తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం ఎందుకు? పాత సచివాలయంలో లోపాలు ఏంటి?

తెలంగాణ సచివాలయం, సెక్రటేరియట్
ఫొటో క్యాప్షన్, ఏ లోటుపాట్లు లేకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త సచివాలయం నిర్మిస్తామని కేసీఆర్ మొదటి నుంచీ చెబుతున్నారు
    • రచయిత, బళ్ల సతీశ్, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

హైదరాబాద్‌లో సచివాలయంను కూల్చేసి, అక్కడే కొత్త సచివాలయ భవనం కట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

దాంతో సోమవారం అర్థరాత్రి నుంచి ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అత్యంత రహస్యంగా కూల్చివేత పనులు ప్రారంమయ్యాయి.

కూల్చివేత పనులు జరుగుతున్న ప్రాంతం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సచివాలయం దగ్గర ఎంత బందోబస్తు ఉందో, ఇప్పుడు దాదాపు అలాంటి భద్రతాచర్యలే చేపట్టారు.

సచివాలయం చుట్టూ ఉన్న చిన్న చిన్న గల్లీలతోపాటూ అన్ని ప్రధాన దారులనూ మూసివేశారు. ఒక్కో రహదారి దగ్గరా బ్యారికేడ్లు పెట్టి పోలీసులు, అధికారులను మోహరించి ఎవరూ అటువైపు వెళ్లకుండా అడ్డుకున్నారు.

మీడియాను కూడా అనుమతించకుండా ప్రభుత్వం అత్యంత రహస్యంగా భవనాల కూల్చివేతలు కొనసాగిస్తోంది. కొన్ని బ్లాకులను ఇప్పటికే దాదాపు కూల్చివేయగా, అన్ని బ్లాకులూ పూర్తిగా నేలమట్టం అయ్యేవరకూ ఈ పనులు కొనసాగించనున్నారు.

ఈ కూల్చివేతలు మంగళవారం అర్థరాత్రి, లేదా బుధవారం మధ్యాహ్నం వరకూ పూర్తవుతాయని భావిస్తున్నారు. మొత్తం భవనాలు నేలమట్టం చేశాక, మిగతా నిర్మాణ పనులు ప్రారంభిస్తారు.

టీఆర్ఎస్ నేతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఏడాదిలోపే కొత్త భవనం నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయంగా చెబుతూ ఒక డిజైన్ కూడా విడుదల చేసింది. అది దాదాపు కర్ణాటక అసెంబ్లీని పోలి ఉంది.

కూల్చివేత పనులు కొనసాగుతుండడంతో సచివాలయ భవనం చుట్టూ వాహనాల రాకపోకలను వేరే వైపు మళ్లించారు. చుట్టూ ఉన్న దుకాణాలు, హోటళ్లు అన్నింటినీ మూయించారు.

ఇదే ప్రాంతంలో ఉన్న కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఆస్పత్రుల సిబ్బందిని మాత్రం ఐడీ కార్డులను చూశాకే అనుమతిస్తున్నారు.

తెలంగాణ సచివాలయం, సెక్రటేరియట్
ఫొటో క్యాప్షన్, తెలంగాణ ఉద్యమ సమయంలో సచివాలయం దగ్గర ఎంత బందోబస్తు ఉందో, ఇప్పుడు దాదాపు అలాంటి భద్రతాచర్యలే చేపట్టారు

కొత్త సచివాలయం ఎందుకు?

2014లో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వానికి సంబంధించి ఐకానిక్ భవనాలు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తూ వచ్చారు.

ముఖ్యమంత్రి అధికారిక నివాసం అయిన క్యాంప్ కార్యాలయాన్ని కూడా ఆయన ఆధునీకరించారు. దానికి ప్రగతి భవన్ అనే పేరుపెట్టారు.

కేసీఆర్ తర్వాత అసెంబ్లీ, సచివాలయం కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మించాలని ప్రయత్నించారు. దాని నిర్మాణం కోసం జంట నగరాల్లో చాలా ప్రాంతాలను పరిశీలించారు.

సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లేదా జింఖానా గ్రౌండ్స్ లో నిర్మిస్తారని, ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిని తరలించి అక్కడ కడతారని, ఎర్రమంజిల్‌లో సచివాలయం నిర్మిస్తారని రకరకాల వార్తలు వచ్చాయి.

చివరకు పాత సచివాలయం ఉన్నచోటే, ఆ భవనాన్ని కూల్చేసి కొత్త భవనం కట్టడానికి ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమైంది.

అయితే, ప్రభుత్వం ఈ నిర్ణయం గత ఏడాది జూన్‌లోనే తీసుకుంది. జూన్ 27న ఇదే ప్రాంగణంలో కొంచెం అవతలివైపు ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాలయ భవనానికి శంకుస్థాపన చేశారు.

తర్వాత పాత భవనాలను కూల్చడానికి వీలుగా, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌కు అవతల ఉన్న బీఆర్కే భవన్‌కు ఉద్యోగులు, ఫైళ్లు, ఫర్నిచర్ అన్నింటినీ తరలించారు.

ఈలోపు కొందరు సచివాలయ కూల్చివేతకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇవి దాదాపు ఏడాదిపాటు నడిచాయి.

ఈ భవనాలు బాగానే ఉన్నాయని, వాటిన కూల్చాల్సిన అవసరం లేదని పిటిషనర్లు వాదించారు. చివరికి మూడు నాలుగు రోజుల క్రితం హైకోర్టు ఈ అంశంలో తుది తీర్పు ఇచ్చింది.

భవనాల కూల్చివేతలో తాము జోక్యం చేసుకోలేమని, సచివాలయం ఎక్కడ ఉండాలి, ఎక్కడ నిర్మించాలి అనేది ప్రభుత్వం ఇష్టమని తీర్పు ఇచ్చింది.

ఆ తీర్పు వచ్చి వారం కూడా కాకముందే, ప్రభుత్వం కొత్త సచివాలయ నిర్మాణం పనులు ప్రారంభించేందుకు, పాత భవనం కూల్చివేత ప్రారంభించింది.

సచివాలయ భవనాలు

ఫొటో సోర్స్, Getty Images

సచివాలయం భవనాల చరిత్ర

ప్రస్తుత సచివాలయం మొత్తం 25 ఎకరాల ప్రాంగణంలో ఉంది. నిజాం కాలంలో ఈ ప్రాంతాన్ని సైఫాబాద్ అనేవారు.

ఆ సమయంలో ఇక్కడ హుస్సేన్ సాగర్ కనిపించేలా వ్యూ ఉన్న చిన్న ప్యాలెస్ ఉండేది. దానిని సైఫా బాద్ ప్యాలెస్ అని పిలిచేవారు.

ఆంధ్రా, తెలంగాణ కలిశాక 1956 తర్వాత ఈ ప్రాంతం పేరు సైఫాబాద్ నుంచి సచివాలయంగా మారిపోయింది. ఇక్కడ అప్పటి నుంచీ అవసరాలను బట్టి ఒక్కో బ్లాక్ నిర్మిస్తూ వచ్చారు.

పాత సచివాలయం సుమారు 25 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనిలోని బీ, సీ బ్లాక్‌లను 1978లో, ఏ బ్లాక్‌ను 1998లో, డీ బ్లాక్‌ను 2003లో నిర్మించారు. 2012‌లో హెచ్ (నార్త్), హెచ్ (సౌత్) బ్లాకులను కట్టారు.

మొదట్లో ఒకటి రెండు బ్లాకులే ఉండేవి.. అలా అప్పటి నుంచి ఇప్పటివరకూ ఇక్కడ 30, 40 ఏళ్ల బ్లాకులతోపాటూ 2012లో కట్టిన బ్లాకులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటినీ కూల్చేస్తున్నారు.

సచివాలయం ఎప్పుడు తరలించారు?

తెలంగాణ సచివాలయం ఉద్యోగులను 2019 ఆగస్టులో బీఆర్‌కే భవన్‌కు తరలించారు. అదే నెల 9 నుంచి కొత్త ప్రాంగణంలో కార్యకలాపాలు మొదలయ్యాయి.

పాత సచివాలయంలో అధికారులు, ఉద్యోగులు ఎవరూ ఉండకూడదని ప్రభుత్వం ఆదేశించడంతో అప్పుడు దానిని పూర్తిగా ఖాళీ చేశారు. కొత్త సచివాలయ నిర్మాణం పూర్తయ్యే వరకు వివిధ శాఖలు బీఆర్‌కే భవన్‌లోనే కొనసాగుతాయి.

పాత సచివాలయాన్ని కూల్చివేసి, అత్యాధునిక హంగులతో తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా కొత్త సచివాలయాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అది ఖాళీ చేయకముందే ప్రకటించారు.

కేవలం వాస్తు కోసమే కేసీఆర్ సచివాలయాన్ని మార్చాలని అనుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి.

కొత్త సచివాలయ నిర్మాణంపై విపక్షాల విమర్శలను పట్టించుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్లింది.

పాత సచివాలయంలోని లోపాలను చూపిస్తూ, కొత్తగా సమీకృత సచివాలయ భవన నిర్మాణాలను ఏ విధంగా చేపట్టనున్నామో వివరించే ప్రయత్నం చేసింది.

పాత సచివాలయం ప్రాంగణంలో భవనాల నిర్మాణం అస్తవ్యస్తంగా జరిగిందన్నది కేసీఆర్ సర్కారు వాదన. అందులో భాగంగానే మంత్రుల బృందంతో ఓ కమిటీని ఏర్పాటు చేసి, కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించి అధ్యయనం చేయాలని ఆదేశించింది.

సచివాలయ భవనాలు

ఫొటో సోర్స్, Getty Images

పాత సచివాలయంలో లోపాలేంటి?

పాత సచివాలయం దగ్గర పార్కింగ్ స్థలం సరిగ్గా లేదని, విదేశాల నుంచి వచ్చే అతిథులకు ఆతిథ్యం ఇచ్చే సందర్భాల్లోనూ సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు కనబడుతోందని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది.

ప్రభుత్వ అవసరాలు తీర్చే సమావేశ మందిరాలు, వీడియో కాన్ఫరెన్స్ హాళ్లు లేవని.. ఉద్యోగులు, ఇతర సందర్శకుల కోసం కెఫెటేరియా, క్యాంటీన్ల లాంటి సదుపాయాలు కొరవడ్డాయని భావించింది.

అధికారులు, సిబ్బంది ఒక భవనం నుంచి మరో దానికి వెళ్ళడం కష్టంగా ఉందని, ఫైళ్ల తరలింపులోనూ ఇబ్బందులు ఉంటున్నాయని ప్రభుత్వం గతంలో వివరించింది.

ఈ నిర్మాణాలు నేషనల్ బిల్డింగ్, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు లోబడి లేవని, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే జనం బయటకు పరిగెత్తి ప్రాణాలు కాపాడుకోలేని దుస్థితిలో అవి ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు గతంలో చెప్పారు.

ఏ లోటుపాట్లు లేకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త సమీకృత సచివాలయం నిర్మిస్తామని కేసీఆర్ మొదటి నుంచీ చెబుతున్నారు. తెలంగాణకే తలమానికంగా ఉండేలాగా దానిని నిర్మిస్తామన్నారు.

కొత్త సచివాలయం నిర్మిస్తే, అక్కడ ఉన్న నల్లపోచమ్మ దేవాలయం, మసీదు, క్రైస్తవ ప్రార్థనా మందిరాలను ఏం చేయాలనే అంశంపై టెక్నికల్ కమిటీ పరిశీలిస్తోంది.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)