ఇస్రో : 101వ ప్రయోగం ఎందుకు విఫలమైంది, ఈ ప్రయోగం దేశభద్రతకు ఎంత కీలకం?

పీఎస్‌ఎల్‌వీ

ఫొటో సోర్స్, Screenshot/YT

ఫొటో క్యాప్షన్, పీఎస్‌ఎల్‌వీ సీ61 మూడో దశలో ఇబ్బందులు ఎదుర్కొందని ఇస్రో చైర్మన్ చెప్పారు
    • రచయిత, శ్రీకాంత్ బక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇస్రో 2025లో తన వందో ప్రయోగాన్ని విజయవంతం చేసి సక్సెస్ జర్నీని కొనసాగించింది . ఇదే ఉత్సాహంతో దేశ భద్రతకు కీలకమైన శాటిలైట్ ప్రయోగంతో 101వ మిషన్‌కు శ్రీకారం చుట్టింది.

మే18 ఆదివారం నాడు తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 5:59కి నింగిలోకి ఎగిరిన పీఎస్ఎల్‌వీ-సీ61 ప్రయోగం విఫలమైనట్లు ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ ప్రకటించారు.

పీఎస్ఎల్‌వీ రాకెట్ సాయంతో ఈఓఎస్ 09 శాటిలైట్‌ను భూమికి 529 కిలోమీటర్ల ఎత్తులో సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్‌లో ప్రవేశ పెట్టాల్సి ఉంది. ఇందులో భాగంగా, ఈ రాకెట్ 17 నిమిషాల 39 సెకన్ల పాటు నాలుగు దశల్లో ప్రయాణించాల్సి ఉంది.

మొదటి రెండు దశల వరకు దీని ప్రయాణం సాఫీగానే సాగింది. కానీ మూడో దశలోనే సాంకేతిక సమస్య తలెత్తడంతో రాకెట్ నిర్దేశిత మార్గంలో కాకుండా మరో మార్గంలో ప్రయాణించడం మొదలుపెట్టింది. ఇందులో లోపం ఎక్కడ తలెత్తిందన్న వివరాలను విశ్లేషణ తర్వాత వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ తెలిపారు.

మూడో దశలో సాంకేతిక సమస్య

''ఈ రోజు శ్రీహరి కోట నుంచి 101వ ప్రయోగాన్ని చేపట్టాం. పీఎస్ఎల్‌వీ సీ61 రాకెట్ సాయంతో ఈఓఎస్ 09 శాటిలైట్ మిషన్‌ను ప్రయోగించాం. మొదటి, రెండు దశల వరకూ అంతా సాఫీగానే సాగింది. మూడో దశ లో మాత్రం మేం కొన్ని ఇబ్బందులను గమనించాం. దీంతో మిషన్ పూర్తి కాలేదు. పూర్తి విశ్లేషణ తర్వాత మళ్లీ మీ ముందుకొస్తాం. థాంక్యూ'' అని ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ ప్రకటించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
శాటిలైట్

ఫొటో సోర్స్, Screenshot/YT

ఫొటో క్యాప్షన్, ఆదివారం ప్రయోగించిన పీఎస్ఎల్‌వీ -సీ61 విఫలమైంది.

కీలమైన సమాచారం అందించే శాటిలైట్

భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఇస్రో తన 101వ ప్రయోగం చేపట్టింది. నిజానికి ఇస్రో ప్రయోగానికి, ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితులకు ఒక సంబంధం ఉంది.

ఇస్రో గతంలో ప్రయోగించిన శాటిలైట్లు కొన్ని రక్షణ రంగానికి కీలకమైన సమాచారం అందించాయి. ఆ కోవలోనిదే ఇప్పుడు ప్రయోగించిన ఈఓఎస్ 09 కూడా.

దీనిని ఒక గూఢచార శాటిలైట్‌గా పలు మీడియా సంస్ధలు చెప్పుకొచ్చాయి. ఇది భారతదేశానికి నిఘా నేత్రం లాంటిదని చెప్పుకోవచ్చు.

ఇప్పటి వరకూ భారత రక్షణ రంగానికి వెన్నుదన్నుగా ఉండేందుకు ఈఓఎస్ 04 వంటి శాటిలైట్లను ప్రయోగించిన ఇస్రో.. ఇప్పుడు ఈ సీరిస్‌లోనేఈఓఎస్ 09ను ప్రయోగించింది. ఇది రిమోట్ సెన్సింగ్ డేటాను అందిస్తుంది.

‘‘గతంలో భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ వంటి సమయాల్లో కార్టోశాట్ వంటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లు ఇచ్చిన డేటానే ఆధారం చేసుకున్నాయి’’ అని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ బీబీసీకి తెలిపారు.

‘‘అయితే, కార్టోశాట్ వంటి ఉపగ్రహాలు పంపే డేటాకు కొన్ని పరిమితులున్నాయి. అంటే ఈ శాటిలైట్లు రాత్రి పూట చిత్రాలను తీయలేవు. వాతావరణం సరిగాలేని సందర్భాలు అంటే మేఘావృతంగా ఉన్నప్పుడు, దట్టమైన పొగమంచు అలముకున్నప్పుడు తదితర సందర్భాల్లో స్పష్టమైన చిత్రాలను అందించలేవు. అందుకే ఇలాంటి ప్రతికూల సందర్భాల్లోనూ కీలక డేటా అందించేందుకు ఈఓఎస్ 09 వంటి శాటిలైట్లు అవసరమని’’ రఘునందన్ తెలిపారు.

గ్రాఫ్

ఫొటో సోర్స్, Screenshot/YT

ఫొటో క్యాప్షన్, పీఎస్‌ఎల్‌వి-సీ61 ప్రయోగంలో మొదటి రెండుదశలు సాఫీగా సాగాయి

ఏడాదంతా, రాత్రి పగలు తేడా లేకుండా

ఇస్రో ఆదివారం (మే18న) ప్రయోగించిన ఈఓఎస్ 09 ఉపగ్రహం... నిర్థిష్ట కక్ష్యలోకి ప్రవేశించి ఉంటే, ఇది భూమి తాలుకూ స్పష్టమైన చిత్రాలను అందించి ఉండేది.

ఇది ఏడాదిలో ప్రతి రోజూ, పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం భూమి తాలుకూ చిత్రాలను తీయగలదు. ఇందులో అమర్చిన సింథటిక్ అపరేచర్ రాడార్ ద్వారా.. ఇది ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా సమాచారాన్ని అందించగలదు. అంటే మేఘాలు కమ్ముకున్నా, వర్షం పడుతున్నా, పొగ మంచు అలముకున్నా సరే.. ఈ ఉపగ్రహం స్పష్టమైన చిత్రాలను అందించగలుగుతుంది.

దీనిని కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన తర్వాత 5 ఏళ్ల పాటు నిరంతరాయంగా సేవలు అందించేలా రూపొందించారు. ఇది కేవలం రక్షణ సంబంధిత అంశాలతో పాటుగా, విస్తృత శ్రేణిలో పౌర అవసరాలైన వ్యవసాయం, అటవీ సంరక్షణ, హైడ్రాలజీ, విపత్తు నిర్వహణ వంటి అంశాలకు కూడా ఉపయోగపడుతుంది.

ప్రభుత్వం ఈఓఎస్ 09 లాంటి శాటిలైట్లు అందించే హై రిజల్యూషన్ చిత్రాలను, డేటాను మిలటరీ, వ్యూహాత్మక అంశాల్లో వినియోగిస్తుంది.

దీంతో పాటు ఈ EOS 09 శాటిలైట్ అందించే సమాచారం, భారత సైన్యం, నేవిలోని ఇతర సింథటిక్ ఆపరేచర్ రాడార్లు ఉన్న శాటిలైట్ల సమాచారాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి.

ఇప్పటివరకూ ఇస్రో ప్రయోగించిన ఈఓఎస్ 04 వంటి శాటిలైట్ల శ్రేణిలో ఇది కూడా భాగం అవ్వాల్సి ఉందని, ఇది సరిహద్దులపై పూర్తి స్థాయి నిఘాను, అక్కడ భూభాగాల్లో చోటు చేసుకుంటున్న మార్పులను రాత్రి పగలు, అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ పసిగట్టగలిగి, స్పష్టమైన చిత్రాలను అందించగలిగేదని రఘునందన్ తెలిపారు.

రాకెట్

ఫొటో సోర్స్, Screenshot/YT

స్పేస్ డెబ్రిస్ ఫ్రీ మిషన్

ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ శాటిలైట్ ప్రయోగం ఒక డెబ్రిస్ ఫ్రీ మిషన్. అంటే సాధారణంగా శాటిలైట్లు తమ నిర్ణీత కాలం పూర్తి కాగానే అంతరిక్షంలోనే తిరుగుతూ ఉండిపోతాయి. వీటినే స్పేస్ డెబ్రిస్ అంటారు.

అంతరిక్షంలో పేరుకుపోతున్న ఇలాంటి వ్యర్థాల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా... ఈ ఈఓఎస్ 09లో తగినంత ఇంధనాన్ని రిజర్వ్ చేసి ఉంచారు. దీని వల్ల ఈ శాటిలైట్ తన ఐదేళ్ల మిషన్ లైఫ్ పూర్తయిన తర్వాత.. రెండేళ్లలో క్రమంగా అది తన కక్ష్య నుంచి డీ ఆర్బిట్ అయిపోతుంది.

కానీ తాజా ప్రయోగం విఫలం కావడంతో ఇది పూర్తిగా స్పేస్ డెబ్రిస్‌గా మిగిలిపోయింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)