పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

ఈ ఎన్నికల సంచలనానికి సర్ ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు.

ఎన్నికల ఫలితాలు స్పష్టమయ్యాక, "బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినట్లు కనిపిస్తున్నప్పటికీ, ఓట్లలో కేవలం మూడు శాతం తేడా మాత్రమే ఉంది" అని ఆయన బీబీసీతో అన్నారు.

‘‘ఒకవేళ జనాభాలో 4.3 శాతానికి ఓటు వేసే అవకాశం ఇచ్చి ఉంటే, వారిలో అత్యధికులు ముస్లింలు అని మనకు తెలుసు, ముస్లిమేతరులలో కూడా చాలామంది టీఎంసీ ఓటర్లు ఉన్నారు, ఫలితం ఇదే విధంగా ఉండేదా? స్పష్టంగా, అలా జరిగి ఉండేది కాదు’’ అని ఆయన అన్నారు.

2016లో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం చేసిన టీచర్స్ రిక్రూట్‌మెంట్‌లో కుంభకోణం జరిగిందంటూ పాతికవేలమందికిపైగా టీచర్లు, బోధనేతర సిబ్బందిని తొలగిస్తూ కోల్‌కతా హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.

ఫొటో సోర్స్, SANJAY DAS

ఫొటో క్యాప్షన్, 2016లో టీచర్ల నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు మమత ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి.

3. పరిపాలనా వైఫల్యం

తృణమూల్ కాంగ్రెస్ పదిహేనేళ్ల పాలనలో అవినీతి ఆరోపణలు, పరిపాలనా వైఫల్యాలు, రోజువారీ జీవితంలో 'కట్‌మనీ' వ్యవస్థ విస్తృతి, సిండికేట్ సంస్కృతి పెరగడం వంటి అంశాలు ఎన్నడూలేని స్థాయికి చేరుకున్నాయని విమర్శలు వచ్చాయి.

అయినప్పటికీ 2016, 2021 ఎన్నికల్లో బెంగాలీ గుర్తింపు, మహిళల సంక్షేమ పథకాలు, సెక్యులరిజం వంటి అంశాలను ముందుకు తెచ్చి పార్టీ ఈ విమర్శలను అధిగమించింది.

ఈసారి అయితే ఎస్‌ఐఆర్ ప్రక్రియ వల్ల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రధాన ఎన్నికల అంశంగా మార్చేందుకు మమతా బెనర్జీ ప్రయత్నించారు. కానీ అవినీతి, పాలనా వైఫల్యాలపై ఉన్న అసంతృప్తిని అది మసకబార్చలేకపోయింది.

టీఎంసీ, పశ్చిమబెంగాల్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ‘ఇది హిందూత్వ విజయం’ అని శుభేందు అధికారి చెప్పారు

4. హిందూ ఓటర్ల సమీకరణ

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ విజయాలకు ముస్లిం ఓటర్ల ఏకగ్రీవ మద్దతు ఒక కీలక కారణంగా విశ్లేషకులు భావిస్తారు. రాష్ట్ర జనాభాలో సుమారు 30 శాతం ఉన్న ముస్లింలలో 85–90 శాతం ఓట్లు సాధారణంగా తృణమూల్ కాంగ్రెస్‌కే పడుతుంటాయి.

ఈసారి అయితే హిందూ ఓటర్లలో గణనీయమైన పోలరైజేషన్ జరిగి, అది బీజేపీకి అనుకూలంగా మారినట్లు కనిపిస్తోంది. మాల్దా, ముర్షిదాబాద్ వంటి ముస్లిం ఆధిక్య జిల్లాల్లో కూడా బీజేపీకి లాభం చేకూరడం దీనికి సూచన.

ముస్లింలకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న విమర్శల నేపథ్యంలో, మమతా బెనర్జీ ఇటీవల ప్రభుత్వ ఖర్చుతో కొన్ని హిందూ ఆలయాల నిర్మాణాన్ని చేపట్టారు. ఇది సాఫ్ట్ హిందుత్వాన్ని ప్రతిబింబించే ప్రయత్నంగా భావించినా, హిందూ ఓటర్లలో పెద్దశాతం బీజేపీ దూకుడువైపే మొగ్గు చూపినట్టు కనిపించింది.

"ఈసారి హిందూ ఓట్లు మరింతగా చీలిపోయాయి" అని కోల్‌కతాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు సుకాంత సర్కార్ అన్నారు.

"పశ్చిమ బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లో హిందువుల ఓట్లు పెద్ద ఎత్తున పోలరైజ్ కావడం కనిపించింది. టీఎంసీ ఓటర్లు సైతం బీజేపీవైపు మొగ్గు చూపారు. బీజేపీ విజయానికి ఇది ఒక ప్రధాన కారణం" అని ఆయన అన్నారు.

మమతా బెనర్జీని ఓడించిన తర్వాత శుభేందు అధికారి మాట్లాడుతూ "ఇది హిందుత్వ విజయం. ఇది బెంగాల్ విజయం. ఇది నరేంద్ర మోదీజీ విజయం’’ అన్నారు.

"సీపీఎం బలమైన మద్దతుదారులందరూ నాకు ఓటు వేశారు. భవానీపూర్‌లో సీపీఎంకు 13,000 ఓట్లు ఉండగా, వాటిలో కనీసం 10,000 ఓట్లు నాకు బదిలీ అయ్యాయి. అక్కడి సీపీఎం ఓటర్లకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బెంగాలీ హిందువులందరూ నాకు బహిరంగంగా ఓటు వేశారు. వారితో పాటు, గుజరాతీ, జైన, మార్వారీ, పూర్వాంచలీ సిక్కు వర్గాల వారు కూడా నాకు ఓటు వేశారు’’ అన్నారు.

పోలింగ్‌కు ముందే 2.4 లక్షలకుపైగా కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు.

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, పోలింగ్‌కు ముందే 2.4 లక్షలకుపైగా కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు.

5. భారీగా కేంద్రబలగాల మోహరింపు

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అధికార పార్టీకి ఎన్నికల సమయంలో కొన్ని సహజమైన ప్రయోజనాలు ఉంటాయని భావిస్తారు. కానీ ఈసారి తృణమూల్ కాంగ్రెస్ ఆ అనుకూలతలను వినియోగించుకోలేకపోయినట్లు కనిపిస్తోంది.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే రాష్ట్ర అధికారగణంపై ఎన్నికల సంఘం కంట్రోల్ సాధించింది. పెద్దఎత్తున జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీసు ఉన్నతాధికారులను మార్చింది. అదనంగా, పోలింగ్‌కు ముందే 2.4 లక్షలకుపైగా కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు. ఈ మోహరింపు మునుపెన్నడూ లేని స్థాయిలోనిదని భావిస్తున్నారు. ఈ భారీ భద్రతా ఏర్పాట్ల వల్ల ఎన్నికలు ప్రశాంతంగా జరిగి, ఓటర్లు ఎలాంటి భయం లేకుండా ఓటు వేయగలిగారని విశ్లేషకులు అంటున్నారు.

గత నెలన్నరగా తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల సంఘం, కేంద్ర బలగాలపై ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు చూస్తే, ఆ ఆరోపణల వెనుక ఉన్న కారణాలు ఏమిటో స్పష్టమవుతున్నాయి.

మొత్తంగా చూస్తే, ఈ ఎన్నికల్లో ఎన్నికల సంఘం కేంద్ర బలగాల పాత్ర తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రతికూలంగా పనిచేసినట్లు కనిపిస్తోంది.

'టీఎంసీని ఓడించడంలో కేంద్ర బలగాలు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమయ్యాయి’’ అని ఏప్రిల్ 29న మమతా బెనర్జీ ఆరోపించారు.

"ఏప్రిల్ 26న తాను కోల్‌కతా విమానాశ్రయానికి వెళ్తుండగా, కేంద్ర బలగాలు తన కారును తనిఖీ చేయడానికి ప్రయత్నించాయని మమతా బెనర్జీ ఆరోపించారు’’ అని కోల్‌కతాకు చెందిన టెలిగ్రాఫ్ వార్తాపత్రిక తెలిపింది.

రాష్ట్రంలో కేంద్ర బలగాలు 'భయభ్రాంతులను సృష్టిస్తున్నాయని' టీఎంసీ నాయకుడు అభిషేక్ బెనర్జీ ఆరోపించారు .

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)