అమెరికా ఎన్నికలు 2020: ట్రంప్ - బైడెన్.. ఎవరు గెలవాలంటే ఏం జరగాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆంథోని జుర్చర్
- హోదా, నార్త్ అమెరికా రిపోర్టర్
అమెరికాలో ఎన్నికల రోజు రాత్రి ఎన్నికల వారంగా మారుతోంది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసిన అభ్యర్థులు శ్వేతసౌధంలోకి అధ్యక్షుడిగా వెళ్లాలంటే ఏమి జరగాలో చూద్దాం.
జో బైడెన్ సులభంగా గెలవడం కానీ, లేదా డోనాల్డ్ ట్రంప్ జాతీయ ఓట్ల సంఖ్యను చేజిక్కించుకోవడంలో ఆధిక్యత సాధించలేకపోయినప్పటికీ కీలక రాష్ట్రాలలో ఎలక్టొరల్ కాలేజీలో వచ్చిన ఆధిక్యత ద్వారా గెలిచే అవకాశం ఉందని ఎన్నికల ముందు రోజు జరిగిన పోల్స్ అంచనా వేశాయి.
అమెరికాలో మంగళవారం సాయంత్రం నుంచి తెల్లవారు జాము వరకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ఫలితాలను చూస్తుంటే బైడెన్ అత్యధిక మెజారిటీతో గెలిచే పరిస్థితులు కనిపించటం లేదు.
డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఘన విజయాన్ని ప్రకటించుకుని.. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చేశారంటూ ప్రతిపక్ష అభ్యర్థులపై ఆరోపణలూ గుప్పించారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రకటన కీలకం కాదు. చట్టబద్ధంగా పోలైన కొన్ని లక్షల ఓట్లను ఇంకా లెక్కించాల్సి ఉంది.
జాతీయ స్థాయిలో జరిగిన పోటీ ఫలితాలు ఇప్పుడు అరిజోనా, జార్జియా, విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియా రాష్ట్రాలలో వచ్చే ఫలితాల మీద ఆధారపడి ఉంది.

కీలకమైన రాష్ట్రాల్లో గెలిచేదెవరు?
అరిజోనా రాష్ట్రంలో బైడెన్ ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. అంటే 2016 - "బ్లూ వాల్ స్టేట్స్" గా పిలిచే విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియా రాష్ట్రాలలో కనీసం రెండు రాష్ట్రాల్లో గెలిస్తేనే ఆయన విజయం సాధించే అవకాశం ఉంది.
ఈ మూడు రాష్ట్రాలలోనూ బైడెన్ వెనుకబడే ఉన్నారు. అయితే ఇంకా లెక్కించాల్సిన ఓట్లు డెమొక్రాట్ల వైపు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది.
పెన్సిల్వేనియాలో పోస్టల్ బ్యాలట్ ద్వారా వేసిన 14 లక్షలకు పైగా ఓట్లను ఇంకా లెక్కించాల్సి ఉంది. వీటన్నిటినీ లెక్కించడానికి కొన్ని రోజులు పట్టవచ్చు. మిషిగన్, విస్కాన్సిన్‌లలో పెద్ద నగరాలైన డెట్రాయిట్, మిల్వాకీలలో ఇంకా ఓట్ల లెక్కింపు పూర్తి కాలేదు. ఈ ఓట్లు డెమొక్రాట్ల వైపు కూడా రావచ్చు.
ఇక జార్జియా ఒక వైల్డ్ కార్డు లాంటిది. మంగళవారం నాడు ట్రంప్ సులభంగా గెలుపు సాధిస్తారనుకున్న ఫలితాలు ఇప్పుడు హోరాహోరీగా మారుతున్నాయి.
బైడెన్‌కి మద్దతుగా ఓట్లు వేసినట్లు కనిపిస్తున్న అట్లాంటాలో కౌంటింగ్ కేంద్రంలో నీటిపైపు పగిలిపోవడంతో అక్కడ ఓట్ల లెక్కింపు జరగడం ఆలస్యమయింది.
జార్జియాలో డెమొక్రాట్లు గెలిస్తే మిగిలిన పశ్చిమ మధ్య రాష్ట్రాలలో మరొక్క రాష్ట్రంలో ఆ పార్టీ గెలుపు సాధిస్తే సరిపోతుంది.

ఈ ఎన్నికల సమరం కోర్టుకు చేరుతుందా?
ఒక వైపు బైడెన్ విజయం సాధించే దిశలో ఉన్నానని ప్రకటించుకుంటూ ఉండగా.. మరోవైపు ట్రంప్ ఎన్నికలలో అక్రమాలు, అరాచకం చోటు చేసుకున్నాయంటూ నిరాధార ఆరోపణలు చేయడం చూస్తుంటే ఒక భయానకమైన కల నిజమవుతున్నట్లుగా అనిపిస్తోంది.
ఓటమి పాలైన వారి మద్దతుదారులు మోసపోయామనే కోపంతో క్రూరత్వాన్ని ప్రదర్శించటానికి ఇదొక సాధనంలా పని చేస్తుంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది ఫలితాలు ఇంకా రావల్సి ఉండగా ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలను చూస్తుంటే అమెరికా తీవ్రంగా విభజితమైన దేశంగా కనిపిస్తోంది.
అమెరికా ప్రజలు ట్రంప్‌ని పూర్తిగా నిరాకరించలేదు. అలాగని ట్రంప్ భావించినట్లుగా ఆయనకు సంపూర్ణమైన మద్దతు కూడా ప్రకటించినట్లు లేరు.
ఈ ఎన్నికలలో గెలుపు ఎవరిదైనప్పటికీ రాజకీయ యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి:
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయం కోరారు’
- చైనా ప్రభుత్వానికి మేం భారతీయ యూజర్ల డాటా ఇవ్వలేదు: టిక్ టాక్
- నిజంగానే భారత్ మహిళలకు అత్యంత ప్రమాదకర దేశమా? రాయిటర్స్ నివేదికలో వాస్తవమెంత?
- జార్జ్ ఫ్లాయిడ్: పోలీసు కాల్పుల్లో చనిపోయేదీ, కేసుల్లో అరెస్టయేదీ, జైళ్లలో మగ్గుతున్నదీ అత్యధికంగా నల్లజాతి వారే... ఎందుకు?
- కెప్టెన్‌గా ధోనీ తీసుకున్న 10 అసాధారణ నిర్ణయాలు
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లు ఎవరు... ఇన్నేళ్ళుగా వారితో యుద్ధం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








